సాహితి

పిల్లలకు రంగస్థల వేదికలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లీషు చదువులు, వీడియో గేమ్స్, కార్టూన్ నెట్‌వర్క్‌ల మధ్య నలిగిపోతున్న నగరాల్లోని
బాల బాలికల కోసం ప్రత్యేకంగా బాల
రంగస్థలం రూపుదిద్దుకోవాల్సి ఉంది.
మారుతున్న సమాజ జీవిత విలువల్ని నేర్పించే కొత్త స్క్రిప్ట్‌లు రావాల్సిన అవసరం ఉంది.

జర్మనీలోని బాలల నాటకరంగం (ద్గిని-డ)ను ఆదర్శంగా తీసుకుని ఏ మహానుభావులైనా తెలుగు బాలల నాటక రంగానికి ఏ కొంచెమైనా రూపురేఖలు దిద్దుతారేమోనని ఆశపడుతూ నా ఆలోచనల్ని పంచుకుంటున్నాను. ప్రతి యేటా కొత్తగూడెంలో పిల్లల నాటక పోటీలు నిర్వహించి బహుమతులివ్వడం వంటి ప్రయత్నాల్ని అందరూ గుర్తించాల్సి ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా అలాంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరగాలి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని రంగస్థల విభాగంవారు బాల బాలికలకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడాన్ని అభినందిస్తూనే దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆశించి చేయాల్సిన కృషి ఎంతో ఉందన్న వాస్తవాన్ని గుర్తెరగాల్సి ఉంది!
సాహిత్య రంగంలో బాల సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా రచయితలున్నారు. పత్రికలున్నాయి. అలాగే సినిమా రంగంలోను పిల్లల సినిమా విభాగం ఉంది. పిల్లలను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తున్న దర్శకులున్నారు. నిర్మాతలున్నారు. పిల్లలతో తీసే సినిమాలున్నాయి. పిల్లల కోసం తీస్తున్న సినిమాలున్నాయి. కానీ నాటక రంగంలో మాత్రం పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక విభాగం లేదు. తెలుగునాట నాటక రంగం ఉచ్ఛ దశలో ఉన్న రోజుల్లో కూడా బాల నాటకరంగం అంటూ ప్రత్యేకంగా అభివృద్ధి కాలేదు. పాఠశాలల వార్షికోత్సవాలలో బాల సంఘాల సమావేశాల్లో అడపా దడపా పిల్లల చేత చిన్న చిన్న నాటికలు, ఏకాంకికలు, ఏకపాత్రాభినయాలు ప్రదర్శింపచేయడం తప్పించి పిల్లల రంగస్థలం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
సరదా పేరిట, తమాషా పేరిట పిల్లలకు ఎంతో క్షుద్ర సాహిత్యాన్ని అందించాం. దేవతల, దయ్యాల, భూతాల ‘కత’లతో పిల్లల్ని మూఢనమ్మకాలవైపు మళ్లించే ప్రయత్నమే ఎక్కువగా జరిగింది. ఒకానొక రాజకుమారుడు ఒకానొక రాజకుమార్తెను కీలుగుర్రం మీద తీసుకుపోయి సంతోషంగా కాపురం చేయడం, లేదా దేవతా కన్యలు మానవుడి కోసం దిగిరావడం వంటి అభూత కల్పనలు చాలా వచ్చాయి. రంగస్థలం మీద పిల్లలతో ప్రదర్శింపచేసిన కొద్దిపాటి నాటకాలు కూడా ఇలాంటి కథలతో రూపుదిద్దుకున్నవే!
ఈనాటి పెద్దలంతా, పిల్లలను తమతోపాటు సినిమాలకు నాటకాలకు, మేజిక్ షోలకు తీసుకువెడుతున్నారు. తమతోపాటు వందల టెలివిజన్ చానళ్లు చూడనిస్తున్నారు, తప్పిస్తే వారి అవసరాలేమిటి? వారికి ఎలాంటి ప్రదర్శనలు నచ్చుతాయి? అనేది ఎవరూ ఆలోచించడంలేదు. సున్నితమైన వారి మనసుల్ని రంజింపచేయడానికి ఎదుగుతున్నవారి మేధస్సును మరింత ఉత్సాహంగా తీర్చిదిద్దడానికి ఎవరూ ప్రయత్నించడంలేదు. ఈ విషయంలో మనం బాగా వెనుకబడి ఉన్నామన్న సంగతి ఒప్పుకోక తప్పదు. పట్టణాల్లో ఉన్న పిల్లలు ఈ విషయంలో చాలా దురదృష్టవంతులు. సినిమాలు టీవీ ప్రోగ్రాములు తప్ప జీవితంలోని కళా ప్రక్రియల్లో పాలు పంచుకునే అవకాశం వారికి లేదు. గ్రామీణ బాలలు ఈ విషయంలో కొంతమెరుగు. వారికి జానపద కళా ప్రక్రియల్లో ఒకసారి కాకపోయినా ఒకసారైనా పరిచయం కలుగుతుంది. వాటిని జీవితంలో నేరుగా చూడగలిగే అపూర్వ అవకాశం లభిస్తుంది. మళ్లీ వాటినే అనుకరిస్తూ వారు, వారి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. లేదా వాటిని వారి ఆటపాటల్లో భాగంగా మలుచుకుంటారు. ఇంగ్లీషు చదువులు, వీడియో గేమ్స్, కార్టూన్ నెట్‌వర్క్‌ల మధ్య నలిగిపోతున్న నగరాల్లోని బాల బాలికల కోసం ప్రత్యేకంగా బాల రంగస్థలం రూపుదిద్దుకోవాల్సి ఉంది. మారుతున్న సమాజ జీవిత విలువల్ని నేర్పించే కొత్త స్క్రిప్ట్‌లు రావాల్సిన అవసరం ఉంది. బాల బాలికల మానసిక స్థితిగతుల గురించి మంచి అవగాహన కల దర్శకులు తమ ప్రతిభను బాలల ప్రదర్శనలకు రూపకల్పన చేయడడంలో వినియోగించాల్సి ఉంది. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించడానికి రంగస్థలం ఒక మంచి మాధ్యమం అనే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది.
సినిమా కన్నా నాటకం జీవితానికి చాలా దగ్గరది. ప్రతి ప్రదర్శనకు మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంది. ఎక్కువమంది బాల బాలికలకు అవకాశం ఇవ్వగలిగేది కూడా! పెద్దలు, పిల్లల కోసం ప్రదర్శనలు రూపకల్పన చేయడం కంటే పిల్లల చేత వర్క్ షాపులు చేయించి, వారి శక్తి సామర్ధ్యాలను పెంచి, వారి మనోగతాన్ని అధ్యయనం చేసి, వారిని భాగస్వాముల్ని చేసే ప్రదర్శనలు రూపొందించడం బాగుంటుంది. దానివల్ల పిల్లల సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. కలిసి పనిచేయడంలోని ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ప్రపంచంలోని రీతి రివాయి గురించి చెప్పకుండా తరుముకొస్తున్న సమస్యల గురించి చెప్పకుండా భిన్నిమైన జాతుల గూర్చి విభిన్న సంస్కృతుల గూర్చి తెలియనీయకుండా వినోదం పేరుతో తక్కువ స్థాయి హాస్యాన్ని మాత్రమే వారికి అందించడం పొరపాటు. ఎదుగుతున్న పిల్లలు కుశాగ్ర బుద్ధులు. ఒక్కోసారి పెద్దలకంటే ఎక్కువగా విషయాన్ని అర్ధం చేసుకోగలరు. రాబోయే తరంలో బాధ్యతాయుతమైన పౌరుల్ని తయారు చేయాలంటే ఈ కాలపు పిల్లల గూర్చి అన్నిరకాలుగా శ్రద్ధ తీసుకోక తప్పదు.
దళితులు దళితుల కోసం పోరాడుతున్నారు. స్ర్తిల హక్కుల కోసం ఫెమినిస్టులు ఉద్యమిస్తున్నారు. వెనుకబడిన జాతులవారు తమ తమ సమస్యల్ని ముందుకు తెస్తున్నారు. కానీ వీరందరిలో బాల బాలికలున్నారు. వీరివి భిన్నమైన సమస్యలు.వాటిని గూర్చి ఉద్యమించే పోరాట పటిమ పిల్లలకు లేదు. కాబట్టి పెద్దలే పెద్దమనసుతో చిన్నవాళ్ల మేధోపరమైన అన్ని అవసరాల గూర్చి ఆలోచించాలి. ముఖ్యంగా రచన, చిత్రకళ, నాట్యం, సంగీతంవలె రంగస్థల ప్రదర్శనల వైపు కూడా పిల్లల మనసుల్ని మళ్లించాలి. స్వేచ్ఛగా, హాయిగా వారిని ప్రయోగాలు చేసుకోనివ్వాలి.పెద్దయ్యాక ఆ అనుభవం వారి జీవితంలో ఉపయోగపడినా, పడకపోయినా వారి వ్యక్తిత్వ వికాసంలో తప్పక ఉపయోగపడుతుంది. నాటకరంగం కార్యక్రమాలు ఉద్ధృతంగా సాగుతున్న మహారాష్టల్రో పిల్లల నాటక విభాగాలు కూడా ఉద్ధృతంగానే పనిచేస్తున్నాయి.
‘చంద్రశాల‘, ‘బాల నాట్ల’ వంటి మరాఠీ బాల నాటక సమాజాలకు సుదీర్ఘమైన చరిత్రఉంది. అంకిత భావంతో వారు పిల్లలతో, పిల్లల కోసం ప్రదర్శనలు ఇప్పిస్తూనే ఉన్నారు. అసలు రంగస్థలమే గడ్డు సమస్యల్ని ఎదుర్కొంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో బాలల రంగస్థలం గురించి, దాని ఆవశ్యకతనుగూర్చి మాట్లాడడం సాహసమే అవుతుంది! ఎంతటి ఎండిన నేలయినా, ఓ చినుకు పడగానే పచ్చని మొలక తలెత్తుతుంది. సంక్షోభంలో ఉన్న నాటక సమాజాల్లో నుంచే బాలల నాటక రంగానికి పునాదులు లేస్తాయేమో ఎవరు చెప్పగలరు? ఏమో గుర్రం ఎగరావచ్చు.

- డాక్టర్ దేవరాజుమహారాజు 9908633949