Others

సామాజిక ముఖచిత్ర దర్శనమే ‘ముచ్చట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముచ్చట (కవితా సంకలనం)
-శిరీష్ కొండ్ర
వెల: రూ.80/-
ప్రతులకు: రచయిత
38-18 ఫస్ట్ ఫ్లోర్, రోహిణి కాలనీ,
సైనిక్‌పురి హైస్కూల్ రోడ్,
అంబేద్కర్‌నగర్, సైనిక్‌పురి
సికిందరాబాద్- 500 094

జీవితానుభవాల్ని దోసిట్లోకి తీసుకుని కవిత్వంగా పలవరించడం కొంత మందికి వెన్నతో పెటిటన విద్యగా మారతుంది. ఇందులో అడుగడుగునా సంఘర్షణ చోటు చేసుకుంటుంది. ఆవేదన అంతర్లీనంగా ఉట్టిపడుతుంది. సామాజిక స్పృహ కలిగిన కవులకైతే ఈ తపన మరీ ఎక్కువ. ప్రతి అంశాన్నీ లోతుగా పరిశీలించి వచనప్రాయంగా చెప్పడానికి ఉరకలు వేస్తారు. ఇందులో సూటిదనం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాస్తవికతకు జీవం పోస్తుంది. ఈ భరోసాలోంచే ఆధునిక సామాజిక జీవితంలోకి తొంగి చూడటం అలవాటవుతుంది. అలా ఊపిరి పోసుకున్న కవితల సమాహారమే చివరికి ‘ముచ్చట’ అనే కవితా సంపుటికి దారితీసింది. దీని కవి ‘శిరీష్ కొండ్ర’. 46 శీర్షికలతో చాలా సరళంగా, భావోద్వేగంతో, వచన శైలిలో చెప్పబడిన కవిత్వం ఇది. అభివ్యక్తిలో తనదైన సొంతగొంతు, వ్యక్తీకరణ కానవస్తుంది. శిల్పం కోసం ప్రాకులాడని తత్త్వం తేటతెల్లమవుతుంది. ఈ ప్రత్యేక లక్షణాలే ఈ కవిని విలక్షణత కలిగిన వాడిగా నిరూపిస్తుంది. ఈ సంపుటికి ముందు మాటగాని, కవితల సంఖ్యగాని కనిపించవు. నేరుగా భావాలను గుదిగుచ్చి అక్షరాలుగా మన ముందు పరుస్తాడు కవి శిరీష్ కొండ్ర.
‘నేను శాశ్వతం/ నేను సర్వవ్యాప్తం/ నా జననం ఒక మార్పు కోసం’ అని అంటారు ఓ కవితలో. వాక్యాలలో ధ్వనించే భావంకన్నా విప్లవాత్మక ఆలోచనా సరళిని నిబద్ధతగా స్వీకరించడం ఇందులో వ్యక్తమవుతుంది. సామూహిక ఉద్యమం ఏకత్వ సంభాషణని సిద్ధాంతపరంగా విశే్లషించి వివరణ ఇవ్వడంలో రాజీలేని పోరాట తత్త్వం బయటపడుతుంది.
దీనిలోనే మరోచోట తన ఆంతర్యాన్ని బహిరంగపరుస్తూ ఇలా చెబుతాడు కవి.
‘నా ప్రయాణం ఒక సందేశం/ నేను మార్క్స్ పదాలలో పెరిగా/ చే గువేరాతో యుద్ధంలో పోరాడా/ గాంధీ అడుగుల్లో అడుగు వేసా/ గడ్డ్ఫా వీరత్వంలో నిలిచా’ అని తన అభిప్రాయ ప్రకటన కవితాత్మక గాఢతతో వెల్లడిస్తాడు శిరీష్ కొండ్ర. పీడిత వర్గాల పాలిట కొమ్ముకాస్తూ సామాజిక సహజీవనం చేసే పోరాట వీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ఒడుపులో సామూహికత్వాన్ని తన గొంతులో పలికిస్తాడు. ఈ భావ ప్రకటన చాలు - కవి ఎవరి పక్షాన నిలిచి ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నాడో తెలియజెప్పడానికి!
ఈ కవికి లోతైన చూపు ఉంది. పదునుదేరిన సామాజిక పరిశీలనా శక్తి ఉంది. పీడిత వ్యవస్థ పట్ల సంఘీభావన ఉంది. సునిశిత తార్కిక జీవన తాత్త్వికతా ఉంది. సుదీర్ఘ అధ్యయనంతోపాటు వచనాన్ని కవిత్వమయంతో చెయ్యగల సాధన తోడైతే మరింత పరిపుష్ఠితను సాధించి సామూహిక కోణాల మూలాల లోతుల్ని శోధించగలుగుతాడు. ఆ భరోసానైతే ఈ సంపుటి రుజువు చేస్తోంది.
‘నువ్వు తెలుసుకో’ కవితలో కవి ఆత్మశోధన ఇలా కొనసాగుతుంది.
‘జీవితాన్ని, మనుషులని/ వారి మనసులను గెలవాలంటే,/ ముందు నిన్ను నువ్వు గెలుచుకో!/ నిన్ను నువ్వు గెలవాలి అంటే/ ముందు నిన్ను నువ్వు తెలుసుకో!’ అంటాడు ఒకచోట. ఆత్మశోధనతో అంతర్వీక్షణకు గురైతే తప్ప, ఈ లక్ష్యసాధనలో ముందుకు సాగలేడు మనిషి. జ్ఞానం అపరిమితమైనది. అనుభవపూర్వకంగానో - అధ్యయన పరంగానో దీనిని ఒడిసి పట్టుకోవాలి. అందులోంచే మనుషుల్ని, జీవితాల్ని చదివి మనసుల్ని గెలవడానికి చేసే ప్రయత్నం ఉన్నత తీరాలకు చేరుస్తుంది. మేధావులుగా మలుస్తుంది. ఈ తపనలోంచే జిజ్ఞాస మొదలవుతుంది. ఇలా మొదలైన ప్రయాణానికి ఆరంభమే తప్ప, అంతం ఉండదు. జ్ఞానదాహాన్ని పెంచుతుంది. దీనిలోంచే మనల్ని మనం మలచుకోవాలి. ఇదే వికాసానికి తొలి మెట్టు. దీని అందుకోమని చెప్పడమే ఈ కవి అంతర్లీన భావ సందేశం.
‘స్వాతంత్య్రం’ అన్న కవితలో సమగ్ర దేశ స్వరూప స్వభావాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం కనపడుతుంది.
‘నేడు/ అంతా మారిపోయింది/ నాయకత్వం రాజకీయం/ వేరు అయిపోయాయి/ స్వార్థం అందరిని మార్చేసింది/ అభివృద్ధి అన్న పదం/ పుస్తకాల్లో ఒక పదములా మిగిలిపోయింది/ స్వాతంత్య్రం అనేది ఒక రోజులా మారిపోయింది’ అంటూ వాపోతాడు కవి. ఈ పలుకులు నేటి అక్షర సత్యాలు. వర్తమాన వ్యవస్థ తీరుతెన్నులకు ఇది అద్దం పడుతుంది. స్వార్థం ముసుగులో స్వాతంత్య్రం హరించివేయబడి, ఆర్థికాభివృద్ధి కుంటుబడింది అనే సత్యాన్ని కళ్లకు కట్టించడం ఈ కవి ముఖ్యోద్దేశం. అదే నిజం కూడా. ఈ సందర్భాన్ని తేటతెల్లం చెయ్యడానికి శిరీష్‌కొండ్ర ఆరాటం వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఈ వేదనలో గూడుకట్టిన నిజాయితీ వ్యక్తమవుతుంది. సామాజికపరమైన అలజడి కవిత్వమంతటా పరుచుకుంది. వీటి మూలాల లోతుల్ని శోధించాల్సిన అవసరముందని కవి హెచ్చరిస్తున్నాడు.
‘ఇవ్వాళ ఓడిపోయానని నిరాశ చెందకు/ రేపు గెలిచినప్పుడు/ నీ మూలాలను మరవకు’ అంటాడు ‘ఒక్క అవకాశం’ అన్న కవితలో. వర్తమాన - భవిష్యత్తు కాలాల ఊగిసలాటలో అపరిచితంగా మిగిలిపోయి వున్న సందర్భ సన్నివేశాలను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తాయి. ఈ వాక్యాలు. గెలుపోటములు సహజమే అయినా, బతుకు మూలాల వెదుకులాట చివరిదాకా తప్పనిసరి అని నిర్వచనప్రాయంగా చెబుతాడు కవి.
ఈ కవితల్లో ఆర్థిక విశే్లషణలూ, కుటుంబ బాంధవ్యాలూ, మిత్రపక్షమూ, సామాజిక ప్రేమ, దైవస్పర్శ, లోకనీతి, గురుపక్షపాతం, ప్రాపంచిక అనే్వషణ, కలం గొప్పదనమూ మున్నగు అంశాల పట్ల తాత్కాలికమైన చర్చ కొనసాగుతుంది. ఇవన్నీ, మానవ సమాజంలోని అనే్వషణలో భాగమే. తాను నమ్మిన సిద్ధాంతాల్ని, రాజకీయ పరమైన సమానత్వ కోణంలో విడమర్చి చెప్పడానికి అక్షరాన్ని ఆయుధంగా వాడుకుంటాడు శిరీష్. ఇదే ఈ సంపుటికి అదనపు బలమూ. వచన ప్రాయమైన బలహీనత కూడా. జీవితాన్ని విశాల దృక్పథంతో అర్థం చేసుకోవడానికి తగినంత విషయ పరిజ్ఞానం కూడా అవసరమే. దీనిని నొక్కి చెప్పడానికి జీవన సంఘర్షణను వాహికగా ఎంచుకుంటాడు కవి. అందుకే ఇది సహజమైన కవిత్వంగా అక్షరాలలో ఒదిగిపోయింది. దీనిని చదివిన పాఠకుడి మనసు మేధోపరమైన ఆలోచనలకు తలుపులు తెరుస్తాయి. కానీ కవిత్వం పలచబడితే అది సాంద్రతను కోల్పోయే ప్రమాదముంది. దీనికి ఈ ‘ముచ్చట’ కవిత్వం ఎంతమాత్రమూ మినహాయింపు కాదు. తదుపరి సంపుటిలో బలమైన కవితలలో ఈ పాఠకలోకంలోకి అడుగుపెడతాడని ఆశిస్తూ శిరీష్ కొండ్ర ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910