ఆంధ్రప్రదేశ్‌

‘సుస్థిర’ అమరావతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని ఎంపికపై చంద్రబాబు విజన్ గొప్పది ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు అభినందన
హరిత భవనాల అభివృద్ధికి టీఈఆర్‌ఐ సహకారం 9 నగరాల అభివృద్ధికి వికేంద్రీకృత వ్యవస్థ: బాబు

అమరావతి, ఫిబ్రవరి 18: అమరావతి ప్రపంచంలోనే అత్యంత సుస్థిర రాజధాని నగరం కానుందని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పలు రంగాల నిపుణులు ప్రశంసించారు. అమరావతిలో అద్భుతమైన 9 నగరాలు నిర్మించనున్నారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు- 2018లో అమరావతి అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను (ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) టీఈఆర్‌ఐ అభినందించింది. దేశంలో వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ వల్ల స్థానిక సంస్థలు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ విధానాలతో ముందుకు వెళుతోందని సదస్సులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని అభినందించారు. సదస్సులో ఏపీ ప్రభుత్వం తరపున పాల్గొన్న ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ సుస్థిర అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలను వివరించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సందేశాన్ని చదివి వినిపించారు. ‘ప్రస్తుతం పట్టణీకరణ శరవేగంగా పెరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణ అసమతౌల్యం, వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దడంపై మనం అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వౌలిక సదుపాయాల కల్పన, నగరాల నిర్వహణ, పట్టణీకరణ వల్ల పెరుగుతున్న ఒత్తిడిని తొలగించుకునేందుకు మార్గాలను అనే్వషించాలి’ అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. ‘అమరావతిని ప్రపంచంలోనే అత్యంత సుస్థిర రాజధాని నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. అమరావతిలోని 9 నగరాలను ఆర్థిక వ్యవస్థకు కీలకంగా, ఆదాయ వనరులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తొమ్మిది నగరాల్లో వాక్ టు వర్క్ వాతావరణం వల్ల నాణ్యమైన జీవనశైలితో పాటు ఉద్యోగాల సృష్టి, పట్టణ ప్రాంతాల్లో అదనపు గృహ నిర్మాణాలు, పెరిగిన పట్టణీకరణ అవసరాలను తీర్చడం, స్వయం సుస్థిర జీవావరణ వ్యవస్థ కలిగిన నగరాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న నగరాలపై భారాన్ని తగ్గించేందుకు నూతన పట్టణాలను సృష్టించడం వంటి కీలక విధానాలను అవలంభించనున్నాం. కాలుష్య రహిత ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్, హరిత పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ వంటి సర్వీసులు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా స్థిరమైన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు మద్దతుతో అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు (ఏఎస్సీసీడీపీ)ని ఏర్పాటు చేశామని, ఇది అమరావతికి అవసరమైన ప్రాథమిక, కీలక వౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహకరిస్తుందని వెల్లడించారు. వరద తీవ్రతను తగ్గించడం, పారిశుద్ధ్యం, రాజధానిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో రహదారుల అనుసంధానం, పట్టణ పాలనా సంస్థల సామర్థ్యాన్ని పెంచడం వంటి సేవలందించడమే ఏఎస్సీసీడీపీ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేలా సమీకృత టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష, విజన్ అని అజయ్ జైన్ వెల్లడించారు. 2029కల్లా ఏపీలో పట్టణ జనాభా 42 నుండి 45 శాతానికి చేరుతుందన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నగరాలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అజయ్ జైన్ ప్రజంటేషన్ అనంతరం టీఈఆర్‌ఐ చైర్మన్ డాక్టర్ అజయ్ మాథుర్ స్పందిస్తూ సుస్థిర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కొనియాడారు. అమరావతిలో హరిత భవనాల అభివృద్ధికి టీఈఆర్‌ఐ సహకరిస్తుందని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ ఇంధన సామర్థ్య సదస్సు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరిగే సంతోష నగరాల సదస్సు- 2018లో పాల్గొనాలని డబ్ల్యూఎస్డీఎస్ సదస్సుకు హాజరైన జాతీయ, అంతర్జాతీయ నిపుణులను ఈసందర్భంగా అజయ్ జైన్ ఆహ్వానించారు.