మెయన్ ఫీచర్

‘సీమ’కు హైకోర్టు బెంచి సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయలసీమలో హైకోర్టు సాధన కోసం చేపట్టిన ఉద్యమం ఇంకా తొలిదశలోనే ఉంది. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గొంతెమ్మ కోరికేమీ కాదు. హైకోర్టు బెంచిని రాయలసీమలోని ఏ నగరంలో ఏర్పాటు చేసినా యావదాంధ్ర ప్రజలు స్వాగతిస్తారు. గతంలో అనేక అంశాలపై ఆయా ప్రాంతాలు భిన్న స్వరాలు వినిపించడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరారు. రాజధాని తమ ప్రాంతంలో ఎటూ నెలకొల్పరనే విషయం తెలిసినా, పోరాడితే పోయేదేముందనే ఉద్దేశంతో రాజకీయ, ప్రజా సంఘాలు ఆ డిమాండ్‌ను పలు వేదికల ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చాయి. 1953లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నగరాన్ని కోల్పోయింది. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా 1953లో కర్నూలు నగరాన్ని ఎంపిక చేశారు. అది మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. 1956లో అప్పటి పాలకులు మిగులు హైదరాబాద్ (తెలంగాణ)లో విలీనమైతే, హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరిస్తుందని భావించి ఆ ప్రయత్నంలో విజయం సాధించారు.
58 ఏళ్ల తర్వాత 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజించింది. విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, వైకాపాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో, దార్శనికతతో వ్యవహరించడంలో విఫలమయ్యాయి.
నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన టిడిపి జాతీయాధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. విభజన వల్ల తీరని నష్టంతో కుమిలిపోతున్న సీమ ప్రాంత ప్రజల నుంచి అక్కడక్కడ కొన్ని నిరసనలు వ్యక్తం అయినా, మనస్ఫూర్తిగా చంద్రబాబు నిర్ణయాన్ని ఆహ్వానించారు. సర్వం కోల్పోయి రోడ్డుమీద పడిన రాజధాని గురించి పోట్లాడి ఇంకా అభాసుపాలు కావడం మంచిది కాదని భావించారు. రాయలసీమలో హైకోర్టును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్న వాదన తెరపైకి వచ్చినా, కార్యరూపం దాల్చదని తేలిపోయింది. అమరావతిలోనే హైకోర్టు ఉండాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని కూడా దాదాపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆమోదించారు. అధికార వికేంద్రీకరణ అనే సూత్రం అమలుకు నోచుకోనందున ఆంధ్ర రాష్ట్రం ఆరు దశాబ్దాల్లో అనేక కష్టనష్టాలకు లోనైంది. మళ్లీ అదే తప్పును ప్రస్తుత పాలకులు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు సంకల్పాన్ని ఎవరూ ఎదురుచెప్పే పరిస్థితి లేదు. కొన్ని గొప్ప నిర్ణయాలను కొంత మంది పాలకులే చాలా సులభంగా తీసుకుని అమలు చేసి ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని పక్షంలో ఆ పాలకులను చరిత్ర క్షమించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీ నేతలే ముఖ్యమంత్రి స్థానంలో రికార్డు స్థాయిలో పాలన చేశారు. కాని పేరుగొప్ప, ఊరుదిబ్బ మాత్రమే రాయలసీమకు మిగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి (అనంతపురం) , దామోదరం సంజీవయ్య, (కర్నూలు),కోట్ల విజయభాస్కరరెడ్డి (కర్నూలు), వైఎస్ రాజశేఖర రెడ్డి (కడప), చంద్రబాబు (చిత్తూరు) పాలించి రాణించారు.
ఇతర రాష్ట్రాలను చూసి మన పాలకులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సిన సమయం ఇది. మన పొరుగునే ఉన్న కర్నాటకలో బెంగళూరులో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఉంటే, వెనకబడిన ఉత్తర కర్నాటకలో గుల్బర్గాలో హైకోర్టు బెంచి, ధార్వాడ్ -హుబ్లీలో హైకోర్టు బెంచిని పదేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. జనాభా, వైశాల్యపరంగా వెనకబడిన కర్నాటకలోనే మూడు హైకోర్టులు ఉన్నాయి. కర్నాటకలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రప్రయోజనాలపై నిర్ణయాలు తీసుకుని అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతాయి. కర్నాటకలోనే బెల్గాంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించి సాలీనా 15రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన చత్తీస్‌గఢ్‌లో హైకోర్టు రాజధాని రాయ్‌పూర్‌లో కాకుండా భిలాస్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. కేరళలో హైకోర్టు రాజధాని తిరువనంతపురంలో కాకుండా కొచ్చిన్‌లో ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో హైకోర్టు లేదు. ఆ రాష్ట్రంలో జబల్‌పూర్‌లో హైకోర్టు ప్రధానకార్యాలయం ఉంది. గ్వాలియర్, ఇండోర్‌లో హైకోర్టు బెంచిలను ఏర్పాటు చేశారు. తమిళనాడులో ప్రధాన హైకోర్టు చెన్నైలో ఉంటే మధురైలో బెంచిని ఏర్పాటు చేశారు. మహారాష్టల్రోని ముంబయిలో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఉంది. ఔరంగాబాద్, నాగ్‌పూర్‌లో బెంచిని ఏర్పాటు చేశారు. ఓడిశా రాజధాని భువనేశ్వర్‌లో కాకుండా, సమీపంలోనే మహానదికి అవతల ఉన్న కటక్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజధాని డెహ్రాడూన్‌లో కాకుండా 280 కి.మీ దూరంలో ఉన్న నైనిటాల్‌లో హైకోర్టును నెలకొల్పారు. అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌లో ప్రధాన హైకోర్టు, లక్నోలో బెంచిని స్ధాపించారు. రాజస్తాన్‌లో హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని జోద్‌పూర్‌లో, బెంచిని జైపూర్ (రాష్ట్ర రాజధాని)లో ఏర్పాటు చేశారు.
దేశంలో కొత్తగా ఏర్పడిన చత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్‌తో సహా కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, రాజస్తాన్, మహారాష్ట్ర లాంటి పాత రాష్ట్రాలు న్యాయపరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ రాష్ట్రాల పాలకులు గొప్ప నిర్ణయాలు తీసుకుని సులువుగా అమలు చేసి ప్రజల దృష్టిలో చిర స్థాయిగా నిలిచారు. ఇవి పెద్ద ఆర్థిక వ్యయంతో కూడుకున్న నిర్ణయాలేమీ కాదు. ప్రస్తుతం పాలకులు ఖర్చుపెడుతున్న వ్యయంతో పోలిస్తే, ఒక హైకోర్టు బెంచి, సాలీనా 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఒక భవనం నిర్మాణం ఒక నగరంలో ఏర్పాటు చేస్తే వచ్చే ప్రజా బాహుళ్య మద్దతు ముందు ఏ పాటిది?
హైకోర్టుకే సరైన భవనాలు లేక సతమతమవుతుంటే, బెంచి గురించి వాదనెందుకని కొంత మంది నేతలంటున్నారు. ఇంతకంటే అమానుషమైన ఆలోచన మరొకటి ఉండదు. హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగిపోయింది. కాని హైకోర్టు బెంచిని రాయలసీమలో ఏర్పాటు చేస్తామనే నిర్ణయాన్ని ప్రకటించేందుకు జాప్యం తగదు. 1937లో కుదిరిన శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలులోరాజధాని,గుంటూరులో హైకోర్టును అప్పటి పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దురదృష్టకరమైన పరిణామాలు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలి వెళ్లడం, అప్పటి పాలకుల తప్పిదాల వల్ల ఆంధ్ర రాష్ట్రం వచ్చే వందేళ్లలో కూడా కోలుకోలేనంత మూల్యం చెల్లించింది. చివరకు గుంటూరులో ఉన్న హైకోర్టును బెంచిగా మార్చి అక్కడే కొనసాగించాలని పెద్ద మనసుతో ఆనాటి తెలంగాణ పెద్దలు కోరినా, ఆంధ్ర పెద్దలు ససేమిరా అన్నారు. చంద్రబాబు 40 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్న ఒక జాతీయ నాయకుడు. ప్రజలు ఒక హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఆమోదిస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఈ ప్రతిపాదనను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరిస్తారు. హైకోర్టు బెంచి రాయలసీమలో ఎక్కడ ఏర్పాటు చేసినా స్వాగతించే విధంగా అధికార, విపక్ష పార్టీలు ఉండాలి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్‌తో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరిపి హైకోర్టు బెంచి విషయమై విశాల దృక్పథంతో ఒక నిర్ణయం తీసుకుంటే రాయలసీమ ప్రజలు స్వాగతిస్తారు. హైకోర్టు బెంచితో పాటు కర్నాటకలో బెల్గాం తరహాలో ఒక అసెంబ్లీ భవన నిర్మాణానికి కర్నూలు అనువైన నగరం. చరిత్రలో కనుమరుగైన నగరాలకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల రాజకీయ పార్టీల గౌరవం పెరుగుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా అంతకు ముందు మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్రరాష్ట్రం విడిపోయినప్పుడు రాయలసీమకు పెద్ద నష్టం వాటిల్లింది. అప్పటి మన రాజకీయ పార్టీల హ్రస్వదృష్టి, సంకుచితత్వం, స్వార్థ రాజకీయాల వల్ల అద్భుతమైన బళ్లారిని రాయలసీమ పొగొట్టుకుంది. బళ్లారిని కోల్పోవడం రాయలసీమ, ఆంధ్ర చరిత్రలో ఒక విషాదం. బళ్లారిని కోల్పోవడం వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఆదవాని, ఎమ్మిగనూరు,ఆలూరు, రాయదుర్గం ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా, పాలనాపరంగా అనేక సంక్లిష్ట సమస్యలను చవిచూశాయి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా, రాయలసీమకు ఆరుదశాబ్ధాల పాటు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇదే అనువైన సమయం. వచ్చే మార్చి నెలలో అసెంబ్లీసమావేశాల్లో హైకోర్టుబెంచిపై నిర్ణయం తీసుకుంటే ప్రజలు స్వాగతిస్తారు.

-కె. విజయశైలేంద్ర 98499 98097