హైదరాబాద్

వవసూళ్ల టార్గెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: కోటి మంది మహానగర జనాభాకు పౌరసేవలు, అత్యవసర సేవలను అందించటంతో పాటు అవసరాలకు తగిన విధంగా ఎప్పటికపుడు వౌలిక వసతులను మెరుగుపరుస్తున్న జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తగ్గించటంతో పాటు సిగ్నల్‌లేని ప్రయాణం చేసేందుకు వీలుగా రోడ్లను అభివృద్ధి పరిచేందుకు రూపకల్పన చేసిన వూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ), సొంతిల్లు లేని పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులను బల్దియా చేపట్టడంతో కార్పొరేషన్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం పొంచి ఉంది. ఈ ప్రభావం ఉన్నట్లు ముందుగానే పసిగట్టిన అధికారులు కాస్త ముందు నుంచే ఈ గడ్డు సమస్యను అధిగమించేందుకు కార్యచరణను సిద్దం చేశారు. ఒకవైపు అందుబాటులో ఉన్న అన్ని ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూనే, మరో వైపు బాండ్లను జారీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న రూ.1400 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లను కూడా టార్గెట్‌కు తగిన విధంగా వసూలు చేయటంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అధికారులు బిజీగా ఉన్నందున, మంగళవారం సర్వేక్షణ్ ముగిసే అవకాశముండటంతో అదే రోజు నుంచి ఈ పన్ను వసూళ్లపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ.942.10 కోట్ల పన్నును వసూలు చేసిన అధికారులు, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా మిగిలిన ఉన్న 42 రోజుల్లో మిగిలిన రూ. 458 కోట్లను వసూలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు గాను సర్కిళ్లు, జోన్లలో జరిగే పన్ను కలెక్షన్‌ను ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను కూడా నియమించారు. అంతేగాక, కొందరు బకాయిదారులకు ఆస్తిపన్నుకు సంబంధించి నోటీసుల్లో తప్పులు పడటం, చెల్లించినా, బకాయి ఉన్నట్లు సమాచారం ఉండటం వంటి ఇతరత్ర ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రతి సర్కిల్‌లో ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ‘ప్రాపర్టీట్యాక్సు పరిష్కారం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దమయ్యారు. దీంతో పాటు నగరంలోని ట్రేడ్ లైసెన్సుల ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న రూ.50కోట్లలో రూ.34 కోట్లు వసూలు చేసుకోగా, మిగిలిన మొత్తాన్ని కూడా టార్గెట్‌కు తగిన విధంగా వసూలు చేయాలని అధికారులు జోన్, సర్కిళ్ల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రూ.6.54కోట్లు చెల్లించిన హెచ్‌సీఎల్
వౌలాలీలోని హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ సంస్థ గ్రేటర్‌కు బకాయి ఉన్న రూ.6.54 కోట్లను సోమవారం చెల్లించింది. దాదాపు 17 ఏళ్ల నుంచి ఈ ఆస్తిపన్ను బకాయి ఉన్న మొత్తానికి సంబంధించిన చెక్కును హెచ్‌సీఎల్ అధికారులు కమిషనర్ జనార్దన్ రెడ్డికి అందజేశారు.

విద్యుదాఘాతంతో ముగ్గురు దుర్మరణం

పరిగి, ఫిబ్రవరి 19: విద్యుత్ షాక్‌తో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పరిగి పోలీ స్ స్టేషన్ పరిధిలోని లఖ్నాపూర్‌లో సోమవారం రాత్రి సంఘటన చోటుచేసుకుంది. లఖ్నాపూర్‌కు చెంది న కాపు రామచంద్రమ్మ గృహప్రవేశం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించింది. గ్రామస్థులను భోజనానికి పిలిచేందుకు సాయంత్రం ఇంటింటికీ వెళ్తోంది. కాగా, చాకలి మొగులయ్య తన పాత ఇంటి నుంచి కొత్త ఇంటిలోకి విద్యుత్ తీగలను వేసి బల్బులు అమర్చాడు. వైర్ల మధ్య జాయింట్లను ఏర్పాటు చేశాడు. మొగులయ్య ఇంటి దగ్గర చెప్పిన రామచంద్రమ్మ వెనక్కి వస్తున్న క్రమంలో జేవైర్ తగిలింది. షాక్‌కు గురై రామచంద్రమ్మ పడిపోవడంతో గమనించిన మొగులయ్య భార్య లక్ష్మీ వచ్చి లాగేందుకు ప్రయత్నించింది. షాక్‌తో రాంచంద్రమ్మ, లక్ష్మీ అరుస్తుండటంతో పక్కనే ఉన్న శేఖర్ కాపాడేందుకు వచ్చి అతనూ షాక్‌కు గురయ్యాడు. గ్రామస్థులు గమనించి ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అప్పటికే లక్ష్మీ, రాంచంద్రమ్మ మృత్యువాత పడగా, గాయపడ్డ శేఖర్‌ను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శేఖర్ కూడా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని పరిగి సీఐ వెంకట రంగ, దోమ, కుల్కచర్ల, పరిగి ఎస్‌ఐలు పరిశీలించారు. టీఆర్‌ఎస్ నేత కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, భాస్కర్, ఉప్పరి రవి బాధితులను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

లక్ష ఉద్యోగాలు ఎక్కడ?

షాద్‌నగర్, ఫిబ్రవరి 19: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. నాలుగు సంవత్సరాలు గడిచినా ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగం ఇవ్వలేదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. సోమవారం లక్ష ఉద్యోగాల సాధనకు చేపట్టిన నిరుద్యోగ యువజన చైతన్య బస్సు యాత్ర షాద్‌నగర్‌కు చేరుకుంది. స్థానిక మాజీ శాసనసభ్యుడు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆరు మండలాల నుంచి బైక్ ర్యాలీతో షాద్‌నగర్ పట్టణానికి చేరుకొని పట్టణంలోని పలు వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యకూడలిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బహిరంగ సభలో అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మబలిధానాలను అరికట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని గారడి మాటలు చెప్పిన సీఎం కేసీఆర్.. తీరా యువతను బురిడీ కొట్టించారని ఆరోపించారు. గొర్రెలు, గెదేలు కాదు.. చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆరే పదవీ చేపట్టి తెలంగాణ ప్రజలను మాటలతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగ యువతకు రూ.3000 భృతి ఇచ్చేందుకు మ్యానిఫెస్టొ తయారు చేస్తున్నట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 17వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉండే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా లక్ష 50వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు, నీళ్లు వస్తాయని ఆశిస్తే సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. మిషన్ భగీరథ పథకం పేరుతో కోట్ల రూపాయలు భూమిపాలు చేస్తున్నారని, ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సంస్కరణలతో ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బ్యాంకుల్లో నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితులు లేకుండా పోయాయని వివరించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రజిత, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, అగ్గనూరి విశ్వం, సుదర్శన్ గౌడ్, కట్టా వెంకటేష్‌గౌడ్, కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, గడ్డం శ్రీనివాస్ యాదవ్, బాబర్‌ఖాన్, సయ్యద్ సాధిక్, శివశంకర్ గౌడ్, మధు, జాఫర్‌ఖాన్, ఖదీర్, శ్రీనివాస్ రెడ్డి, సత్తయ్య, రాజేష్ కుమార్ పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత
జీడిమెట్ల, ఫిబ్రవరి 19: కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం డివిజన్ దేవేందర్‌నగర్, కట్టమైసమ్మ బస్తీలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలో సర్వే 329/1 ప్రభుత్వ స్థలంలో రాత్రికిరాత్రి వెలసిన మూడు గదులను, రెండు బేస్‌మెట్‌లను రెవెన్యూ సిబ్బందితో నేలమట్టం చేశారు. సుధాకర్ మాట్లాడుతూ గాజులరామారంలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తామని అన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఓ రజినీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
11బైక్‌లు స్వాధీనం
గచ్చిబౌలి, ఫిబ్రవరి 19: మోటారు సైకిల్ పార్కింగ్ చేసుంటే చాలు క్షణలో మాయం చేసేస్తాడు... రెండుసార్లు జైలుకి వెళ్లినా అతనిలో ఎలాంటి మార్పురాలేదు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కాడు. కొంతకాలంగా హైటెక్ సిటీలో ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువ కావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిని గమనించిన ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా 11 వాహనాలను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడు రెండు తెలుగురాష్ట్రాల్లో చోరీకి పాల్పడినట్టు మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు తెలిపారు. మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుని వివరాలను ఏసీపీ వివరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తడికమల్ల నాగార్జున అలీయాస్ నిఖిల్ (28) బంజారాహిల్స్‌లోని శంకర్ నగర్‌లో నివాసముంటూ కథలు రాస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అవాటు పడిన నిఖిల్ మోటారు వాహనాలను దొంగిలించడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. గతంలో జంట కమిషనరేట్ పరిధిలో 10 ద్విచక్ర వాహనాలు దొంగిలించి పోలీసులకు చిక్కి జైలుకి వెళ్లి 2014లో విడుదలైన తరువాత కూడాఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ పాతపద్ధతినే అవంబిస్తున్నాడు. మాదాపూర్ క్రైం పోలీసులు అయ్యప్ప సొసైటీకాలనీలో వాహన తనిఖీ చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించి దొరికాడు. అతని వద్ద రెండు ఆర్‌సీ బుక్‌లు దొరికాయి. అనుమానం వచ్చి ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌తో నిందితుని వేలుముద్రలు పరిశీలించగా పాత కేసులకు సంబంధించి సమాచారం రావడంతో పోలీసుస్టేషన్‌కు తీసుకుని వెళ్లి విచారించగా సైబారాబాద్‌తో పాటు ఖమ్మం, కర్నూల్, వరంగల్, తదితర పోలీసు స్టేషన్ పరిధిలో మోటారు సైకిళ్లను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. నిందితుని పట్టుకున్న క్రైం సిబ్బందిని ఏసీపీ అభినందించారు. కార్యక్రమంలో మాదాపూర్ సీఐ కళింగరావు. డీఐ సైదులుతో పాటు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
జిల్లెలగూడలో చైన్‌స్నాచింగ్
బాలాపూర్, ఫిబ్రవరి 19: ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తెల తాడును అపహరించిన సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జిల్లెలగూడ మున్సిపాలిటీ స్వాగత్ గ్రాండ్ వెనుక విజయహోమ్స్ కాలనీ రోడ్డు 2లో నివాసం ఉండే టీ.అరుణ కుమారి (58) ఉదయం 5.30 గంటల సయమంలో వాకిలి ఊడుస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు.. అరుణకుమారి మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.