సబ్ ఫీచర్

శిశిరంలో విషాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులోని వెంకటాపురం అటవీ ప్రాంతంలో హోలీ రోజున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఒక గ్రేహౌండ్స్ కమాండో మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఏడాది క్రితం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు లోని రామగూడ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత ఇదే భారీ ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ ఆధిపత్యం సాధించాలన్న ఉద్దేశంతో కొంతకాలంగా మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. సమీపంలో చత్తీస్‌గఢ్ ఉండటంతో అక్కడి నుంచి సాయుధ మావోయిస్టులొచ్చి తమ పనులు ముగించుకుని వెళుతున్నారు. తాజా ఎన్‌కౌంటర్‌లో హన్మకొండ వద్ద రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ మినహా మిగతా వారంతా చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీలు కావడం గమనార్హం. ఎన్‌కౌంటర్‌కు రెండు రోజుల ముందు ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మావోలకు మందులు, ఇతర సామగ్రిని తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని మావోల ఆనుపానులు తెలుసుకున్నారని, మరికొందరు ఇచ్చిన సమాచారం ప్రకారం అడవిలోకి గ్రేహౌండ్స్ బలగాల తరలింపు జరిగిందని భావిస్తున్నారు. గత నెలలో పినపాక మండలం భూపతిరావుపేటలో మావోయిస్టులు ఒక గిరిజనుడిని ఇన్‌ఫార్మర్ పేరిట కాల్చి చంపి, మరో గిరిజనుడిని తీవ్రంగా గాయపరిచారు. ఇసుక ర్యాంప్‌ల వద్ద లారీలను, ట్రాక్టర్లను, ఇతర వాహనాలను దగ్ధం చేశారు. వెంకటాపురం మండలం ఎదిరలోని టెలిఫోన్ ఎక్స్చేంజిని దగ్ధం చేసి, మందుపాతరలను పేల్చారు.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోనూ మావోల కార్యక్రమాలు ఇటీవల పెరిగాయి. జనవరిలో ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను, నలుగురు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు ఔట్ పోస్ట్ లక్ష్యంగా మావోయిస్టులు ప్రెషర్ బాంబు అమర్చగా ఒక జవాను మరణించాడు. ఇలా అప్రతిహతంగా ముందుకు వెళ్లి సంచలనం సృష్టించాలనుకున్న మావోలకు తాజా ఎన్‌కౌంటర్ శరాఘాతమైంది. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్, కెకెడబ్ల్యు నాయకుడు దామోదర్ తదితరులు త్రుటిలో తప్పించుకున్నారు. సంఘటన స్థలంలో ఆధునిక ఆయుధాలు, బాంబులు, డిటొనేటర్లు, లాప్‌టాప్, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక- ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏఓబి) ప్రాంతంలో మావోలకు వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తాజాగా అక్కడ 60 మంది మహిళా కమాండోలను భద్రతా బలగాలు రంగంలోకి దింపాయి. వీరిలో పదిమంది మాజీ మావోయిస్టు మహిళలే ఉండటం విశేషం. ‘ముల్లును ముల్లుతో తీయాలన్న’ పద్ధతిలో మాజీ మావోలకు ఉద్యోగాలిచ్చి వారిని కూంబింగ్ ఆపరేషన్లలో మోహరిస్తున్నారు. ఈ విధానం మంచి ఫలితాలనిస్తోందని తెలుస్తోంది. మావోల ఏఓబీ ప్లీనరీ సమావేశంపై గత నెలలో భద్రతా బలగాలు దాడిచేసి 45 కిట్లను, మందుపాతరలను, డిటొనేటర్లను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. తెలంగాణలో తాజా ఎన్‌కౌంటర్ నుంచి జగన్ తప్పించుకున్నట్టే, ఆ ప్లీనరీపై జరిగిన దాడి నుంచి కీలక నేత హరగోపాల్ అలియాస్ ఆర్కే తప్పించుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. 2016లో ఏఓబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ అనంతరం 117 మంది మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. 62 మంది మావోలు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మావోలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆ క్రమంలో వారు క్యాడర్‌ను నష్టపోతున్నారు. దీంతో వారికి అన్ని రకాలుగా దారులు మూసుకుపోతున్నాయి.
చత్తీస్‌గఢ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సుకుమా, బీజాపూర్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల్లో మావోలకు విజయాల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ తగులుతున్నాయి. ఉక్రోషంతో ఇన్‌ఫార్మర్ల పేరిట అమాయక ఆదివాసీలను మావోలు హతమారుస్తున్నారు. కిష్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నంపేటకు చెందిన వీరయ్యను జనవరిలో నరికి చంపారు. నారాయణపూర్ జిల్లాలో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను హతమార్చారు. సుకుమా జిల్లాలో ఇద్దరు, బీజాపూర్ జిల్లాలో ఒక మావోయిస్టు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. బెజ్జి-చింతగుప్ప గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణ పనులకు కాపలాగా ఉన్న జవాన్లపై గత నెల మావోయిస్టుల మెరుపుదాడిని భద్రతా బలగాలు తిప్పి కొట్టాయి. అందులో చాలామంది మావోయిస్టులు మరణించి ఉంటారని భావిస్తున్నారు.
తెలంగాణ సరిహద్దులోని బలార్షలో మావోయిస్టు సీనియర్ నాయకుడు రామన్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో మావోయిస్టు సీనియర్ నాయకుడు దశరథన్, అతని భార్య వల్లీని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్-మహారాష్ట్ర మావోయిస్టు కారిడార్‌లో పనిచేస్తున్న ఏడుగురు మావోయిస్టులను ముంబయిలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్‌లో జనముక్తి పరిషత్తు (మావోయిస్టు) సభ్యులతో జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం భారీ సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మరణించారు. ఒడిశాలో దిగంబర్ పొద్దార్ అనే మావోయిస్టు నాయకుడు పోలీసుల ముందు లొంగిపోయి, తన సహచరులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమ దుస్థితి దృశ్యమిది. ‘ఆకురాలు కాలం’లో వారి కార్యక్రమాలు స్తబ్దుగా మారుతాయి. వేసవి ప్రారంభమయ్యాక నీటి వనరులు మృగ్యమవుతున్న వేళ వారి కదలికలు తగ్గుముఖం పడతాయి. అటు పోలీసులు, భద్రతా బలగాలు, ఇటు ప్రకృతి మావోయిస్టులపై తీవ్ర ఒత్తికి పెడుతోంది. పైకి ఎంతో గంభీరంగా మాట్లాడుతున్నా, తెరాస నాయకులు, పాలకులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు చేస్తున్నా వారికి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ప్రధానంగా రిక్రూట్‌మెంట్లు నిలిచిపోవడం, ఉన్న క్యాడర్ లొంగిపోవడమో, ఎన్‌కౌంటర్లలో హతమవడమో, ఆరోగ్య సమస్యలతో సతమతమవడమో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్ ఆశాజనకంగా కనిపించడం లేదు.
మావోల సిద్ధాంతమైన ‘మార్క్సిజం ప్రాసంగికత’పై పెద్ద ప్రశ్నార్థకం ప్రపంచవ్యాప్తంగా పరచుకుంది. వర్తమాన డిజిటల్ ప్రపంచంలో, అటోమేషన్, టెక్నాలజీ అతివేగంగా విస్తరిస్తున్న సమయంలో- శారీరక శ్రమ పునాదిగా ఎదిగిన మార్క్సిజం మసకబారంది. అంతటా అది స్పష్టంగా కనిపిస్తోంది మావోయిస్టులకు తప్ప! అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసమున్న వామపక్షాలకు ఉనికే లేకుండా పోతోంది. తాజాగా త్రిపురలో పరిస్థితి ఇందుకు అద్దం పడుతోంది. రాజ్యాంగంపై నమ్మకం లేదని, తుపాకీ గొట్టం మీదనే ఆధారపడి, దీర్ఘకాల సాయుధ పోరాటం చేస్తామంటున్న మావోలకు భవిష్యత్ ఉంటుందని ఎలా విశ్వసించగలం?
సంపద ప్రాథమ్యాలు మారి, కృత్రిమ మేధకు, సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తున్న సందర్భంలో శారీరక శ్రమపై ఆధారపడిన ‘మార్క్సిజం’ దేదీప్యమానంగా వెలుగొందుతుందను కోవడం అజ్ఞానం తప్ప మరొకటి కాదు! ప్రపంచంలోని అన్ని సమాజాలు రూపాంతరం చెందిన సంగతిని విస్మరించి ‘రెండు వర్గాల సిద్ధాంతం’ ఆధారంగా దండకారణ్యంలో సాయుధ దండు నిర్మించాలనుకోవడం, అందుకు ఆదివాసీలను ఆహుతి చేయడం అనాగరికం, అమానవీయం. మావోయిస్టులు జనతన సర్కారు పేర, మార్కెట్ రహిత ఎకానమీ విధానం పెంచి పోషిస్తామనడం కాలం చెల్లిన విధానం తప్ప మరొకటి కాదు. ప్రపంచం ఆ దశను దాటి చాలాకాలమైంది. చైనా సైతం మార్కెట్ ఎకానమీతో దూసుకుపోతుండగా ఆ దేశం నుంచి స్ఫూర్తి పొందిన భారత మావోయిస్టులు మాత్రం ఇలా వర్తమానానికి భిన్నమైన పద్ధతి అనుసరిస్తామని సహజ వనరులను, మానవ వనరులను ధ్వంసం చేయడం ఏ విధంగా ఆమోదనీయం?