మెయిన్ ఫీచర్

కావాల్సింది ప్రోత్సాహమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాదికొకసారి మహిళలను గౌరవించినంత మాత్రాన మహిళాభివృద్ధి జరిగిపోతుందా? దేశంలో ఎంతోమంది మహిళలు ఉంటే 100మంది మహిళలు గెలిస్తే అది అందరి విజయం అవుతుందా? ఆకాశంలో సగం అన్నారు. ఎక్కడ స్ర్తిలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.. అని అన్నారు. అది ఆనాటి మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పురుషులతోపాటు మహిళలకు అవకాశాల్లో మాత్రం సమానత్వం ఎక్కడ ఉంది.
ఎక్కడ చూసినా స్ర్తిలపై వివక్ష, వాళ్ళపై అనుమానాలు, అణివేత, అసహనాలు.. గడిచిన కాలంలో పోలిస్తే ఇపుడు ఉన్న స్ర్తిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కానీ మహిళా సాధికారత మాత్రం ఇంకా అడుగులు వేస్తూనే వుంది.
మన దేశంలో పురుషులతోపాటు మహిళలు పనిచేస్తున్నారు కానీ, మహిళలను పురుషులతో పాటు సమానంగా ఎదగనివ్వడంలో మొదటి దశలోనే ఉంది. అందరికీ విద్య అందుబాటులో ఉంది కాబట్టి మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు కానీ సామాజికంగా, ఆర్థికంగా మాత్రం ఎదగడంలేదు. దీనికి కారణం ఇంట్లోనివారు మహిళలకు తగిన ప్రోత్సాహం అందించడంలేదని చెప్పాలి.
కొన్నిచోట్ల మహిళల వేతనాలలో కూడా చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు. ఎంతో టాలెంట్ వున్న మహిళలు కూడా ఇంకా గృహిణులుగా ఉండిపోతున్నారన్న విషయం ప్రపంచానికి తెలియనిది కాదు. ఇద్దరు పిల్లలకు తల్లైనా మగాళ్లకి ధీటుగా బాక్సింగ్ ఆడే మేరీకామ్, దేశం మొత్తం తన ఆటతో తన వైపునకు తిప్పుకున్న పి.వి.సింధు, తన గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన లతామంగేష్కర్, అంతరిక్షంలోకి కాలుమోపిన కల్పనాచావ్లా, దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ, ప్రజలకు సేవ చేసిన మదర్ థెరిసా, తన అందంతో, అభినయంతో ఆకట్టుకొన్న విశ్వసుందరి అయిన సుస్మితాసేన్, క్రికెట్‌లో తన సత్తాచాటిన మిథాలిరాజ్, రాణి లక్ష్మీబాయి, కిరణ్‌బేడి, సరోజినీ నాయుడు, సుష్మాస్వరాజ్, సునితా విలియమ్స్, పి.టి.ఉష... ఇలా ఒకరా.. ఇద్దరా- ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆణిముత్యాలు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ఠలని ఎవరెస్టు మీద కూర్చోబెట్టారు.
అలాంటి మహిళలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. వాళ్ళని శభాష్ అని మెచ్చుకుంటాం. కొందరైతే మన ఇంట్లో వున్న ఆడపిల్లలు కూడా అలా అవ్వాలి అని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాం. ఇంకొందరైతే ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, మగ పిల్లాడిని ప్రైవేటు పాఠశాలలో వేస్తున్నాం. ఎందుకంత వివక్ష చూపిస్తున్నాం. ఎందుకంత చిన్నచూపు? నిజంగా ఒక మహిళ ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించలేదా?
అమ్మగా, భార్యగా, కూతురుగా ఎన్నో బంధాలను పెనవేసుకున్నా నేటికీ సమాజంలో వాళ్లకి దక్కాల్సిన గౌరవం దక్కుతుందా అంటే అది ప్రశ్నార్థకమే? స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు అయినా స్ర్తికి స్వాతంత్య్రం కలలాగే మిలిపోతోంది. మహిళా సాధికారత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రభుత్వాలు అనుకున్నంత స్థాయికి మహిళలు చేరుకోలేకపోతున్నారు. గ్రామాలలో ఉన్న మహిళల దగ్గరనుంచి సిఇఓలుగా పనిచేస్తున్న మహిళల వరకు చూస్తే 25 శాతం మంది మహిళలు మాత్రమే ముందున్నారు.
మహిళా సాధికారత ఉన్న అంశాల్లో 135 దేశాలను లెక్కిస్తే మనది 105వ స్థానంలో వుంది. ఇది ఐక్యరాజ్యసమితి తేల్చిన చెప్పిన వాస్తవం. అన్ని రంగాలలో మహిళలు ముందుంటారన్నది ఎంత వాస్తవమో, ఇప్పటికి కొంతమంది మహిళలు వాళ్లచుట్టూ అల్లుకున్న చీకటినుండి బయటకు రాలేకపోతున్నారన్నది కూడా అంతే వాస్తవం. పురుషుల ఆలోచనా దృక్పథంలో మాత్రం మార్పు రావడంలేదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు-
పట్టణాల్లో వున్న మహిళలను చూసి గ్రామాల్లో వున్న మహిళలు ఎదుగుతున్నారు అని అనుకుంటే పొరపాటే. ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తే అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి. కొన్ని కొన్ని కంపెనీలను మహిళలు నడుపుతున్నారు. నగరాలలో ఎంతోమంది ధీర వనితలు.
ఇంటిని ఒక తాటిపై నడిపిస్తున్న అమ్మలు- ఇలా ఎంతోమందిని ఉదాహరణ తీసుకోవడమే కానీ, నిజంగా పల్లెల్లో, గ్రామాల్లో, తండాల్లో ఉన్న మహిళలు గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి? వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలి.
వాళ్ళ కాళ్ళమీద వాళ్లని నిలబడగలిగేట్లు చేయగలగాలి. ఎప్పుడైతే అట్టడుగు వర్గాలలో వున్న మహిళ కూడా తన కాళ్ళమీద తాను నిలబడగలుతుందో అప్పుడు నిజంగా మహిళా సాధికారిత వచ్చినట్టు. ఎప్పుడైతే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోకుండా, పురుషుల జాతీయ దినోత్సవం అని జరుపుకుంటారో అపుడు నిజంగా మహిళా సాధికారత వచ్చినట్టు, మహిళలు ఇంకా ముందుకు రావాలంటే వారికి కావాల్సిందల్లా ఇంట్లో వున్న పురుషుల ప్రోత్సాహం. మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండటమే కాదు, మహిళల అభ్యుదయంలో, అవకాశాలలో పురుషులతోపాటు సమానంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆనందంగా స్థిరపడే రోజులు రావాలి.
..................................................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-కాసర సిధూరెడ్డి