సాహితి

సాహిత్య విమర్శ సన్నగిల్లుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు కవులకేం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. కవితా సంపుటాలు రంగురంగు అట్టలతో పిట్టల్లా సమాజం మీద వాలుతునే వున్నాయి. కథకులు కథారంగాన్ని దునే్నస్తూనే ఉన్నారు. పుట్లుపుట్లుగా కథా సంపుటాలు పురుడు పోసుకుంటూనే ఉన్నాయి. సాహిత్యంలో వాదాలు రహదారి విడిచి చీలుపుదార్లుగా కుల, మత వర్గాల గూటికి వ్యక్తిగత స్వార్ధాన్ని మూటకట్టుకుని చేరే ప్రయత్నం చేస్తునే ఉన్నాయి. సాహిత్య విమర్శ మాత్రం కొంతకాలం రహదారి వెంట నడిచి చీలుపుదార్ల కూడలి చిక్కుల్లో పడి అర్ధం కాక వ్యర్థమైన అడుగులు వేయలేక నాలుగు రోడ్ల కూడల్లో తలపట్టుకు కూర్చోనుంది. అందుచేత సాహిత్య సభల్లో సాహితీవేత్తలు నేడు విమర్శ రావాల్సినంతగా రావడంలేదనే సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. సాహిత్య విమర్శకుడ్ని అయోమయం బోనెక్కించి ఆడిపోసుకోవడం పరిపాటైపోయింది. సాహిత్య విమర్శ సన్నగిల్లుతుందనే అపప్రథ ఒకటి వినిపిస్తుంది.
నేడు సాహిత్య విమర్శ వస్తుందా? వస్తే దాని మార్గమేమిటి? మతలబ్ ఏమిటి? సాహిత్యంలో వెలుగు చూస్తున్న వాదాలు, వైయక్తికంగా వెలువడుతున్న ధోరణులు సవాలక్షలున్నాయి. వాటన్నింటినీ కలిపి చూస్తుందా? విడివిడిగా దృష్టి సారిస్తుందా? నేడు ఎందుకు సాహిత్య విమర్శ వెనకపడిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం విమర్శకులతోపాటు సాహితీవేత్తలకుంది అనేది నా భావన. ప్రాచీన కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాల మీద గొప్ప విమర్శలే వెలువడ్డాయి. వాటిని ప్రస్తావించాల్సిన అవసరం ఈ వ్యాసంలో వుందని నేననుకోవడంలేదు. 1910నుండి ఆధునిక సాహిత్యపు ప్రారంభకాలంగా పరిగణించవచ్చును. ఆధునిక సాహిత్యంలో సమాజం, సామాన్య మానవుడు, దుర్భిక్షం, దోపిడీ, పెత్తనందారితనం, ప్రజాస్వామ్యం, కార్మిక నియంతృత్వం, దళిత ఆవేదన, మైనారిటీ, స్ర్తివాదము సంవేదన, వృత్తుల దైన్యం, కర్షక దైన్యం కవితకు కథకు వస్తువులైనాయి. వైవిధ్య భరితరమైన వస్తు శిల్పాలు ఆధునిక సాహిత్యంలో పురుడుపోసుకున్నాయి. అందుకే కాల్పినిక వాదం, అస్తిత్వవాదం, ప్రతీకవాదం, భావ చిత్రవాదం, డాడాయిజం, అధివాస్తవిక వాదం, హేతువాదం, చైతన్య స్రవంతి, అనుభూతి వాదం, మానవతావాదం, మార్క్సిజమ్, స్ర్తివాదం, దళితవాదం, మైనారిటీ వాదం అంటూ ఎన్నో వాదాలు పుట్టుకొచ్చాయి. అట్లే సాహిత్య ఉద్యమాలు జాతీయోద్యమ కవిత్వమని, భావ కవిత్వోద్యమని, అభ్యుదయ కవిత్వోద్యమని, దిగంబర కవిత్వోద్యమని, విప్లవ కవిత్వోద్యమని, హరిజనోద్ధరణోద్యమని, స్ర్తి, దళిత మైనారిటీ కవిత్వోద్యమాలు తెరమీదికొచ్చాయి. వాదాలు, ఉద్యమాలు ఎంతో సాహిత్యాన్ని సృష్టించాయి. వెలువరించాయి. వెలువడిన వాదాల మీద ఉద్యమాల మీద, సాహిత్య విమర్శ రావాల్సినంతగా రాలేదు అనడంలో కొంత సత్యముంది. మరి కొంత సంకుచిత దృష్టితో కూడిన అసంతృప్తి వుంది.
ప్రముఖ సాహిత్య విమర్శకులు డా.రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మన తెలుగు సాహిత్య విమర్శ ఎదగకపోవడానికి అపవాదుపాలు కావడానికి అసంతృప్తికి లోను కావడానికి కొన్ని కారణాలను చూపించారు.
1. ప్రాచీన సాహిత్యాన్ని సంప్రదాయ దృష్టితో పరిశీలించి విమర్శనా మూసలో పరిచయానికే పరిమితమైపోవడం
2.తెలుగు విమర్శ ప్రశంసకు అంకితమైపోవడం
3. ఆధునిక సాహిత్యాన్ని విమర్శించడానికి పాశ్చాత్య అలంకార గ్రంథాలను చదవాల్సి వుంటుంది; అట్టి పని మన విమర్శకులు చేయకుండా ఆధునిక సాహిత్యాన్ని సంప్రదాయ విమర్శ ప్రమాణాలతో కొలవబోవడం
4. విశ్వవిద్యాలయాలు ఉత్పత్తి చేసే సిద్ధాంత గ్రంథాల్లో ఏ సిద్ధాంతమూ ఉండకపోవడం, పేలవమైన విమర్శ బయటకురావడం
5. ఆధునిక సాహిత్యం విమర్శలో కుహనా ఆధునికులు చొరబడడం
6. మార్క్సిజం దృష్టితో వచ్చే విమర్శ ఎక్కువ భాగం వస్తు చర్చకే పరిమితమై శిల్పాన్ని సమఉజ్జీగా పట్టించుకోకపోవడం అనే అంశాలు ముఖ్యంగా పేర్కొనవచ్చు. దళిత, స్ర్తి, మైనారిటీ వాదులు తమ సమస్యల పరిష్కారానికి మార్క్సిజం సరిపోదని వాదించడం ప్రారంభించారు. వల్లంపాటి మార్క్సిస్టు విమర్శ ద్వారా తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదలకు వేగం చేకూర్చడానికి కృషి చేసారని అభిప్రాయపడ్డారు రాచపాళెం వారు.
సాహిత్యం లేకపోతే జాతికి చరిత్ర లేదు. జనానికి సత్యసౌందర్యం దర్శనం లేదు. అట్లే వెలువడుతున్న సాహిత్యానికి తగిన విమర్శ లేకపోతే రచయితలకు పాఠకుల మధ్య సామాజిక బాధ్యతలను ఎరుకపరిచే సంధాన క్రియ లోపిస్తుంది. సాహిత్య విమర్శ రచయితల్ని సామాజిక నేపథ్యంలో అర్ధం చేసుకోవాలి. అంతేకానీ విమర్శకుని వైయక్తిక ఏకోన్ముఖ అభిప్రాయాల మూసలో కాదు. ‘రచయితలకు నిబద్ధత, ప్రాపంచిక దృక్పథం, ప్రాపంచిక జ్ఞానం వున్నట్లే విమర్శకులకు అవి ఉండాలి. అదనంగా విమర్శకులకు సామాజిక శాస్త్రాల పరిచయం ఉండాలనే ప్రతిపాదనలు ‘వల్లపాటి’వారు ఎప్పుడో చేసివున్నారు. సాహిత్య విమర్శ ఎంత ఎత్తుకుపోతే సాహిత్యం అంత విశాలమవుతుంది. ఎంత లోతుకు పోతే సాహిత్యం అంత విశదమవుతుంటుంది. సాహిత్య విమర్శ పెరిగినపుడే సాహిత్యన్ని గురించి ఎత్తుగా, లోతుగా ఆలోచించేవారు పెరుగుతున్నారనే భావన సాహిత్య సృజనకారుల్లో రావాలి. సాహిత్యం లాగానే సాహిత్య విమర్శ కూడా నిరంతరం విస్తృతపడుతుండాలి. కొత్త పరికరాలతో పురోగమిస్తుండాలి. ఎరుకల్ని సమకూర్చుకుంటూ విమర్శ దారి తప్పుతున్న సాహిత్యం మీద పదునైన దాడికి సిద్ధపడేదిగా ఉండాలి. రచయిత నమ్మిన, అనుసరిస్తున్న, అనుభూతిస్తున్న సాహిత్య సిద్ధాంతాల్ని సాహిత్య క్రియారూపంలోకి తీసుకు రాగలుగుతున్నాడా లేక స్వార్దంతో వక్రీకరిస్తున్నాడా అనే ఎరుకకు గీటురాయిగా విమర్శకుడు ఉంటాడు. విమర్శకునికి దృష్టి నైర్మల్యత, దృక్పథ స్పష్టతతో పాటు ఆత్మీయత, సహృదయత, నిష్పక్షపాతం వుండాలి విమర్శకునికి వివిధ సాహిత్య వాదాలతో ముడివడి వెలువడుతున్న సాహిత్యాన్ని పరిశీలించి పరిగణనలోకి తీసుకుని లోతుల్లోకెళ్లి విమర్శించే అర్హత, నిపుణత తనకుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంప్రదాయ విమర్శకుడు నేటి ఆధునిక వాదాల్లో వేలుపెడితే ప్రతిభావనా దోషంగానే కనిపిస్తుంటుంది. ఆ విమర్శకుడు ఊహించిన వేద వాజ్ఞ్మయ సంస్కృతి, సంప్రదాయాలు, సదాచారాలు ఈనాడు లేవనుకుంటే అది ఆ విమర్శకుని గుడ్డితనమే అవుతుంది. అట్లే మార్క్సిస్ట్ భావజాలమున్న విమర్శకుడు తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని విమర్శించి నిగ్గు తేల్చలేడు. ప్రతిదీ లోపభూయిష్టంగానే కనిపిస్తుంటుంది. వక్రీకరణలు ఎన్నో వెలువడుతాయి. కాలంతోపాటు సాహిత్యంలో మార్పు వచ్చినట్లే విమర్శనా రంగంలోను మార్పులు రావాలి.
నేడు సాహిత్యకారులు కుల, మత, వర్గ, జెండర్ రూపాలుగా విడివడి అస్తిత్వ వాదాల ముసుగుల్లో సమసిపోతున్న కుల, మతాల్ని, వర్గాల్నీ, లింగ బేధాల్ని తోడి కొంత రంగులు పొసి సరికొత్త రూపాల్లో వెలుగులోకి తెస్తున్నారు. సైద్దాంతిక భావాలతో రాసే ఆధిపత్య కుల, మత వర్గాలు, పారదర్శకంగా లేకుండా స్వార్ధపూరిత భావాలతో స్ర్తి, దళిత, మైనారిటీలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. అందుకే మా సాహిత్యాన్ని మేం రాసుకుంటాం ఆధిపత్య కులాల సానుభూతి సాహిత్యం మాకక్కరలేదు అంటూ బహిరంగంగానే ఖండిస్తున్నారు. బల్ల గుద్ది మరీ చెపుతున్నారు. సాహిత్యం ఈ విధంగా వాదాలుగా విడివడి వెలువడుతున్నప్పుడు సాహిత్య విమర్శ కూడా వాదాలను అనుసరించి ఏ వాదానికి కట్టుబడిన విమర్శకులు ఆ వాదాన్ని తలకెత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో శాస్ర్తియమైన ఒక సిద్ధాంతాన్ని, ఒక వాదాన్ని, మనసులో పెట్టుకుని ఇతర వాదాల సాహిత్యాన్ని విమర్శించినట్టయితే విమర్శకులకంటే ముందే రచయితలు/కవులు ఒప్పుకునే దశలోలేరు. ఈ విధమైన మీమాంసతోనే తెలుగు విమర్శ నలిగిపోతుంది. అన్ని వాదాలను సమదృష్టితో చూసే విమర్శ ఎటూ ఉండదు. కనుక సాహిత్య విమర్శ నేడు తగిన విధంగా తగినంతగా రాలేదనే ప్రస్తావనలు జరుగుతున్నాయి.
పొరపాటున ఒక కులంవాడి లేదా ఒక మతం వాడి సాహిత్యాన్ని మరో కులం వాడు మరో మతం వాడు సమీక్ష చేసినా విశే్లషించినా కవులు, రచయితలు పెదవి విరిచే దశకు వచ్చారు. మా బాధలు, మా దుఃఖం, మీకేం తెలుసుననే వాదాలు వినిపిస్తున్నాయి. నేడు సాహిత్య విమర్శ కత్తిమీద సాము లాగైంది. విపరీత ధోరణుల మధ్య వాదాల మధ్య సాహిత్య విమర్శ బిక్కమొహం వేసుకుని కూర్చుందేమో అనిపిస్తుంది. పదునెక్కిన, లోతుగా తీరిన, సైద్ధాంతికపరమైన విమర్శ వస్తునే వుంది. కువిమర్శముందు, కుటిల సమీకరణల ముందు, కుల మతాల ప్రోత్సాహకర సాహిత్యంముందు నేటి సాహిత్య విమర్శ పసలేని దానిలా కనిపిస్తూంది. ఇవాళ సాహిత్య విమర్శ రాసే విమర్శకులు వాదాల మార్గాల్లోకి దిగి అధ్యయనం చేసి గతం సాహిత్య విమర్శ చరిత్ర లోతులెరిగి ఉండడం కూడా అవసరమే అనిపిస్తుంది. నిజమైన స్వచ్ఛమైన విమర్శను భరించే ఆత్మవిశ్వాసం కవులు/రచయితలు కలిగి ఉండాలి. అప్పుడే సాహిత్య విమర్శ ఎదుగుతుంది, పదునెక్కుతుంది అనుకోవడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శను ఆత్మీయంగా, పరిపూర్ణ విశ్వాసంతో సరైన దృక్పథంతో ప్రోత్సహించినపుడే సాహిత్యపు విలువలు పదునెక్కుతాయి. వెలుగుదారుల వెంట పరుగులిడతాయి. సాహిత్య విమర్శ సన్నగిల్లుతుందనే అపవాదు తొలగుతుంది.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, 9948774243