సాహితి

భారతీయ కవితా శిల్పశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకాడమీలు, భాషా ప్రాధికారిక సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు చాలా సందర్భాల్లో ఆయా భాషా సాహిత్య సంస్కృతుల వికాసానికి, ఇరుగు పొరుగు భాషల్లో ఆయా భాషల స్థానాన్ని సుస్థిరపరచేందుకు, వికాసానికి తోడ్పడతాయి. అయితే కారణాలేవయినా అకాడమీలు రద్దుకావడంతో దాదాపు మూడు దశాబ్దాల నుండి తెలుగువాళ్ళం ‘అకాడమీ’లు చేసే కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యాం. కానీ మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అకాడమీలు భాషా, సాహిత్యాల విషయంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అటువంటిదే ఈమధ్య కేరళలో జరిగిన ‘కవిత్వ అనువాద శిల్పశాల’. జనవరి 26-28, 2017 గురు, శుక్ర, శనివారాల్లో కేరళలోని పాలక్కాడ్ జిల్లా పట్టంబి కళాశాలలో కేరళ సాహిత్య అకాడమీ- డైరెక్టరేట్ ఆఫ్ పొయట్రీ కార్నివాల్ సంయుక్తంగా ‘కవితాయుధ’ పేర మూడు రోజులు ‘పొయెట్రీ కార్నివాల్’ను నిర్వహించింది. కేరళలోని దాదాపు అన్ని వయోవర్గాల కవులు, సాహితీవేత్తలు ఇందులో పాల్గొన్నారు, అదీ కిక్కిరిసిన కవిత్వ ప్రేమికులమధ్య. ఒక ప్రధాన వేదికతోపాటు మరో మూడు ఉపవేదికలపై రోజంతా కవిత్వ పఠనం, చర్చలు, కవుల ముఖాముఖి వంటి కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా కార్నివాల్ నిర్వాహకులు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. దాని పేరు ‘దక్షిణ భారతీయ భాషల కవిత్వ అనువాద శిల్పశాల’. తమిళం, తెలుగు, కన్నడ భాషల కవిత్వం మలయాళంలోకి, మలయాళ కవిత్వం ఇతర భాషల్లోకి అనువదించడం ఈ శిల్పశాల ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ మలయాళ, ఆంగ్ల కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి కె.సచ్చిదానందన్ శిల్పశాలకు సంచాలకులుగా రెండు రోజులు కవులతో గడిపారు. కె.సచ్చిదానందన్ మాట్లాడుతూ- ఆంగ్లంలో కంటే కూడా భారతీయ భాషల్లో అనువాదాలు జరిగినప్పుడు భాషల ‘ఆదాన్-ప్రదాన్’ సాధ్యమవుతుందని, ఆ దిశలో ఇది గొప్ప ప్రయత్నమని అన్నారు. ఈ కార్యశాల ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. సాహిత్య అకాడమీ ఇండియన్ లిటరేచర్ సంపాదకులు ఎ.జె.్థమస్, కేరళ సాహిత్య అకాడమీ కార్యదర్శి మోహనన్, కార్నివాల్ సంచాలకులు రామచంద్రన్ శిల్పశాలలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుండి డా.పత్తిపాక మోహన్ (తెలంగాణ), మందరపు హైమవతి, మంత్రి కృష్ణమోహన్ (ఆంధ్రప్రదేశ్)లు పాల్గొన్నారు. తమిళం నుండి సీనియర్ కవి సుకుమారన్, సుకీర్తరాణీ, ఇషాయ్‌లు, కన్నడం నుంచి ప్రముఖ కవి అబ్దుల్ రషీద్, యువ రచయిత ఎం.వి.మంజనాథ్, వి.ఆర్.కార్పెంటర్‌లు హాజరయ్యారు. మలయాళ సీనియర్ కవులు ఎం.జి.ఉన్నికృష్ణన్, పి.జి. గోపీకృష్ణన్‌తోపాటు వి.ఎం.గిరిజ, ఎన్.పి.సంధ్య, ఉమా రాజీవ్, కె.ఎం.ప్రమోద్, ఎం.ఆర్.రేణుకుమార్, కె.వి.సింధు, మనోజ్ కురూర్, అన్వర్ అలీలు పాల్గొన్నారు. వీరితోపాటు వివిధ భాషల్లో అనువాదం జరిగేటప్పుడు అనువాదాలు చేసేటప్పుడు వచ్చిన సందేశాల నివృత్తికోసం రెండు మూడు భాషలతో పరిచయం ఉన్న తరలి శేఖర్ (కన్నడ, మలయాళం), ప్రొ.శివకుమార్, కుప్పం(తెలుగు, కన్నడ, మలయాళం), సుకుమారన్ (తమిళ, మలయాళం) పాల్గొన్నారు.
మొదటిరోజు మలయాళ కవులు తెలుగు, తమిళ, కన్నడ కవుల మూడు నాలుగు కవితలను మలయాళంలోకి అనువాదం చేశారు. శిల్పశాలకు ముందే నిర్వాహకులు ఆయా భాషల కవితల ఆంగ్ల అనువాదాన్ని పాల్గొనే కవులకు అందజేశారు. అనువాదకులు, మూల భాషలోని కవులు ఎదురెదురుగా కూర్చు ని అనువాదం చేయాల్సిన కవితను అనువాదకునికి దాని మూల భాషలో వినిపించి శబ్దసౌందర్యాన్ని, భాషలోని తీయదనాన్ని వివరిస్తూ చెబుతుంటే ఆ దృశ్యం చాలా అద్భుతంగా కనిపించింది. తెలుగు తీయదనం, కన్నడ కర్పూరం, తమిళ ప్రాచీనత్వం మలయాళ భాషలోకి వెళ్లడం నిజంగా ఒక అద్భుతమైన దృశ్యమే. మొదటిరోజు పత్తిపాక మోహన్ నాలుగు తెలుగు కవితలను ప్రముఖ మలయాళ యువకవి ఎం.ఆర్.రేణుకుమార్ తెలుగులోకి అనువాదం చేశాడు. మందరపు హైమవతి మూడు కవితలను సీనియర్ కవి ఎం.జి.ఉన్నికృష్ణన్, యువ కవి ప్రమోద్‌లు, మంత్రి కృష్ణమోహన్ కవితలను కె.వి.సింధు, ఉమా రాజీవ్‌లు మలయాళంలోకి అనువదించారు.
దాదాపు రాత్రి వరకు సాగిన శిల్పశాలలో ఇదేవిధంగా మిగతా మలయాళ కవులు తమిళ, కన్నడ కవుల మూడు, నాలుగు కవితలను మలయాళంలోకి అనువదించారు. అదే రాత్రి జరిగిన అనువాద కవిత పఠనంలో మూల కవితను ఆయా భాషల కవులు చదవగా, వాటి మలయాళ అనువాదాలను అనువాదకులు చదివి వినిపించారు. అనువాదాల పట్ల ఇతర కవుల సలహాలు, సూచనలతో ఒక చక్కటి అనువాద పరంపరకు అంకురార్పణ జరిగింది.
రెండవ రోజు మూడు భాషల కవులు తమకు కేటాయించిన మలయాళ కవుల కవితలను వారి వారి భాషల్లోకి అనువదించే కార్యక్రమం జరిగింది. సచ్చిదానందన్ మలయాళ భాష అనువాదం విషయంలో అనువాదకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆంగ్ల మాధ్యమంగా అనువాదం జరుగుతున్నపుడు లోపించే భాషా సౌందర్యం వంటివాటిని శిల్పశాలలో అనువాదం చేస్తు న్న కవితల ఆంగ్ల అనువాదం, మలయాళ మూల కవితలను చూపిస్తూ అనువాదకులకు వాటిపట్ల అవగాహన కల్పించారు.
మలయాళ కవులు తొలుత తమ జత కవులకు తమ మలయాళ కవిత్వాన్ని వినిపించారు. అటు తరువాత అనువాదకులు ఆంగ్లానువాదం సహాయంతో ఆయా కవుల ద్వారా వారి వారి కవిత్వాన్ని వింటూ అనువాదాల నివృత్తి చేసుకోవడం, కొన్నిసార్లు దుబాసీల సహాయం తీసుకోవడంతో శిల్పశాల నడిచింది. తెలుగులోకి మలయాళ కవిత్వాన్ని అనువాదం చేయడంలో భాగంగా పత్తిపాక మోహన్ రేణకుమార్ కవితను ‘నల్లని వానలు’, గోపికృష్ణన్ కవిత ‘నా జీవతంలోని తొలి మహిళ చివరి మహిళతో చెప్పింది’ మొదలగు కవితలను అనువాదం చేశారు. అదేవిధంగా యువ కవయిత్రి సంధ్య రాసిన కవితలు ‘చనుబాలు’, ‘నేను’, ‘పది మంది’, ‘ఎండాకాలం వర్షం’, ‘కళ్ళు’, ‘ఒక కదలిక’, ‘నగ్నం’ మొదలైన పది కవితలను అనువాదం చేశారు. మంత్రి కృష్ణమోహన్, సింధూ కవితలు ‘ఒక ఒకే ఒక’, ‘రక్షకుడు’, గిరిజ కవిత ‘చేప’ మరియు ఉమా రాజీవ్ కవిత ‘పటం’ను తెలుగులోకి చేశారు. మరో కవయిత్రి మందరపు హైమవతి ఎం.జి.ఉన్నికృష్ణన్ కవితలు ‘పిల్లల పార్కు’, ‘అనంతం’, ‘కాగితం పడవ’లు, ప్రమోద్ కవిత ‘కర్కాటకం’లను తెలుగులోకి అనువాదం చేశారు.
ఈ కవితలనే తమిళ కవులు తమిళంలోకి, కన్నడ కవులు కన్నడంలోకి అనువాదం చేశారు. దాదాపుగా ముప్ఫై వరకు మలయాళ కవితలు ఇతర దక్షిణ భారతీయ భాషల్లోకి అనువాదం చేయబడ్డాయి. అదే రోజు రాత్రి జరిగిన కవితా పఠనంలో మలయాళ కవుల కవితలను వెంట వెంటనే తెలుగు, తమిళ, కన్నడ కవితల అనువాదాన్ని ఆయా భాషల కవులు చదువుతుంటే ఒక భాషలోని కవిత మరో దక్షిణ భారత భాషలోకి వెళ్లినపుడు దక్షిణ భారత భాషల్లోగల ఏకరూపత వంటివి అర్థం చేసుకునే అవకాశం శిల్పశాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కలిగింది. ముఖ్యంగా మలయాళ, కన్నడ యువ కవులు, రచయితలు వస్తువు, శిల్పం విషయంలో ఒక విధంగా కొద్దిగా ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంధ్య వంటి యువకవయిత్రుల కవిత్వం ఆలోచనలు రేకెత్తించే విధంగా వుంది.
దాదాపు ఆ శిల్పశాలలో పాల్గొన్న ప్రతి కవి, కవయిత్రి కవితలు ఆంగ్లంలోకి వెళ్లాయి. గతంలోనే ఆంగ్ల మాధ్యమంగా మలయాళ దేశం దాటి పరిచయం అయ్యారు. ఈ శిల్పశాల ద్వారా ఇతర ‘ఇరుగు పొరుకు’లకు దగ్గర కానున్నారు. ఇది తెలుగులో కూడా జరగాలి. అప్పుడే తెలుగు సాహిత్యం కూడా మన ‘ఇరుగుపొరుగు’వారికి చేరుతుంది. నిజానికి ఒక భాషలోని సాహిత్యం మరో భాషలోకి వెళ్ళడం సాహిత్యంతో పరిచయం అంతగాలేని వారికి సాధారణమైన విషయంలాగే కనిపించొచ్చు కానీ ఒక భాషలోని సాహిత్యం, సంస్కృతి మరో భాషలోకి వెళ్లడం వల్ల ఆ రెండు భాషా, సంస్కృతులపట్ల, ఒకరి గురించి మరొకరికి అవగాహన చెందడం మాత్రమే కాదు, అన్ని భారతీయ భాషల్లో ఈ ప్రక్రియ సాగినపుడు సాంస్కృతిక ఏకత సాధ్యమవుతుంది. చిన్న పాయగా పాలక్కాడ్‌లో మొదలైన ఈ ప్రక్రియ ముందు ముందు తెలుగు తమిళం, తమిళం తెలుగు, కన్నడం తెలుగు, తెలుగు కన్నడం, తులు, మలయాళం ఇలా అన్ని దాక్షిణాత్య భాషల్లోనూ, ఉర్దూ, హిందీల్లోనూ జరిగిననాడు తెలుగు రాష్ట్రాల్లో, సాహిత్యంలో ఏం జరుగుతుందో దేశమంతా తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం వ్యక్తులవల్ల మాత్రమే ఇది సాధ్యపడదు. ఇందుకు అకాడమీలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు పూనుకోవాలి. అప్పుడే కేరళలో వెలిగిన ఈ వెలుగు దేశమంతా ‘అఖండ దీపం’గా వెలుగులను ప్రసరిస్తుంది. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అకాడమీలను పునరుద్ధరించి, భాషా ప్రాధికార సంస్థలు, అనువాద పరిషత్తులను ఏర్పాటు చేస్తాయని ఆశిద్దాం.

- డా పత్తిపాక మోహన్, 9966229548