మెయన్ ఫీచర్

ప్రశ్నార్థకంగా మారిన భారతీయ బ్యాంకుల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిది వేల కోట్ల మేరకు బ్యాంకు రుణాలను చెల్లించకుండా దేశం నుండి పరారైన విజయ్‌మాల్యా ఉదంతం కనుమరుగు కాకముందే మరో ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,500 కోట్ల మేరకు టోపీ పెట్టి సంపన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి వెళ్లిపోవడం సంచలనం కల్గించింది. అయితే ఇటువంటి ఒకటో, రెండో సంఘటనలు అప్పుడప్పుడు సంచలనం కలిగిస్తున్నా బ్యాంక్‌ల నుండి రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న పారిశ్రామికవేత్తలు దేశంలో ఎందరో ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల రుణాలను చెల్లించక పోయినా బ్యాంకులు ప్రేక్షక పాత్ర వహించడం మినహా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే అటువంటివారు తరచు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా కనిపిస్తూ ఉంటున్నారు.
నేడు రాజకీయ నాయకుల వెంట తిరుగుతున్న బడా పారిశ్రామికవేత్తలు అందరూ ఆ విధంగా బ్యాంకులకు భారీ స్థాయిలో టోపీ పెడుతున్న వారే. అయితే బ్యాంకులను మోసం చేస్తున్న వారికి మీరు అండగా ఉన్నారంటే, కాదు మీరే అంటూ బిజెపి, కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మినహా అసలు దొంగలను పట్టుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఉదాహరణకు విజయ్ మాల్యా మొదటిసారి రాజ్యసభకు కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికైనట్లు బిజెపి ఆరోపిస్తుంటే, ఆ సమయంలో బిజెపి సహితం అతనికి మిగులు ఓట్లు వేయడమే కాదు, రెండోసారి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది.
విజయమాల్యా విమానాలను సొంత కారులవలె ఉపయోగించుకొని ఉచితంగా వెంకయ్యనాయుడు, అమిత్‌షాలతో సహా చాలామంది బిజెపి ప్రముఖులు అనేకసార్లు ప్రయాణం చేస్తుండేవారు. వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లే ఇళ్లల్లో కనిపిస్తూ ఉండేవారు. దేశం విడిచి వెళ్లిపోయే ముందు కూడా వారిద్దరిని కలిసి, వారితో సమాలోచనలు జరిపిన తర్వాత వెళ్లడం గమనార్హం.
రెండేళ్ల క్రితం విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు వచ్చిన అరుణ్‌జైట్లే తమ సదస్సుకు పెద్దఎత్తున స్పందన వస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పగానే ఆర్థిక మంత్రి అన్నమాటలు ఈ సందర్భంగా గమనార్హం. ‘‘నేను ఏ రాష్ట్రం వెళ్లినా ఒక డజన్ మంది పారిశ్రామికవేత్తలే వస్తున్నారు. పెద్దయెత్తున పరిశ్రమలు పెడతామని చెప్పి, ఒప్పందాలు కుదుర్చుకొని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి భూములు కారు చవక ధరకు తీసుకొంటున్నారు. ఆ భూములను చూపి బ్యాంకుల నుండి భారీ రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత బ్యాంకులకు తిరిగి డబ్బులు ఇవ్వడం లేదు, పరిశ్రమలు పెట్టడం లేదు, ఎవ్వరికీ ఉపాధి కల్పించడం లేదు’’ అంటూ వాపోయారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పారిశ్రామిక వేత్తల పేర్లు కూడా అరుణ్‌జైట్లే ప్రస్తావించినట్లు తెలిసింది. వారు ముగ్గురు కలసి బ్యాంకులకు లక్ష కోట్ల రూపాయల రుణాలు చెల్లించడం లేదని, ముందుగా వారు చెల్లించేటట్లు చూడండి అన్నారు. ఇటువంటి ‘ఆర్థిక నేరస్థులు’ అన్ని రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొంటున్నారు. ఎవ్వరు అధికారంలో ఉంటే వారితోనే తమ పనులు చేయించుకొంటున్నారు. దానితో మన బ్యాంకుల మనుగడ ప్రశ్నార్తకంగా తయారైనది. నోట్ల రద్దు, డిజిటల్ కార్యకలాపాలతో బ్యాంకుల వద్ద నగదు నిల్వలు గణనీయంగా పెరిగినా ఎవ్వరికీ రుణాలు ఇచ్చే పరిస్థితులలో లేవు.
ఈ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా భారతీయ బ్యాంకుల పట్ల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడింది. అదే జరిగితే ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకొంటున్న మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. బ్యాంకులలో అంతర్గత పర్యవేక్షణ, ఆడిటింగ్ యంత్రాంగం, రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ లోపాలను ఈ ఉదంతాలు బహిర్గతం చేస్తున్నాయని స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లే ఆందోళన వ్యక్తం చేశారు. మనదేశంలో పెద్దయెత్తున జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కారణం ఎక్కువగా తీసుకొన్న అప్పులు చెల్లించకపోవడమే. తీసుకున్న ఒకటి, రెండు లక్షల రూపాయలు చెల్లించకపోవడం తో బ్యాంకుల నుండి ఎదురవుతున్న వత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు.
ఒక్క పారిశ్రామికవేత్త అయినా ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారా? కనీసం అల్లరి అయితే మినహా జైలుకు వెళ్లారా? అల్లరి జరిగితే దేశం విడిచి వెళ్లిపోతున్నారు. తాజా కుంభకోణానికి ఏడేళ్ల క్రితమే పునాది పడినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఏటా వార్షిక ఆడిట్‌లు క్రమపద్ధతిలో నిర్వహిస్తున్నప్పటికీ ఈ కుంభకోణానికి ఏడేళ్ల క్రితమే తెరలేచింది. దిగుమతి బిల్లుల పరిష్కారం కోసం అందిన విజ్ఞప్తుల మేరకు చెల్లింపులు చేసిన ఇతర బ్యాంకులకు చెందిన విదేశీ శాఖలు ఇందులోని లోపాలను దీర్ఘకాలం పాటు ఎత్తి చూపలేక పోయాయి. 1.77 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11వేల పైనా) విలువ చేసే ఈ కుంభకోణంలో మొత్తాలను ముందుగానే వ్యూహాత్మకంగా విదేశాలకు తరలించినట్లు కూడా బ్యాంకు వర్గాలు ధృవీకరించాయి.
కాగా ఇతర బ్యాంకుల్లోనూ ఈ తరహా మోసం జరిగి ఉండొచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఇంత జరిగినా ఈ వ్యవహారంపై ఆ బ్యాంకు స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి జైట్లే స్పందించి ఏమి జరిగిందో చెప్పే సాహసం చేయడం లేదు. రాజకీయ ప్రాపకంతోనే బ్యాంకులను ఇంత పెద్దయెత్తున మోసం చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నా, ఆ కోణంలో సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్థలు ఎటువంటి గుట్టు రాబట్టే ప్రయత్నం చేయడం లేదు.
ఉదాహరణకు విజయమాల్యాకు సంబంధిత బ్యాంకు అధికారులు భారీ ఋణం ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినా, నాటి బ్యాంకు చైర్మన్ జోక్యంతో ఆ ఋణం మంజూరైనట్లు చెబుతున్నారు. చైర్మన్‌ను విచారిస్తే తనకు ఎదురైన రాజకీయ వత్తిడుల గురించి నోరువిప్పే అవకాశం ఉండేది. కానీ సిబిఐ అటువంటి ప్రయత్నం చేయనే లేదు. బ్యాంకులలో విదేశీ లావాదేవీలను పర్యవేక్షించ వలసిన బాధ్యత రిజర్వు బ్యాంకుదే అయినా, దేశంలో బ్యాంకుల యాజమాన్య తీరుతెన్నుల పర్యవేక్షణ బాధ్యత ఆర్థిక శాఖదే. అయితే వీరిద్దరితో సంబంధం లేకుండా బ్యాంకులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నట్లు ఇప్పుడు భావించవలసి వస్తున్నది.
బ్యాంకులపై ఆర్‌బిఐపై పర్యవేక్షణ తగ్గిపోతూ ఉండడం ఇటువంటి కుంభకోణాలకు ఆస్కారం ఏర్పడుతున్నట్లు కనిపిస్తున్నది. అందుకు ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించు కోలేదు. గత ఏడు నెలలుగా దేశంలోని బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్‌బిఐలో పూర్తిస్థాయి డిప్యూటీ గవర్నర్ లేరు. గత జూలైలో ఎస్‌ఎస్ ముద్ర పదవీ విరమణ అనంతరం కేంద్రప్రభుత్వం ఆ పదవిని భర్తీ చేయకుండా అలానే వదిలేసింది.
బ్యాంకు లకు వందల కోట్ల రూపాయలు చెల్లించకుండా, కోర్టు కేసులతో కాలక్షేపం చేస్తున్న అనేకమంది స్వయంగా వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులుగా చట్టసభలకు ఎన్నికై, కొందరు మంత్రి పదవులలో కూడా ఉన్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు తమ వద్ద గల నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవడం కోసం తమ కుటుంబ సభ్యుల పేర్లతో నడుపుతున్న ట్రస్ట్‌లలో కార్యనిర్వాహక పదవులలో బ్యాంకులకు టోపీ పెడుతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు.
రాజకీయ పార్టీలకు, ఎన్నికలలో అభ్యర్థులకు పుష్కలంగా నిధులు సమకూర్చుతున్నది కూడా వీరే. అంతే ఆర్థిక నేరస్థులకు మన రాజకీయ వ్యవస్థే ఆశ్రయం కల్పిస్తున్నది. ఈ లొసుగులను అవకాశంగా తీసుకొని బ్యాంకు అధికారులు సహితం విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.
బ్యాంకు రుణాలను ఎగవేసే వారిని, ఎగవేసే ప్రయత్నం చేసిన వారిని ‘ఆర్థిక నేరస్థులు’గా పరిగణించి, ఆర్థిక వ్యవహారాలకు వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తేగాని మన బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకోలేదు. తద్వారా మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోకుండా జాగ్రత్త పడలేము. ఈ సందర్భంగా చైనా ఈ మధ్య తీసుకున్న కొన్ని చర్యలను ప్రధాని నరేంద్రమోడీ పరిశీలించి కఠిన నిర్ణయాలు చేపట్టాలి.
చైనా సుప్రీం పీపుల్స్ కోర్టు 67.3 లక్షల మంది బ్యాంకు రుణాల ఎగవేతదారుల్ని బ్లాక్‌లిస్ట్ చేయమని ఆదేశించింది. అటువంటి వారు విమానాల్లో ప్రయాణాలు చేయలేని విధంగా, వారికి కొత్తగా రూపాయి రుణం పుట్టకుండా, చివరకు క్రెడిట్ కార్డులు కూడా పనిచేయకుండా ఆంక్షలు విధించమని ఆదేశించింది. చైనా ప్రభుత్వం ఇప్పటికే 61.5 లక్షల మందిని విమానాల టికెట్లు కూడా కొనకుండా బ్లాక్‌లిస్ట్ చేసింది. 22.2 లక్షల మంది అసలు హైస్పీడ్ ట్రెయిన్లలో ప్రయాణం కూడా చేయకుండా నిషేధించింది.
పాస్‌పోర్టులు, ఐడీ కార్డుల ఆధారంగా దీన్ని అమలు చేస్తున్నట్టు సుప్రీమ్ పీపుల్స్ కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో చీఫ్ మెంగ్ జియాంగ్ చెబుతున్నారు. 71 వేల మంది ఎగవేతదారులు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులుగా, ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేయకుండా ఆదేశాలు జారీ చేశారు. 5.5 లక్షల మంది రుణ ఎగవేతదారుల క్రెడిట్ కార్డుల దరఖాస్తులను ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా చెత్తబుట్టలో పారేసింది.
ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ సలహా కమిటీల సభ్యులు, స్థానిక లెజిస్లేటివ్ సభ్యులు, చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ డెలిగేట్స్ విషయంలోనూ ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దని సుప్రీం ఆదేశించింది. దీంతో కొందరిని బహిష్కరించారు. కొందరిని డిమోట్ చేశారు. కనీసం పది లక్షల మంది దీంతో బెదిరిపోయి, రుణాలు చెల్లించడానికి సిద్ధపడుతున్నారట.
ప్రధాని మోడీ ఇటువంటి తీవ్ర చర్యలకు సాహసింప గలరా? జరిగిన కుంభకోణాలపై ప్రభుత్వంపై నిందలు మోయడంతో కాలం గడపకుండా రాహుల్‌గాంధీ, ఇతర నాయకులు ఇటువంటి తీవ్ర చర్యలను సూచించగలరా? ఇలా చేస్తే దాదాపు 10 లక్షల కోట్ల మేరకు రుణ ఎగవేతదారులు, అక్రమ పన్ను మినహాయింపు లబ్ధిదారుల నుంచి ఎంతో కొంత వసూలు చేయొచ్చు. నగదు లేకుండా ఎటిఎంలను ఖాళీగా ఉంచడం, బ్యాంకులలో కూడా నగదు లేకుండా ఈగలు తోలుకొనే పరిస్థితులు కల్పించడాన్ని ‘సమర్థపాలన’గా భావించుకొనే దుస్థితి నుండి బైటపడాలి.
ముందుగా బిజెపి ప్రభుత్వాలలో ఉన్న మంత్రులు, పార్టీ పదాధికారులు ఎవ్వరూ బ్యాంకులకు బకాయిలు చెల్లించకుండా, మొండి బకాయిదారులుగా ఉండరాదని రెండు, మూడు నెలల గడువు ఇవ్వండి. ఈలోగా బకాయిలు చెల్లించని పక్షంలో వారి పదవులు ఉండవని స్పష్టం చేయండి. వచ్చే ఎన్నికలలో అటువంటి వారికి పార్టీ టికెట్‌లే కాకుండా, నామినేటెడ్ పోస్టులు కూడా ప్రభుత్వంలో ఉండబోవని స్పష్టం చేయండి. ఇటువంటి కఠిన చర్యల ద్వారా మాత్రమే ప్రధాని కృంగిపోవడానికి సిద్ధపడుతున్న మన ఆర్థిక వ్యవస్థను కాపాడగలరని గ్రహించాలి. వౌనం వీడాలి. తన నిజాయితేని ‘ఎంపిక చేసిన’ రాజకీయ ప్రత్యర్థులపై కాకుండా మొత్తం వ్యవస్థను సంస్కరించడంలో ప్రదర్శించాలి.

- చలసాని నరేంద్ర