మెయన్ ఫీచర్

జాతరమ్మ జాతర.. రాజకీయ జాతర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతించిన కాలాన్ని కాచి వడబోయడం కష్టసాధ్యం. నిన్నటి చరిత్ర నేటి తరానికి చేరడానికి అనేక పద్ధతులుంటాయి. అందులోప్రజలే అసలైన చరిత్రకారులు. వివిధ కళారూపాల్లో ఆ గాథలను జనం మననం చేసుకుంటూ వుంటారు. ఆ గాథల్ని ఆధునిక చరిత్రకారులు అందుబాటులో వుండే ప్రాథమిక ఆధారాల్ని (శాసనాలు) దృష్టిలో పెట్టుకుని అనేక వ్యాఖ్యానాలు చేస్తూ వుంటారు. ఫలానా చరిత్రకారుడిదే సరైన కథనం అని నిగ్గు తేల్చడం కూడా జరగని పనే!
ఈ కోవలో కాకతీయుల నాటి కాలాన్ని అనగా మొదటి ప్రతాపరుద్రుడి (రుద్రదేవుడు) నుండి కాకతీయ సామ్రాజ్యం పతనమైన రెండో ప్రతాపరుద్రుని కాలానికి గల నాలుగు తరాల పలుకుబడిని కచ్చితమైన తేదీలతో, సంవత్సరాలతో చెప్పడం కష్టమే! అయినా రుద్రమదేవి మరణాన్ని 27 నవంబర్‌గా చెప్పినా, సంవత్సరాన్ని కచ్చితంగా (1289/1295) చెప్పని పరిస్థితి. వీరి ఏలుబడి కాలంలోనిదే కోయరాజు పడిగిద్దరాజు కథ. అయితే ఈ సంఘటనకు కొందరు మొదటి ప్రతాపరుద్రుడి కాలానికి ముడిపెడితే, మరికొందరు రెండవ ప్రతాపరుద్రుడి కాలానికి చెందినదని చెపుతారు. కొన్ని కథనాల్లోని యుగంధరుడి ప్రస్తావనను బట్టి, ఈ కథ రెండవ ప్రతాపరుద్రుడి కాలానికి చెందిందనే నిర్ధారణకు వస్తారు. ఇవన్నీ భిన్న పరికల్పనలైతే నాడు ఏం జరిగిందనేది మాత్రం ఒకే కథనం వినవస్తుంది.
కాకతీయుల కాలమంతా యుద్ధాలతో గడవగా, ముందుగా పశ్చిమ చాళుక్యులకు ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంతులుగా వుండడం జరిగింది. అంటే పాలెగాళ్లుగా, కప్పం కట్టే వారన్నమాట! రుద్రమదేవి కాలంలో ఓరుగల్లును సందర్శించిన మార్కోపోలో కాకతీయుల వైభవాన్ని ఎత్తిపట్టి చూపినంతగా నాటి సామాజిక పరిస్థితుల్ని, అంతర్గత వైరుధ్యాల్ని, ప్రజలతో వున్న సంబంధాల్ని ప్రస్తావించినట్లు ఆధారాలేమీ లేవు. ఒకవేళ వాస్తవిక ఆధారాలేమైనా వుంటే చరిత్రను మరో కోణంలో అన్వయించే అవకాశం వుండేది. ఈ మొత్తం వ్యవహారంలో పడిగిద్దరాజు నాయకత్వంలో ఆదివాసులు యుద్ధం చేసారని, ఈ యుద్ధంలో రాజుతోపాటు ఆయన కూతుర్లయిన సారలమ్మ, నాగులమ్మ, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజులు అసువులు బాయగా, (రాజకీయ పరిభాషలో చంపబడడం), భార్య సమ్మక్క యుద్ధం చేస్తూ గాయాలపాలై అటవిలోకి వెళ్లిందని, చిలకలగుట్ట ప్రాంతంలో కుంకుమ భరణి రూపంలో దర్శనమిచ్చిందని, ఆ ప్రదేశమే ఆమె బాలికగా ఆమెను పెంచిన మేడరాజుకు లభించిందనేది ఓ నమ్మకం. ఏదిఏమైనా రాజ వంశానికి చెందిన రాజుతోపాటు మొత్తం కుటుంబం మరో రాజ్యకాంక్షలో భాగంగా చంపబడ్డారు.
ఈ మారణకాండకు కారణమేంటని ప్రశ్నించుకుంటే, ఆధిపత్యంతో, అంగబలంతో, సామ్రాజ్య విస్తరణతో మరో ప్రాంత రాజ్యంపై దండెత్తడమని, ఆక్రమించడమని తెలుస్తుంది. లొంగనివారిని నయానా, భయానా చెరబట్టడమని, సామంతులుగా చేసుకుని బలవంతంగా కప్పం వసూలు చేయడమని- ఓ రాజకీయ పరిభాష! ఈ రాజకీయ పరిభాష అర్థమైతే, కప్పం కట్టేవారి ప్రజాస్వామిక హక్కుల్ని హరించడమేనన్నమాట! వరుసగా కరువు కాటకాలు రావడం, చివరికి వరప్రదాయిని అయిన గోదావరి వట్టిపోవడంతో పంటలే లేక ఆకలితో అల్లాడుతుంటే, కప్పం ఎలా కట్టగలమనేది కోయల వాదన! ఈ న్యాయమైన వాదనని మనం ఘనంగా కీర్తిస్తున్న కాకతీయులు గుర్తించకపోగా, గర్హించి యుద్ధాన్ని ప్రకటించి ఆదివాసులపై మారణకాండ సాగించడమే ఓ అప్రజాస్వామిక చర్య! దీన్నిబట్టి వీరు (కాకతీయులు) మరో రాజుకు సామంతులుగా వుంటూ స్వతంత్రాన్ని ప్రకటించుకుని రాజ్యవిస్తరణ చేయడం మనకు గొప్పగా అనిపిస్తుంది. కాని ఇదే ఆలోచన ఓ ఆదివాసీ రాజు చేయడం తప్పుగా తోస్తుంది. నేరంగా అనిపిస్తుంది. ఈ సంధి కాలంలో, అనగా దాదాపు ఏడు శతాబ్దాలుగా పాలించిన ప్రతి పాలకుడు కాకతీయ దర్పానే్న ప్రదర్శించినా, ప్రజలు మాత్రం ఆదివాసుల పక్షానే్న నిలబడడం గుర్తించబడని రాజకీయం మనది. అంటే ఆదివాసులే కరెక్టు, కాకతీయులదే తప్పు అని నిగ్గు తేల్చాల్సి వస్తుంది.
ఆనాడు ఆదివాసీ పోరాటాలు నేటికీ అదే గోదావరి పరీవాహక ప్రాంతంలో, దండకారణ్యంలో కొనసాగుతూనే వున్నాయి. నాడు, నేడు ఉనికి కోసం, చింతన లేని కునుకు కోసం, వున్న నేల కాళ్లకింది నుంచి కదలకుండా వుండడం కోసం జరుగుతున్నాయి. ఈ పోరాటాలన్నీ కూడా ఆయా రాజ్యాలకు వ్యతిరేకంగానే కావడం గమనార్హం! పోతే, అలనాడు అణచబడినట్లే, ఆదివాసులు నేడు కూడా అణచివేయ బడుతున్నారు. రాజ్యహింసకు గురవుతున్నారు. ఇది వాస్తవమని గుర్తిస్తే, ఆదివాసుల హక్కులు కాలరాయ బడుతున్నాయని అర్థమవుతుంది. ఇది అర్థమైతే ఆదివాసుల్ని కాకతీయ దృష్టితో చూడలేము. అలాగే నేటి పాలకపక్షం భావజాలంతో కూడా చూడలేము. మరి ఇది జరుగుతున్నదా? జరిగే పనేనా? అనేది నేటి ప్రశ్న! ఈ వైరుధ్యాల్ని పట్టించుకోకుండా ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన ఓ నాయకత్వాన్ని సంబంధిత ఆదివాసులు స్మరించుకుంటూ, సంబురాల్ని జాతర పేరున చేసుకుంటుంటే, వారి హక్కుల్ని కాలరాసిన నాటి కాకతీయల పక్షాన ఆలోచించేవారు, నేటి పాలకుల స్వభావాన్ని సమర్ధించేవారు ఆ సంబురాల్లో చొరబడి, తాము సైతం.. అంటూ జండాలెత్తడం ఏంటనేది ఓ ధర్మ సందేహం! ఈ సందర్భంగా ఆదివాసులు ఆరాధిస్తున్నప్పుడు మనం ఆరాధిస్తే తప్పేంటనే ప్రశ్న రావచ్చు. కాని ఆదివాసేతరులుగా వారి హక్కుల్ని ఎంతమేరకు గుర్తిస్తున్నామనేది అసలు సమస్య! దీనిపై విస్తృత చర్చ జరగాలి. అలా జరిగినప్పుడు విధిగా కాకతీయుల అణచివేత విధానాన్ని, వారి వారసులుగా చలామణి అవుతున్న నేటి పాలకుల్ని విభేదించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ సాహసం మనం చేయగలమా?
నిజానికి ఆదివాసీ వన జాతర దాదాపు 1998 దాకా దండకారణ్యానికే పరిమితంగా వుండేది. ఆదివాసుల ఆచార వ్యవహారాల ప్రచారమే జరిగేది. నాటి జ్ఞాపకాలకు అనుగుణంగా పూజలు సాగేవి. ఒకప్పుడు వేలకు, తర్వాత లక్షలకు ఇప్పుడు కోటిమందికిపైగా హాజరయ్యే విధంగా జాతర ఎదిగింది. అయితే ఈ ఎదుగుదల భావాల పరంగా, ఆదివాసుల దైన్యస్థితిని దృష్టిలో పెట్టుకుని, వారి హక్కుల్ని నిలబెట్టాలని ఎదిగితే అభినందనీయమే! పైగా ఏ కాకతీయులకు వ్యతిరేకంగా ఆదివాసులు ధ్వజమెత్తారో, ఆ కాకతీయుల పేరునే స్వాగత ద్వారాన్ని నిర్మించడం ఏ రాజనీతో మనకు అర్థమై చావదు. అడవి తరగి, తారు రోడ్లతో ఆ ప్రాంతమంతా ధ్వంస రచన జరుగుతుంటే, అభివృద్ధి అని భ్రమిస్తున్నాం. పాలకులు ఇదే అభివృద్ధి నమూనా అంటున్నారు. ఇలా హాజరవుతున్న జనాల్లో ఆదివాసేతరుల సంఖ్య అధికం కాగా, అసలు సిసలు ఆదివాసులు తెరమరుగు కావడం జరుగుతున్నది. ఇంకా ఎదపైన మారుగుడ్డ లేని స్ర్తిలు, బుడ్డ గోచిగాళ్లు.. మన విఐపిల రాక సందర్భంగా పక్కకు తొలగాల్సి వస్తున్నది. ఇలా జాతర నేపథ్యంలో ప్రభుత్వం మద్యం పేరున కాంట్రాక్టర్లు, ఇతర వ్యాపారులు ఆ పోరాట గాథల్ని సీడీలుగా మార్చి సొమ్ము చేసుకునే దళారులు భారీగా లబ్ధి పొందుతుంటే, అమాయక ఆదివాసులు ఇంకా నిస్సహాయలుగానే మిగిలిపోతున్నారు.
నిన్నటిదంతా గతించిన కాలమనుకుంటే, నేడు జరుగుతున్నది నిన్నటి చరిత్ర పునఃప్రస్తావనే! ప్రాజెక్టుల పేరున, ఖనిజ సంపద వెలికితీత పేరున పుట్టి పెరిగిన అడవిని ఆదివాసులు వీడాల్సి వస్తున్నది. అభివృద్ధి అనే అంకుశంతో హింసకు గురైతున్నారు. దీన్ని ఆపడం మన తరం కాకపోవచ్చు! కాని ఈ వైపుగా ఆలోచిస్తున్నామా అనేదే ప్రశ్న! ఆ ప్రాంత కోయలు, కొండరెడ్ల, గోండుల బాధలు తెలియాలంటే పోవల్సింది జాతరకు కాదు, ఆదివాసీ గూడేలకు. అక్కడికి వెళ్లి వారి గుండె చప్పుళ్లను వినగలగాలి. ఆ ఓపిక మనకు ఎలాగు లేదు. ఏ రాయికి మొక్కితే ఎంతో లాభిస్తుందోననే చింతనతో ఆదివాసులు ఓ నమ్మకంతో నిర్మించుకున్న సంస్కృతీ సంప్రదాయాలలో చొరబడడం వారి సంస్కృతిని ధ్వంసం చేయడమే అవుతుంది. ఈ మేడారం జాతరకు పోయేవారికెవరికైనా షెడ్యూల్డు ఏరియా నిబంధనలు, 1/70 చట్టం, పెసా రాజ్యాంగ బద్ధత గూర్చి ఏమైనా తెలుసా? అవి అనునిత్యం ఉల్లంఘనకు గురైతున్న విషయం తెలుసా? వీరికి తెలిసిందల్లా ఎలా కోట్లకు పడగెత్తాలి, రాజకీయాల్లో ఎలా రాణించాలి, కాంట్రాక్టులు ఎలా కొట్టేయాలి, రియల్ ఎస్టేట్‌లో ఎలా సంపాదించాలి, పిల్లల్ని ఐఐటి, ఐఐఎంలలో ఎలా చేర్పించాలి, ఐఎఎస్‌లుగా ఎలా తీర్చిదిద్దాలి, అమెరికాకు ఎలా ఎగిరించాలనే స్వార్థ చింతన తప్ప ఆ ఆదివాసులు ఏ లక్ష్యం కోసం పోరాడారనేది ఏనాడు పట్టదు. సమ్మక్కకు, సారలమ్మకు పొర్లు దండాలు పెడితే, అనుకున్న లక్ష్యం నెరవేరుతుందనే అత్యాశ తప్ప మరొకటి కాదు.
నేటి ఆదివాసులే ఈ దుస్థితిలో వుంటే 7 దశాబ్దాల క్రితం వారి పూర్వీకుల దైన్యస్థితి ఎలా వుండేదో అర్థం చేసుకోవాలి. అలాకాకుండా ఆదివాసులు పెంపొందించుకున్న నమ్మకాల్ని శాస్ర్తియంగా ఆలోచించకుండా, వారిని ఎదిరించకుండా వారిని అలానే మగ్గేలా చేయడమే నేడు రాజకీయాలుగా మారడం శోచనీయం!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162