సాహితి

పున్నమ వెనె్నట్లో తెలుగు వెలుగు జాడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వచన రచయితల్లో భాషా శైలీ విషయానికి విశిష్టంగా పేరెన్నికగల మహనీయులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు, మరొకరు మల్లాది రామకృష్ణశాస్ర్తీగారు. ఇద్దరికిద్దరూ తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాల్లో మంచి విద్వాంసులే. తెలుగుకోసం ప్రాణం పెట్టేవారే. గొప్ప శైలీ విన్యాస శిల్ప మర్మజ్ఞులే. తెలుగు జన జీవన సంస్కృతి పరమయిన, సహజోత్పన్న భావ విశేషమయిన వస్తువులను కథానికలుగా మలుచుకొన్నవారే. అయినా- శాస్ర్తీగారలిద్దరిలోనే భేదముంది. ‘ముఖే ముఖే సరస్వతీ’ అన్నది మనమెరిగినదే. కాని ఎవరి ప్రత్యేకత వారికుంది. అది కథా వస్తుపరమయినది కావచ్చు. భాషావైలీ పరమయినది కావచ్చు. లేదా వాటి కలబోతకు సంబంధించినదీ కావచ్చు. భావానికి సంబంధించినదీ కావచ్చు. ఆ ప్రత్యేకత అ రచయిత ముద్రగా రాణిస్తుంది. ఈ ఉభయుల ముద్రల మధ్యా కనిపించే ప్రధానమయిన అంతరమేమంటే, శ్రీపాదవారిది సమకాలిక భాషా ప్రయోగ సంపన్నమయినది, మల్లాదివారిది సుమారు రెండు మూడు పర్వాతరాలవారి పూర్వ శతాబ్ది గ్రామీణ ప్రజల వాడుకలో ఉన్నదీ, క్రమక్రమంగా వ్యవహారచ్యుతమవుతూ వస్తున్నదీ, పూర్వ శతాబ్దుల అచ్చ తెలుగు కావ్యాలదీ అనిపించే పలుకుబడులతో కూడి ఉన్నదీ.
భాషాపరమయిన ఈ విశిష్టతకు తోడు, శ్రీపాదవారిలో భావపరమయిన, విశ్వాసపరమయిన నిష్కర్షలలు కూడా కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి. ‘ఇదీ శ్రీపాద ముద్ర’ అనిపించేవి అనేకం వారి రచనల్లో అడుగడుక్కూ కనిపిస్తాయి. ‘‘ఓహో! ఎంత గొప్పగా చెప్పారు! అనిపించే వాక్యాలనెన్నిటినో మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలనుకుంటాం, నలుగురికీ చెప్పాలనుకుంటాం. సభా సదనాల్లో వేదికలమీద ఉదాహరించాలనుకుంటాం. కాని అంతలోనే మరచిపోతుంటాం. శ్రీపాదవారి రచనలన్నీ చదివి వాటిలోని మరవరాని మాటలను ఒకచోటికిచేర్చి మనకందించే పుణ్యాత్ములు ఎవరయినా, ఎక్కడయినా కనిపిస్తారా అని చూస్తాం, నేనలా చూశాను, ఏభై అరవై ఏళ్ళపాటు! ఎవ్వరూ కనిపించలేదు. ఇటీవలివరకు డా బూదరాజు రాధాకృష్ణగారు, నన్నయగారి కాలం నుంచి గత శతాబ్ది చివరి వరకు రచనలు చేసిన కొన్ని వందలమంది గ్రంథాలలోనుంచి అనేక గొప్ప వాక్యాలు ఏరి కూర్చి ‘మరవరాని మాటలు’ అనే పుస్తకం ఒకటి ప్రచురించారు. అది చాలా ఉపయోగకరమయినది. కాని విషయాల వారీగా విస్తరించి ఉన్న ఆ పుస్తకంలో, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు చెప్పిన వాటికోసం ప్రత్యేకంగా ప్రయత్నించి చూసుకోవాలి.
అలా కాకుండా, కేవలం సుబ్రహ్మణ్యశాస్ర్తీగారి భావాలను మాత్రమే సేకరించి పుస్తక రూపంలో కూర్చడానికి పూనుకొన్న పుణ్యాత్ములు పున్నమరాజు నాగేశ్వరరావుగారు. పుస్తకానికి ‘శ్రీపాదముద్ర’ అన్న పేరు నప్పింది.
మిత్రులు పున్నమరాజు నాగేశ్వరరావుగారు మంచి సాహిత్యాభిరుచిగలవారు. పైగా సుబ్రహ్మణ్యశాస్ర్తీగారి మీద అపరిమితమయిన అభిమానమున్నవారు. వారిలో అనేక సంవత్సరాల సాన్నిహిత్యమున్నవారు; వారిని గురుత్యులుగా భావించినవారు. అటువంటి పున్నమరాజువారు ఈ గ్రంథాన్ని కూర్చడంవల్ల దీని విలువ ఎంతో పెరిగింది.
తరచుగా చెప్పుకోవలసిన సూక్తులవంటి వాక్యాలను కూర్పరి, ఈ క్రింది విభాగాల కింద పొందుపరిచారు.
ఆధ్యాత్మికం, కళలు, కవిత్వం- భావం, కవులు- కావ్యాలు, గ్రంథాలయాలు, తెనుగు, తెనుగుజాతి, పత్రికారంగం, పద్యం- మననం, పరసీమ, ప్రకృతి, ప్రభుత, ప్రముఖులు, ప్రవృత్తి, భాష- వాఙ్మయం, మనస్సు- హృదయం, మహాత్ములు- ధర్మం, రచన, రాజకీయాలు, విద్య- విజ్ఞానం, వివాహం- స్ర్తి పురుషులు, శాస్త్రాలు, సంద్రపాయం- సంస్కారం, సాంఘికం, సామెతలు- సూక్తులు, స్వీయం, హిందీ ప్రచారం.
ఈ మాదిరి విభాగాలను ఏర్పరచిన తరవాత నాగేశ్వరరావుగారు, ‘శ్రీపాద గమకాలు’ శీర్షికతో, శాస్ర్తీగారి జనన మరణాది వివరాలను ఇచ్చారు. ‘శ్రీపాద కలం పోటు’ పేరుతో, వారు రచించిన అనువాద గ్రంథాల ఆయుర్వేద గ్రంథాల, చిన్న కథల నవలల, నాటకాల, సంపాదకత్వం వహించిన పత్రికల, పద్యరూప ఖండకావ్యాల, పద్యఖండికల గుచ్ఛం, వాచకాల, వ్యాఖ్యాన వ్యాసాల, విమర్శల, రూపికల, స్వీయ కథా గ్రంథ వివరాలు ఇచ్చారు. ‘శ్రీపాద మూర్తి, స్ఫూర్తి’ పేరుతో శాస్ర్తీగారిని గురించి చిరస్మరణీయమయిన అనేక విశేషాంశాలను గ్రంథస్థం చేశారు పున్నమరాజువారు.
‘తన (తెలుగు) జాతి పరంపరాభివృద్ధి కోసం, ప్రగతిశీల ప్రభావోత్పాదక సాహితీ వికాసం కోసం, దానికి తోడ్పడే భాషా లీలా విలాసాల అవగాహన కోసం, లోకవృత్త పరిశీలనా నైశిత్యంకోసం, వ్యవహార దీక్షదక్షతల అనుశీలన కోసం, మానవతా వౌలిక మూల్య పరిరక్షణ కోసం, వెరసి సర్వతోముఖాభివృద్ధి కోసం, సమగ్ర సముజ్జ్వల దీప్తి కోసం అహరహం తపించే అంతఃకరణ ప్రవృత్తి’’ గల ఒక మహారచయిత భావజాల పుష్పకదంబాన్ని కూర్చిన నాగేశ్వరరావుగారికి సాహితీప్రియులు సదా కృతజ్ఞతాబద్ధులయి ఉంటారు.

chitram...
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

- డా పోరంకి దక్షిణామూర్తి