కథ

ప్రజాసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ
ప్రచురణకు
ఎంపికైన కథ

బలవంతుల కష్టాలు బలహీనులకు అవకాశం కల్పిస్తాయి.. బలహీనుల కష్టాలు బలవంతునికి శక్తినిస్తాయి. కష్టాలనేవి కనపడని ద్రవ్యం వంటిది. అది విజయానికి కావల్సిన వస్తువులను సమకూర్చుతుంది. సమర్థులు తమ కోసం.. అసమర్థులు ఇతరుల కోసం కృషి చేస్తారు.
-కబీర్ దోహ
‘రండి.. రండి.. ఇలా వచ్చేరు.. ఏమయినా విశేషమా?’ రామస్వామి నాకు ఎదురొచ్చి స్వాగత సత్కార్యపు మాట అన్నాడు. నన్ను తీసుకొని వెళ్లి.. తన పర్సనల్ రూమ్‌లో కూర్చోబెట్టాడు.. అక్కడున్న ఒకరిద్దరితో... ‘ఈయన మా గురువుగారు.. మంచి రచయిత. సర్వ సాధారణంగా ఒకరికి సహాయం చేయటమే కానీ... ఆయన ఎవరి సహాయం కోరరు!...’ నా గురించి చెప్పగానే వారంతా నాకు నమస్కరించారు.. నేను ప్రతి నమస్కారం చేశాను.. వారంతా బయటకు వెళ్లారు. చల్లని మజ్జిగ వచ్చింది. తాగాను.
గోడ మీద గడియారం పనె్నండు సూచిస్తున్నది. బయట మే నెల ఎండ దట్టంగా ఉంది.. గదిలో ఏసీ చల్లగా ఉంది. నేను కుదుటపడ్డాను. నా ఎదురు కుర్చీలో రామస్వామి కూర్చోని...
‘చెప్పండి మాస్టారూ.. ఏమిటీ పని?’
‘మీరు మంచి నాయకులని.. ప్రజలు పిలిస్తే పలుకుతారని.. ఏ పనైనా సునాయాసంగా చేస్తారని విన్నాను... నేనేమీ అంత గొప్పవాడిని కాను. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నవాణ్ని. ఈ మధ్యలో చిన్న ఇల్లు కట్టుకున్నాను. మీకు తెలుసు.. మీరు కూడా సహాయం చేశారు. ఆ చనువుతోనే మరో చిన్న సహాయం కోసం వచ్చాను..’
‘అయ్యయ్యో ఎంత మాట.. తప్పకుండా చెప్పండి...’ అన్నారు వినయంగా.
‘ఏమీ లేదు సార్.. నా ఇంటికి మీ వలన కరెంట్ కనెక్షన్ వచ్చింది.. కానీ...’ ఆగాను. ‘ఎలా చెప్పాలా?’ అని ఆలోచించసాగాను.
‘మాస్టారూ... మీరు పెద్దవారు.. ఎటువంటి సంకోచం లేకుండా చెప్పండి... నా చేతనైనదయితే చేస్తాను.. లేకుంటే మీదకు వెళదాం...’
‘అయ్యో అంత పెద్దది కాదు.. నాకు ఏసీ ఉంది. మీకు తెలుసు కదా...’
‘అవును.. అయితే’ అర్ధోక్తిగా ఆగారు.
‘మన ప్రాంతానిది... లోవోల్టేజీ సమస్య.. కరెంట్ సింగిల్ ఫేస్ వస్తుంది. ఏసీ పని చేయటంలేదు. ఏమైనా అవకాశం ఉంటే.. డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు.. డబుల్ ఫేస్.. నా యింటికి ఏమైనా అవకాశం ఉంటుందేమోనని...’ అన్నాను.
క్షణం సేపు ఆలోచించి...
‘ఎందుకు సార్.. డబ్బులు దండగ అవుతాయి.. మీరు తట్టుకోలేరు.. అయినా ఇది మన ప్రాంత సమస్య... దీనిని మనమంతా కలిసి చర్చించుకుందాం...’ అని.. వెంటనే - ఒక మనిషిని పిలిచి ‘ఈ రోజు మన కాలనీ వాసులందరినీ రామమందిరం దగ్గరకు రమ్మనమను. కరెంట్ గురించి చర్చించాలని చెప్పు...’
ఆ మనిషి బయటకు వెళ్లిపోయాడు.
‘సారూ.. పైసా ఖర్చు కాకుండానే పని చేయిద్దాం... సరేనా.. రాత్రి మీరు కూడా రండి. ఏం ఫర్వాలేదు.. పని అయిపోయేటట్టు చేస్తాను... సరేనా.. రాత్రికి వచ్చేయండి’
ఇద్దరం లేచాం.. బయటకు వస్తుంటే ‘రామస్వామి మన వార్డు మెంబర్ కావటం.. మన అదృష్టం.. ఎమ్మెల్యేలు చేయలేని పని కూడా ఈయన చేయగలడు...’ అని అనుకుంటున్నారు. నన్ను చూసి ‘నమస్కారం మాస్టారూ’ అని చేతులు జోడించారు.
ఆ రాత్రి అందరం రామమందిరం దగ్గర సమావేశమయ్యాం.. ఇంటికి ఒక్కరు చొప్పున పెద్దలు వచ్చారు.. పెద్దలు లేని చోట.. ఓటు హక్కున్న యువకులు వచ్చారు.
రామస్వామి రాగానే అందరూ నిలుచున్నారు... నన్ను ఆయన ప్రక్కన కూర్చోమన్నారు. అందరం ఒక్కసారి.. ‘జై శ్రీరామ్’ అని మూడుసార్లు నినాదాలు చేశాం.. వెంటనే రామస్వామి లేచి నిలబడి మాట్లాడటం ప్రారంభించారు.
‘అందరికీ నమస్కారం.. యువకులు ఎక్కువ మంది వచ్చారు.. వారికి అభినందనలు.. వారే రేపటి దేశ దిశా నిర్దేశకులు.. మన సమస్యను కూడా వారి భుజాలపైనే పెడుతున్నాను.. మన ప్రాంతంలో కరెంటు మరీ దారుణంగా ఉంటున్నది.. మనమంతా బలహీన వర్గాలకు చెందినవారమే. అయినా ఇలాంటి దుస్థితి విచారకరం.. కరెంటు బిల్లులు సక్రమంగానే కడుతున్నాం.. మంచి కరెంటు కోరుకోవటంలో తప్పు లేదు... ఇటువంటి లోవోల్టేజీ వల్ల మన టీవీ.. ఫేన్లు వంటివి కాలిపోతున్నాయి.. ఈ విషయం వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి.. కొత్త ప్రభుత్వం.. ఇది మన ప్రభుత్వం.. తెలియజేయవలసిన అవసరం మనది..’ అని ఆగారు. ఎవరో వాటర్ బాటిల్ అందించారు. కొంచెం తాగి.. మిగిలినవి టేబుల్ పైన ఉంచారు.
మరలా ప్రారంభించారు.
‘ఇందుకోసం మీరు నయాపైసా చెల్లించనవసరం లేదు.. ఖర్చంతా నాదే...’ అందరూ చప్పట్లు గట్టిగా కొట్టారు. నేను కూడా వారితో కలిశాను.. ‘మాస్టారు ఓ పిటిషన్ రాస్తారు. దాని మీద మీరంతా సంతకాలు చేయండి’ అని ఓ తెల్లకాగితం తెమ్మన్నారు. ఓ కుర్రాడు పరిగెత్తుకొని వెళ్లి, తెచ్చాడు. నాకు రాయమని ఇచ్చాడు.. ‘ఎవరికి రాయాలి?’ అని అడిగాను.. ‘హైద్రాబాద్... ఏపీడీయల్..కి రాయండి.. ఎమ్మెల్యేకో కాపీ, కలెక్టర్‌కి, ఇక్కడ కరెంట్ ఈఈకి కూడా ఓ కాపీ పంపిద్దాం...’
అరగంటలో తయారయింది.. అందరూ సంతకాలు చేశారు. రామస్వామి చేతికందించాం. ఆయన మడిచి జేబులో పెట్టుకున్నారు.
అందరం ఇంటికి వెళ్లిపోయాం.. వచ్చిన వారందరికీ రామస్వామి ధన్యవాదాలు చెప్పాడు. ‘మీ పని అయిపోయినట్టే మాస్టారూ’ అని నాకో నమస్కారం పెట్టారు.
నెల రోజులు గడిచింది.. ఏమీ లేదు. నేను కూడా మరోసారి కలవడం జరగలేదు. పరీక్షలు.. స్పాట్‌వాల్యూయేషన్.. ఇంకో వైపు నా కథలు.. వ్యాసాలు రాసుకోవటం...
ఓ రోజు వీధిలోకి కరెంటాఫీసు వారు వచ్చారు. స్తంభాలు మార్చుతున్నారు. త్రీఫేస్ వైర్లు వేస్తున్నారు.. ఇది దాదాపుగా వారం రోజులు జరిగింది. మా ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు రోడ్ల కూడలిలో ఓ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కూడా మార్చారు.. ఈ ఖర్చు కోసం డిపార్ట్‌మెంట్ వారే.. ఇంటికి రెండువందలు చొప్పున వసూలు చేశారు.. ఇద్దరు, ముగ్గురు కట్టలేమంటే రామస్వామే.. వారి డబ్బులు కూడా కట్టారు.
మొత్తం మీద మాకు మంచి కరెంటు వచ్చింది. నేను కూడా ఏసీ వేసుకుంటూ రాత్రిళ్లు చల్లగా నిద్రపోతున్నాను.
ఓ ఆదివారం.. కృతజ్ఞతలు తెలియజేద్దామని.. స్వీట్ పాకెట్, జీడిపప్పు పాకెట్స్ రామస్వామి ఇంటికి వెళ్లాను. ఇంట్లో ఎవరూ లేరు. ఆయనొక్కరే.. టీవీ చూస్తున్నారు.
‘రండి మాస్టారూ.. ఎలా ఉంది హేపీయేనా?’ అన్నాడు. పేకెట్స్ అందిస్తుంటే ‘అయ్యో పెద్దవారు.. మీకు మేమివ్వాలి కాని.. మీరు మాకివ్వడమేమిటి సార్... వద్దు’ అన్నాడు. నేనూరుకోలేదు.. బలవంతం చేశాను. ‘తప్పదా’ అన్నట్టుగా తీసుకున్నారు.
‘ఇంట్లో ఎవరూ లేరు.. ఏమీ ఇవ్వలేక పోతున్నాను.. ఏమీ అనుకోవద్దు సార్’ అన్నాడు. ‘అయ్యో ఎంత మాట’ అన్నాను. ఓ పది నిమిషాలు పిచ్చాపాటీ మాట్లాడి నేను బయలుదేరుతుంటే... ‘మాస్టారూ ఒక్క నిమిషం కూర్చుంటారా.. మీకో విషయం చెప్పాలి’ అన్నాడు.
‘నాకేం పని లేదు.. ఆదివారం సెలవు.. ఇంటి దగ్గర నేను చేయవలసిన పని కూడా లేదు’ అన్నాను. కూర్చున్నాను.
లేచి.. బీరువాలో నుంచి ఒక పేపర్ తీసి నాకిచ్చాడు.. ‘చదవండి.. ఫ్రంట్ పేజీలోనే ఓ వార్త ఉంది...’ అన్నాడు.
మంచి కరెంటు కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని.. లోవోల్టేజి ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అక్కడ ఆ సమస్యను నివారించాలని.. పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో మా ప్రాంతాన్ని ఎన్నిక చేసినట్టుగా ఆ వార్త సారాంశం...
‘మంచిదే కదండి.. మీ పని బాగా జరిపించారు.. మాకు చక్కని కరెంట్ ఇచ్చారు...’ అన్నారు. కాని.. విషయం నాకర్థమయింది. అతను ప్రజా సేవకుడుగా గడించిన పేరు వెనుక మతలబు కూడా నాకర్థమయింది.
నాకర్థమయిందని.. అతని కర్థమయింది.. ఎక్కడో గిల్టీ భావన.. అతను చెప్పడం ప్రారంభించాడు.
‘మాస్టారూ.. ఇది ప్రజాస్వామ్యం.. మేము మన కోసం పని చేయాలి.. మీ కోసం నా కోసం కాదు... నా పనైనా.. నాకు లాభం చేకూరేదే అయినా.. దానిని ప్రజా సమస్యగా చిత్రించుకోవాలి. నాలుగు డబ్బులు మిగుల్చుకోవాలి.. ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవాలి.. బలహీనుల కష్టాలు బలవంతునికి ఆయుధాలు... బలవంతునికి కష్టాలు వస్తే మరలా బలహీనులనే ఆయుధాలుగా మార్చుకోవాలి.. ప్రజాస్వామ్యంలోని గేమ్ ఇదే.. మేము టాక్సులు.. ధరలు పెంచుతాం.. మరలా మీ మంచి కోసమేనని చెప్పాలి.. కరెంటు, బస్సు, ఇంటి.. మద్యం చివరకు బ్యాంకులు పన్నులు.. నోట్లు రద్దు కూడా మా వాళ్ల మేలు కోసమే అయినా.. ప్రజల మేలు కోసమేనని చెప్పాలి.. చెబుతాం కూడా...’
‘ఎంత కాలం.. ఎంత మందికి?’ నా ప్రశ్న.
‘ప్రజాసేవ అంటే అదే మాస్టారూ.. అందరినీ సంతృప్తిపరచటం కన్నా.. మా అనుకొనే వారిని సంతృప్తి పరచటం సులభం కదా! అదే మేం అనుసరిస్తాం.. నాయకులిచ్చే హామీల్లో డెబ్బై శాతం జరగవు సార్.. అయినా ఇదిగిదిగో చేసేస్తున్నాం అనాలి.. తప్పదు. నేను చేసిన ఈ పని దగ్గర నుంచి రైల్వే జోన్ హామీ వరకు అంతే... అయినా.. ఇవేమీ మీకు తెలియవని కాదు.. ఏదో... నాతో పని కోసం వచ్చారు.. మీ పని జరిగిన విధం మీకు తెలిస్తే.. నా మీద వ్యతిరేక భావం ఉండకూడదని ఇవన్నీ చెప్పాను’ అని ముగించాడు. నాకర్థమయింది. ‘్థంక్స్’ చెప్పి బయలుదేరాను.
నిజమే...
ప్రజాసేవకు దిగి మంచి నాయకుడిగా శిక్షణ పొంది పరిస్థితికి తగ్గట్టు తనని తాను సంతోషంగా మలచుకుంటారు.. వర్తమానంలో నాయకులు ఇటువంటివారే.. వ్యక్తిగత ఆదాయాన్ని, అవసరాలను వ్యక్తుల అవసరాలుగా మార్చి తన పబ్బం గడుపుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యమని నాయకుల అభిప్రాయం. రామస్వామి వాదన కరెక్టే.. తనలోని సుతిమెత్తని వైపు చూపించుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కాని.. అంత తేలికగా లొంగని గట్టి మనిషి అన్న పేరు తెచ్చుకోవాలన్న కోరిక ఉంటే మాత్రం ఇలా మృదువుగా మాట్లాడటం బలహీనతలా కనిపిస్తుంది..
రామస్వామి బలవంతుడు... మంచి ప్ర...జా.. సేవకుడు.

-భమిడిపాటి గౌరీశంకర్