సాహితి

నిశ్శబ్ద వలయంలో వర్తమాన సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యమంటే వెలుగు... సాహిత్యమంటే గలగల పారే వాగు. మిలమిల మెరిసే నక్షత్రం. జలజల కురిసె వర్షం. ఒక కెరటం ఒక మెరుపు ఒక ఉరుము. సాహిత్యం నిశ్శబ్దంకాదు. నిశ్శబాదన్ని సృష్టించే అక్షరాలు సాహిత్యం కాదు. సాహిత్యమంటే శబ్దం. ధిక్కరణ, చైతన్యం, పోరాటం... నిరంతర ప్రయాణం... ఆరని మంట...
ఇప్పటి సాహిత్యమెలా వుంది? - ఇది ఆత్మ విమర్శకే! ఎవరినో విమర్శించటానికి కాదు. నిర్లిప్తంగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది. నిస్తేజంగా ఉంది.
సాహిత్యం రావటం లేదా? - బోలెడు సాహిత్యం వస్తుంది. అదంతా సాహిత్యమేనా? - అది వేరే సంగతి... అంతా రచయిత లేనా?... అంతా రచయితలే... ఇక్కడ వారిని చిన్న చూపు చూడలేం. అవమానించలేము. వ్రాయాలనే తపనతో, ఉత్సాహంతో ఏది వ్రాసినా ఆయన రచయిత. సాహిత్య సముద్రంలో ఓ నీటి చుక్కను కావాలని ఎవరు కలం పట్టి రెండు అక్షరాలు వ్రాసినా ఆయన రచయిత. కాదనలేం. తప్పటడుగులు మంచి అడుగులవుతాయి. మంచి అడుగులు పోరాట అడుగులు కావచ్చు. ఏ భాషా సాహిత్యంలోనైనా రచయితలు విస్తృతంగా పుట్టుకొస్తున్నారు. అది మంచి పరిణామమే తెలంగాణ మలిదశ ఉద్యమం ఎందరో కొత్త రచయితలను సృష్టించింది ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన రచయితలు కొంత మేరకు శక్తివంతంగా సాహిత్యాన్ని సృష్టించగలిగారు. ఉద్యమం శక్తివంతమైన సాహిత్యాన్ని కమిటెడ్ రచయితలను సృష్టిస్తుంది. ధిక్కరణ అక్షరాలకు అటువంటి శక్తి ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యంలో సృజనాత్మకత బాగా తగ్గింది. ఏమి వ్రాయాలో ఎటుపోవాలో తెలుగు రచయితకు అర్థం కావటం లేదు తెలంగాణలో అయతే రచయత పదమూడు సంవత్సరాల ఉద్యమకాలంలో గిరిగీసుకొని అందులో వుండిపోయాడు. అందులో నుండి బయటకు రావటం లేదు. తెలంగాణ రచయిత తెలంగాణాయే సర్వస్వమనుకోవటం దురదృష్టకరమైన విషయం - ప్రపంచం - ప్రపంచపు కన్నీళ్లు ఆయనకు కనిపించటం లేదు. తెలంగాణ రచయిత ప్రపంచ రచయిత కాలేకపోతున్నాడు.
తెలంగాణ విషయమే కాదు. ఏ భాషలోనైనా మంచి సాహిత్యం రావటం లేదు. ‘మంచి’ అంటే నా దృష్టిలో ప్రజా సాహిత్యం. అయితే ఈ వ్యాసానికి గిరిగీతలు యేమీ లేవు. ‘వస్తువు’ను దృష్టిలో పెట్టుకొని ‘మంచి సాహిత్యం’... ఇది. అని ఈ వ్యాసం వ్రాయటం లేదు. శిల్పరీత్యా, భాషరీత్యా, శైలిరీత్యా కూడా మంచి సాహిత్యం రావటం లేదు. వడ్డెర చండీదాస్ ‘హిమజ్వాల’లాగా మంచి నవల, గోపిచంద్ ‘అసమర్ధుని జీవయాత్ర’ - నవీన్ ‘అంపశయ్య’ - రావిశాస్ర్తీ ‘రాజు-మనిషి’ ఇలాంటి నవలలు ఇప్పుడు రావటం లేదు. ఇప్పటికీ చరిత్రలో శ్రీశ్రీ మహాప్రస్థానం గొప్పకావ్యం. అజంతాలాగా ఎవరైనా వ్రాస్తున్నారా? కుందుర్తి - శివసాగర్ అటువంటి కవితలు ఏవీ? - కాళీపట్నం ‘యజ్ఞం’ కథ మంచి కథలేవీ?...
తెలుగు భాష విషయమే కాదు ఏ భాషలో కూడా ఇటీవల ఒక దశాబ్దకాలంలో మంచి సాహిత్యం వస్తున్నట్టు లేదు. నేను పోరాట సాహిత్యం. ధిక్కరణ సాహిత్యం గీటురాయిగా ఈ వ్యాసం కాదు శరత్‌బాబు నవలల లాగా ఒక నవలైనా కిషన్ చందర్, ప్రేమ్‌చంద్, మహాశే్వతాదేవి, అరుంధతీరాయ్... లాగా ఎవరూ ఎందుకు వ్రాయటం లేదు. ‘ఇది చదువాలి’ అనే ఆతురత - పరుగు పెట్టించే సాహిత్యం రావటం లేదు. ఎందుకూ? - అనే ప్రశ్న.
మంచి సాహిత్యమంటే నా దృష్టిలో ప్రజాసాహిత్యమే... ప్రజలకోసం వ్రాసేదే మంచి సాహిత్యం. అయితే అంత ఎత్తుకుపోయి ఈ వ్యాసం వ్రాయటం లేదు. ఇప్పుడు వస్తున్న సాహిత్యం ఏ ఎత్తులో లేదనే బాధతో ఈ వ్యాసం వ్రాస్తున్నాను. కనీసం చదివించే సాహిత్యం రావటం లేదు చదివితే ‘హాయ్’ అనిపించే సాహిత్యం కావాలి. ప్రారంభించిన తర్వాత ఆఖరువరకు ఆగకుండా చదివించే సాహిత్యం రావాలి. ఒక ఆర్టికల్ చదివిన తర్వాత మళ్లీ మళ్లీ చదువాలనిపించాలి. ఒక ఆర్టికల్ చదివిన తర్వాత మనసు శాంతితో సంతృప్తితో సంతోషంతో ఒక అనుభూతితో నిండిపోవాలి. ఏదో నేర్చుకున్నానని తృప్తి మిగులాలి. జ్ఞానం, విజ్ఞానం, శాస్ర్తియ ధృక్పథం, అనుభూతి గీటురాయిగా సాహిత్యం రావటం లేదనే బాధ మదిలో వుంది. వేలాది కవితలు వస్తున్నా - ఎప్పుడో ఓ మంచి కవిత కనిపిస్తుంది. వందలాది కథలు వస్తున్నా - చెప్పుకోదగిన ఒక్క కథ కనిపించదు. ఎక్కడైనా అనువాద కథలు కనిపిస్తే - పాతికేళ్ల క్రితపు కథ ఎక్కడైనా కనిపిస్తే - అది చదివితే అద్భుతమనిపిస్తుంది. ఎంతమంచి కథ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క కథ తృప్తికరంగా అనిపించదు.
వాస్తవికత, జనజీవితం, సామాజిక దర్శనం వీటిలోనే మంచి సాహిత్యం వస్తుందని అవి పునాదులుగా సాహిత్యం సృష్టించాలని నా భావన కాదు. అయితే వాస్తవికత అవసరమే జనజీవనం అవసరమే సామాజిక దర్శనం అవసరమే. వీటి ‘వస్తువు’లో సృష్టించేది మంచి సాహిత్యం అనలేం... ఉన్నది వున్నట్టుగా వ్రాసి చదివించలేకపోతే... రైతు దుఃఖాన్ని వ్రాసిన కథ రెండోసారి చదివించకపోతే... ఇది ఇంతేలే.... ఇది తెల్సిన వస్తువేనని ప్రక్కన పెడితే... సామాజిక కోణంలో ఒక రచయిత నవల వ్రాసాడు. ఆ అక్షరాలు మన కనులను పరిగెత్తించలేకపోతే... ఇంకెందుకు వ్రాసి...?
అంటే - చదివించగలిగేలా మనం వ్రాయలేకపోతున్నాం. పాఠకులను ఆకర్షించేలా వ్రాయలేకపోతున్నాం.... దీని అర్థం మంచి సాహిత్యం సృష్టించలేకపోతున్నాం.
కథ కానీ, కవిత కానీ, నవల కానీ, ఆఖరుకు వ్యాసం కానీ చదివించేలా పాఠకులు కనులను అద్దుకునేలా ఇప్పటి రచయితలు వ్రాయలేకపోతున్నారు. ఎందుకూ?- కారణాలు అనే్వషించాల్సిందే. యాబది సంవత్సరాల క్రితపు హిందీ పాటలు పాత తెలుగు సినిమా పాటలో పదేపదే వినాలనిపిస్తుంది. కొత్తవి అంతగా ఆసక్తి కలిగించవు.
మంచి, మంచి మనసు, మంచి మనిషి, మంచి సమాజానికి మంచి సాహిత్యానికి సంబంధం వుందా? అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. వుండవచ్చు. పాతిక సంవత్సరాల నాటికి ఇప్పటికీ సాంకేతికంగా ఎంతో ఎదిగాం. అవసరమైన సమాచారం, అవసరమైన విజ్ఞానం దండిగా నిమిషాలపై అందుతుంది. సాహిత్య రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు క్షణాలలో రచయితకు తెలుస్తున్నాయి. ఇంత ఆధునికత పెరిగిన తర్వాత మంచి సాహిత్యం రావటం లేదు. విలువైన సాహిత్యం రావటం లేదు. వస్తున్న సాహిత్యంలో కూడా విలువైన సమాచారం ఉండదు. జీవన ప్రయాణంకు సంబంధించిన ఏ ప్రశ్నకు సమాధానం దొరకదు ఎందుకూ... ఎందుకూ...?... కారణాలు అనే్వషించాల్సిన అవసరముంది.
వేమన పద్యాలు నోటిమీద ఆడుతుంటాయి... ఎందరో పద్యాలు వ్రాసారు కానీ కరుణశ్రీ పద్యాలు చిరకాలముంటాయి. ఎప్పుడో వ్రాసిన భారత - భాగవత - రామాయణాలు ఇప్పుడూ చదివిస్తాయి. భారతం ఇప్పటి వాస్తవ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ‘కల్పితం’ అనిపిస్తుంది. అయినా ఆ పాత్రలు అందులోని ధర్మం - నీతి - భగవద్గీత ఎన్నిసార్లయినా చదివిస్తాయి. పోతన భాగవతం పద్యాలు నోరు వూరిస్తాయి. షేక్‌స్పియర్ పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. దశాబ్దాలు గడిచినా గురజాడ కన్యాశుల్కం పాత్రలు మనముందు నిలుస్తాయి. ముప్పది నలుబది సంవత్సరాల క్రితం ఎప్పుడో వ్రాసిన కథలు మనముందు అలరిస్తాయి. సామాజికం, ఉద్యమం, ప్రజలు వేటికి సంబంధం లేని కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు, యుగంధర్ రాజు పాత్రలు కనుల ముందు నిటారుగా నిలబడుతాయి... ఇవి కొన్ని ఉదాహరణలే... ఇప్పుడొస్తున్న సాహిత్యంలో ఇటువంటి ఉదాహరణలు చెప్పలేం... మంచి సాహిత్యం వస్తేగా చెప్పటానికి...
ఇప్పటి రచయితకు శిల్పం అక్కర్లేదు. భాషమీద పట్టులేదు. పదాల సౌందర్యాన్ని ప్రేమించడం వాక్య నిర్మాణాన్ని ఒక కళగా అంగీకరించడు ఒక ప్రక్రియ గీటురాయిని గుర్తించడం కవితలో అనవసర అక్షరాలు పదాలు పరధి దాటిపోతుంది. కథ ఒక సంఘటనకు పరిమితం కాదు. ఇప్పటి నవలలలో లోకజ్ఞానం, సైద్ధాంతిక చర్చ, ధర్మ పాత్రలు తలవంచని వీరులు సామాజిక బలహీనులు వుండరు.
రచయిత తన బలహీనతలను నవల మీద రుద్దుతుంటాడు. పాటకు సంగీతం, సాహిత్యం, కవిత్వం అక్కర్లేదు ఇలా వుంది నేటి సాహిత్యం. వర్తమాన సాహిత్యం ఇంత చెత్తగా ఎందుకు తయారయ్యింది?
ఇంత బలహీనమైన సాహిత్యాన్ని ఎందుకు తలకు మోస్తున్నాం?
ఏటా గంపల పుస్తకాలు వస్తున్నాయి. లాభమేమిటి?-
ఎందుకిలా....?....
ప్రపంచీకరణ వలయంలో రచయిత చిక్కుకుపోయాడు. స్వార్థం పెరిగింది. మానవతా విలువలు తగ్గాయి. నిజాయితీ, ఆత్మీయ భావం, మంచితనం పట్ల ప్రేమ, అన్యాయాన్ని ఎదిరించే ధీరత్వం తగ్గాయి. భట్రాజు పొగడ్తలు - వాటికి లొంగపోయే మనస్తత్వం, సన్మానాలు, అవార్డుల మీద ప్రేమ, అవార్డులకు సన్మానాలకు అడ్డదారులు... మంచి సాహిత్యం ఎలా వస్తుంది?-
అధ్యయనం బాగా తగ్గింది. రచయితకు పుస్తక అధ్యయనంతోపాటు సామాజిక అధ్యయనం వుండాలి. వుందో... రచయితలలో ఎక్కువగా టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లమని వస్తున్నారు. మంచిదే! వాళ్ళకు భాష మీద పట్టు వుంది. పిల్లలకు చరిత్ర - సాహిత్యం చెపుతారు. పోతన ఏమి వ్రాసారో చెప్పగలరు కానీ... తాము చదివిన చదువుకు ఇప్పటి చదువుకు తేడా చెప్పగలరా?- రెండు మూడు తరగతి నుండే వీపు మోస్తున్న గంపెడు పుస్తకాలెందుకో చెప్పగలరా?- విద్య వ్యాపారంగా ఎందుకు మారిందో, ఈ సామాజిక స్వరూపమేమిటో, దోపిడి అంత ఏమిటో చెప్పగలరా?-
ఏదో వ్రాస్తున్నాం, పుస్తకాలు వేసేవాడు ప్రచురించేవాడు మన వాడయితే చాలు - మనవాణ్ణి చేసుకుంటే చాలు.... ఇదే ఇప్పటి సాహిత్య పరిస్థితి.

- సిహెచ్.మధు, 9949486122