క్రీడాభూమి
న్యూఢిల్లీ/బెంగళూరు, ఫిబ్రవరి 4: టీమిండియాకు చాలా కాలం నుంచి స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న సహారా ఇండియా సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కు శనివారం ఊహించని ఝలక్ ఇచ్చింది. బిసిసిఐతో ఆర్ధిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంతో పాటు పుణే వారియర్స్ యాజమాన్యాన్ని ఉపసంహరించుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుంచి కూడా వైదొలిగింది. శనివారం బెంగళూరులో ఐపిఎల్-5 ఆటగాళ్ల వేలం ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు సహారా సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి ఏమాత్రం తొణకని ఐపిఎల్ అధికారులు ఆటగాళ్ల వేలాన్ని యథావిథిగానే కొనసాగించారు. ఐపిఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు సహారా సంస్థ నుంచి తమకు లిఖితపూర్వక సమాచారమేదీ అందలేదని వారు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టుకు ఎదురైన ఘోర పరాజయాలతో సతమతమవుతున్న బిసిసిఐ టీమిండియాకు దీర్ఘకాలిక స్పాన్సర్లను అనే్వషించడంలో తలమునకలై ఉన్న తరుణంలో సహారా సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. బిసిసిఐతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవడానికి, అలాగే ఐపిఎల్ నుంచి వైదొలగడానికి సహారా సంస్థ వివిధ కారణాలను చూపుతూ తమ ఇబ్బందులను బోర్డు ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిందించింది. భారత క్రికెట్ జట్టుకు గత 11 ఏళ్ల నుంచి స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న సహారా సంస్థ 2010 జూలై 1వ తేదీన బిసిసిఐతో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆ సంస్థ వచ్చే ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు టీమిండియాకు స్పాన్సరర్‌గా కొనసాగాల్సి ఉంది. నూతన నిబంధనల ప్రకారం ఈ సంస్థ ఒక్టో టెస్టు క్రికెట్ మ్యాచ్‌కు, అలాగే అంతర్జాతీయ వనే్డ, ట్వంటీ-20 మ్యాచ్‌లకు 3.34 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. ‘టీమిండియాకు స్పాన్సర్‌గా మేము 11 ఏళ్ల పాటు బిసిసిఐతో కలిసి పయనించాం. దేశంలో ఇప్పుడు క్రికెట్ ఎంతో సుసంపన్నమైంది. ధృఢ సంకల్పంతో క్రికెట్‌కు తోడ్పాటును అందించగల సంపన్నవంతులు దేశంలో ఎందరో ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బిసిసిఐ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ నుంచి తప్పుకోవాలని మేము నిశ్చయించుకున్నాం. టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరించాలని మేము గతంలో తీసుకున్న నిర్ణయం ఎంతో భావోద్వేగభరితమైనది. అయితే మా భావోద్వేగాలకు సరైన గుర్తింపు, గౌరవం లభించలేదు. మా ఇబ్బందులను బిసిసిఐ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. అందుకే బాధాతప్త హృదయంతో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాం’ అని సహారా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
టోర్నమెంట్ ఆగదు : రాజీవ్ శుక్లా
ఇదిలావుంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పుణే వారియర్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరమని, అయినప్పటికీ ఐపిఎల్ ట్వంటీ-20 టోర్నమెంట్ యథావిథిగానే కొనసాగుతుందని ఐపిఎల్ అధికారులు పేర్కొన్నారు. పుణే వారియర్స్ జట్టుకు యజమానులుగా వ్యవహరిస్తున్న సహారా ఇండియా సంస్థ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలగడంపై అధికారికంగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని, కనుక దీనిపై తాను స్పందించబోనని ఐపిఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పుణే వారియర్స్ వైదొలగడం దురదృష్టకరం. ఈ విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. అధికారికంగా దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం అందలేదు. దీనిపై మేము ఇప్పుడే ఏమీ మాట్లాడలేము. సహారా సంస్థ నుంచి లిఖితపూర్వక సమాచారం లభించిన తర్వాతే మేము దీనిపై స్పందించగలం’ అని ఐపిఎల్-5 ఆటగాళ్ల వేలం సందర్భంగా రాజీవ్ శుక్లా తెలిపాడు. పుణే వారియర్స్ పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఐపిఎల్ ట్వంటీ-20 టోర్నమెంట్ యథావిథిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశాడు. ‘ఐపిఎల్‌లో ఎవరు ఉన్నా, లేకపోయినా టోర్నమెంట్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదు. ఆటగాళ్ల వేలం ఇప్పటికే ప్రారంభమైంది. టోర్నమెంట్ యథావిథిగా కొనసాగుతుంది’ అని ఆయన అన్నాడు.
Add new comment