సాహితి

కవిత్వానికి అపురూప కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 12న
అలిశెట్టి ఫ్రభాకర్ వర్ధంతి.. జయంతి
.............................
తాను మరణించి..కవితా చరణాలకు జీవం పోసి...
.....................
పదో తరగతి పాసై ఇంటర్‌తో సర్ట్ఫికెట్ల చదువుకు వీడ్కోలు చెప్పినా- అతని కవిత్వమే పదో తరగతి మరియు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాఠాల రూపంలో పుస్తకాల పుటల్లోకి ఎక్కుతుందని ఎవరు అనుకున్నారు? అంతటి సత్తా వున్నవాడు అందరి బాధల గాధల్ని తన మష్తిష్కంలో మధించి ‘ఎర్రపావురాలు’ ఎగరేసినవాడు. ‘మంటల జెండాలు’ రగిల్చినవాడు, ‘రక్తరేఖలు’ గీసినవాడు మరియు ‘సిటీలైఫ్’ను చిత్రించినవాడు. మట్టి వాసన వున్న కవి అలిశెట్టి ప్రభాకర్ కాక మరెవరు?
జగిత్యాల ఒకే ఊరుగా మా ఇద్దరి మధ్య తొలిసారి పరిచయం 1973లో మిత్రుడు నర్సన్ ద్వారా. సినీనటుడు శోభన్‌బాబు నటించిన చిత్రాల పేర్లతో శోభన్‌బాబుగారి అభిమాన సంఘం పత్రికకు వేసిన కవర్‌పేజిని మొదటగా చూసిన గుర్తు. నాకూ బొమ్మలు గీసే అలవాటున్న కారణంగా ప్రభాకర్‌తో దోస్తి మరింత బలపడింది. కాలేజీ సెలవుల్లో వూరు వచ్చినపుడల్లా మరియు నిరుద్యోగ పర్వంలో అలిశెట్టి ‘స్టూడియో పూర్ణిమ’ దోస్తులందరి అడ్డాగా వుండేది. చిత్రకళ, ఛాయా చిత్రకళలో అలిశెట్టి ప్రభాకర్ తనకు తానుగా మెలకువలు నేర్చుకున్నా- ప్రభాకర్లోనున్న కవితాంశకు తొలి రోజులలో దిశా నిర్దేశం చేయడానికి, సానబెట్టి మెరుగులు దిద్దడానికి మూల కారకుడు మిత్రుడు ‘సాహితీ మిత్రదీప్తి’ సారధి నర్సనే. అప్పట్లో అతను ప్రతిరోజూ నిద్రమరచిపోయి రాత్రంతా సమాజంలోని వివిధ అంశాలపై మదనపడి తన ఆలోచనలకు తుది రూపమిచ్చి రాసిన కవితలు మరుసటి రోజు చదవడం మా వంతు. ఆ సందర్భంలో ప్రభాకర్ ముద్రించిన ‘చురకలు’ చిరు పుస్తకానికి నేను ముఖచిత్రం వేయడం నాకు ఒక మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ సమయంలోనే నేనూ, ప్రభాకర్ రాసిన మినీ కవితలు నిజామాబాద్ నుండి వెలువడ్డ ‘కేకలు’ పత్రికలో ప్రక్క ప్రక్కనే ప్రింట్ కావడం అతనితో చేసిన సహవాసానికి ఒక తీపి గుర్తుగా మిగిలింది. మాతో సమకాలీకుడైన అతను లేని లోటు ఈనాడు ముళ్ళుగా గుచ్చుకుంటున్నా- అతను ఎదిగిన ఎత్తు చూసి జగిత్యాల మిత్రులమందరమూ గర్వపడుతున్నాము.
ఎంవియల్‌గారు ఆ రోజుల్లో అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం గొప్పదనాన్ని గుర్తించి అతనిని వెన్నంటి ప్రోత్సహించాడు. ఆయన ప్రసంగించిన ప్రతి సమావేశంలో, చర్చించిన చర్చాగోష్ఠుల్లో తప్పనిసరిగా అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితల విశిష్టతను వివరించి విజ్ఞుల మధ్య ప్రచారానికి తెరతీశాడు. ఆ మహానుభావుని ఆహ్వానం మేరకు 1980 మేలో ప్రభాకర్-్భగ్యలతో నేనూ నూజివీడు వెళ్ళాను. అక్కడ ఎంవిఎల్‌ల్‌గారు పనిచేసిన కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాల తొలి ప్రదర్శన జరిగింది. దానికి విద్యార్థులు మరియు యువకుల నుండి వచ్చిన విశేష స్పందన మరపురానిది. ఆ తరువాత చిత్ర కళాయుక్త కవితా ప్రదర్శనను జగిత్యాల డిగ్రీ కళాశాల, కరీంనగర్ వుమెన్స్ మరియు జూనియర్ కళాశాలల్లో కొనసాగించడం జరిగింది. అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాలు - కవితలు కళాశాల విద్యార్థులను ఒక ఊపు ఊపేశాయి. ప్రతి ఒక్కరిలో ఒక విధమైన చైతన్యాన్ని కలుగజేసి- ఉత్తేజకరమైన ఆలోచనలకు బీజం వేసి ప్రేరేపింపజేసాయి. ప్రభాకర్ తదనంతరం వివిధ కారణాల రీత్యా ఫొటో స్టూడియోను కరీంనగర్‌కు (స్టూడియో శిల్పి), ఆ తరువాత హైదరాబాద్‌కు (స్టూడియో చిత్రలేఖ) మార్చడం, మా మధ్య కలయికల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా, కలసిన ప్రతీసారి అతని ఆరోగ్యమెంతటి క్షీణదశలోనున్నప్పటికిని, తన చర్చ, ముచ్చట్లు మాత్రమే కవిత్వంపైనే. తన ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోని ఆయన జగమొండి తత్త్వం- మిత్రుల మాట వినని నైజం- మాకెప్పుడూ కోపం తెప్పించినా- అతనిని మాత్రం మేము గెలువలేకపోయాం. తనదైన రీతిలో మమ్మల్ని గెలిచి అతడు పైకెళ్లిపోయాడు. కవిత్వపరంగా తెలుగు గడ్డపై చెరగని తన ముద్రను వదలి వెళ్లాడు. ‘‘గుడిసెలే / మేడల్ని / కడతాయి / అయినా / మేడలే / గుడిసెల్ని / కొడతాయి’’.. అతి సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టి తయారుచేసిన అణుబాంబుకున్న తీవ్రమైన విస్ఫోటన శక్తి ప్రభాకర్ కవిత్వానికుంది. ‘‘తను శవమై.. / ఒకరికి వశమై../ తనువు పుండై../ ఒకడికి పండై../ ఎప్పుడూ ఎడారై../ ఎందరికి ఒయాసిస్సై..’’ అంటూ ‘వేశ్య’ గురించి అతను రాసినంత క్లుప్తంగా, తీక్షణంగా ప్రపంచంలోనున్న అన్ని భాషల్లో ఏ కవి కూడా రాసి వుండకపోవచ్చు. ‘‘ఇంద్రధనస్సుల్ని తుంచుకొని తినడం / సిగరెట్ పీకల్లాంటి నన్ను / సిగలో పువ్వులా తురుముకొని’’.. అని రాయడం ఆయన అంతరంగ అలజడిలోంచి పెల్లుబికి వచ్చిన అనురాగ లాలిత్యానికి (తన భార్య భాగ్య గురించి) మచ్చుతునక. ‘‘ఒక చెయ్యి తెగి పడితేనేం/ ప్రతిఘటనా కెరటంగా / మరో చెయ్యి ఉప్పొంగే తీరుతుంది’’.. చావు సమీపించిందని తెలిసినా తన కవితా ఖడ్గంతో తల దించక జీవన పోరాటం చేసిన యోధుడు ప్రభాకర్. ‘‘మరణం నా చివరి చరణం కాదు’’లో ప్రభాకర్ మరణం అంచున నిలబడి కూడా ‘‘నిర్విరామంగా నిత్య నూతనంగా/ కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను/ కలల ఉపరితలమీద కదలాడే కాంతి పుంజం నేను...’’ అని అంటాడు- నిజంగా చావును ధిక్కరించి ఘీంకరించిన కవి అలిశెట్టి. సెంట్రిఫ్యూజ్ చేసి వడగట్టిన ద్రావణ ప్రమాణంలా అతని కవిత జాలువారుతుంది. దాంట్లో తాలు తప్ప, పిప్పి, చెత్తా- చెదారాలేవీ ఉండవు. అందరి బాధల్లోకి అతను పరకాయ ప్రవేశం చేసి- ప్రతీ సంఘటననీ- సుత్తె దెబ్బల్తో నిప్పుల కొలిమి వేడి సెగల్లో కత్తికి పదును పెట్టినట్లు-అక్షరాల పదాల్ని చెక్కి సానబెట్టి కాని తన కవితకు రూపమివ్వడు ప్రభాకర్.
‘‘నా కవిత్వ బాంకులో దాచే / అక్షర లక్షలన్నీ/ అక్షరాలా మీకే..’’ అంటూ అలిశెట్టి ప్రభాకర్ వెళ్లిపోయినా- తెలుగువారికి మిగిల్చిన తరగని ఆస్తి అతని కవితాక్షరాలు. అక్షరశిల్పి అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ శైలి నాలుగు తెలుగు భాషలో అజరామరం- చెరిగిపోని శిలాశాసనం. మన మధ్య అతనెప్పుడూ నిత్య యవ్వనుడుగానే జీవించి వుంటాడు.

- నాగభూషణం దాసరి, 08096511200