సాహితి

అట్లా.. ఆ నది మీద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లా
ఆ నది నురగ కాళ్లతో
పరవళ్లు తొక్కుతుందన్న వానాకాలం తీపి వార్త
ఎన్ని మెగావాట్ల సంజీవనిని ప్రసాదించిందో
మా నారుమడి బీడు గుండెకు
బోరుబావి ఎండిన నోటికి-

అట్లా
ఆ జల మహాభాండం చినుకుల చిత్తరువుగా
పూసి పారుతుందన్న తడి కబురు
ఎంత పారమెరుగని సంబూరానికి
సంకెళ్లు తెంచిందో
మా జ్ఞాపకాల బాల్యం గట్ల
పచ్చిక బయల మంచు ముచ్చట్ల మీద

అట్లా
ఆ నీటి ప్రబంధం అలల కేరింతలతో
పంపిన వెచ్చని పడవల ఆహ్వానం
ఎన్ని క్యూసెక్కుల ఆవల
అరకలను సాగగట్టిందో
మా ఎడారి బతుకు కథల
పుటల కమతాల నిండా-

అట్లా
ఆ గంగమ్మ తల్లి కప్పిన వర్షపు నెనరుకొంగు
ఎంత సంవృద్ధి హరిత కవచాన్ని
సుస్థిరపరచిందో
మా కరవు రాజ్యపు ప్రహరి దిగులు
కోర దిశల చుట్టూ-
అట్లా
ఆ పయోధర యశోదగా మారి
పల్లెలను రేపల్లెను చేసి
ఎన్ని క్షీరసముద్రాలను తోరణం కట్టిందో
మా పాడి గడపల నీరస సముఖాల
నిరుదక ముఖద్వారాలకు-

ప్రవాహపు ప్రతి సున్నితపు పొరమీద
ప్రభాత చైతన్యం లిఖించే
పిల్ల చేపల దూకుడు-

చెరువులు ఇష్టంగా వేసుకున్నవి
వాగుల కొంగుముడి
వరుణుడి రసోత్తరీయంలా మెరుస్తున్నది
చిరకాలపు నీలాకాశం
సందర్శకుల చూపుల సిగల్లో
పరువాల ఏటవాలు పూల పరీమళాలు

కప్ప ఎక్కడికీ పోలేదు
తప్త శివలింగం కిందనే ఉంది
బండలను రొద ఆపమంటూ తత్త్వమెత్తుకున్నాడు
ఈ జమానా రామదాసు

అట్లా
ఆ నది మీద శుభోదయమైనందుకు
సూర్యుడికి దాపుగా
ఎన్ని మెగాటన్నుల ఓజోన్లు వంతెన కట్టాయో
కృతజ్ఞతకి పెద్ద పీట వేస్తూ-

అట్లా
ఆ నది మీద వెనె్నలతో పాటు
నేనూ నడచినందుకు
ఎంత నిగూఢ సంగీతం మీగడ కట్టిందో
మా ఊరి భజన బృందాలతో
గొంతు కలిపేందుకు

సందేహం దేనికి?
రైతులాగే గంధంగా ఈ మట్టినే
పిడికెడు ఒంటికి రాసుకో
కవీ! అధ్యారుూ!!
నాగళ్ల వలె నీ పద్యాలూ దున్నగలవు
మెదడు పొలాలను అంటున్నది
హంసలాంటి కొంగ ఒకటి-

నది పక్కన ఊరన్నా ఉండాలి
ఊరు పక్కన నదైనా ఉండాలి
నది పక్క ఊరు నుంచి వచ్చిన నదిలాంటి
మనిషైనా నీ పక్కన ఉండాలి
లేకుంటే నువ్వెంత చదువరివైనా
జీవితం నదిని దాటడం
కష్టమే మరి అంటున్నాడు
ఆరు పదులు దాటిన
ఆరోగ్యవంతుడొకాయన.

- డా బెల్లి యాదయ్య