ఈ వారం కథ

స్కూటర్‌వాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘షిట్.. తను మళ్లీ అదే తప్పు చేసింది. ఏ మాయ కమ్మేస్తుందో ఏమో ఆ తప్పు జరక్కుండా నిరోధించటంలో విఫలమవుతోంది. ఈ తప్పు కచ్చితంగా భర్తకి తెలిసే తీరుతుంది. ‘తెలిస్తే ఏమవుతుంది?’ తల బద్దలయ్యేలా ఆలోచిస్తోంది సుజన. ఆ వార్త తెలిసినా ఎప్పట్లాగానే ప్రశాంతంగానే ఉంటాడా? లేక పిడుగులు కురిపిస్తూ విలయం సృష్టిస్తాడా?
సాయంత్రం అయిదైంది. ఈపాటికే ఆఫీసు నుంచి బయలుదేరిన భర్త కృష్ణమూర్తి మరో అరగంటకి ఇంటికి చేరుకుంటాడు. ఇవాళ ఆయనెలా కనిపిస్తాడు? రాబోయే అరగంటలో తన సంసార సాగరంలో విరుచుకుపడబోయే ప్రళయం గురించి హెచ్చరికలు జారీచేసే వ్యవస్థ తన దగ్గర ఏముంది? కదుల్తున్న ఒక్కో క్షణం కాలయముని మహిషపు లోహపుగంటల ధ్వనుల్ని గుర్తుచేస్తుంటే.. సుజన వెన్నులో వణుకు పుడుతోంది. నిజానికి తన భర్త శాంత స్వభావుడే. పెళ్లయిన ఈ ఆర్నెళ్లలో ఎప్పుడూ నవ్వుతూ నవ్వించిన వ్యక్తే. ఆఫీసుకి వెళ్తున్న ప్రతి ఉదయం ఆత్మీయ ఆలింగనాలతో కూడిన తపనలు, భర్త గుర్తుకొచ్చిన ప్రతిసారీ సుజన పెదాలపై సదా చిర్నవ్వులు పూయించే మధుర కిలికించితాలు ఇవే. అడపాదడపా నెలకొనే అలకలు, కోపతాపాలు ఆలుమగల అనురాగానికి అసలు సిసలైన ఆనవాళ్లు. ఇంతవరకూ బాగానే ఉన్నా- తాజాగా తను చేసిన తప్పు తెలిసినా.. సరదాగా తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంటాడా? భార్య తప్పు చేసిందని తెలిసిన ఏ మగడైనా వౌనంగా ఎలా ఉంటాడు? అయినా తను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. అదేం ఖర్మమో? తప్పు చేయడం, ఆ తర్వాత ఎక్కడలేని మనోవేదనకు గురవుతుండడం ఓ రకంగా నిత్యకృత్యమైంది. ఏదో తెలీని తన్మయత్వం పురిగొల్పుతుంటే తెలిసి అదే తప్పు చేయడం అలవాటైపోయింది. తీరిగ్గా పశ్చత్తాపడడం కూడా ఓ వ్యసనంగా మారిపోయింది. ఇలా ఎనె్నన్నో ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంటే వేడివేడిగా కాఫీ తాగాలని కిచెన్‌లోకి వెళ్లబోయింది సుజన. ఇంతలో వీధి గేటు చప్పుడైంది.
‘ఆయన వచ్చేసినట్లున్నారు.. ఏ కళనున్నారో?’ ఆతృతగా గుమ్మంలోకి వచ్చిందామె. అయితే, వచ్చింది తన భర్తకాదు. తన ఆడపడుచు పద్మ. వీధి గేటు వేస్తూ రెండిళ్లవతల నిలిచిన ఓ స్కూటర్‌వాలాకు నవ్వుతూ ‘బై’ చెప్తోందామె. అతడూ చేతులూపి మరీ ‘బై’ చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసి కదలిపోయాడు. అంటే- అతగాడే మళ్లీ పద్మని తన స్కూటల్ మీద ఇంటిదాకా దిగబెట్టాడన్నమాట. కాలేజీ నుంచి సిటీ బస్సులో రావాల్సిన పిల్ల.. ముక్కూముఖం తెలీని ఓ వ్యక్తి స్కూటర్ వెనుక హత్తుకుని దర్జాగా ఇంటిదాకా రావడం ఇదే మొదటిసారి కాదు. అలా వచ్చిన ప్రతిసారీ తాను అడిగే ప్రశ్నకు జవాబేమైనా చెప్తుందా? అని ఎదురుచూసేది వదిన హోదాలో ఉన్న సుజన. అంతగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నట్లు ప్రవర్తించేది పద్మ. ఉండబట్టలేక ఓసారి ముఖం మీదే అడిగేసింది సుజన- ‘పద్మా.. ఆ వచ్చిందెవరే?’ అంటూ.
‘ఎవరో అయితే అతడి స్కూటర్ మీద నేనెందుకు వస్తాను వదినా?’
‘మరి...?’
‘అతడు నా ఫ్రెండ్’
‘అంటే...?’
‘ఫ్రెండంటే..ఫ్రెండే! ఒకే కాలేజీలో చదువుతున్నాం. ఓకే కాలనీలో ఉంటున్నాం. బస్సులో ఎందుకు? ఒకే స్కూటర్ మీద వెళ్దామంటూ ప్రపోజ్ చేస్తే ఒకే అన్నానంతే’ ఎంతో సింపుల్‌గా ఆన్సరిచ్చింది పద్మ.
‘సిటీబస్సులో అంతమంది మగాళ్లని రాసుకుపూసుకుని జర్నీ చేసేకన్నా.. ఈ ఒక్క మగాడితో స్కూటర్ జర్నీ ఎంత హాయిగా ఉంటోందో’అంటూ ఆ తర్వాత ముక్తాయింపునిచ్చింది.
‘పరపురుషుడితో స్కూటర్ మీద రావడంలో తప్పేం లేదా?’ మరో ప్రశ్న వేసింది సుజన. దీనికి పద్మ నుంచి వచ్చిన సమాధానంతో ఆమె బుర్ర తిరిగిపోయింది.
‘చూడు వదినా.. నువ్వు పుట్టి పెరిగింది పల్లెటూర్లో, నీకివన్నీ కొత్తగా కనిపిస్తాయి. సిటీలో ఇలాంటివి కామన్. కాలేజీలో చదువుతున్న లేడీ స్టూడెంటన్న తర్వాత కచ్చితంగా బాడీ గార్డ్‌లాంటి బాయ్‌ఫ్రెండ్ ఉండి తీరాలి. కాలేజీకి తీసుకెళ్లి తీసుకురావడమే కాదు, క్యాంటీన్లు, సినిమాలు, షికార్లకూ తోడు రావాలి. ఐస్‌క్రీమ్‌లు కొనివ్వాలి. కూల్‌డ్రింక్స్ తాగించాలి. మరే మగవాడి చూపు పడకుండా పహారా కాయాలి. అవసరమైతే అమ్మాయి కోసం చొక్కాలు చింపుకుని వీధుల్లో యుద్ధాలు చేయాలి. ఇదంతా సిటీ కల్చర్. నీకు తెలీదులే’
ఇక, అప్పట్నుంచీ ఎన్నోసార్లు పద్మ అదే స్కూటర్‌పై ఇంటికొచ్చినా చూసీ చూడనట్లు వ్యవహరించేది సుజన. కానీ, ఇప్పుడు పరాయి వ్యక్తితో స్కూటర్‌పై ఇంటికి వచ్చిన పద్మని చూశాక తనలో మనోధైర్యం హెచ్చింది. అనవసరంగా అపరాధ భావంతో ఇంతవరకూ కుంగిపోయినందుకు సిగ్గుపడిపోయింది. పద్మ చేసిన పనిముందు తను చేసింది తప్పేం కాదనిపించిందామెకి. తనేదో చేయరాని తప్పు చేసినట్లు ఫీలైపోయి పద్మ ముఖమెలా చూస్తానా? అని ఐదు నిముషాల వరకూ పడిన బెంగ, ఆందోళనంతా ఒకే ఒక్క సన్నివేశంతో ఎగిరిపోయాయి.
ఔను.. తనేమీ తప్పు చేయలేదు. ఒకవేళ విషయం తెలిసి భర్త అంతెత్తున ఎగిరిపడినా సమర్థించుకోవడానికి తనకు బలమైన వాదనే ఉంది. ఆ వాదనలో పద్మ స్కూటర్‌వాలా నిలువెత్తు సాక్ష్యంగా నిలుచుంటాడు. పద్మ చేస్తే తప్పు లేనిది, తను చేస్తే తప్పవుతుందా?.. అనుకుంది సుజన.
***
‘సుజనా..’ అని గట్టిగా అరుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు భర్త కృష్ణమూర్తి.
‘ఏంటండీ.. ఏమైందీ?’ కాఫీగ్లాసుతో కిచెన్‌లోంచి బయటకొచ్చింది సుజన. రోజూ అయితే కృష్ణమూర్తి ఆమె చేతుల్లోంచి కాఫీ గ్లాసు అందుకోకుండా భుజాలపై చేతులు వేసి గబగబా బెడ్‌రూమ్‌లోకి లాక్కెళ్లేవాడు. ‘పద్మ చూస్తుందండీ..’ అని సుజన సిగ్గుల మొగ్గయితే- ‘చూస్తే చూడనీ! రేపు తన మొగుడ్ని ఎలా కొంగున ముడేసుకోవాలో నేర్చుకుంటుంది’ అంటూ చుబుకం పైకెత్తి పెదాల్ని గాఢంగా చుంబించేవాడు. కానీ- ఇవాళ అందుకు భిన్నంగా ‘చూడు.. ఏం జరిగిందో?’ అంటూ అసహనంగా సోఫాలో కూర్చున్నాడు.
‘అంత డీలా పడిపోయారు. ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా?’ అడిగింది తనకు తెలిసిన విషయమే తెలీనట్లు ఆరాతీస్తూ సుజన.
‘ఆఫీసులో కాదు.. ఇంట్లో ప్రాబ్లమ్’
‘ఇంట్లోనా.. ప్రాబ్లమ్ ఏంటో?
‘పద్మ పెళ్లి సంబంధం తప్పిపోయింది.. అదే ప్రాబ్లెమ్’
‘అసలేం జరిగింది?’
‘ఆఫీసుకి పరమేశ్వర శాస్ర్తీ వచ్చాడు’చెప్పాడతడు.
‘వచ్చి..’ అని ఆతృతగా అడిగింది పద్మ.
డిగ్రీ చదువుతున్న ఒక్కగానొక్క చెల్లెలు పద్పని అపురూపంగా చూసుకున్నాడు కృష్ణమూర్తి. ఫైనలియర్ పరీక్షలు రాశాక పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకున్నాడు. వారం రోజుల క్రితమే పెళ్లిచూపులు ఏర్పాటు చేయించాడు. పెళ్లికొడుకు సైబర్ సిటీలో ఓ ప్రముఖ సంస్థలో కంప్యూటర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడని తెలిసి మురిసిపోయాడు. పెళ్లిచూపులప్పుడు- ‘మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుంటే అభ్యంతరమా?’ అడిగాడు పెళ్లికొడుకు. అక్కడి నుంచి ఒక్కొక్కరూ జారుకున్నాక- ఆ గదిలో ఇద్దరే ఇద్దరు. ఒకరు పెళ్లికొడుకు, మరొకరు పద్మ. అరగంట గడిచాక నవ్వు ముఖంతో పెళ్లికొడుకు బయటకొచ్చినప్పుడే అందరికీ అర్థమైంది అతడికి సంబంధం నచ్చిందని. రెండ్రోజుల తర్వాత ఆవార్తనే మోసుకొచ్చాడు సంబంధం చూసిన పరమేశ్వర శాస్ర్తీ. ఇక, అప్పట్నుంచీ కృష్ణమూర్తి పెళ్లి ఎంత ఘనంగా చేయాలా? అని ప్రణాళికలు వేసుకునేవాడు. ఓ రాత్రంతా నిద్రపోకుండా పెళ్లికి పిలవాల్సిన గెస్ట్‌ల లిస్ట్ ప్రిపేర్ చేసాడు. తెల్లవారుజామున సుజనని నిద్రలేపి మరీ ఆ లిస్ట్ వెరిఫై చేసి ఎవర్నియినా మరిచిపోతే గుర్తు చేయమన్నాడు. ‘ఇంకా పెళ్లిమాటలే పూర్తి కాలేదు.. ఈ హడావుడి ఎందుకండీ?’ నిద్రకళ్లతోనే ఆమె అడుగుతుంటే- ‘ఈ ఇంటి మాలక్ష్మి పెళ్లంటే మాటలా?ఎక్కడా తప్పు జరక్కూడదు. తల్లీతండ్రీ లేని కొరత పద్మకు అస్సలు కనిపించకూడదు. పెళ్లికి సంబంధించిన ప్రతి విషయంపై ఇప్పట్నుంచే దృష్టిపెట్టాలి’అనేవాడు.
‘ఎవరో అబ్బాయితో పద్మ తిరుగుతోందని ఎవరో చెప్పారట. అది మగ పెళ్లివాళ్లు నమ్మారట’అన్నాడు చికాగ్గా కృష్ణమూర్తి. ఆ తర్వాత కొద్దిక్షణాలకు-‘ఈ సంబంధం చెడిపోయింది. మళ్లీ ఇలా జరక్కుండా ఉండాలంటే మనగురించి చెడ్డగా చెప్పిన వారెవరో తెలియాల్సిందే’
‘ఎలా తెలుస్తుంది?’అని సుజన అడగలేదు. ఆమె అడగని ప్రశ్నకి కృష్ణమూర్తే సమాధానమిచ్చాడు-‘ఎవరో కాదు.. ఆ శాస్త్రే చెప్పాడు’ అనడంతో- నిప్పంటుకుందని తేలిపోయింది. ఆమెలో అంతులేని కలవరం.
‘మనమంటే గిట్టనివాళ్లు ఎక్కడో లేరు. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నారు. అన్నాడు కృష్ణమూర్తి.
‘ఔను సుజనా.. ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే. నూవ్వు, నేనూ, పద్మ. పద్మకి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది. వచ్చిన సంబంధాన్ని కోరికోరి చెడగొట్టను కదా! ఇక, పెళ్లికూతురు పద్మ అసలు సంబంధమే ఇష్టం లేకుంటే ఈ తంతు పెళ్లిచూపుల దాకా వచ్చేది కాదు. ఇక, మిగిలింది..’’
‘నేనే.. మీ అనుమానం నామీదే కదా! బయట నుంచి ఈ ఇంట్లోకి అడుగుపెట్టినదాన్ని నేనే. అందుకే ఆడపడుచు పెళ్లి సంబంధాన్ని చెడగొట్టి పబ్బం గడుపుకోవాలనుకున్నాను..’ కళ్లలో చింతనిప్పులు కురుస్తుండగా గట్టిగా అరిచింది సుజన.
‘నా ఉద్దేశం అదికాదు. మగపెళ్లివాళ్లకి మనింట్లోవాళ్లే చెడుగా చెప్పారంటే- ఎవరై ఉంటారా? అని ఆలోచిస్తున్నాను. అంతే!’
‘మిమ్మల్నే నమ్మి మీ నట్టింట్లోకి వచ్చిన నన్ను అనుమానించడం న్యాయమా?’ ఆమె కళ్లు కన్టీటి కుండలయ్యాయి.
‘నువ్వూ, నేనూ చెప్పకపోతే .. ఇక మిగిలింది పద్మ. తన పెళ్లిని తనే చెడగొట్టుకుంటుందా? నాకైతే నమ్మకం లేదు’ అన్నాడు కృష్ణమూర్తి. కొద్ది క్షణాల తరువాత- ‘సంబంధం కుదిరితే.. పెళ్లిచూపుల సమయంలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు గదిలో ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలీదు. అనుకున్నట్లు జరగకపోతేనే అన్ని విషయాలూ బయటకొస్తాయి. ఇంతకీ పెళ్లికొడుకుతో పద్మ ఏం మాట్లాడిందో ఎలా తెలుస్తుంది?’ అడిగాడతడు.
‘స్వయంగా పద్మ చెప్తేనే తెలుస్తుంది’ అంది సుజన. అప్పటికి ఆ గండం గట్టెక్కినట్టనిపించినా, భర్త చూపుల్లోని అనుమానం పెనుభూతంలా తనను వెంటాడుతోందన్న భావన సుజనను వేధిస్తునే ఉంది. అయితే, నోటిని అదుపులో పెట్టుకోవడం మాత్రం సుజనకు ఇన్నాళ్లుగా సాధ్యం కావడంలేదు. ఆ బలహీనతే ఆమెను కష్టాలపాల్జేస్తోంది.
అయిదోక్లాసు చదువుతున్నప్పుడోసారి స్కూల్‌కి తనిఖీ అధికారొచ్చాడు. అంతవరకూ కుర్చీలో కునికిపాట్లు పడుతున్న టీచర్ గభాల్న లేచి నిద్రకళ్లతోనే తడబడుతూ నమస్కారం పెడుతూ క్లాస్‌రూంలోకి ఆ అధికారిని ఆహ్వానించాడు. టీచర్‌ని చూసిన ఆ అధికారి-‘ఏం..? పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్నవా?’ అంటూ గద్దించాడు.
‘లేదండీ.. ఇప్పటిదాకా పాఠాలే చెప్తున్నా’ అని సంజాయిషీ చెప్పుకున్న టీచర్ సాక్ష్యం కోసం-‘ఏం పిల్లలూ.. మీకు ఇప్పటిదాకా పాఠాలే కదు చెప్పాను.’ అన్నాడు. పిల్లలంతా- ‘ఔనండీ మీరు పాఠాలే చెప్పారం’టూ గుంపుగా అరిచారు. ఆ అరుపుల్ని అధిగమిస్తూ-‘లేదండీ.. మీరు పాఠాలు చెప్పలేదు. క్లాస్‌కి వచ్చిన దగ్గర్నుంచీ ఆవులిస్తూ నిద్రపోతూనే ఉన్నారు’ అనే గొంతు గట్టిగా వినిపించింది. ఆ గొంతు చిన్నారి సుజనది. ఇంకోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. తండ్రి తెచ్చిన డబ్బును పొదుపుగా వాడే తల్లి అడపాదడపా కొన్ని నోట్లని పోపుల డబ్బాలో దాస్తుండేది. ఓరోజు రాత్రి డబ్బు విషయంలో తల్లితో తండ్రి గొడవపడుతున్నాడు. తల్లి తన చేతిలో చిల్లిగవ్వ లేదంటూ బుకాయిస్తోంది.
‘దాచిన సొమ్ము ఇస్తావా.. ఛస్తావా?’ అంటూ తండ్రి తల్లి చెంపపై కొట్డాడు. ఆమె మాత్రం అదరలేదు, బెదరలేదు. సుజన మాత్రం తండ్రి చేయి పట్టుకుని వంటింట్లోకి లాక్కెళ్లి పోపుల డబ్బా చూపిస్తూ-‘నీక్కావల్సిన డబ్బులు ఇందులో ఉన్నాయి’ అని చెప్పింది. వెంటనే తండ్రి కొంతడబ్బు తీసుకుని ఇంట్లోంచి జారుకున్నాడు.
‘డబ్బులు అందులో ఉన్నాయని ఎందుకు చెప్పావే?’ అనడిగింది తల్లి. ఆ తర్వాత ఏడుస్తూనే సుజనను దగ్గరకి తీసుకుని- ‘నీ స్కూల్ ఫీజు కోసం దాచాను తల్లీ. ఇప్పుడు చూడు. నీ తండ్రి ఆ డబ్బుల్ని తాగడానికి తగలేస్తాడు’ అంది. ‘అమ్మా.. నువ్వే చెప్పావుగా.. అబద్ధాలు ఆడకూడదని..’ అమాయకంగా ప్రశ్నించింది సుజన ఆనాడు.
‘నిజమే తల్లీ. అబద్దాలు ఆడకూడదు. కానీ, అన్ని వేళల్లోనూ నిజాలు చెప్పకూడదు. సౌఖ్యంగా ఉండాలంటే లౌక్యం నేర్చుకోవాలి’ అంది . అయినా, ఇప్పటికీ తనకు తెలిసింది ముందూ వెనుకా చూసుకోకుండా అనేస్తుంటుంది. ఆ తర్వాత వచ్చే పరిణామాల్ని తలచుకుని భయంతో, బాధతో వణికిపోతుంటుంది. తాజాగా పద్మ పెళ్లి సంబంధం విషయంలోనూ మగపెళ్లివారి బంధువులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ స్కూటర్‌వాలా విషయం ప్రస్తావించింది. అతడు కేవలం పద్మకి ఫ్రెండ్ మాత్రమేనంటూ నొక్కి వక్కాణించటంతోఆ యథార్థ వచనం పెళ్లి సంబంధం తప్పిపోయేంతవరకూ వచ్చింది. ‘ఈసారి అలాంటి తప్పు మళ్లీ చేయకూడదు. నోటిని అదుపులో ఉంచుకోవాలి’ అని పదే పదే అనుకుంటోంది సుజన.
***
పాదరసంలా రోజులు దొర్లుతున్నాయి. మళ్లీ పద్మ పెళ్లి సంబంధం విషయం సుజన దగ్గర ఎత్తలేదు కృష్ణమూర్తి. ఆ ప్రస్తావన తెచ్చేందుకు సుజన కూడా సాహసించడం లేదు. అయితే, పద్మ విషయంలోనే కించిత్ మార్పు వచ్చినట్లు ఆమెకు అవగతమైంది. అంతకుముందు ప్రతిరోజూ సాయంత్రం అయిదయ్యే సరికి ఇంటిముందు ఒ స్కూటరాగడం.. వెనుక సీట్లో కూచున్న పద్మ దిగి అతడికి వీడ్కోలు చెప్పడం షరా మాములుగా సాగిపోయే ప్రక్రియే. ఇప్పుడా దృశ్యం అదృశ్యమైంది. కాలినడకనే పద్మ ఇంటికే వస్తోంది.
‘వారిద్దరి మధ్య ఏం జరిగింది?’ అనే కుతూహలం సుజనకు రోజురోజుకీ పెరిగిపోతుంది. తనడిగే ప్రశ్నలకి పద్మ సజావుగా సమాధాలిస్తుందనే నమ్మకం మాత్రం ఆమెలో లేదు. ‘ఇద్దరూ ఏమైనా తగవు పడి విడిపోయారా? అతడేమైనా కోరరానిది కోరాడా? అందుకు పద్మ నిరాకరించడంతో ఆ ఇద్దరూ కలిసి కనిపించడం లేదా?’.. ఇలా లక్ష యక్ష ప్రశ్నలు మెదడును దొలిచేస్తుంటే సుజన తెగ ఇబ్బంది పడుతోంది. ఆ ప్రశ్నలన్నింటికీ ఓ రోజు సుజనకు సమాధానం దొరికింది. ఆరోజు సాయంత్రం మార్కెట్‌కి వెళ్లి తిరిగొస్తుంటే- సందు చివర్లో ఆగిన ఓ స్కూటర్ నుంచి పద్మ దిగడం సుజన చూపుల్ని దాటిపోలేదు. నవ్వుతూ పద్మ చేయి ఊపుతుంటే నవ్వుతూనే అతడూ ఆమెకి వీడ్కోలు చెప్తున్నాడు. అంటే.. వాళ్లిద్దరి స్నేహం ఇంకా కొనసాగుగూనే ఉందన్నమాట. ఇంటిదాకా రావాల్సిన స్కూటర్ సందు చివరనే ఆగిపోవడం వెనుక మతలబు ఏంటో? సరికొత్త అనుమానాలు కొన్ని సుజనలో చోటుచేసుకున్నాయి.
ఆరోజు రాత్రి భర్త కృష్ణమూర్తితోసుజన నెమ్మదిగా అంది- ‘ఏమండీ.. ఒక్క విషయం అడగనా?’
‘అడుగు..’ అన్నాడు కృష్ణమూర్తి భార్యని దగ్గరగా తీసుకుంటూ.
‘మగపెళ్లివాళ్లకి ఎవరో ఏదో చెప్పారంటూ ఒకటే ఇదైపోయారు గానీ.. ఆ చెప్పినదాంట్లో నిజానిజాల్ని వెతికేందుకు మీరెందుకు ప్రయత్నించ లేదు?’ అడిగింది సుజన.
‘ఎందుకు ప్రయత్నించలేదు? అన్నీ ఆరాతీసాను.’ అన్నాడు.
‘అంత ఆరాతీస్తే.. పద్మ ఇంకా అతడితో ఎందుకు తిరుగుతోంది?’
‘ఇంకా తిరుగుతోందా?’
‘ఈ విషయం మీదాకా రాలేదా?’
‘ఊహూ! రాలేదు.. ఆ వ్యక్తితో తిరగడం నువ్వు చూసావా?’
‘ఆమె తిరగడం యథార్థమైతే.. నేను చూడడం వాస్తవమే. ఇదివరకు ఇంటి దాకా వచ్చే స్కూటర్ ఇప్పుడు సందు చివరనే ఆగిపోతోంది. అదే చిన్న ఛేంజ్’’ సుజన మాటలకి కృష్ణమూర్తి పడిపడి నవ్వాడు.
‘ఇందులో ఏం జోక్ ఉందని.. అంతలా నవ్వుతున్నారు?’ సుజన ఉడుక్కుంటోంది.
‘పద్మ పరాయి వ్యక్తితో తిరగడం లేదు. అంతా నీ భ్రమ’ అన్నాడతడు.
‘ఏంటీ.. ఆ స్కూటర్‌వాలా పరాయివాడు కాడా?’
‘ముమ్మాటికీ కాదు. మూడుముళ్లు వేసేవాడు మొగుడవుతాడు కానీ... పరాయివాడెలా అవుతాడు? ’
‘మీరు చెప్పింది అర్థం కావడం లేదు’ అంది సుజన.
‘తప్పిపోయిన పెళ్లిసంబంధం కారణంగా స్కూటర్‌వాలా సంగతి నా దృష్టికొచ్చింది. మొదట్లో మగ పెళ్లివాళ్లకి మన గురించి చెప్పిందెవరా? అని కోపం వచ్చింది. అలా చెప్పిందెవరో ఆరాతీసి తిట్టాలనిపించింది. ఆ తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే.. చెప్పినవాళ్లకోసం వెతికి చేసిన తప్పుని ఎత్తిచూపించే కన్నా అసలు విషయం తెలుసుకోవడమే తెలివైన పననిపించింది. అంతే! ఆ తర్వాత రెండ్రోజులూ ఆఫీసుకి ఆలస్యంగావెళ్లి, త్వరగా వచ్చేస్తూ పద్మ వెనుక పడ్డాను. అప్పుడే తెలిసింది. పద్మ వెనుక ఓ స్కూటర్‌వాలా పడుతున్నాడనీ. అతడి స్కూటర్ వెనుక పద్మ దర్జాగా కూచుంటోందని. అంతేకాదు! ఆ ఇద్దరూ కలిసున్న క్షణాల్లో వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ని అబ్జర్వ్ చేస్తే ఒక విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. ఔను.. వాళ్లిద్దరూ ప్రేమలోపడ్డారు. వాళ్ల చూపుల్లో, నవ్వుల్లో, నడకలో, ఒకరికొకరు చెప్పుకునే వీడ్కోలులో అంతులేని ప్రేమ కనిపించింది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చాను. ముహూర్తాలు చూసి వచ్చేనెల్లోనే వాళ్లిద్దరికీ ముడిపెట్టేయాలని.’
‘నాకు తెలీకుండా నా వెనుక ఇంత కథ జరిగిందా?’
‘నువ్వు లేకుండా ఈ ప్రేమ కథ ముందుకు జరగడమా? నెవ్వర్. ఈ కథకి కర్తకర్మక్రియ అన్నీ నువ్వే. ఆడపడుచు ప్రేమపెళ్లిని దగ్గరుండి జరిపించాల్సింది కూడా నువ్వే’ అన్నాడు కృష్ణమూర్తి.
‘యాథార్థవాది లోకవిరోధి..’అన్నది సామెత. కానీ, ఒక్కోసారి తెలీకుండా చెప్పేసిన యథార్థాలు కలిసొచ్చే కాలంలో కళ్యాణ కారకాలవుతాయి..’ అనుకుంది సుజన తేలిక పడిన మనసుతో. *

-పివిడిఎస్ ప్రకాష్, 90005 44160