సాహితి

త్రికాలానే్వషణే సాహిత్య లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రికాలానే్వషణలో తీరిన కవి మాత్రమే అనంతానే్వషణశీలిగా సృజనాత్మకమైన కవిత్వాన్ని సృష్టించగలుగుతాడు. గతాన్ని జ్ఞాపకాల్లోను, భవిష్యత్తును దార్శనికంగాను, తనతో నడిచే వర్తమానంతో సరిపోల్చుకుంటూ అక్షరాల్లో దర్శనమిస్తుంటాడు. విషయాన్ని అనుభూతించి తనదైన ఆలోచనలతో శోధించి, తర్కించి, లోతులోకెళ్లి తవ్వుకొని, అవగాహనించుకుని దార్శనిక వ్యూహంతో అక్షరాల్లోకి అనువదించుకునే కవి పది కాలాలపాటు సాహిత్య రంగంలో నిలుస్తాడు. ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని, బుద్ధి చతురతను, విచక్షణాశక్తిని పుటం పెట్టుకోలేని కవి, ‘అప్ టు డేట్’ కాలేని కవి, గత కాలపు సాహితీవేత్తల సాహిత్యాన్ని విశే్లషిస్తూ.. చెప్పిందే చెప్తూ.. రాసిందే రాస్తూ సాహిత్య పేజీల్లో బరువైపోతుంటాడు. సమాజాన్ని బాధించే ముళ్ళను దుర్గంధభూయిష్టమైన కుళ్లును పెకలించే చైతన్యాన్ని సాహిత్యం అందివ్వగలగాలి. సమాజాన్ని సరికొత్త వెలుగులపై నడిపించే సంఘటిత శక్తికి స్ఫూర్తిదాయకంగా సాహిత్యం నిలవగలగాలి. సమాజంలో అధికార మార్పిడి జరుగుతూనే వుంది. ఆర్థిక, సాంఘిక, అసమానతలు వ్యత్యాసాలు, వివక్షలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయ. ఎక్కడికక్కడ అస్తిత్వవాదాలు ప్రబలుతున్నాయ. సంకుచిత స్వభావాలతో, వ్యక్తిపూజలతో, పరనిందలతో అధికార దాహంతో, విశాల దృక్పథాలకు తిలోదకాలిస్తూనే ఉన్నాయ. ముఠాలు, కూటములు తయారై అధికార మార్పిడి కోసం రాజకీయ అవినీతికి హారతులెత్తుతూనే ఉన్నాయ. అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిన అస్తిత్వ ఉద్యమాలకు, నిరంకుశ పాలకుల అభీష్టానికి పెద్ద తేడాలేనితనం జనం గమనిస్తూనే ఉన్నారు. ఈ లోపాలన్నింటిని ఎత్తిచూపకుండా అస్తిత్వవాదాల్ని ప్రోత్సహిస్తూ ఎంత రాసినా ప్రయోజనం శూన్యమే అవుతుంది. సమాజంలో ఉన్న ఇతరుల హక్కుల్ని గుర్తించకుండా అస్తిత్వ ఉద్యమాలు తమ హక్కులను, స్వేచ్ఛను ఉద్ఘోషిస్తూ పోవడం తమ స్వీయ స్పృహకు గొడ్డలిపెట్టుగా మారుతుందనే సత్యం ఎరుగకపోవడం శోచనీయంగా భావించక తప్పదు.
ధనస్వామ్య వ్యవస్థ సమాజాన్ని ఏమార్చుతూ, దోపిడీ వ్యవస్థకు తెర లేపడానికి, సాహిత్యాన్ని ఆశ్రయిస్తుంటూంది. సాహితీవేత్తలు అంధ విశ్వాసాలను, ఆధ్యాత్మిక ముసుగుల్లో దాస్తూ, అంతా ఈశ్వరేచ్ఛగా ప్రచారం చేస్తూ, మనిషిని నిమిత్తమాత్రునిగా రూపకల్పన చేస్తుంటారు. నిర్వీర్యుని చేసే మూఢ విశ్వాసాలను నమ్మకాలను ఎక్కడో జరిగిన కథలుగా వినిపిస్తూంటారు. మానవతావాదం దీన్ని అంగీకరించదు. మానవుడే అన్నింటికి ప్రమాణంగా భావిస్తూ మానవ మేధస్సుతోనే విశ్వరహస్యాలు తెలుసుకోవడం జరిగిందనే సత్యాన్ని తెరపైకి తెస్తారు. మానవ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మనిషి మనిషితనాన్ని మరువకుండా సాటి మనిషి ఉనికిని మరచిపోకుండా ఒకే మానవాత్మగా మనగలగాలి అనేది మానవతావాదం. మనిషిలో సహేతుకతను రగిలించాలి.
ఈనాడు కవులు కంటున్న కలలు మానవ సమాజంలో ఫలించాలంటే సాహిత్య దిశ, దశ మారాలి. చరిత్ర గతిని నిర్ణయిస్తున్న ఆర్థిక శక్తుల అధికార శక్తుల మూలాలు సాహితీవేత్తలు పట్టుకుని బహిర్గతపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఉత్పత్తి విధానాల్ని బట్టి ఆర్థిక పరిస్థితులు మారుతుంటాయ. ఆర్థిక పరిస్థితులను బట్టి భౌతిక సమాజ సంబంధాలు మారుతుంటాయ. దీన్ని బట్టి నూతన వ్యవస్థ పురుడు పోసుకుంటోంది. త్రికాలాన్ని విశే్లషించే శక్తి కవులకు ఉండాలి. అందుకే గతాన్ని గూర్చిన జ్ఞానం, వర్తమానాన్ని గూర్చిన అవగాహన, భవిష్యత్తుని గమనించే దార్శనికత కావాలి. నిష్పక్షపాతంగా, నిర్వికారంగా, సమదృష్టితో, న్యాయబద్ధంగా, శాస్ర్తియ దృక్పథంతో, హేతువాదంతో, భౌతికవాద అవగాహనతో సాహిత్య క్రతువు సాగించాలి. అప్పుడే మానవ పురోభివృద్ధికి, మానవ ప్రగతికి పనికివచ్చే ఆలోచనా విధానాల్ని అందించగల సాహిత్యాన్ని సాహితీవేత్తలు సృష్టించగలుగుతారు.
ఈనాడు ప్రపంచం ఎంత ఆధునికం అనుకుంటున్నామో మనకు తెలియకుండానే అంత అనాధైపోతోంది. మనిషిని కోల్పోతున్న సమాజం మన కళ్ళ ఎదుట కనిపిస్తోంది. అయినా మనం దాన్ని గుర్తించడంలేదు. అదేదో నవ నాగరికత అనుకుంటున్నాం. మంచికి చిరునామా దొరకడంలేదు మాయమైపోతోంది. మనిషిని ఒంటరితనం వెంటాడుతోంది. ఏమీ తెలియని అగమ్యగోచరం మన చుట్టూ విస్తరిస్తుంది. రాజకీయం, మతాలు, కవిత్వానికి బరువైపోతున్నాయ. మొద్దుబారని, మోడువారని ప్రతిభా పాండిత్యాలు కవికి ఉండాలి.
ఆధునిక సమాజంలో మనిషి సుఖశాంతులతో ఆరోగ్యవంతంగా విస్తరించాలంటే తనకు జీవశక్తినిస్తూ తనను జీవింపజేయడానికి ఊతమిచ్చే అంశాలను ఆచరించాలి. ఉపయోగపడని అంశాలను ఏవిధంగా త్రోసిపుచ్చాలి అనే సత్యాన్ని సాహిత్యం విప్పి చెప్పాలి. మనిషి తన అంతరంగంలోకి తాను తొంగి చూసుకునే సాహిత్యం కావాలి. హిమాలయాల ఎత్తును అధిరోహించినా, సముద్రం లోతుల్లోకి ప్రవేశించినా, గ్రహాలపైకి యాత్ర సాగించినా ప్రయోజనం కంటే మనిషి తనలోకి తాను అనే్వషిగా వెళ్ళే నేర్పునిచ్చే సాహిత్యపు ప్రయోజనమే మేలుగా భావించవచ్చును. బ్రతుకన్నాక నిత్య ఘర్షణ తప్పదు. ఆశ అనే అస్త్రంతో, శ్వాస అనే శస్త్రంతో ప్రాణం, నెత్తురు అనే సైన్యంతో, ఆశయమనే సారథ్యంతో నిరంతర యత్నంతో పోరాటం చేయించే కవితాక్షరాలు సృష్టించినప్పుడే ఓటమి లేని గెలుపునకు చైతన్యవంతమైన ఆలోచనలను కవులు అందించగలరు. సరికొత్త ఆలోచనా విధానానికి ఆలోచనా కవాటాలను తెరవాలి. అనేక కోణాలనుండి దృష్టి సారించాలి. మనస్సు పరిధులు దాటి ఆలోచించే శక్తిని సాహిత్యం నుండి పొందాలి. పాత ఆలోచనా విధానాలకు పాతరేయాలి. కొత్త ఆలోచనా విధానాలకు తెరలేపాలి. పనికిరాని పాత ఆలోచనా ధోరణులను కవిత్వం వదిలించుకుని వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలను పెంపొందించుకునే దిశగా కవిత్వం పయనించాలి. ఏది ఏమైనా ఆధునిక సాహిత్యం ఆధునిక ప్రపంచ ముఖ చిత్రాన్ని, దాని యధార్థ రూపాన్ని, సమాజం ముందు నిలబెట్టగలగాలి. నూతన సాంకేతికతను నైపుణ్యంగా చేసుకొని సాహిత్యం వేదికగా ప్రపంచాన్ని పలకరించగలగాలి. ఆధునిక ఆలోచనలకు అంబుల పొదిగా యత్నాలకు శస్త్రంగా సాహిత్యం నిలవాలి. ఆధునిక మానవుని అంతర్గత సంఘర్షణలు పట్టుకోవాలంటే నేటి కాల మాన పరిస్థితులు అవగాహన సాహితీవేత్తలకు ఉండాలి. సాహిత్యం మానసిక విశ్వాసాన్ని పెంచగలగాలి. అద్భుతమైన ఊహా ప్రపంచపు తలుపులు తెరవగలగాలి. మానవ జీవన కోణాన్ని ఒకే దృష్టితో చూడకుండా ఒకే రంగు అద్దకుండా, సత్యానే్వషణతో ఆవిష్కరించే సాహిత్యం రావాలి. మార్క్సిస్ట్ ఆలోచనా విధానాలను హేతుబద్ధమైన శాస్ర్తియమైన తాత్విక మానవతావాదాన్ని చేర్చుకుంటేనే అది పరిపూర్ణమైన ఆలోచనా విధానంగా రూపుదాలుస్తుందనే సత్యాన్ని సాహితీవేత్తలు విస్మరించకూడదు. అపుడే శాంతి సౌఖ్యాలతో విరాజిల్లే అద్భుతమైన భౌతిక ప్రపంచాన్ని సృష్టించి మానవుడి మనుగడ సాగే విధంగా తీర్చిదిద్దగలుగుతాము.
రాజకీయం ముసుగులో అగ్రరాజ్యాలు తమ పరిధులు దాటి సంపన్న, బలహీన దేశాలమీద ప్రకృతి వనరులను, సంపదలను కొల్లగొట్టుకు పోవడానికి వారి ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుని అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నాయ. మతం ముసుగులో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ యువతను కూడగట్టుకుని ఉగ్రవాదులుగా ముద్రపడి అగ్ర దేశాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయ సంపన్న అరబిక్ దేశాలు. ఈ రెండు చర్యల వలన బలైపొయ్యేది సామాన్య జనం. దీని మూలాలను సాహితీవేత్తలు పసిగట్టి దుర్నీతిని బట్టబయలు చేయాల్సిన అవసరం వుంది. ఉగ్రవాద సమస్య అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. మన దేశం దశాబ్దాలుగా ఉగ్రవాద భూతపు వికృత చేష్టల్లో నలిగిపోతూనే వున్నాయ్. ఉగ్రవాదాన్ని గాని అగ్రరాజ్యాల దోపిడీ నైజాన్నిగాని ఉపేక్షిస్తే కూలేది కట్టడాలు కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు. సత్వరం దీన్ని ఐక్యరాజ్యసమితి పట్టించుకొనేట్టు సాహితీవేత్తలు తమ సాహిత్య ప్రక్రియల్లో స్పందించాల్సి వుంది. ఏది ఏమైనా సాహితీవేత్తలు త్రికాలానే్వషకులుగా మారాలి. కదిలే కాలం మీద మొలిచే రుగ్మతలకు సరికొత్త లేపనాలు అద్దే భావజాలాన్ని సాహితీవేత్తలు అందించగలగాలి. అపుడే సరికొత్త సమాజాన్ని చూడగలుగుతాము. జీవిత లక్ష్యాలను అధిగమించగలుగుతాము.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243