సాహితి

కథలూ రావాలి.. కథకులూ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనవాళ్ళు కవిత్వానికి పైత్యానికి సంబంధం ఉందంటారు. పైత్యానికి మందంటూ ఉంది ట. కాని కవిత్వానికి అది లేదట! ఇంగ్లీషు వాళ్ళు కవులను పిచ్చివాళ్ళను ఒక కుండలి (బ్రాకెట్)లో పడేసి గొళ్ళెం పెట్టి తాళం బిగించేరు. నయమే వారు కథలను స్వేచ్ఛగా వదిలేసారు! ‘ఏమి తిని సెపితివి కవితము’ అని తెనాలి రామకృష్ణుడు ప్రశ్న వేసినప్పటి నుంచి కవిత్వం భ్రష్టు పట్టింది అన్న అనుమానం రావడం సహజమే! సంతోషించవలసిన విషయమేమంటే ఈ అధునాతన కవిత్వం గురించి అలాంటి అపోహలున్నా కథలను ఈసడించే దుర్దశ పట్టలేదు. అయితే కథలు ఉత్తమోత్తమైనవి, కథకుల్లో సృజనాత్మక శక్తి ఉందని భావించమని కాదు. కొన్ని కథలు ఆచంద్రార్కం నిలుస్తే కొన్ని ముట్టగానే తుస్సుమంటున్నాయి.
కథా పత్రికలు పుంఖానుపుంఖాలుగా వస్తే నాసిరకం సరకు కనిపించదా? గతంలో సాహిత్య పత్రికలు, కుటుంబంలో అందరు చదివే పత్రికలు బహు అల్పంగా ఉండేవి. కథకులు పరిమితంగా ఉండేవారు. అయితే ఆ రోజుల్లోనూ ఒక విచిత్రం ఉండేది. కొందరు పేరుమోసిన కథకులు ఆంగ్ల కథలను తెలుగులోకి తర్జుమా చేసి, తెలుగు వాతావరణం, తెలుగు పాత్రల పేర్లతో స్వంత కథలుగా చలామణి చేసి, అహా ఎంత మంచికథ అని పాఠకుల మెప్పు పొందేవారు.
మన అదృష్టవశాత్తు ఆ దశ గడిచింది. పట్టుబడి పోతామేమో నన్న భయంతో రచయితలలాంటి దుస్సాహసం చేయడం లేదు. ఇతర భాషా కథలు మూల రచయిత అనువాదకుల పేర్లతో వస్తున్నాయి.
అంటే ఆ దశ గడచిపోయింది. అయితే దురదృష్టవశాత్తు మరోదశ వచ్చింది. నిజం నిష్ఠూరంలా ఉంటుంది. అయినా ముచ్చటించక తప్పదు. ఈనాటి చాలా కథల్లో నాయకీ నాయకులు వ్యక్తిత్వంలేని వ్యక్తులు. ఆ పాత్రలలా ఉండడానికి కారణం ఆయా రచయితలు వ్యక్తిత్వం లేని వారు అని భావించవలసిన అవసరం లేదు. మరొకమాట... కథ అన్న తరువాత నాయకీ నాయకులతో పాటు ప్రతి కథలోనూ సంఘం అనే పాత్ర ఉంటుంది. దాన్ని సమాజం అని కూడా వ్యవహరిస్తారు. సామాజిక కథలు కాబట్టి సంఘానికి ప్రతినిధిత్వం వహించే ఎల్లయ్యలో బుల్లెయ్యలో ఉండాలి. లేకుంటే పంచతంత్ర కథల్లా జంతువుల చుట్టూ అల్లాలి. నాయకీ నాయకులు ఒక వంక సంఘం అనే విలన్ ఒక వంక, కథ క్లైమాక్స్ చేరుతుంది. బాగు... బాగు...
ఇక్కడ మరో విరోధాభాసం ఉంది. చాలా మంది ఎలా వ్రాయాలో అలా వ్రాయరు అలా వ్రాస్తే తనను ఆదర్శంగా భావించే వర్గం మెచ్చుకోదేమోనన్న భయం. ఇజానికనుగుణంగా వ్రాస్తే గుర్తింపు గ్యారంటీ అనుకుంటారు. ఆ ఇజానికి సామాజిక స్పృహ అనే తోక తగిలిస్తారు. ఎవరి పిచ్చి వారికానందం.
వ్యవస్థలో లోపాలు లేవని కాదు. ఉంటాయి. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ముక్కు సూటిగా నడిచే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అనలేము. పరిస్థితులకు లొంగనని ఛాతి విరిచి నిలబడి క్రింద పడినా ‘కందుకమువోలె... మగుడమీదనె్నగయ యుందుజుమీ!’ అని చెప్పగల సుజనులు మన రచయితలలో లేరా? పరాజితలే కాని అపరాజితలు మనలో లేరా? ఉన్నారు... ఉంటారు... ఉండవలసిందే!
మనమో సామెత వింటూ ఉంటాం. ‘‘కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా కొంతకాలం బ్రతుకు’’ కథకులు అలోచించవలసింది ఎన్ని కథలు వ్రాస్తేం అని కాదు. రాశి కన్నా వాశి ముఖ్యం అది గమనిస్తే కథకులు సాహితీ క్షేత్రంలో మంచి పంటలు పండించి పాఠకులకు రసానందం కలిగిస్తారు. ఏది ఏమైనా కథకులను, కథలను ప్రచురించే పత్రికలను అభినందించాలి.

- గుమ్మా ప్రసాదరావు, 09755110398