సాహితి

ఒక భావుకుని మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజోవంతమైన దీపంలా ముఖం
నిట్టనిలువు ఎండ సోకని దేహం
చిరు ఉద్వేగాల కంపనానికి
చెమ్మగిల్లి గుండె చెరువై
ఊగిపోయే ఊరిపోయే
ఆర్ద్రమయ్యే కళ్ళు
ఊకలు విసిరికొడితే చాలు
కందిపోయే కమిలిపోయే చర్మం

వర్షం కడిగిన పచ్చని చెట్టులా
స్వచ్ఛ స్పటిక నిగారింపు
రోజంతా తాజాతనం
పక్కన కూర్చుంటే చందన పరిమళం

లోలోపల అంతరంగం ఎవరినీ నొప్పించని
సహృదయ నవనీతం
ప్రకృతంటే.. వెనె్నలంటే
పడి చచ్చే ప్రియంభావుకుడు
అతని ఊహలు అతని ఆలోచనలు
మెత్తనివి సుకుమారమైనవి
ఉన్నట్టుండి-
సర్వనామాం అయిపోయాడు

జుట్టు చెదరని చలనమేదీ
ముత్యాలు రాలిపడే చిరునగవుల దొంతరేదీ
గుబాళింపుల శ్వాసలేవీ లయాత్మక గుండె చప్పుడేదీ
ఎక్కడికో ఎగిరిపోయిన ఊపిరులు
ఏ మూలో దాక్కున్న చూపులు

అందరిలాగే
ఇపుడు అతని చావు బొమ్మ
నిట్రాడలా బిగిసుకుపోయింది
క్షణక్షణానికి పెరిగే చావు కంపు
అందరిలాగే అందరిలాగే

రోదనలు అదుపులోనే ఉన్నాయి
చుట్టూ మాత్రం వైరాగ్యాల నిశ్శబ్దం.

సూర్యాస్తమయానికి ముందు
భూమికీ ఆకాశానికీ మధ్య
నిచ్చెన పల్లకీలో
తరలించడానికి త్వరపడుతున్నారు

ఎవరికి చెప్పాలి ఎవరిని అడగాలి
ఇది పున్నమి రాత్రి అని
కాసేపు ఆగమని
వెనె్నలంటే అతనికిష్టమని.

జన్మానంతర దీపాలు
అవయవ దానమై
ఏడుగురిలో నిక్షిప్తమయ్యే మహాయోగ్యమై
నిండు ఎండలో మంచు కలలుగా
వెలుగులు జిమ్మితే
ఎంత బావుండును

అపుడు -
అతని కళ్ళల్లో బతికే ఉండును కదా
ఆకుపచ్చని కలలు
వెండి వెనె్నల రాత్రులు.

- దాట్ల దేవదానం రాజు