సాహితి

జన భాషకు జై కొట్టిన కాళోజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పుట్టుక నీది / చావు నీది / బతుకంతా దేశానిది’- అని జయప్రకాశ్ నారాయణ్ మరణించినప్పుడు రాశారు కాళోజీ. ఈ కవితను కాళోజీకి కూడా అన్వయించి చెప్పవచ్చు. దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో మమేకమయ్యారు. తన కళ్లముందు కదలాడిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనాన్ని తన కవిత్వంలోకి ప్రవహింపజేశాడు. ఫ్యూడల్ పాలకులు పీడనకు వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్యానికి ఏ రూపంలో విఘాతం కలిగినా స్పందించి కవిత్వం రాశారు. కవిత్వం రాయడమే కాదు, కార్యరంగంలోకి దిగి ఉద్యమించారు. నిజానికి కాళోజీ జీవితమే ఒక ఉద్యమం. నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్న సంఘాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దాన్ని అభివృద్ధికరంగా మార్చాలని ప్రయత్నించాడు. ఇలాంటి సమాజాన్ని చూసి అశ్రువులు కార్చాడు. సమాజంలోని సమస్యలకు కారణమైన వ్యక్తులపైన, వ్యవస్థలపైన ఆగ్రహం వ్యక్తంచేశాడు. అందుకే కాళోజీ నారాయణరావంటే అశ్రువులు, ఆగ్రహమే. సమాజంలో మార్పును కోరుకున్న కాళోజీ, అహింసే పరమధర్మంగా భావించాడు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రజా చైతన్యానికి ఒక విధంగా దోహదపడేది కవిత్వం. అత్యంత శక్తిమంతమైన ఆయుధం కవిత్వం అని భావించిన కాళోజీ ఎట్లాంటి భాషలో రాయాలి అనే విచికిత్సకు గురయ్యాడు. ఆయన సాహిత్య రంగంలో కాలుమోపుతున్న కాలంలో భావ, అభ్యుదయ భావజాలాలు సాహితీ ప్రపంచంలో ప్రబలంగా ఉన్నాయి. ఇవి రెండూ ఆధునిక సాహిత్య భావధారలకు నెలవులే. ఒకటి జీవితంలో, కవితా రూపంలో స్వేచ్ఛను కోరుకుంది. మరొకటి ప్రజాస్వామ్య భావనకు, వర్గ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి దోహదపడేది. ఒకటి పద్య ప్రక్రియను స్వేచ్ఛగా వాడుకున్నది. మరొకటేమో గేయ ప్రక్రియకు పట్టం కట్టింది. ఈ రెండు చైతన్య ధారలను తన కవిత్వంలోకి ఆహ్వానించి నిరుపమానమైన కవిత్వం రాశాడు కాళోజీ. తాను ప్రజల కోసమే రాస్తున్నాననే స్పృహ ఆయనకు మెండుగానే వుంది. స్వచ్ఛమైన, నిరలంకారమైన ఆయన జీవితానికి నిలువుటద్దం- ‘నా గొడవ’! ఉర్దూ, ఆంగ్లం, తెలుగు, మరాఠీ భాషలు చదువుకున్నాడు. తన కవిత్వానికి పాఠకులైన వాళ్లు బహు భాషా కోవిదులు కారు. కొద్దో గొప్పో సాహిత్యం తెలిస్తే చాలు, వారికి అది తెలియకపోయినా అక్షరజ్ఞానం ఉన్నా చాలునని కాళోజీ అనుకొని ఉంటాడు. అందుకోసమే తనకంటే ముందున్న కవుల ప్రభావం కాని, తన సమకాలీనుల ప్రభావం కాని లేని కవిత్వం కాళోజీది. ఒకవేళ భాష, వస్తువు, అభివ్యక్తి విషయాల్లో పోలిక చూపించదలచుకుంటే ఒక పాల్కురికి, వేమన, గురజాడ సాహిత్యంతో సామ్యతను చూపించవచ్చునేమో! ఆయన వస్తువు, భాష ప్రజలదే. వారికి అర్థమయ్యే రీతిలో ‘నా గొడవ’ రాశాడు. అసంఖ్యాకమైన ప్రజలు కాళోజీ కవిత్వాన్ని ఏ పరిమితులు లేకుండా ఆమోదించారు. కనుకనే ఆయనను ‘ప్రజాకవి’ అని పిలుచుకున్నారు. ఉర్దూ భాషలో చదువుకున్న కాళోజీ, మాతృభాష తెలుగును ఏ దశలోనూ మరచిపోలేదు. తన తల్లి భాష తెలుగు నుడికారం ఎంత గొప్పదో ఆయనకు తెలుసు కనుకనే దాన్ని అవ్యాజంగా ప్రేమించాడు, కవిత్వం రాశాడు. కొంతమంది మాతృభాష తమకు రాదని గొప్పగా చెప్పుకుంటుంటారు. దానివల్ల నాగరికులుగా తమకు పేరు వస్తుందనుకుంటారు. అలాంటివారిని చూసిన కాళోజీ ఆగ్రహించి, వ్యంగ్యంగా కవిత్వంలో విమర్శించాడు.
అసలు సిసలైన తెలుగు భాష పచ్చి పల్లెటూళ్ళలో, స్వచ్ఛమైన ప్రజల వాడుకలో ఉంది. చదువుకున్న వాళ్లు ఇతర భాషలు నేర్చుకొని తమ తల్లి భాషను, సంస్కృతిని విస్మరిస్తున్నారు. భాష అనేది ఒక సాంస్కృతిక హక్కు. ఆ హక్కు ఎంత ఉన్నతమైనదో, విలువైనదో తెలియక అన్యభాషల ప్రవాహంలో కొట్టుకుపోతూ తల్లి భాషకు నీళ్లు తెస్తున్న వారిని కాళోజీ ఘాటుగానే విమర్శించాడు.
తల్లి భాష తెలుగే కావచ్చు.. మరి ఏ తెలుగు అంటే ఆయనే- ‘బడి పలుకుల భాష కాదు / పలుకుబళ్ళ భాష’ కావాలని నిర్ద్వంద్వంగా చెప్పాడు. అతి సామాన్యుడు, ఏ ప్రభావాలూ లేనివాడు మాట్లాడే భాషను కాళోజీ ప్రోత్సహించాడు. దానే్న కవిత్వంలో ప్రయోగించి మెప్పించాడు. ఎవరి వ్యావహారికంలో వారు రాసుకుంటే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందని కాళోజీ అభిప్రాయపడ్డాడు. ఎవరి వ్యవహారికంలో వారు రాసుకుంటే ‘ముఖే ముఖే సరస్వతి’ కాదా అంటాడు కాళోజీ. ఎవరి వాడుక భాషలో వారు రాసుకోవడమే ప్రజాస్వామిక భాషా దృక్పథమని కాళోజీ స్పష్టం చేశాడు. కాళోజీ కవిత్వంలో ఎక్కడా సంస్కృత సమాస భూయిష్టమైన పదాడంబరం కనిపించదు. ప్రజలు నిత్యం మాట్లాడుకునే భాషే కనిపిస్తుంది. సామాన్య ప్రజలు వాడుతున్న పలుకుబళ్ళు, సామెతలు వారి కవిత్వం నిండా కనిపిస్తాయి. భాష ఒక ప్రవాహం. దాన్ని ఎవరూ బంధించలేరు. పదాలకు స్థిర రూపాన్నిచ్చే ప్రయత్నం సరైనది కాదన్నాడు కాళోజీ. ‘వ్యాకరణము సూత్రాలతో / వాణిని బంధించగలమా?.. / నోట నోట బైలెళ్లెడి వాణికి/ చోటు చూపి బంధించుట చాలు / సూత్రాలతో బిగియించుట చాలు’ అంటాడు. తల్లి భాష జీవద్భాష. ఆ సొగసును కాళోజీ కవిత్వంలోనే చూడగలం. తెలుగు భాష ఒక్కటే అయినా ప్రాంతాలను బట్టి భేదాలున్నాయన్నాడు. భేదాలను కలుపుకొనిపోతేనే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందని ఘంటాపథంగా చెప్పాడు కాళోజీ. ఇలా భాషాభేదాలను కలుపుకొనిపోయిననాడే భాష సుసంపన్నం అవుతుందంటాడు. దస్తూరిలో తేడాలున్నట్టే ఉచ్ఛారణలోనూ తేడాలున్నాయి. ఈ ఉచ్ఛారణనే మనం యాస అంటున్నాం. ఈ యాసను ఈసడించుకోవడమంటే భాషను ఈసడించుకున్నట్లేననే తర్కాన్ని మన ముందుకు తెచ్చాడు కాళోజీ. భాషాభివృద్ధికి దోహదం చేసేవి నూతన పదకల్పనలు, పదబంధాలే. కాళోజీ కవిత్వంలో లేఖకుడు, వాదకుడు, శిల్పకుడు, యాంత్రికుడు, దీపకుడు అనే నూతన పదకల్పనలున్నాయి. జీవించడానికి కావాల్సింది ‘విత్తము’ ‘జీవిత్తము’ అని పదకల్పన చేశాడు. బలవంతంగా చలాయించేదానికి దాదాగిరి అని వాడుకలో వుంది. దాన్ని కాళోజీ రాజకీయ నాయకులకు వాడుతూ ‘నేతాగిరి’ అని కల్పించాడు. తెలుగు పదాలనే కాదు ఆంగ్ల పదాల్లో కూడా నూతనత్వం గోచరిస్తుంది. హార్టిస్టు (హృదయంగలవాడు), డెమనాక్రసి (డెమోక్రసి) రాక్షసుల పాలన అనే అర్థంలో దాన్ని కాళోజీ వాడాడు. అట్లాగే నూతన బంధాలు సృష్టించాడు కాళోజీ. పార్టీవ్రత్యం- ఒకే పార్టీకి కట్టుబడలేకపోవడం (పాతివ్రత్యం అనే మాట వాడుకలో ఉంది కదా!). అసమసమాజం అనేదానికి అసామ్య సంఘం, బోర్‌వెల్‌కు బదులుగా ట్యూబు బావి అని, ప్రజలు, రాజకీయాలు అనే రెండు మాటలను కలిపి ప్రజా రాజకీయాలంటాం. దానే్న కాళోజీ ‘ప్రజాకీయాలు’ అన్నాడు. బ్లాక్‌మార్కెట్‌ను ‘కు’బేరాలు అని కల్పించాడు. కుటిల మతులు, దేబే మొగాలు అనే పదాలను ఖాయపరచాడు కాళోజీ. ఇక కాళోజీ కవిత్వంలో పలుకుబళ్లు, నుడికారాలు, జాతీయాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. కుక్కచావు, ఏ ఎండకాగొడుకు, కుంటిసాగులు, బాకాలూదాడు మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
తెలుగు భాషాభివృద్ధికి ఒకవైపు కవిత్వం రాస్తూ, మరోవైపు సాహిత్య సంస్థలతో ఆత్మీయ మైత్రిని కొనసాగిస్తూ, ఇంకోవైపు వివిధ వేదికలపై నుంచి ఉపన్యాసాలిచ్చాడు కాళోజీ. ఆ కాళోజీ స్ఫూర్తిని కొంతైనా మనం అందుకోగలిగితే తెలుగు భాష మూడు పువ్వులు ఆరుకాయలుగా వికసిస్తుంది!

- డా. బన్న అయిలయ్య