శ్రీవిరించీయం

కాలం నిలపని వంశ ప్రతిష్ఠ-కల్లోల కుటుంబ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాతిక సంవత్సరాలు కాపురం చేసిన రామ సుబ్బమ్మ భర్తకు తొలిసారిగా ఎదురుతిరిగింది. పతివ్రత, పరమసాధ్వి అయిన రామసుబ్బమ్మ భర్త గీచిన గీటును దాటి ఎరగని రామసుబ్బమ్మ, ఈ లోక దైవానే్న ధిక్కరించింది. సత్యకాలం కాకపోబట్టి సరిపోయింది. లేకపోతే అటు సూర్యుడు యిటు పొడిచి, నక్షత్రాలు ఝుల్లున నేలరాలి, భర్త శాపాగ్నిలో రామసుబ్బమ్మ మల మల మాడి మసై వుండేది. లేకపోతే చిన్నసైజు నల్లరాతి బండైనా అయి వుండేది’- ఈ వాక్యాలు వాసిరెడ్డి సీతాదేవి కధానిక ‘మారిపోయిన మనిషి’లో మొదట్లోనే అగుపిస్తాయి. ఎవరు ఈ రామసుబ్బమ్మ? భర్త మాటకు ఎందుకు తిరగబడింది? ఆమె అలా తిరగబడడం ధర్మమేనా? తిరుగుబాటువల్ల వచ్చిన ఫలితం ఏమిటి? కాలం మనుషుల్ని ఎట్లా కుదిపి కదలించివేస్తుంది, మనసులను ఎలా మార్చివేస్తుంది!.. ఈ వివరాలన్నీ కధలో క్రమంగా బయటపడతాయి.
రామసుబ్బమ్మ భర్త శేషయ్య. అతను పరువయిన ఐశ్వర్య కుటుంబంలో పుట్టిన వాడే. అతని తాతలు, ముత్తాతలు, తండ్రులు ఎన్నో దానధర్మాలు చేసి పుణ్యకార్యాలు ఆచరించి వంశానికి పరువు ప్రతిష్ఠలను ఇనుమడింపజేశారు. వాటిని నిలిపి వుంచటానికి, వాటికి మాలిన్యం అంటకుండా ఉండడానికి శేషయ్య కంకణం కట్టుకున్నాడు. కుటుంబం పస్తులు వుండే దిగజారుడు స్థితి వచ్చినా అతని వంశ ప్రతిష్ఠ అభిప్రాయాలు, అతిశయాలు ఇసుమంతయినా మారలేదు. భార్య ఇరుగుపొరుగువారి సహాయంతో ‘ఇడ్లీల వ్యాపారం’ చేయబూనుకుంటే అది తన ప్రతిష్ఠకు ప్రతిబంధకం అవుతుందనీ, యింక రుూ వూళ్ళో తనకు తల పైకెత్తి తిరిగే అవకాశం లేదనీ నిర్ణయించుకుంటాడు. భార్య, కూతురు ఎంత సమాధానంగా చెప్పదలచుకున్నా అతని ధోరణి యేమాత్రం మారదు. ఆఖరుకు భార్య తన పుస్తెలు తాకట్టుపెట్టి వ్యాపారం కోసం పెట్టుబడిగా తెచ్చుకున్న ఆరు వందల రూపాయలు దొంగతనం చేసి ఊరునుంచి పరారైపోతాడు- తన బట్టలు చేతి కర్రతో సహా. రామసుబ్బమ్మ బాధలు మళ్లీ మొదటికే వస్తాయి. ఆమెకు ఇరుగు పొరుగువారే సహాయపడి నిలదొక్కుకునేట్లు చేస్తారు. అనుకున్న ప్రకారం ఆమె ఇడ్లీల వ్యాపారం చేసి దానిని క్రమంగా అభివృద్ధి చేసుకుని పల్లెటూరు విడిచి దగ్గరి రైలు స్టేషన్ వున్న ఊరులో చిన్న సైజు రెస్టరెంట్ ఏర్పాటు చేసుకోగలుగుతుందనీ, యిందుకు కూతురు- అల్లుడు సహాయంగా నిలిచి ఉన్నారని మనకు కథాంతంలోగాని ఊహకు అందదు.
తరువాతి కథనం అంతా శేషయ్య యాత్రతో నడుస్తుంది. చేతినిండా డబ్బు వున్నది గనుక అది దొంగతనంగా సంపాదించిందే అయితేనేం- అతను ఇబ్బందులకు లోనుకాకుండా కృష్ణ, గోదావరి నదులు దాటుకుపోయి కాశీపట్టణానికి చేరుకుంటాడు. కాశీలో అతను గంగానది స్నానం చేయబోతూ వుండగా-అతను బసచేసిన సత్రంలో యేదో చోరీ జరిగిందనీ, అందుకు శేషయ్యే బాధ్యుడనీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుపాలు చేస్తారు. గంగానదిలో స్నానం చేసి - జీవితం అంతం చేసుకుందామనే అభిప్రాయంతో వున్న శేషయ్య తన కట్టుబట్టల సంచీ నదీ మధ్యానికి గిరవాటు వేయడం పోలీసులకు అదే నగల మూట అనుకునేందుకు ఆధారం అయింది. అతనికి మూడు సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఈ మూడేళ్ళలో అతను హంతకులమధ్య, దొంగలమధ్య కాలక్షేపం చేస్తూ ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. తన భార్య నగలు అమ్మి చేర్చుకున్న డబ్బును అపహరించినందువల్లనే తనకు ప్రస్తుత చోరీ నేరం ఆపాదన అయిందనీ, తనకు తగిన శిక్షే పడిందనీ సమాధానపడతాడు. ఇకనుంచయినా చక్కగా బతుకు కొనసాగించాలనీ, వెనకటి భేషజాలకు మనసు లొంగపోకూడదనీ నిర్థారణకు వస్తాడు.
శేషయ్య జైలు జీవితం గడిపి బయటకు వచ్చి తన స్వగ్రామానికి తిరిగి వెళ్లి భార్యాబిడ్డలను చూడాలని ఆరాటపడతాడు. ఆ ఊరుకు వెళ్ళే రైలు ఎక్కి దగ్గరి స్టేషన్‌లో దిగుతాడు. అక్కడినుంచి ఐదు మైళ్లు బస్సు ప్రయాణం చేస్తే తప్ప అతని గ్రామం రాదు. రైలు స్టేషన్ ఎదురుగా వున్న చిన్న రెస్టరెంట్ అతన్ని కాఫీ తాగమని ప్రేరేపిస్తుంది. చేతిలో మిగిలిన పైసలు కూడా ఇందుకు సహకరించేట్లే కనిపిస్తాయి. శేషయ్య కాఫీ హోటల్‌లో చేరి కడుపారా టిఫిన్ చేసి, కాఫీ పుచ్చుకుంటాడు. హోటల్ యజమానికి డబ్బు చెల్లించకుండానే ఎదురుగా కనిపించిన బస్ ఎక్కి ఊరికి వెళ్ళే ఊరటలో వుంటాడు. అయితే హోటలు యజమాని అతన్ని పట్టుకుని చొక్కా లాగి కిందకు గిరాటేస్తాడు బస్‌లోనుంచి. తీరా హోటల్‌కు తీసుకువచ్చి దండించే సమయంలో అతని కూతురు- తండ్రిని గుర్తుపట్టి, తల్లిని తీసుకువచ్చి ఎఱుక చేస్తుంది. శేషయ్య భార్యను రెండు చేతులా పట్టుకుని ‘నేనే.. నేనే.. నన్ను క్షమించు..’ అన్నమాటలు చెప్పలేక చెబుతాడు. అల్లుడు అతన్ని ‘పారిపోయిన మనిషా?’ అంటే- శేషయ్య భార్య ‘కాదు- మారిపోయిన మనిషి’ అంటుంది రామసుబ్బమ్మ ముసిముసి నవ్వులతో.
వంశ ప్రతిష్ఠ, మర్యాదలంటూ భేషజాలకు పోకుండా వర్తమాన స్థితిగతులను చక్కగా ఆకళింపు చేసుకుని జీవితం గడపటం అవసరం అనే ‘న్యాయ సూత్రాన్ని’ రుూ కథానిక చెబుతుంది. కల్లోల కుటుంబాన్ని సరిచేయడంలో స్ర్తికి ఎటువంటి బాధ్యతాయుతమైన పాత్ర వున్నదో కూడా చెబుతుంది. ఓడలు బళ్ళు అవడం, మళ్లీ బళ్ళే ఓడలుగా తయారవడం కాలం తీసుకువచ్చే మార్పు అయినా, ఇందుకు దోహదం చేసేది జీవనయానం చేస్తున్న మనుషులే అని చదువరులు గమనించాలని సూచించే రుూ చక్కని కథానిక స్ర్తివాద ధోరణి మటుకే సంబంధించినది కాదు. జీవనయాత్ర అంతటినీ పొదిలపరచేది.