సబ్ ఫీచర్

సమ్మిళిత శ్రమతో సంపద సృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఢిల్లీలో ‘నీతి ఆయోగ్’ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై దేశంలో వెనుకబడిన జిల్లాల సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుపుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నది. విశాఖ, ఖమ్మం జిల్లాల్లోనే మావోల కదలికలున్నాయట. దేశం మొత్తం మీద కేవలం 35 జిల్లాల్లో మాత్రమే వారి ప్రభావం కనిపిస్తోందని ‘నీతి ఆయోగ్’ తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో మావోల ప్రభావం ఉండగా, ఇపుడు రెండు జిల్లాలకే వారు పరిమితమయ్యారట. దేశంలో వందలాది జిల్లాలుండగా 35 జిల్లాల్లో మాత్రమే వారి ఉనికి ఉందని వివరించడం చూస్తే మావోయిస్టు పార్టీ పరిస్థితి ఇప్పుడెలా వుందో విశదమవుతోంది.
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఊపిరి పోసుకున్న పీపుల్స్‌వార్ గ్రూపు అనంతరం వివిధ నక్సలైట్ గ్రూపులను, పార్టీలను తనలో కలుపుకుని దాదాపు దశాబ్దంన్నర క్రితం మావోయిస్టు పార్టీగా అవతరించింది. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామని ప్రతిన పూనింది. ఆ దిశగానే ఆయుధాలను భారీగా పోగేసింది, ఆదివాసీలను చేరదీసింది. దండకారణ్యంలో జనతన సర్కారును నెలకొల్పామని ప్రకటించింది. తమది దేశవ్యాప్త పార్టీ అని, 22 రాష్ట్రాల్లో బలంగా వున్నామని, కాంగ్రెస్ పార్టీకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో తమ ప్రాబల్యమున్నదని ప్రకటించుకున్నది. తాజా పరిస్థితి ఏమిటో నీతి ఆయోగ్ వెల్లడించింది. విచిత్రమేమిటంటే గత పదిహేనేళ్లలో ప్రపంచ చలనగతులే మారిపోయాయి. సంపద ప్రాథమ్యాలు తారుమారయ్యాయి. టెక్నాలజీ కీలకంగా మారి ప్రజల ఆలోచనా విధానంలో సమూల మార్పు వచ్చింది. ఈ పరిణామాన్ని మావోయిస్టులు పసిగట్టలేకపోయారు. ఎంతసేపూ సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, దళారీ వర్గం, బడా భూస్వామ్య వర్గం అంటూ విశే్లషించుకుంటూ ఆ ‘ఎర్ర’ కళ్లద్దాల నుంచే సమాజాన్ని వీక్షించడం తప్ప వాస్తవిక స్థితిని పరిశీలించే వైఖరిని అలవరచుకోలేక పోయారు. వంద యాభై ఏళ్ల క్రితం కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ చేసిన విశే్లషణ, వింగడింపు మానవజాతి ఉన్నంత కాలం సజీవంగా ఉంటాయని, అందులో ఏమాత్రం తేడా రాదని ఒక ప్రగాఢ మూఢ విశ్వాసంతో కాలం గడుపుతూ ఉండటం వల్ల వర్తమానాన్ని అంచనా వేసే తూకం రాళ్లు వాళ్ల దగ్గర కొరవడ్డాయి. పైగా ఎనభై సంవత్సరాలుగా దేశంలో మార్క్సిజాన్ని ప్రచారం చేస్తున్నవారు సైతం అవే గంతలు కట్టుకుని సమాజాన్ని పరిశీలించారు తప్ప వాస్తవాలకు ప్రాధాన్యత నివ్వలేదు. ఆ దారిలోనే, ఆ తప్పుడు అవగాహననే ఆసరా చేసుకుని నక్సలైట్లు-మావోయిస్టులు విశే్లషించడం అలవర్చుకున్నారు. దాంతో వారిప్పుడు కేవలం మూడు పదుల జిల్లాలకే పరిమితమయ్యారు. చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని అరణ్య ప్రాంతాలకు అంకితమై జనతన సర్కార్‌ను బలోపేతం చేస్తామని చెప్పుకుంటున్నారు. ఈ ‘సర్కారు’ను కారల్ మార్క్స్ తొలి పారిశ్రామిక విప్లవం రోజుల్లో చెప్పిన దర్శనాలు, సూత్రాల ఆధారంగా, మార్కెట్ రహిత వ్యవస్థ కీలకమన్న ప్రధాన లక్ష్యంతో రూపొందించాలని మావోయిస్టులు కలలు కంటున్నారు.
అందరూ ‘కలలు కనాలి, గొప్ప కలలు కనాల’ని కోరుకుంటారు కాని ఇలాంటి తిరోగమన కలల్ని మాత్రం కాదు. మార్కెట్ రహిత వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. చైనాలో కమ్యూనిస్టు సూత్రాల ఆధారంగా ఏర్పడిన వ్యవస్థ సైతం ఆమూల సూత్రాలకు తిలోదకాలిచ్చి మార్కెట్ ఎకానమీ వైపు మొగ్గి అద్భుతాలు సృష్టిస్తూ అగ్ర దేశంగా అవతరించింది. భారత్‌కు, చైనాకు అనేక పోలికలున్నాయి. ఒకప్పటి చైనా మార్గమే తమ మార్గమన్న మావోయిస్టులు చైనాయే మార్కెట్ రహిత ఎకానమీ నుంచి మార్కెట్ ఎకానమీకి మళ్లినప్పుడు భారతదేశాన్ని మార్కెట్ ఎకానమీ నుంచి మార్కెట్ రహిత ఎకానమీవైపు మళ్లిస్తామని మర తుపాకులు, మందుపాతరలు పేలిస్తే అందులో ఏమైనా విజ్ఞత కనిపిస్తోందా?
ఇంగితం-విజ్ఞత, వర్తమాన కాలమాన పరిస్థితులన్నీ విస్మరించి దండకారణ్యంలో ఆదివాసీలతో సైన్యం ఏర్పాటు చేస్తున్నామని, ఆ ప్రజాసైన్యం భారతదేశాన్ని ‘విముక్తి’ చేస్తుందని ప్రగల్భాలు పలకడం ఏ రకంగా సమంజసమవుతుంది? ‘్భరతదేశాన్ని ఏ పరాయి మూకల చేతి నుంచి మీరు విముక్తి చేస్తారు?’ అని ఎవరైనా ప్రశ్నిస్తారన్న వెరపుకూడా లేకుండా అదేపనిగా ఆ మాటను ఆ పార్టీ, దాని అనుబంధ సంఘాలు, సంస్థలు, మేధావులు ఉచ్ఛరించడం విడ్డూరం.
సాయుధ మావోయిస్టులు రాజ్యాధికారం యావతో ఆ విధమైన తప్పుడు ఆలోచనలు చేసినా, మేధావులన్నవారు, వారి అభిమానులైన వారు ఆ పోకడలపై ‘అంకుశం’ పెట్టాలి కదా? వారు ‘తాన’ అంటే వీరు ‘తందాన’ అనడం విచిత్రమైన వైఖరి తప్ప విశిష్ఠమైనది కాదు. మార్క్సిస్టులు- మావోయిస్టులు పదార్థం, యదార్థం అన్న మాటలను తాత్విక చింతనలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుత యదార్థ పరిస్థితులు ఏమిటి? అన్న విశే్లషణ చేసుకోవాలి కదా?
ప్రస్తుత యదార్థ పరిస్థితి నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని పూర్తిగా రూపాంతీకరించే దశలో వుంది. మార్క్స్ కాలం నాటి ఊహలకు, విశే్లషణలకు అందనంత ఎత్తులో రూపాంతీకరణ జరుగుతోంది. శ్రామికవర్గం అంటూ ప్రత్యేకంగా కనిపించని స్థితి. అంతటా ప్రజలే దర్శనమిస్తారు. ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు, ఎవరి శ్రద్ధాసక్తుల మేరకు, ఎవరి నైపుణ్యాల మేరకు వారు శ్రమిస్తున్నారు. ఆ సమ్మిళిత శ్రమ ఆధారంగానే సంపద సృష్టి జరుగుతోంది. అందుకే దీన్ని ‘డిజిటల్ టెక్నాలజీ’ అని పిలుస్తున్నారు.
మార్క్స్-ఏంగిల్స్ ఈ సమ్మిళిత శ్రమ ఆధారిత సంపద సృష్టిని ఊహించలేదు. వారు పేర్కొన్న వైరుధ్యాలిప్పుడు అంజనం వేసినా అగుపించని పరిస్థితి. యంత్రశక్తి, కృత్రిమ మేధస్సు సంపదకు మూలకందకంగా నిలిచింది. ఈ అద్భుత పరిణామాన్ని చూసేందుకు నిరాకరించి ఇంకా కారల్ మార్క్స్ చెప్పిన కార్మిక శక్తి, పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యాల్నే నమ్ముకుని దండకారణ్యంలో సాయుధ దండు నిర్మించి నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామని ప్రతిజ్ఞ చేస్తే అది ఆమోదనీయమవుతుందా? అంగీకార యోగ్యమవుతుందా? కోట్లాది ప్రజల తరఫున కొద్దిమంది మావోయిస్టులు కాలం చెల్లిన మార్క్స్ సూత్రాల వెలుగులో నిర్ణయాలు తీసుకుని రక్తకాసారాలు సృష్టిస్తామని అరణ్యాలలో తిష్టవేస్తే ఎలా? ఈ వైఖరి ప్రజానుకూలమైనది ఎలా అవుతుంది? ప్రజల ఆమోదం పొందినట్టు ఎలా అవుతుంది?
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచించేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. వారెవ్వరూ ఇలా అమాయకులను బలితీసుకునే, బలి ఇచ్చే కార్యక్రమాల్ని ప్రోత్సహించడం లేదు. మావోయిస్టుల కన్నా తీక్షణమైన ఆలోచనలు చేసేవారూ సమాజంలో వున్నారు. అంతెందుకు? మావోయిస్టులు తమది ఏ ప్రాపంచిక దృక్పథం అని చెప్పుకుంటున్నారో ఆ మార్క్సిజం, మావోయిజం వెలుగులో పనిచేస్తున్న పార్టీలు, సంస్థలు అనేకం వున్నాయి. వారు తమ పరిధిని గుర్తెరిగి తమ శాయశక్తులా పనిచేస్తున్నారు. అంతిమంగా అణగారిన, అట్టడుగువర్గాల ప్రజలు స్వయంగా చైతన్యవంతులై తమ హక్కులను గుర్తెరిగి, తమ జ్ఞానాన్ని పెంచుకుని తమ జీవితాలను ఉన్నతీకరించుకునే వైనం గుర్తెరగాలని భావిస్తున్నారు. అటువైపు వారిని కదిలించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని చైతన్యవంతులైన వారందరూ కోరుకునేది ఇదే. అంతేగాని సమస్త శ్రామికవర్గం, అణగారినవారు రాత్రికి రాత్రే చైతన్యవంతులై సాధికరత సాధించి ఉజ్వలమైన జీవితాన్ని అందిపుచ్చుకుంటారని, అది రాజ్యాధికారం ద్వారానే సాధ్యమని భావించడం పూర్తిగా భావ దారిద్య్రం. రష్యా, చైనా, తూర్పు యూరప్, లాటిన్ అమెరికాలో అలా జరగలేదని, జరగదని అనుభవం చెబుతున్నా మొండిగా మావోయిస్టులు రాజ్యాధికారం ద్వారానే ప్రజల జీవితాలు మెరుగవుతాయని, సాధికారత సాధిస్తారని నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలు వెల్లువెత్తుతున్న సమయంలో పేర్కొనడం అన్యాయం. ఆధునిక టెక్నాలజీ ఫలితాల్ని ప్రజలు గరిష్టంగా అందుకునే మార్గంపై మనసు పెట్టడం ముఖ్యం తప్ప రాజ్యాధికారంపై కాదు. ఈ అంశం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నా అదే పాత పాట పాడితే ప్రజలు వారిని క్షమించరు. *