సాహితి

సంచార కళలకు కలాల అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాతుర్వర్ణ వ్యవస్థ సామాజికంగానే కాదు సాంస్కృతికపరమైన అంటరానితనానికీ బలమైన పునాదులు వేసింది. శిష్టులైన దేశీయ పండిత వర్గం తమ ఆధిపత్యం కొనసాగింపులో భాగంగా అట్టడుగు వర్గాలైన జన జీవితాలతో మమేకమై వారి సాంస్కృతిక మూలాల ఆధారంగా నిర్మించుకున్న ప్రజాకళలు, సాహిత్యాన్ని ప్రధాన సాహితీ స్రవంతిలో భాగం కానీయని కుట్రను పకడ్బందీగా కొనసాగిస్తూ వస్తున్నది. రాజ్యాధికారంలో సింహభాగమైన ప్రాతినిధ్య పాలకవర్గాలు కూడా సాంస్కృతిక వివక్షకు, విధ్వంసానికి తోడుగా నిలుస్తున్నాయి. దాని ఫలితమే.. అద్భుతమైన ఈస్తటిక్ సెన్స్‌ను కలిగిన కాలికస్పృహతో, సంపద సృష్టికర్తలైన శ్రామిక కులాల మూలాలను కళారూపాలుగా మలచి ప్రదర్శిస్తున్నారు. సంచారులు కళాత్మక చైతన్యాన్ని నింపిన జ్ఞానులు, సంగీత సాహిత్య సర్వసామ్రాట్టులైన సంచార జాతుల కళావైభవం విస్మృతిలోకి జారుకునే పరిస్థితి ఏర్పడింది.
కవులు, రచయితలు ప్రభుత్వాలు సభ్య సమాజం ప్రదర్శిస్తున్న అమానవీయ అలసత్వాన్ని నిరసిస్తూ... ప్రజాస్వామిక, ప్రగతిశీల సమాజ చలన శక్తులతో మమేకమై నడుస్తున్న తెలంగాణ రచయితల వేదిక వీరి కళలను, వౌఖిక సంప్రదాయంగా కొనసాగుతున్న వీరి సాహిత్యాన్ని అక్షర బద్ధం చేసి ముందు తరాలకు అందించవలసిన బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెరవే వరంగల్ జిల్లా మహాసభల సందర్భంగా ‘తెలంగాణ వర్తమానంలో సంచార జాతులు-నోటి సాహిత్యం-కళలు-సంస్కృతి’ అనే అంశంతో ఒకరోజు సదస్సు- సంభాషణ- కవిసమ్మేళనాన్ని నిర్వహించిన సభలో పాల్గొన్న వక్తలు మూగబోతున్న సంచార జాతుల గొంతుకగా మారి వారి సమస్యల పరిష్కారాన్ని చర్చించారు.
80 ఏళ్లు దాటిన వయసులోనూ ఇప్పటికీ ప్రజా ఉద్యమాల పక్షాన నిలుస్తున్న చుక్కా రామయ్యగారు ప్రారంభసభలో ముఖ్య అతిథిగా స్పందిస్తూ... ఆధునికులు కళను భ్రష్టుపట్టిస్తే ఈ సంచార జాతులవారు ప్రజలలో చైతన్యాన్ని నింపి సమాజ మార్పుకు దోహదపడ్డారన్నారు. డబ్బుల కోసం సినిమావాళ్లు సాహిత్యాన్ని దిగజారుస్తుంటే ఈ కళాకారులు కేవలం వినోదం కోసం కాకుండా సమాజంలో ఉన్నత విలువలు పాదుకొలిపే లక్ష్యంతో కళను నమ్ముకున్నారన్నారు. అనేక ఉపకులాలుగా ఉన్న వీరు శ్రీమంతులను కాకుండా దళితులు, వెనుకబడిన వారిని ఆశ్రయించడం ద్వారా కేవలం కళ కోసమే బతికిన వీరి అంకితభావం తెలుస్తుందన్నారు.
సంచార జాతుల వౌఖిత సాహిత్యం, రాతప్రతులు, తాళపత్ర గ్రంథాలు, వారి జీవన విధానాన్ని పట్టాల కోసం చేసే పరిశోధనలా కాకుండా పరిష్కారాలను అందించే మానవీయ కోణంలో కృషి చేస్తున్న పరిశోధకులు, నిత్యసంచారి ప్రొ. జయధీర్ తిరుమలరావు. వీరి కీలకోపన్యాసం సంచార జాతుల వ్యథాభరిత జీవితాల హృదయావిష్కరణగా ఇలా సాగింది. ఈ కళాకారులు సమాజాన్ని సూర్యునిలా వెలుగిస్తున్నవారు. మన సిరధమనులుగా సాంస్కృతిక చైతన్యాన్ని అందిస్తున్నవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంస్కృతిక సైన్యం. మరి వీళ్లను సమాజం ఎలా చూస్తుంది? ఎలా పిలుస్తుంది? ఇంతకాలం అసలైన స్వరాలను, గళాలను గుర్తించలేకపోయాం. వీళ్ల ప్రతిభను సాహితీవేత్తలుగా, సంగీతకారులుగా,తాత్వికులుగా గుర్తించకపోవడం వలసవాద వివక్ష. ఈ వివక్ష ప్రజాస్వామ్య యుగంలో కొనసాగడం శోచనీయం. వైష్ణవాన్ని బతికించింది మిత్తులయ్యవార్లు. వీర శైవాన్ని కూడా బతికించింది వీళ్లే. ప్రతి సంచారజాతి ఒక ఆర్కైవ్. దళిత సౌందర్య శాస్త్రాన్ని రాయడానికి ఈ జాతుల చరిత్ర తెలియాలి. పాల్కురికి సోమన తెరచీరల వాళ్ల కళా ప్రతిభ గురించి ఏనాడో చెప్పాడు. ఇంతటి సాంస్కృతిక ఆధార కళాభూమికలైన వీళ్లు ఇప్పుడు ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నారు? కుల వ్యవస్థలో వీళ్లకు గుర్తింపు లేదు. ప్రభుత్వ పథకాలు వీళ్ల దరిచేరవు. ఇళ్లు ఉండవు. రేషన్ కార్డులుండవు. విప్లవాత్మక ప్రగతి శీల సంస్థలు కూడా వీరి అస్తిత్వం పట్ల పెదవి విప్పకపోవడం విచారకరం. వీళ్లు ఎవరి మానాన వాళ్లు ఎవరి సంచారంలో వాళ్లు బతకవలసిందేనా? వీళ్ల ప్రతిభను గుర్తిస్తూ సంచార జాతుల జీవితాలు, సాహిత్యం ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి. ఇతర భాషల్లోకి కూడా వీరి సాహిత్యాన్ని తీసుకుపోవాలి. అలా చేయనినాడు ఏదో ఒకరోజు మనందరం తలవంచుకోక తప్పదు. ఈ కళల్లోని సాంస్కృతిక, సామాజిక అంశం ఏమిటో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. భారతీయ సమాజ పునర్నిర్మాణంలో వీరిని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని తిరుమలరావు పిలుపునిచ్చారు.
అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాధం, తెలంగాణ ఉద్యమ ప్రధాన భూమిక కవులు, కళాకారులేనని, వారి సంక్షేమానికి ప్రభుత్వం పునరంకితం కావాలని అన్నారు. ఉద్యమ సందర్భంలో తెరవే పోషించిన మేధోపరమైన పాత్రను గుర్తు చేస్తూ వృత్తి కళాకారులకు తెరవే అండగా నిలుస్తుందన్నారు. తెరవే ప్రధాన కార్యదర్శి గాగోజు నాగభూషణం తెలంగాణలోని ప్రాచీన కళాకారుల వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ సంచార కళాకారుల కళలను బతికించుకోవాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సమాజం, ప్రభుత్వంపై ఉందని, అలా చేయని నాడు వీరి నుండి ఎంతో పుచ్చుకున్న మనమంతా దోషులుగా మిగిలిపోతామన్నారు. తెలంగాణ వచ్చిన తరువాతకూడా ప్రభుత్వపరంగా జరిగే అనేక కార్యక్రమాల్లో శిష్ట సాంప్రదాయ కళలైన కూచిపూడి, భరత నాట్యాలు ప్రదర్శిస్తున్నారేకానీ, అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమంలో అత్యధిక ప్రజల ఆదరణ పొందిన వీళ్ల కళలను ఎందుకు ప్రదర్శించడం లేదని ప్రశ్నించారు. అంతరించిపోతున్న ఈ కళారూపాల గురించి చుక్క సత్తయ్యగారు ఒక కళాకారుడిగా ఆవేదన చెందారు. మరో ప్రజాగాయకుడు జయరాజ్ మాట్లాడుతూ ప్రజా కళాకారుల సృజనను దోచుకుని ఆధునికులు పాటలల్లుతున్నారని, దళిత కళాకారులపట్లనే కాకుండా, సమాజంలో మొత్తం దళితులకు ఆదినుండి జరుగుతున్న వివక్షను కళ్లకు కడుతూ ‘నాయినా’ అన్న అద్భుతమైన పాటను పాడి శ్రమజీవన సౌందర్యాన్ని ఆవిష్కరించారు.
సంచార జాతుల ఇంటర్వ్యూలతో కూడిన ‘సిరధమనులు’ పుస్తకాన్ని అతిథులంతా కలిసి ఆవిష్కరించారు. ‘సంచార జాతులు-బతుకు వెతలు’ సదస్సులో ఈ కళను నమ్ముకుని జీవిస్తున్న అనేకమంది కళాకారులు తమ బతుకు వెతలను వెళ్లబోసుకున్నారు.ఈ సదస్సులో కీలకోపన్యాసం చేసిన ప్రొ. బట్టు రమేష్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసారు. వీరిపై అధ్యయనం చేసిన వారంతా వీరి కళలపైనే కాని వీరి జీవితాలను అధ్యయనం చేయలేదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేసి, వీరి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సదస్సులో ఏర్పాటు చేసిన అద్భుత కార్యక్రమం ‘నిరంతర చలనంలో దేశీగాన ప్రదర్శనలు’ సంచార సంగీత వాద్యాలతో ప్రదర్శన. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి డా.గూడూరు మనోజ కాలంలాగే కళలు నిరంతరం కొనసాగుతాయని, వృత్తి కళాకారులది సాంస్కృతిక కులంగా భావించాలని, భారతీయ పద్ధతుల్లో ఈ కళలకు ఆదరణ కల్పిస్తూ ముందుకు తీసుకుపోవాలన్నారు. అద్భుత సంగీత వాద్యాలైన రుంజా, కినె్నర, మిత్తులయ్యవార్ల కడ్డీనాదం మొదలగు వాయిద్యాల ప్రదర్శన, గంగిరెద్దుల ప్రదర్శన, మందెచ్చుల ప్రదర్శనలతో ప్రాంగణం అంతా కళాతోరణమై పరిమళించింది. డా.కోట్ల హన్మంతరావు రచన, దర్శకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయ నాటక శాఖ విద్యార్థులచే ప్రదర్శించిన ‘సంచారం సందించిన ప్రశ్న’ ఆధునిక వీధి నాటకం సంచార బ్రతుకుల వేదనలకు అద్దంపట్టింది. చివరగా ‘విస్మృత సిరధమనులు’ పేరిట కవి సమ్మేళనం, సంచార కళాస్రష్టలకు సన్మానం జరిగాయి. చివరగా సంచార తెగల కళాకారులకు ప్రత్యేకంగా పింఛను ఇవ్వాలని, తెలంగాణ సంచార జాతుల అధ్యయనం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని, సంచార జాతులు, కులాల సమాఖ్య ఏర్పడడానికి వివిధ సంఘాలవారు ముందుకు రావాలని సదస్సు తీర్మానించింది. ఏవౌతుందో రేపు చూడాలి!

- గాజోజు నాగభూషణం, 9885462052