సాహితి

అవధాన సార్వభౌముడు సి.వి.సుబ్బన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలలో అవధానం ఒకటి. ఆధునిక కాలంలో ఒకటి రెండు భాషల్లో ఈ ప్రక్రియ ఉన్నా తెలుగులో ఉన్నంత ప్రాచుర్యం మరే భాషలోనూ లేదనే చెప్పవచ్చు. ఈ అవధాన రంగంలో డా.సి.వి.సుబ్బన్నగారు 1950 ప్రాంతంలో అడుగుపెట్టి శతావధానిగా పేరుపొంది రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో పండితుల మెప్పు పొందా రు. అయిదు దశాబ్దాలు అవధానాన్ని నిబద్ధతతో కళాత్మకంగా నిర్వహించారు. కొంతమంది అవధానులు అవధానాలకే పరిమితమైపోయారు. కావ్యాలు ఏవీరాయలేదు. మరికొందరు అవధానాలు చేస్తూనే కావ్యాలు కూడా రచించారు. డా.సి.వి.సుబ్బన్నగారు ఈ రెండవ వర్గానికి చెందిన అవధాని, కవి. సుబ్బన్న 18వ ఏట అంటే 1950లో బహిరంగంగా అవధానాలు చేయడానికి పూనుకొని, మదనపల్లిలో మొట్టమొదట శతావధానం చేసి అవధానిగా లోకానికి పరిచయమయ్యారు. ఆయన బహిరంగ అవధానానికి శ్రీకారం చుట్టిన మహాశివరాత్రి రోజుననే తిరుపతి కవులలో రెండవవారైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్తీ స్వర్గస్థులైనారు. 1986లో చీరాలలో చేసిన అవధానంలో సుబ్బన్న ఈ విషయాన్ని ప్రస్తావించి, కవితాపటిమతో, సమయస్ఫూర్తితో పృచ్ఛకులను, శత్రువులను అదరగొట్టే చెళ్ళపిళ్ళకవి తనను అంత సమర్థుడుగా భావించి, తనలో ఆత్మతేజాన్ని ప్రేమతో నిలిపి దివంగతుడయ్యారేమో అని ఇలా చెప్పారు. ‘‘అదరీభూత విపక్షపక్షుడు తనుత్యాగంబు గావించె నె/ప్డ ధరన్ వేంకటశాస్ర్తీ, యప్పుడ పదమ్మున్ మెట్టి కావించితిన్/ బుధులంకింప శతావధానము, మహా/త్ముండాత్మతేజమ్ము ‘వీ/డు ధురీణుం’డని, నాయెడన్ నిలిపినాడే యేమొ ప్రేమార్ద్రుడై’’.
సుబ్బన్న అవధానంలో ప్రబంధ శైలిని ప్రవేశపెట్టారు. ప్రౌఢంగా కవిత్వం చెప్పగల సామర్థ్యం ఉండడంవల్ల ఆయనలో ఆత్మవిశ్వాసం, ధిషణాహంకారం సహజంగానే తొణికిసలాడుతుంటాయి. రవీంద్రభారతిలో పలువురు ప్రసిద్ధులైన అవధానులున్న సభలో తనలా అవధానంలో ప్రౌఢ కవిత్వాన్ని చెప్పగలవారు లేరని ఇలా స్వాతిశయాన్ని వెల్లడిచేశారు. ‘‘ఏడీ? నేడవధానరంగమున వాక్ హేల పరిష్కార స/మ్రాడోజోభర పద్య గద్యరచనా ప్రాగర్భ్యధౌరేయుడు/న్నాడా? సుబ్బన్న దక్క యిం కొకరు డాంధ్రక్షోణియందున్ సుధీ/ చూడారత్నములార! చూడరె గుణజ్ఞుల్ వస్తుసౌభాగ్యమున్.’’
సుబ్బన్న 1950నుంచి 1997 వరకు దాదాపు 600 అష్టావధాన శతావధానాలు చేశారు. ఒక్కో అవధానం చిక్కని పదబంధంతో, చక్కని భావంతో రస చమత్కారంతో ఒక్కో ప్రబంధంలా ఉండాలని ఆయన అభిప్రాయం. ఆయన అవధానంలో సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్ఠులైన దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, చెలమచెర్ల రంగాచార్యులు, కప్పగంతుల లక్ష్మణశాస్ర్తీ, డా.దివాకర్ల వేంకటావధాని, వెంపరాల సూర్యనారాయణశాస్ర్తీ, గంటిజోగి సోమయాజి, దీపాల పిచ్చయ్యశాస్ర్తీ, మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ, డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, ఆరుద్ర వంటి వారెందరో పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఆయన అవధానాల లాగానే కావ్యాలు కూడా ప్రసిద్ధి పొందాయి. ఆయన 1950లో రచించిన త్రివేణి కావ్యం మూడు పద్య కావ్యాల సంపుటి. మహాభక్తుడైన రామదాసు కథను ‘శ్రీ భద్రాచల రామదాస ప్రబంధం’గా రచించారు. ‘బీబీనాంచారు ప్రబంధం’ (2009) అనే 5 అశ్వాసాల కావ్యం అన్నమయ్య యక్షగానం ఆధారంగా రచింపబడింది. డా.సి.వి.సుబ్బన్న శతావధాని ఇంకా వ్యాస విలాస ప్రబంధం, అష్టావక్రుడు, పురందరదాసు, కుంతి అనే కావ్యాలను రచించారు. ఆయన మరణం సంప్రదాయ సాహిత్యానికి, అవధాన రంగానికి తీరని లోటు.

- డా.్భతపురి గోపాలకృష్ణశాస్ర్తీ, 9966624276