సాహితి

అభ్యుదయ కావ్యం.. ‘మంటలూ-మానవుడూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1970లో డా.సి.నారాయణరెడ్డిగారు ప్రచురించిన కావ్యం ‘మంటలూ -మానవుడూ’. ఇది ఆయన రాసిన 30 కవితల సంకలనం. ఇందులోని ప్రతి కవితా అభ్యుదయ పరిమళంతో అలరారుతు సామాజిక మార్పును ఆకాంక్షగా ప్రకటిస్తున్నది. ఈ కావ్యం వచ్చి నాలుగున్నర దశాబ్దాలు గడిచిపోతున్నా ఇందులోని కవితలు సామాజిక స్వభావాన్ని కోల్పోలేదు. ఈ కావ్యంలో కవి విమర్శనాత్మకంగా చిత్రించిన రాజకీయార్ధిక సాంఘికాంశాలు ఏదో ఒక రూపంలో ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. 1970నాటికి భారతదేశంలో విప్లవోద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి. అటు పడమట బెంగాల్, ఇటు ఉత్తరాంధ్ర, మరోవైపు ఉత్తర తెలంగాణాలలో పరిస్థితులు విప్లవీకరింపబడుతున్నాయి. దేశం రాజకీయంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విప్లవ సాహిత్య యుగం మొదలవుతున్నది. అభ్యుదయ సాహిత్యం పెద్దగా విమర్శలకు గురవుతున్నది. ఆ సమయంలో ‘మంటలూ- మానవుడూ’ కావ్యం వచ్చింది. ఈ కావ్యం మరోసారి అభ్యుదయ కవిత్వ జెండా ఎగురవేసింది.
సమసమాజ ఆకాంక్షను వ్యక్తం చేయడం, వర్గ వ్యవస్థపై విమర్శ పెట్టడం, స్వార్ధపర శక్తులపై యుద్ధం ప్రకటించడం, విప్లవ ప్రబోధం చేయడం, మత శక్తులను ప్రతిఘటించడం, భవిష్యత్తు మీద విశ్వాసాన్ని ప్రకటించడం, దోపిడీని నిరోధించడం, నియంతృత్వాన్ని నిరసించడం, పాతకు వీడ్కోలు చెప్పి ఆగతానికి స్వాగతం పలకడం వంటి అభ్యుదయ కవిత్వ లక్షణాలు ఈ కావ్యంలో పుక్కిటిబంటిగా ఉన్నాయి.
ఏ శక్తులు అడ్డుకున్నా, ఎన్ని అవాంతరాలెదురైనా సమాజం ఎప్పుడూ ముందుకే నడుస్తుందన్న శాస్ర్తియ భావన ఈ కావ్యమంతా పరుచుకుని ఉంది.
ప్రతాపశక్తులు అడుగడుగునా
ప్రభాతాన్ని నిరోధిస్తున్నా..
మానవుడు పురోగమిస్తున్నాడు
పార్టీవ్రత్యం లేని రాజకీయాలు ఇవాళ నిస్సిగ్గుగా సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అవసరాన్ని బట్టి అప్పటప్పటి దాకా ఎన్నికల్లో గెలిపించిన ప్రజల ముఖాన పేడనీళ్లు చల్లి పార్టీలు మారే దుర్మార్గం విచ్చలవిడిగా సాగుతున్నది. ఈ దుర్మార్గాన్ని కవి 1970లలోనే గుర్తించి అధిక్షేపించాడు.
పొద్దున చూరుకంటుకునే బల్లులై
మధ్యాహ్నం గోడమీద పిల్లులై
సాయంత్రం కాగానే ఊసరవెల్లులై
రంగులు ఫిరాయించే అధికారాంధులు (పరమహంసలారా)
అభ్యుదయ కవిది నిరంతర పరివర్తనా సిద్ధాంతం. అభ్యుదయ కవిది ప్రగతిశీల మార్పు ఆకాంక్ష. పాతకు వీడ్కోలు కొత్తకు ఆహ్వానం ప్రగతిశీల కవి కర్తవ్యం. అందుకే కవి ‘పాతముఖాన్ని బహిష్కరించి కొత్త ముఖాన్ని ఆవిష్కరించాలని ఃకోరుకున్నాడు. చైతన్య ప్రబోధం అభ్యుదయ కవికి శ్వాస. స్తబ్దతను బద్దలు కొడుతూ చలనాన్ని రగిల్చడం అభ్యుదయ కవిత్వ లక్షణం. ‘మంటలూ మానవుడూ’ కావ్యం నిండా సినారె అనేక భంగిమలలో చైతన్య శంఖమూదాడు.
చైతన్యమున్న మనీషి స్పందించక ఏమవుతాడు?
హృదయమున్న మనిషి ఎదురు తిరగక ఏం చేస్తాడు? (చైతన్య ప్రగతి)
‘మంటలూ-మానవుడు’ కావ్యంలో వర్గ సమాజ రూపురేఖలు అనేక ముఖాలుగా ఆవిష్కరించాడు కవి.
1970 నాటికి అభ్యుదయ సాహిత్యం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నది. దిగంబర కవులనుంచి విప్లవ రచయితల దాకా అభ్యుదయ సాహిత్యం పైన విమర్శలు పెడుతున్నారు. విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా ప్రకటించి విప్లవ శక్తులకు వేదికగా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘మంటలూ మానవుడూ’ కావ్యం వచ్చింది. సి.నారాయణరెడ్డిగారు విప్లవ శక్తులపట్ల, విప్లవకారుల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వాళ్ల నిజాయితీని గుర్తించారు. అయినా తన మార్గం తనదేనని చాటారు.
తమ్ముని గొంతుకతో శ్రుతి కలపలేకున్నా
దమ్మును మాత్రం మెచ్చుకుంటున్నాను
రాజీపడే అవసరం ఇద్దరికీ లేదు
రాస్తాలు వేరని చాటుతున్నాను (నేనూ-నా తమ్ముడూ)
విప్లవ మార్గంతో విభేదించినా విప్లవాన్ని ఆహ్వానిస్తూనే సి.నారాయణరెడ్డిగారు ‘మంటలూ-మానవుడూ’ కావ్యాన్ని నిర్మించారు. కవి కలం యోధుడు. కాలాన్ని సిరా తాడుతో ముందుకు లాగుతాడు. కవి ప్రగతి వాది అయితే ముందుకు కాకపోతే వెనక్కు నడుస్తాడు. అభ్యుదయ కవిది ‘పదండి ముందుకు’ అనే తత్వం. ‘మంటలూ-మానవుడూ’ కావ్యం ఈ రకమైన కావ్యం. మనుషుల్ని ముందుకు నడిపించే అభ్యుదయ కావ్యం.

- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, 944022211