సాహితి

సాహితీ పరిజ్ఞానం లేకపోవటాన్ని ఏమనాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య రంగంలో కలం పెట్టినవాళ్ళకి లేదా కలం పెడుతున్నవాళ్ళకి సాహిత్యంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండటం కనీసమైన యోగ్యత. ఏ రంగంలో రాణించాలన్నా ఆ రంగంలో కొంత పరిజ్ఞానం అవసరం కాబట్టి దానిని పెంపొందించుకుంటారు. అవగాహన చేసుకుంటారు. కానీ మన రచయితలు, కవులు.. ముఖ్యంగా నేటి తరంవాళ్ళకి ఇవేమీ పట్టవు. ఒక పుస్తకం, ఒక ప్రశంసాపూర్వకమైన ముందుమాట, తన వారిచే సమీక్ష.. ఇంకేముంది? ‘ప్రముఖ’ అనే పదాన్ని తగిలించుకోవచ్చు. ఒక ఊళ్ళో ప్రముఖుడా, జిల్లాలోనా, రాష్ట్రంలోనా? ఎందుకని ‘ప్రముఖుడు’ అయ్యాడు? అని అడిగేవారు లేరు. లోపల అడగాలని వున్నా బయట పెట్టరు. అందువల్ల ప్రముఖంగా చెలామణి అవుతున్నారు. ఏ ప్రక్రియను చేపట్టినా దాని పూర్వాపరాలు, లక్షణాలు, పరిణామాలు అధ్యయనం చెయ్యాలి. అందుకే పెద్దలు మంచి రచయితలు కావాలంటే మంచి పాఠకుడు అయి వుండాలన్నారు. ఇదేమీ కొత్త అంశం కాదు. కానీ అధ్యయనం అవసరమని చెప్పేవారు లేక, చెప్పినా పాటించేవారు లేకపోవడంవల్ల సాహితీ పరిజ్ఞానం హుళక్కి అవుతోంది.
సాహితీ పరిజ్ఞానం అవసరమంటే ‘ఈయనెవడో చాదస్తుడు. ప్రాచీన శాస్త్రాలన్నీ చదవాలి కాబోలు’ అని ఎద్దేవా చేసేవారుంటారు. మిగిలిన రంగాలలో వారు ఈ అభిప్రాయాన్ని గౌరవించి అమలు చేస్తారు. ప్రక్రియ, ప్రబంధం, యక్షగానం, దీర్ఘకవిత, నానీ.. ఇలా వీటిని గురించి తెలుసుకోవాలనిపించని తరం వస్తోంది. దీర్ఘకవిత అంటే ‘పెద్ద కవిత’ అని సమాధానం చెప్తారు తప్ప దాని గురించిన అవగాహన ఉండదు. ఒకే వస్తువుపై విభిన్న కోణాలతో కవితాపరంగా రాయటం దీర్ఘకవిత అవుతుంది. జూలూరి గౌరీశంకర్ దీర్ఘకావ్యాలు (కవితలు) ఎక్కువ రాశారు. ఎన్.గోపి రాసిన ‘జలగీతం’ పరిశీలనగా చదివితే దీర్ఘకవిత అంటే ఏమిటో తెలుస్తుంది. ‘నానీలు’ లక్షణాలు తెలీకుండా నానీల కవితా సంపుటాలు చదవకుండా నానీలు పేరుతో అడ్డదిడ్డంగా రాసినవారూ ఉన్నారు. అక్షర నియతి, పాదాల నియతి పాటించాలని కూడా తెలిసికోరు.
‘సాహితీ రూపకం’ అంటే తెలీనివారు చాలామంది ఉన్నారు. భువనవిజయం, కవన విజయం వంటివి సాహితీ రూపకాలు. ఇవేమీ తెలుసుకోకుండా సాహితీ రూపకాలకు పోటీ పెడితే- నాటకాలు, నాటికలు, గేయ నాటికలు, సాంఘిక రూపకాలు పంపారంటే వారి పరిజ్ఞానం ఎంతటిదో తెలుస్తుంది. ఇటీవల వ్యాఖ్యన గ్రంథాలకు పోటీ పెడితే ఈ ప్రక్రియా జ్ఞానవంతులు దాదాపు లేరని తెలుస్తుంది. వెనుకటి తరానికి వీటిపై సంపూర్ణ పరిజ్ఞానం ఉండేది. ‘వ్యాఖ్యాన విమర్శ’, ‘వ్యాఖ్యానం’ అనేది స్వతంత్రమైన, పాండిత్యంతో కూడిన రచనా ప్రక్రియ. భారత రామాయణ భాగవతాలకు, కావ్యాలకు, ప్రబంధాలకు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. తాపీ ధర్మారావు వంటి ఆధునికుడు కూడా చేమకూర వెంకట కవి రాసిన ‘విజయవిలాసాని’కి వ్యాఖ్యరాశారు. వ్యాఖ్యాన గ్రంథం అంటే కేవలం తాత్పర్యం రాయటమే. విమర్శ చేయటమో కాదు. కొందరు ఆధునిక కవితా సంపుటాలను విశే్లషించి ‘వ్యాఖ్యాన గ్రంథం’ అని భావిస్తున్నారు. వ్యాఖ్యానం అంటే ప్రతిపదార్థం (అర్థాల క్రమం), తాత్పర్యం, విశేషాలు (కవితా పరంగా, భాషాపరంగా..) వివరణ వుంటేనే! ఇది తెలీనివారు వ్యాఖ్యాన గ్రంథంగా భావిస్తే పరిజ్ఞానం శూన్యమనేగా? సాహిత్యం, విమర్శ, భాష, సంపుటి- సంకలనం, పరివర్తిత ముద్రణ వంటివాటి గురించి తెలీకుండానే ప్రముఖులైపోవటం దిగులు కలిగిస్తుంది. సాహిత్యోద్యమాలు వచ్చి ఈ సాహితీ పరిజ్ఞానం లేకుండా చేశాయనిపిస్తుంది. తమకు అవసరమైన ‘నాలుగు ముక్కలు’ ఉదాహరిస్తేనే సాహితీ పరిజ్ఞానం అవదు. ఇటీవలి సాగి కమలాకర శర్మ ‘కదంబం’ అనే వ్యాస సంకలనం ప్రచురించారు. ఈ తరం రచయితలు, కవులు రాణించాలంటే ఈ ‘కదంబం’ చదవటమే కాదు- ఆ కర గ్రంథం (రిఫరెన్స్ బుక్)లాగా ఎదురుగా ఉండాలి. అప్పుడు సాహితీ పరిజ్ఞానం కొంతైనా ఏర్పడుతుంది.

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376