సంపాదకీయం

రసాయన ‘మాధుర్యం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజనప్రియులు నిరంతరం ‘రసాయన’పు రుచులను ఆస్వాదించడం జీవనశైలిగా మారిపోయింది. రసాయన విషాలు, ప్లాస్టిక్ రసాయనాలు హిమాలయ పర్వతాలను సైతం కరిగించి వేస్తున్నాయి. అంతరిక్షం కూడా అసంఖ్యాకమైన విష రసాయన పదార్థాలతోను, ప్లాస్టిక్ ముక్కలతోను నిండి కలుషితమైపోయింది. సముద్ర జలాలలో కట్టలుగా, తెట్టెలుగా, గుట్టలుగా రసాయన వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి! ఈ రసాయనాలను భరించలేని లక్షలాది తాబేళ్లు, వందలాది తిమింగలాలు ప్రాణాలను కోల్పోతున్నాయి. సముద్ర తీరాలకు తాబేళ్ల, తిమింగళాల కళేబరాలు కొట్టుకొని వస్తుండడం నిరంతరం ఆవిష్కృత వౌతున్న భయంకర, వికృత, విషాద దశ్యాలు! మహోన్నత హిమాలయాలనే మాలిన్యంతో నింపగలుగుతున్న ‘ప్లాస్టిక్’ పదార్థాలు, రసాయన విషాలు మానవుల కడుపులలో చేరినప్పుడు ఏం జరుగుతుందో ఊహించగలగడం విచక్షణకు ‘గీటురాయి’. ప్రపంచీకరణ ‘జీవన విలాసం’ - లైఫ్ స్టైల్- ఈ ‘విచక్షణ నికషాన్ని’ దిగమింగి వేసింది. సామాన్య మానవులు మాత్రమే కాదు, ప్రజాసేవకు నడుములను బిగించి ఉన్న మేధావంతులు, రాజకీయ వేత్తలు, ప్రభుత్వాలు ‘రసాయన భోజనాన్ని’ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రోత్సహిస్తున్నారు. ‘ఆహార శుద్ధి’- ‘్ఫడ్ ప్రాసెసింగ్’ పేరుతో కొనసాగుతున్న ‘కేంద్రీకృత వాణిజ్య’ కలాపాలలో రసాయన విషాలు నిహితమై ఉండడం బహిరంగ రహస్యం! ‘శుద్ధి’కి గురైన ఆహారం చెడిపోకుండా ‘కలకాలం’ నిలువ ఉండడానికి వీలుగా ‘పదిల పరిచే రసాయనాల’- ప్రిజర్వెంట్స్-ను వాడడం మనదేశంలో చట్టబద్ధమైపోయింది. ప్రభుత్వాలు ఈ వాడకాన్ని అనుమతించాయి. ఈ రసాయనాల వాడకానికి చట్టాలలో, నిబంధనలలో పరిమితులను విధించారు. ‘మోతాదు’ను మించి రసాయనాలను వాడవద్దన్నది నిబంధన! ‘ఆహార శుద్ధి’ని చేసి పదిల పరిచి పంపిణీ చేసి విక్రయిస్తున్న సంస్థలన్నీ ‘మోతాదు’కు మించి రసాయనాలను వాడి ఆహారాన్ని విష పూరితం చేస్తున్నాయి! దీన్ని నిరోధించడానికి, నిబంధనలను ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి ఏర్పడి ఉన్న చట్టాలు, అధికార యంత్రాంగాలు, వ్యవస్థలు మాత్రం కూలబడి ఉన్నాయి!
‘్ఫడ్ ప్రాసెసింగ్’ పేరుతో భయంకర విష రసాయనాలను భారీ మోతాదులలో కలిపేస్తున్నారు. ఈ కల్తీ పెరుగుతున్న కొద్దీ ‘రుచులు’ కూడా పెరుగుతున్నాయి! ‘నెయ్యి’ ఘుమఘుమ లాడుతుండడానికి, అప్పడాలు, వడియాలు, సేమ్యాలు, ఉప్పేరి - చిప్స్, ఒరుగులు, బొరుగులు, అటుకులు, మిరియాలు ‘అందం’గా కన్పిస్తుండడానికి కారణం రసాయనాల వాడకం! బంగారం రంగులోని అరటిపళ్లు, కుంకుమపువ్వు, వనె్నలు విరబూసే మిరపకాయలు మాయామృగాల వలె జనానికి మిరుమిట్లు గొలుపుతుండడానికి కారణం విష రసాయనాలు! ‘కృత్రిమ సుగంధాలు’ - యాడెడ్ ఫ్లేవర్స్-ను ఉత్పాదక వాణిజ్యవేత్తలు మాత్రమే కాదు, సొంత ఇళ్లలో వంట చేసుకునేవారు సైతం భారీగా వాడేస్తుండడం ‘ప్రపంచీకరణ’ యుగధర్మంగా మారింది! ‘శీతల పానీయాలు’- కోల్డ్ డ్రింక్స్‌లో ఎరువులు, క్రిమినాశక ఔషధాల- పురుగుల మందుల- అవశేషాలు నిండి ఉన్నాయన్న కఠోర వాస్తవాన్ని అంగీకరించడానికి వినియోగదారులు సిద్ధంగా లేరు! మంచు కురుస్తున్నా, వాన వస్తున్నా ప్లాస్టిక్ సీసాలలోని ‘కోల్డ్‌డ్రింక్స్’ తాగడం జీవన ‘విలాసం’- ఫ్యాషన్‌గా మారింది. కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటివి తాగడం ‘నామోషీ’. అవి ‘నాసిరకం’ మనుషులు తాగాలి కానీ ‘ప్రపంచీకరణ’ ద్వారా అమెరికాతో అనుసంధానమై ఉన్న నాగరికులు తాగరాదు. ఈ నవనాగరికతకు చిహ్నం ‘పెప్సీ’, ‘కోకో’ వంటి ‘రసాయన’ భరిత కోల్డ్ డ్రింక్స్‌ను క్రోలడం..’ అన్నది పెరిగిన మధ్యతరగతి ధ్యాస..
సంప్రదాయ పద్ధతిలో ఇళ్లలో వంటలు చేస్తున్నవారు ‘విరివిగా’ రసాయనాలను వాడేస్తున్నారు. ‘మీల్ మేకర్స్’ పేరుతో లభిస్తున్న శాకాహార, మాంసాహార గుళికలు రసాయనాలతో నిండి రుచిని పుట్టిస్తున్నాయి. అందువల్ల ఇలాంటి గుళికలను కొని రకరకాల వంటలను, మిఠాయిలను ఇళ్లలో తయారు చేస్తున్నారు! అమ్మమ్మలు, నాయనమ్మలు గ్రామీణ కుటీర పరిశ్రమలలో అనాదిగా ‘రసాయనాలు’, ‘కృత్రిమ విషాలు’ లేకుండానే ప్రాకృతిక పద్ధతులలో ఆహారాన్ని శుద్ధి చేశారు. ఆవకాయలను, అప్పడాలను చేసి ఏడాది పొడవునా నిలువచేశారు. కానీ ఇప్పుడు ‘బడా’ పరిశ్రమలవారు అప్పడాలలో ‘రసాయనాలు’ కలిపి రుచిని పెంచుతున్నారు. పులిహోర, హల్వా, ఇతరేతర శాకాహారాలన్నింటిలోను ఇళ్లలోనే రకరకాలైన ‘పౌడర్లు’ కలిపి ‘రుచి’ని పెంచుకుంటున్నాము! ‘ఆహార శుద్ధి’ కేంద్రాలలోను, దుకాణాలలోను మాత్రమే కాదు ‘సొంతింటి వంటశాల’లో సైతం భోజనంలో ‘రసాయనాలు’ కలిసిపోయి కృత్రిమ సువాసనలను, రుచుల భ్రాంతులను విస్తరింపచేశాయి! ఈ రసాయన భోజనాల వల్ల రకరకాల చిత్ర విచిత్ర వ్యాధులు వ్యాపిస్తున్నాయి! ‘రసాయనపు రుచుల’ను అంటగతుతున్న ‘బహుళ జాతీయ సంస్థలు’ ఈ వ్యాధులను ‘నయం’ చేయడానికి ‘మందుల’ను తయారుచేసి భారీ ధరలకు విక్రయించడం ‘ప్రపంచీకరణ’. వ్యవసాయదారులకు ‘మేలు’ చేస్తున్నామనే భ్రాంతిలో దేశమంతటా భారీ ప్రాంగణాలలో ఆహారశుద్ధి- ఫుడ్‌ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ‘కృత్రిమ రసాయన విషాల’ను విస్తరింపచేస్తున్నాయి! కృత్రిమ రసాయనాలను వాడని ప్రాకృతిక పద్ధతిలో ‘ఆహారశుద్ధి’ ప్రక్రియ ద్వారా పానీయాలను, భోజన పదార్థాలను తయారుచేసి పంపిణీ చేస్తున్న స్వదేశీ సంస్థలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. ఈ స్వదేశీయ సంస్థల ప్రాకృతిక పద్ధతులను ప్రభుత్వాలు ఎందుకని అధ్యయనం చేయించదు? ‘ఆహారశుద్ధి’ ప్రక్రియలో ఎలాంటి రసాయనాలను కాని- ప్రిజర్వెంట్స్, యాడెడ్ ఫ్లేవర్స్ అధేసివ్స్ - రసాయనపు జిగురులు-, కెమికల్ కలర్స్- రసాయనపు రంగులు- ఉండరాదని ప్రభుత్వాలు ఎందుకని నియమావళి రూపొందించరాదు? ‘నెజెల్’- నెస్లే- వంటి ‘బహుళ జాతీయ సంస్థలు’ రుచికరమైన, తొందరగా పచనమయ్యే సేమ్యాలు తయారుచేసి వ్యాధులను వ్యాపింపజేస్తుండడానికి కీలకం- రసాయనం! ‘మోతాదు’గా వాడాలన్న నిర్దేశం ఉన్నది కేవలం ఉల్లంఘనకు గురికావడానికి మాత్రమే! రసాయనాల వాడకాన్ని, ఉత్పత్తిని, దిగుమతిని పూర్తిగా నిషేధించడం మాత్రమే ‘స్వచ్ఛ్భారత’ పునర్నిర్మాణానికి దోహదకరం.! ప్రజల ఆరోగ్యం ‘స్వచ్ఛత’లోని ప్రధాన అంశం!
నిలువ ఉన్న చాక్లెట్లు, చిప్స్, పిజ్జాలు, బర్గర్‌లు- తినుబండారాలు మెక్కడం వల్ల వ్యాధులు సంక్రమిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా పరిశోధక నిర్ధారణలు జరుగుతూనే ఉన్నాయి, ఆవిష్కృతవౌతూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో మరో ‘పరిశోధక నిర్ధారణ’ ఆవిష్కృతమైందట! పొట్లాలలోను, ప్లాస్టిక్ తిత్తులలోను భద్రపరిచిన ‘తిండి’ తినడం వల్ల జనం లావెక్కి పోతున్నారన్నది ఈ నిర్ధారణ! ఈ ‘ప్లాస్టిక్’ తిత్తులకు ‘చాక్లెట్లు’ వంటివి అతుక్కొని పోకుండా, ఊడిపోయి నోళ్లలోకి చేరిపోవడానికి వీలుగా వాడుతున్న ‘రసాయనాల స్పర్శ’ ఇలా లావెక్కడానికి కారణమట! అతుక్కోని పెనిపెనుము, బాణలి- నాన్‌స్టిక్ పాన్- వంటి వంట ఉపకరణాలు తయారీలో కూడా ఈ ‘లావెక్కించే’ రసాయనాలను వాడుతున్నారట! బోలెడు డబ్బు పోసి ‘నాన్‌స్టిక్ పాన్’ కొనడం వల్ల లభిస్తున్న ప్రయోజనం- వినియోగదారులు లావెక్కడం..!