డైలీ సీరియల్

పూలకుండీలు 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఔను, అది గర్భాశయ ఇబ్బందులున్న వాళ్ళకోసం కనిపెట్టిన ఓ ఆధునిక వైద్య ప్రక్రియ. కానీ చాలా రహస్యంగా కొనసాగుతున్న ప్రక్రియ’’ అనిత వైపు చూస్తూ చెప్పుకొచ్చాడు డాక్టర్ విశ్వామిత్రా.
‘‘రహస్యం ఎందుకు డాక్టర్!’’ తను కలుగజేసుకుంటూ డాక్టర్ విశ్వామిత్రను అడిగాడు కిషోర్.
కిషోర్ మాటలకు ఓ సుదీర్ఘంగా నిశ్వాసాన్ని వెలువరించిన డాక్టర్ విశ్వామిత్ర నేత్రాలు అర్థనిమీలితం అవుతుంటే మెల్లగా తల పైకెత్తి చూస్తూ..‘‘ మానవ కల్యాణం కోసం కనిపెట్టబడిన ప్రతి ఆధునిక ప్రక్రియ కూడా కొందరు స్వార్థపరుల చేతుల్లో పడి దుర్వినియోగమైపోయినట్టే, కేవలం గర్భాశయ ఇబ్బందుల కారణంగా సంతాన సాఫల్యతను పొందలేకపోతున్న స్ర్తిలకోసం కనుగొనబడిన ఈ ప్రక్రియను కూడా కొంతమంది డాక్టర్లు తమ వృత్తి ధర్మానికి భిన్నంగా కేవలం డబ్బు కోసం దుర్వినియోగపరుస్తున్నారు’’ అంటూ వేదనగా చెప్పుకొచ్చాడు.
‘‘అదెలా!!’’ అడిగారు అనితా కిషోర్‌లిద్దరూ ఒకేసారి.
‘‘బాగా డబ్బులున్న, గ్లామర్ ప్రాధాన్యత వున్న రంగాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు కొందరు పిల్లల్ని కంటే తమ అందం చెడిపోతుందన్న ఆత్మహత్యా సదృశ్యమైన ఆలోచనతో మాతృత్వపు మాధుర్యాన్ని కూడా కాదనుకుని, పేదింటి స్ర్తిలకు డబ్బులు ఎరవేసి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ పర్యవేక్షణలో తమ భర్తలనుండి సేకరించిన వీర్యకణాలను వాళ్ళ గర్భాశయాల్లోకి ప్రవేశపెట్టి, తద్వారా సంతానాన్ని పొందుతున్నారు.
అంతవరకు ఏదో పోనీలే అనుకున్నా, లింగనిర్థారణ పరీక్షల ద్వారా తాము ఎంచుకున్న అద్దె గర్భపు తల్లుల గర్భాల్లో పెరిగింది ఆడపిల్ల అని తెలవగానే నిర్దాక్షిణ్యంగా ఆ పిండాలను చదిమివేస్తూ మగ పిల్లలకోసం మళ్లీ ప్రయత్నిస్తున్నారు.
బీదరికం కోరల్లో చిక్కుకున్న అనేకమంది తల్లులను నెలల తరబడి ఆ విధంగా తమ పిల్లా పాపలకు, ఇళ్ళు వాకిళ్ళకు దూరంగా తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఖైదీల్లా ఉంచుతారు.
ఆఖరికి నెలలు నిండి పురుడు కాగానే అప్పుడే పుట్టిన పసికందులనూ అన్నాళ్ళూ తమ ఉమ్మనీటి పవిత్ర జీవ జలాల్లోని బీజాన్ని బిడ్డగా పెంచి జన్మనిచ్చిన ఆ పేద తల్లులనూ వారి తొమ్మిది నెల్ల పేగు బంధపు ప్రతిరూపం ఎలా వుందో ఒక్కసారన్నా కళ్ళారా చూసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా పూలకుండీలనుండి వేరుచేసిన మొక్కల్లా క్షణాల్లో తల్లీ బిడ్డలను ఎగరేసుకుపోతారు’’ అంటూ సరోగసీ దుర్వినియోగంపైన తన అంతరంగంలో పేరుకుపోయిన అసంతృప్తినంతా వెళ్ళబోసుకున్నారు డాక్టర్ విశ్వామిత్ర.
‘‘మరిప్పుడు మేం కూడా అదే సరోగసిని ఆశ్రయించి సంతానాన్ని పొందొచ్చుగదా డాక్టర్!’’ ఆశగా అడిగింది అనిత.
‘‘అలా చెయ్యొద్దనే నేనిదంతా మీకు వివరించాను’’ అన్నాడు డాక్టర్ విశ్వామిత్ర.
‘‘అలా చెయ్యొద్దని చెప్పారా!?’’ ఆశ్చర్యంగా అన్నారు అనితా కిషోర్‌లిద్దరూ ఒకేసారి.
‘‘ఔను, ఇప్పుడు నేనీ విషయం మీకు చెప్పకపోయినా ఏదో ఒక రోజు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీకు కచ్చితంగా తెలిసిపోతుంది. ఆ రోజున మీరీ నిర్ణయానికొస్తారని నాకు తెలుసు. అందుకే మీకు ముందుగా ఈ వివరాలన్నీ తెలియజేసి మీ మనసుల్లోకి ఆ ఆలోచన రాకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనూ ఒక అనాధ శిశువుకు మంచి జీవితాన్ని అందించొచ్చన్న ఆశతోనూ చెప్పుకొచ్చాను.
నా మాట విని ఓ అనాధ శిశువును తెచ్చుకుని పెంచుకుంటే మనుషులుగా మీరొక సార్థకత పొందుతారు. లేదు మా రక్తమే మాకు కావాలనుకుంటే ఆపైన ఇక మీ ఇష్టం’’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు డాక్టర్ విశ్వామిత్రా.
డాక్టర్ విశ్వామిత్ర మాటలు విన్న అనిత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘‘డాక్టర్! సరోగసీ మదర్స్‌గా వచ్చే ఆడవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మీ హాస్పిటల్లో ఆ సౌకర్యం వుందా? సుమారుగా ఎంత ఖర్చౌతుంది?’’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది.
ఆ ప్రశ్నలన్నీ సావధానంగా విన్న డాక్టర్ విశ్వామిత్ర చిరునవ్వుతో సూటిగా ఆవిడ కళ్ళలోకి చూస్తూ ‘‘మా హాస్పిటల్లో ఆ సౌకర్యం లేదు. వేరే హాస్పిటల్ చూసుకోవాల్సిందే. ఇక డబ్బు విషయం అంటారా అది ఒక్కో హాస్పిటల్లో ఒక్కోరకంగా వుంటుంది. మొత్తంమీద ఇక్కడైతే ఎంతలేదన్నా పాతిక లక్షలదాకా అవుతుంది. అదే మీరు ఇండియాకి అదీ మన హైదరాబాద్‌కి వెళ్ళారంటే పది పనె్నండు లక్షల్లో అయిపోతుంది. మీ నిర్ణయం సరోగసే అయితే మీరు హైదరాబాద్ వెళ్ళడమే మంచిది. అక్కడైతే సరోగసి మదర్ని వెదికి పట్టుకోవడంతో సహా అన్ని వ్యవహారాలూ వాళ్ళే చూసుకుంటారు’’ అంటూ తనకు తెలిసిన సమాచారాన్ని తెలియజేశాడు.
‘‘ఆ హైదరాబాద్ అడ్రస్ ఏదో చెబితే మేం వెంటనే వెళ్లి అక్కడి డాక్టర్లను కన్సల్టవుతాం డాక్టర్!’’ అంటూ అడిగింది అనిత డాక్టర్ విశ్వామిత్ర వంక ఆశగా చూస్తూ.
‘‘బేగంపేట చౌరస్తాలో అజంతా కార్పొరేట్ హాస్పిటల్ అని వుంటుంది. దాని చైర్మన్ డా.అంకిరెడ్డి నా మిత్రుడే. వెళ్లి అతణ్ణి కలవండి. వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్’’ అంటూ తన టేబుల్ సొరుగులోవున్న విజిటింగ్ కార్డ్స్ ఆల్బం బుక్ బైటికి తీసి అందులో అల్ఫాబెట్‌లో సెట్ చేసి వుంచిన కార్డ్‌ల్లోనుండి ఓ కార్డు బయటికి తీసి అనితకు అందించాడు డాక్టర్ విశ్వామిత్ర.
‘‘చెప్పండి డాక్టర్!’’ అంటూ ఆ విజిటింగ్ కార్డును అందుకున్న అనిత దాన్ని జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు