వీరాజీయం

పాక్ టెర్రరిస్టు మూకలకు మెరుపుదెబ్బే మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ సెంట్రల్ జైలు నుంచి భయంకర లష్కరే తోయిబా టెర్రరిస్టు ఖైదీ అయిన నజీద్ అహమ్మద్ ఝాట్‌ని నాటకీయంగా విడిపించుకుపోయిన దరిమిలా కాశ్మీర్‌లో సైనిక దుస్తుల్లో తెగబడి వచ్చి, సున్జవాన్ సైనిక శిబిరం మీద తెగబడి దాడులు చేశాయి ఉగ్రవాద మూకలు. ఒక జూనియర్ అధికారిని, ఏడుగురు (ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే వుంది) జవాన్లను వీరు పొట్టన బెట్టుకున్నారు. ఇది ధర్మయుద్ధం కాదు- అసలు యుద్ధం కూడా కాదు. దాడి తరువాత తప్పించుకొనిపోతున్న కిరాయి ముష్కరులలో కొందరు ఒక ఇంట్లో జొరబడి దాక్కొని ఇరవై గంటలుగా ఎదురుకాల్పులు చేస్తూనే వున్నారు. అంటే వాళ్ళ సంసిద్ధత, సరంజామా ఎంత ఎక్కువో తెలుస్తోంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌లు అక్కడకి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు.
నిద్రిస్తున్న గృహస్థులపై దాడులు చేస్తున్న ఈ మూకల్ని సైనికులే తయినాతుగా వచ్చి దిగవిడిచారని- మన వేగులవారి భోగట్టా. నజీద్నికి, అతడి అనుచరులకి శ్రీనగర్ సెంట్రల్ జైల్లో కష్మీరీ కబాబులు, చికెన్ బిర్యానీలు- మొబైల్ ఫోనుల సౌకర్యాలు అన్నీ ఇంటి అల్లుడుగారి లెవెల్లో అందుతున్నాయని దర్యాప్తులో తేలింది. సంకీర్ణ ప్రభుత్వం వున్న కాశ్మీర్ అసెంబ్లీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యుడు చిత్రంగా కూశాడు, కాశ్మీర్‌లో కల్లోలానికి కారణమైన పాకిస్తాన్‌కు జిందాబాదులు కొట్టాడు. తనను బిజెపి సభ్యులు రెచ్చగొట్టారంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా సమర్థించుకోవడం- ఈ దారుణ దొంగ దాడుల కన్నా హేయమైన పని. ‘మా పార్టీకి అతని నినాదాలకి సంబంధం లేదు’ అని ఫారూక్ అబ్దుల్లా అన్నప్పటికీ- అది చాలదు.. బేషరతు క్షమాపణ సభ లోపలే కావాలి. మాకేమీ సంబంధం లేదన్నంత మాత్రాన ఊరట చెందకూడదు.
సాక్షాత్తూ కశ్మీర్ సీఎం ముఫ్తీ మెహబూబా అమ్మగారి ధోరణి మరీ చిత్రంగా వున్నది. రాళ్ళు రువ్వే అల్లరి మూకలను కటకటాల వెనుక నుంచి విడుదల చేయడమే అనుచితం. పోనీ వాళ్ళని లోపల తోసేసిన సమయంలో- కాశ్మీర్ సరిహద్దు పరిసరాల్లో రాళ్ళు అన్నీ ఏరి, వాటితో రోడ్లు నిర్మించలేకపోయారా? రాళ్లను, వాటిని రువ్వే కుర్రాళ్ళని కూడా సప్లై (పరోక్షంగా) చేస్తున్నారని ఎందరో తిడుతున్న నేపథ్యంలో- పగిలిన అగ్నిపర్వత శిఖరాన నిలబడి ఉన్న తరి, పాకిస్తాన్‌తో మనం ఇపుడు బల్ల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుందామా? అంటూ మెహబూబా సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. భాజపాకు అధికార కక్కుర్తి కాదు, కేవలం అక్కడ అధికారంలో వుంటే ఏమైనా శాంతి సాధించవచ్చు అనుకొని మిశ్రమ ప్రభుత్వ ఏర్పాటుకి దిగారనే అనుకుందాము. కాని, ఇదేదో శల్య సారథ్యం బాపతుగా తయారవుతూంటే , ముఖ్యమంత్రిని ఏమనాలో అర్థం కాదు. ‘చర్చలు చేద్దామా?’ అంటుందామె. దేనిమీద చర్చలు? ఈ ఉగ్రవాద మూకలకు నాయకత్వం ‘నాదే’ అని పాకిస్తాన్ అంగీకరించినపుడు కదా? ఇక- దాడులు మా నిర్వాకమే అని లష్కరే తోయిబా అంటూ- దొంగ దెబ్బ తియ్యడమే వీరోచిత కార్యక్రమం అన్నట్లు ప్రకటించింది. రక్షణ మంత్రి నిర్మల నిర్ద్వంద్వంగా ‘ఇది టెర్రరిస్టుల ఆగడమే- దీనికి పాకిస్తాన్ మూల్యం చెల్లించాలి’ అని ప్రకటించింది. దీనికి సీఎం వెంటనే జేజేలు చెప్పవద్దా.. ఎస్ మాడం అంటూ!
వెనక్కి తిరిగి ఒక్కసారి 2016 నాటి ‘ఉరీ’ సంఘటనలను- అంతకుముందు పఠాన్‌కోట్ ఎయిర్‌బేసు సంఘటనలని గుర్తుచేసుకుందాం. మొదటి దాడులలో ఏడుగురు సైన్యాధికారులు, రెండో దాడిలో పందొమ్మిది మంది సైనికులు- యుద్ధంలో కాదు, దొంగచాటుగా జరిగిన దాడిలో దుర్మరణం పాలైనారు. మన ప్రభుత్వం అటు తరువాత- ఎన్నో నిరోధక చర్యలకు సంకల్పించింది. త్రివిధ దళాల సభ్యులను నియమించి మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంటు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఎన్నో నిరోధక భద్రతా చర్యలని కమిటీ సూచించింది. చొరబాటుదారులని అరికట్టే మానవ రహిత ఎలక్ట్రానిక్ వాహనాల ఏర్పాటు మొదలుకుని జవాన్లందరికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల సరఫరా దాకా ఎన్నో సదుపాయాలను సమకూర్చాలని ఆ నివేదిక చెప్పింది. ఎన్‌ఐఏ దర్యాప్తులో నేరదోహదకరంగా పాకిస్తాన్ వ్యవహరించిన సంగతి బయటపడ్డది. దానికి ఇస్లామాబాద్ చలించకపోగా పరిశోధన సహకారాన్ని కూడా అందించలేదు. దౌత్య మార్గాలలో, అంతర్జాతీయ ఒత్తిడి పెట్టే దారులలో భారత్ ప్రయత్నాలు చెయ్యక తప్పలేదు. అంతర్జాతీయ ఒత్తిడి ఫలితంగానే ఎట్టకేలకు హఫీజ్ సరుూద్‌ని ‘ఉగ్రు డు ఈ ముష్కరుడు’ అని ముద్రవేసి మరీ ఒప్పుకున్నది పాకిస్తాన్.
వెనక్కిపోయి చూస్తే- 2016 సెప్టెంబరు నాటి సర్జికల్ మెరుపుదాడులు జ్ఞాప కం వస్తాయి. వాస్తవాధీన రేఖ వెంబడే డేరాలు వేసుకుని తిష్ఠ వేసుకున్న ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది మన సైన్యం. ఎప్పుడు వెళ్లిందో? అసలు వెళ్లిందో లేదో తెలియనంత వేగంగా దాడులు జరిగాయి. సభ్య ప్రపంచం ‘అయ్యో.. పాపం’ అనలేదు. పాకిస్తాన్ తేలు కుట్టిన దొంగ అయిపోయింది. సరిగ్గా ఇవాల్టి దొంగ దాడులు నాటి వైనాన్ని తిరిగి చూపాయి. కష్మరీలతోపాటు ఇండియన్స్ అందరికీ కూడా గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా ఇప్పటి దుస్సాహపు దాడులను అసెంబ్లీ ముఖంగా, ప్రభుత్వ పరంగా ఖండించి దుమ్మెత్తిపోయాలి. సమయం దొరికినపుడల్లా ఆమె మన ఆర్మీపైనే నిందలు వేస్తున్నది. ఆర్మీ మేజర్ ఆదిత్యాన్‌పై నింద వేస్తున్నది. ‘‘నువ్వు రాళ్లతో కొట్టు, నేను పువ్వులతో కొడతాను’’ అన్న ధోరణిలో ప్రాణాంతకంగా రాళ్లవాన కురిపిస్తున్న మూకలమీద తుపాకీ ఎక్కుపెట్టకూడదా? ‘పెల్లెట్లు’ పెట్టి కూడా కొట్టకూడదు అంటుందామె. ఆదిత్యన్‌పై పోలీసు కేసు పెట్టించింది ఎవరో కాదు మన దేశంలోని ఒక ముఖ్యమంత్రి. సైన్యాధికారిపై ఎఫ్‌ఐఆర్ పెట్టించడమా? కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లాలి. అందుకనే ఆ మేజర్ తండ్రి సుప్రీంకోర్టుకి పెట్టిన అప్పీలు మీద కోర్టు ‘స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్’ అన్నట్టుగా ‘స్టే’ ఇచ్చింది.
అది సరే, ఏ అజెండా మీద చర్చలు చేస్తారు? పాకిస్తాన్ సందర్భ శుద్ధిలేని కక్షతో ఇలాంటి అక్రమ దాడులను చేయిస్తూ వుంటే - నిర్మలా సీతారామన్ చెప్పినట్లు అందుకు వాళ్ళు మూల్యం చెల్లించవలసిందే. దేశం మొత్తం ఒక రూలు కాని కాశ్మీర్‌కి ఒక్కదానికి ఆ ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు? గవర్నమెంటేమో రాళ్ళతో, పాకిస్తానేమో ఉగ్రదాడులు చేయిస్తో వుంటే చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? మరొక్కసారి మెరుపు దాడులకి పూనుకోవాలి. పిలిచి పీకల మీదికి తెచ్చుకుంటుంది పాక్. ఇక ఎంతోమంది పరిశీలకులకు కూడా అనుమానంగానే వుంది. ఉగ్రవాదులికి కాశ్మీర్ లోపల సహాయం, సేవ, మెచ్చికోలు వగైరా అందుతున్నాయి అన్నది అనుమానం.
లా అండ్ ఆర్డర్‌ను చూడవలసినది- మహబూబా ప్రభుత్వమే గాని కేంద్రం కాదు. అవసరమైతే కాశ్మీర్‌లో అఖిల పక్షం మీటింగు పిలవాలి. ఆనక సీఎంను ఢిల్లీకి పిలిచి మాట్లాడాలి. ఇదంతా జరిగాక రక్షణ మంత్రి ఇచ్చిన వార్నింగుని అమలు చెయ్యాలి. ఆఖరికి మొన్న రిపబ్లిక్‌డే నాడు కూడా వాఘా బోర్డరు దగ్గర మిఠాయిలు పంచుకోలేదు సైన్యాలు. అటు అమెరికా తోక కత్తిరించిన దగ్గరినుంచి ఇండియాపై ఇస్లామాబాదు మండిపడిపోతున్నది. మీ దగ్గర ఏమి సాక్ష్యాలు ఉన్నాయి? అంటారు- ముంజేతి కంకణంలాగ కనబడుతూనే వుందిగా.. పైగా ఇప్పటి దాడులమీద కూడా అన్ని రకాల రుజువులు మన వాళ్లు రొటీన్‌లో పాక్‌కి పంపుతారు. హిందీలో ఓ సామెత వుంది ‘‘లాతోంకే కే భూత్ బాతోనే్స నహీన్ మానతే’’ అని. అంటే- దెబ్బకి దెయ్యం జడుస్తుంది అని అర్థం. కాశ్మీర్‌పై చర్చలైనా గిర్చలైనా మొదట మెరుపు దాడులు తప్పవని ఈపాటికే అర్థం అయిపోయింది. సైన్యానికి పచ్చజెండా చూపెట్టడం జరిగిపోయింది అని అంటున్నారు. కాకపోతే పాకిస్తాన్ కూడా ఇటువంటి బాదుడుని ఊహించుకుని సిద్ధం అయ్యేలోగానే ఓ ‘రేవు పెట్టడం’ మంచిది అన్నది జనవాక్యం!
ఎర్లీయర్ ది బెటర్! హైల్!! అవర్ బ్రేవ్ ఆర్మీ!

veeraji.columnist@gmail.com