సాహితి
అంతర్మథనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మ పరమాత్మల పరిశోధనకు
ఉపక్రమించటం లేదు
ఆంతర్ముఖ ఆలోచన్ల పాతర లోతుల్ని
లెక్కించటం లేదు
వర్తమాన జీవన స్రవంతిపై జలతరంగిణి
వినిపించాలనీ లేదు
బాల్యం తప్పటడుగుల్ని
తడిమి తడిమి చూచుకుంటూ
వయసు ఎక్కుతున్న నిచ్చెనమెట్లపై నుండి
వెనక్కు వెనక్కు ఆలోచించుకుంటున్నాను
ఎడారిలో పూల పరిమళాల సుగంధాల్ని
ఆస్వాదించలేమనే ఆకాళింపు లేనివాణ్ణి
ఒయాసిస్సు జాడలు వెతికితే గానీ
కనుపించవనే బుద్ధి వికసించని వాణ్ణి
చేయి పట్టుకు నడిపించే తోడుమాత్రమే
అడుగుల తడబాట్లను సరిచేయగలదని
ఊహ తెలియని వాణ్ణి
జాబిలమ్మ కథలే కలతనిద్రల్ని దూరం చేస్తాయనే
ఆకాంక్షల అభివ్యక్తీకరించలేని వాణ్ణి
జోలపాటల్తో సేదతీర్చే
మురిపాల పాలబువ్వలు
కోరుకోవటం ఎలాగో తెలియని వాణ్ణి
అంగుళం అంగుళం పెరుగుతున్న శరీరాన్ని
తనవి తీరా చూసుకొంటూ
తొందర పడుతున్న వాణ్ణి
భవిష్యత్తుకై అరాటపడుతున్న వాణ్ణి
కాలం ఘనీభవించినప్పుడు నిస్తేజితుణ్ణి
కరిగి ప్రవహిస్తున్నప్పుడు కలల కవిత్వాన్ని
నెమరేసుకునే వాణ్ణి
విశ్వాస తంత్రువుల్ని శృతి చేస్తూ
నిశ్శబ్ద క్షణాల్ని లెక్కించుకుంటూ
కూర్చోవటం దుర్లభమని
గుర్తించలేని వాణ్ణి
ఎదుగుతున్న కొద్దీ ఎదలోతుల్ని
తట్టి లేపే స్పర్శకై పరితపిస్తున్న వాణ్ణి
ఆడంబరాల అత్యాశలకు ఆలంబననై
ఏదో ఎంతో సాధించానని సంబరపడేవాణ్ణి
చుట్టూ చుట్టుముట్టిన చైతన్యం
నాలోని అంతర్వాహిననుకొని అతిశయంతో
విర్రవీగిన వాణ్ణి
నాలో నుంచి నేనే రోజు రోజుకు
దూరంగా జరిగిపోతున్నానని గుర్తించేటప్పటికి
మనసును తరిచే మాటలు లేక
మూగబోయిన వాణ్ణి
అనుభవాల భోషాణం తాళం చెవి కనపడక
మాంత్రికుణ్ణి నమ్మి మాయాదర్పణంలో
చిక్కుకున్న వాణ్ణి
జీవన జలధి మధ్యన మంథరగిరిగా నిలిచినవాణ్ణి
అమృతానే్వషణలో నన్ను నేనే
మధించుకుంటున్న వాణ్ణి
నాకు నేనే ప్రశ్నార్థకమై
ప్రశ్నల మధ్యే తారాడుతున్నవాణ్ణి