సాహితి

‘కాళిదాసుని అపకీర్తి’... విశ్వనాథ సృజన కీర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా కథారచనలో మెళకువలు నేర్పేవారుగానీ, విశే్లషణలు చేసేవారు కానీ కథ ఎత్తుగడ, ముగింపు, నడుమ ఓ సంఘర్షణ వంటివి ఉండాలని చెప్తారు. కథలో పాత్రలు, పాత్రల వ్యక్తిత్వాలు, సంభాషణల ఔచిత్యం వంటి వాటి గురించి చెప్తారు. ఉదాహరణలు చూపుతారు. వస్తువు గురించి మాట్లాడతారు. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం ‘వస్తువు’కు ఉన్నంత ప్రాధాన్యం ఇంకా దేనికీ లేదు. కానీ ప్రతిభావంతులయిన రచయితలు తమదైన రచన సూత్రాలను ఏర్పాటు చేసుకుంటారు. వారు తమదైన ప్రత్యేక పంథాలో రచనను సృజిస్తారు. అన్ని నియమాలను నిబంధనలు తోసిపుచ్చి తమదైన స్వతంత్ర రచన నిర్మాణ శైలిని అవలంబిస్తారు! అలాంటివారు కథలేని చోట కథను సృజిస్తారు. పాత్రలను తీర్చిదిద్దడం, సంఘర్షణలు లేకుండానే పాఠకుడు ఊపిరి బిగపట్టి కథను ఆసాంతం చదివేట్టు చేయడమే కాదు, చదివిన తరువాత పాఠకుడికి తాను ఎంతో విజ్ఞానవంతుడై తనని తాను మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న ప్రపంచ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న భావన కలిగిస్తాడు. అక్షరాలతో అందమైన ఆలోచనల ప్రపంచాన్ని సృజిస్తాడు. ప్రతి పదం, ప్రతి వాక్యం అర్థవంతమై, అమితమైన ఆలోచనలను, విజ్ఞానాన్ని పొదుగుకుని పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కథను ముందుకు నడిపేట్టు సృజన చేస్తాడు. తరచి చూస్తే అసలు ఆ అంశాన్ని కథగా మలచడం కూడా అత్యద్భుతం అనిపిస్తుంది. అంటే కథలేని చోట కథను సృజించి పాఠకుడిని తనదైన ప్రత్యేక సృజనాత్మక ప్రపంచంలో రచయిత పర్యటింప చేస్తాడు. ఆనందింప చేస్తాడు. అదీ ఎలాంటి ఆనందమంటే, అత్యంత విజ్ఞాన దాయకమైన ఆనందం. ఇలాంటి అత్యంత విజ్ఞాన దాయకమూ, వినోదాత్మకమయిన ఆనంద స్వర్గపుటంచుల వరకూ తన రచనతో రచయిత పాఠకుడిని లాక్కువెళ్లడం విశ్వనాధ సత్యనారాయణ సృజించిన మహాద్భుతమైన కథకాని అతి గొప్ప కథ ‘కాళిదాసుని అపకీర్తి’లో అనుభవించవచ్చు.
‘కాళిదాసుని అపకీర్తి’ ఒక విచిత్రమైన సృజన కథ అని ఒక్క ముక్కలో చెప్పవచ్చు. ధర్మదేవతకు ముల్లోకాలలో అన్ని కాలాలలో కాళిదాసు తేజోరాశి కనిపిస్తుంది. అయితే అంత తేజోరాశిలోనూ ధర్మదేవతకు నువ్వు గింజంత నలుపు కనిపిస్తుంది. ఆ నలుపు ఏమిటన్నది కథ. ఒక రచయిత ప్రతిభ గొప్ప కథను గొప్పగా చెప్పడంలో ఉండదు. ఏమీ లేదనిపించే చోట మహాద్భుతమైన నూతన ప్రపంచాన్ని సృజించి పాఠకుడిని ఆ ప్రపంచంలో విహరింపచేసి, అక్షరాల ద్వారా బ్రహ్మనందాన్ని అనుభూతికి తేవడంలో వుంటుంది. ఒక్క ముక్కలో చెప్పగల కథను విశ్వనాథ ప్రకటించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కథలో రచయిత భారతీయ, తాత్త్విక చింతన, సిద్ధాంతాలు, సాహిత్య సృజన దాని ప్రయోజనాలు, సాహిత్య పఠనం వల్ల కలిగే బ్రహ్మానంద అనుభూతి, సాహిత్యం ఏరకంగా వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభవాన్నిస్తుంది వంటి విషయాలను ప్రదర్శించడమే కాదు, రచయిత పరిణతి చెందడం, రచయిత మానసిక స్థితి అతని రచనలో ప్రతిబింబించడం వంటి సాహిత్య పరమైన, మానసిక శాస్త్ర సంబంధిత విషయాలను సైతం ప్రదర్శిస్తాడు. ఆరంభ వాక్యమే వేద విజ్ఞాన సంబంధి అయి పాఠకుడికి వేదాల ఆవిర్భావం విషయంలో అవగాహన కలిగిస్తుంది. ‘నైమిత్తిక ప్రళయం అయిపోవటంతోనే నూతన బ్రహ్మ నిశ్వాసాలు బయలుదేరినై’ అంటు కథ ఆరంభమవుతుంది. భారతీయ ధర్మంలో ఈ ప్రపంచం చక్రనేమి. క్రమేణ ప్రపంచం ఏర్పడుతుంది. యుగాలు గడుస్తాయి. ప్రళయం సంభవిస్తుంది. మళ్లీ నూతన సృష్టి ఆరంభమవుతుంది. వేద విజ్ఞానం సృష్టిలో నిబిడీకృతమై ఉంటుంది. సృష్టి ప్రకటితమైనప్పుడు వేద విజ్ఞానం ప్రకటితమవుతుంది. వేదం బ్రహ్మ నిశ్వాసం అన్నమాట. ఈ ఆరంభ వాక్యం ఈ సత్యాన్ని ప్రకటిస్తోంది. ఆ తరువాత ధర్మ దేవత ‘స్వకీయ తేజో వికారమైనదిన్నీ భవిష్యత్కార్యమైనదిన్నీ అయన కవితా మూర్తి’ వైపు దృష్టి సారిస్తుంది. ఇక్కడ రచయిత కవితా మూర్తిని వర్ణించిన విధానమే కవిత అంటే సాహిత్యం ఎంత పవిత్రమైంది, ఎంత శక్తివంతమైనదో స్పష్టం చేస్తుంది. సాహిత్యం దివ్య సృష్టి మాత్రమే కాదు అది సృజించే రచయిత ద్రష్ట అయి ఉంటాడు. అలాంటి వాడు సృజించే సాహిత్యం వ్యక్తిలోని దివ్యత్వాన్ని జాగృతం చేస్తుంది. అలాంటి సాహిత్య ప్రపంచంలో కాళిదాసు కనిపిస్తాడు. అతడు ప్రభురాశిలో నువ్వు గింజంత నలుపు కనిపిస్తుంది. ఇది కథకు ‘నాందీ ప్రస్తావన’ వంటిది. ఇకనుంచి అసలు కథ ప్రారంభమవుతుంది.
‘బ్రహ్మ నిశ్వాసాలు సుళ్లు తిరిగి బుక్కలైనాయి. యజస్సులైనాయి. సామలైనాయి’ అంటూ అసలు కథ ఆరంభమవుతుంది. అంటే నూతన సృష్టి ఆరంభమైంది. మళ్లీ మానవ ప్రపంచం ఆవిర్భవించిందన్న మాట. ‘త్రేతాదిలో వాల్మీకి ఋషి ముఖ కమలంలో నుండి నూతన చ్ఛందో అవతారం కలిగింది’ అని కావ్య సృజనను, సాహిత్య సృజనకు నాందీ ప్రస్తావన జరిగిందని చెప్తాడు రచయిత. ఇక్కడ ‘వాల్మీకి ఋషి ముఖ కమలం’ అనడంతో ఎలాగైతే కమలంనుండి ఉద్భవించిన బ్రహ్మ నూతన సృష్టి జరిపి వేదవిజ్ఞానాన్ని అందిస్తాడో, అలా వాల్మీకి రామాయణాన్ని సృజించి సాహిత్యానికి వేదం లాంటి రచనను నూతన ఛందస్సును అందించాడన్న భావన కలిగిస్తాడు రచయిత. ఒక రకంగా చూస్తే కవితాత్మక కథా రచన సంవిధానం అన్న మాట ఇది. రామాయణ సృష్టి తరువాత బ్రహ్మ వాల్మీకులిద్దరూ కాళిదాసుని కీర్తిని పరీక్షిస్తారు. నల్లని చుక్క అలాగే ఉంటుంది. ద్వాపరాంతంలో వ్యాసులు అవతరించి భారత కావ్యంతో సహా వేద విభజన, అష్టాదశ పురాణ రచన, బ్రహ్మసూత్రాలు రచించి చూస్తే కాళిదాసు యశస్సు మూడు లోకాల్లో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుంది. కానీ నల్ల మచ్చ ఉంటుంది. రచయిత కాళిదాసుకన్నా ముందున్న మహా కావ్య నిర్మాతలను ప్రస్తావిస్తూ కాళిదాసు ఔన్నత్యాన్ని నిరూపిస్తూ ‘నల్లటి మచ్చ’ విషయంలో ఆసక్తిని రేకెత్తిస్తూ కథను ముందుకు నడుపుతున్నాడు. అంతేకాదు కథలో భాగంగా భారతీయ సాహిత్య నిర్మాతలను వారి సాహిత్య ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ సాహిత్యం దివ్య రూపాన్ని పరిచయం చేస్తున్నాడు. అత్యద్భుతమైన రచన సంవిధానం ఇది.
ఇంతలో కాళిదాసు జన్మిస్తాడు. ఆయన జన్మించిన అగ్రహారం గొప్ప పండితులకు ఆలవాలం. ఇక్కడ రచయిత ఒక వ్యాఖ్య చేస్తాడు. ‘శిల్పమన్న పేరు పెట్టుకుని కవిత్వం ధర్మోల్లంఘన చేయలేదప్పటికింకా’. ఈ వాక్యం ఆధునిక కవిత్వంపై, కవులపై వ్యంగ్య విమర్శ. శిల్పం పేరుతో కవితా శిల్పాన్ని ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టి పిండి చేస్తున్న ఆధునికులపై నిరసన ఇది. ఏ రకంగా సాహిత్యాన్ని భ్రష్టు పట్టించారో అన్నదాన్ని స్పష్టం చేసే వ్యాఖ్య ఇది. కాళి ఋతుసంహారం సృజిస్తాడు. కుమార సంభవం రచిస్తాడు. ఇక్కడ రచయిత మరో చమత్కారం చేస్తాడు. కాళిదాసు ఒక్కో రచనకు ప్రపంచం ఎలా స్పందించిందో అత్యద్భుతమైన రీతిలో వర్ణిస్తాడు. ఇదీ ఈ కథలో గొప్పదనం. ఈ చర్చలు మనకు ఆ కావ్యాన్ని పరిచయం చేస్తాయి. ఒక మనోజ్ఞమైన రస ప్రపంచంలోకి లాక్కువెళ్తాయి. అయితే ప్రపంచం కాళిదాసు రచనలకు పులకరించి రస ప్రపంచంలో ఓలలాడుతుంటే, కాళిదాసు జన్మించి అగ్రహారంలోని పండితులు మాత్రం పట్టించుకోరు. కాళిదాసు మేఘదూతం సృజనకు ‘మధుర భారతి ఒయ్యారాలు పోయి సిగ్గు లొలికించుతుంది. ఆ సేతు శీతాచలం రసమేఘం రంగురంగుల నడకలు నడిచి, సమ్మర్ధము కాని క్షేత్రమే లేకపోయింది’ అని వర్ణిస్తాడు రచయిత. కానీ అగ్రహారంలో కదలిక ఉండదు. రఘువంశం సృజనను ‘రామాయణం వశిష్టులు రామచంద్రులకు దోవ ఇచ్చినట్టు దోవ ఇచ్చిందంటాడు రచయిత. అత్యద్భుతమైన వర్ణన. మాళవిక నృత్యంలో యవ్వన వంతుడైన కవి రసాత్మకమైన సృజనను దర్శిస్తాడు ప్రౌఢుడైన కవి ఊర్వశిని చూసి సౌందర్య పిపాసతో మదమెక్కి ఉన్మాదవస్థలో నాట్యాన్ని నృత్యంగా సృజిస్తాడు. ఆ సృజనను రసవీధుల విస్తృతి పట్టలేదంటాడు రచయిత. కానీ అగ్రహారంలో కదలిక ఉండదు! పరిణతి పొందిన రచయిత శకుంతలలో ‘సర్వ సంసారము యొక్క సారము’ చూస్తాడు. ఆమెను ‘అఖండమైన పుణ్యముల ఫలము’గా దర్శిస్తాడు. ఇలా ఒక్కో కావ్య సృజనను వర్ణిస్తూ ఆ కావ్యం గొప్పతనాన్ని వివరిస్తూ కవి మానసిక స్థితిని, సాహిత్య ప్రపంచాన్ని, రస ప్రపంచాన్ని ఆ రచన పరిపుష్టం చేసిన విధానాన్ని వర్ణిస్తూ చివరలో అగ్రహారానికి మాత్రం కవి గొప్పతనం పట్టలేదంటు కథ ముందుకు సాగుతుంది. చదువుతున్న పాఠకుడు ఒక ఉన్నతమైన రస ప్రపంచంలో విహరిస్తుంటాడు. కవి గురించి తెలుస్తూంటుంది. అతని సృజనలోని ఔన్నత్యం తెలుస్తుంటుంది. సాహిత్య ప్రపంచ వైశిష్ట్యం గ్రహింపునకు వస్తుంటుంది. చివరలో అగ్రహారం నిరాదరణ ఈ భావనను మించి పాఠకుడిని భూమిమీదకి తెస్తుంటుంది. కవితలో మూడు పాదాలలోని భావాన్ని నాలుగవ పాదం విరిచినట్టన్న మాట. ఇక్కడ రచయిత మరో గొప్ప వ్యాఖ్య చేస్తాడు. ‘అగ్రహారం సులభంగా సాధించే ఆనందాన్ని బహు జన్మల చేత సాధిస్తానంది’ అంటాడు. అంటే కావ్యపఠనం, దాన్ని అనుభవించడం, రస లోకాల్లో విహరించడం వల్ల క్షణకాలంలో బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చు. ఉన్నతంగా విహరించవచ్చు. కానీ సాహిత్యాన్ని అనుభవించలేని వారు ఈ ఆనందాన్ని అనుభవించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాల్సి వుంటుంది. ఇదీ సాహిత్య సృష్టి పరమార్థం!
కాళిదాసు వాఙ్మయలోకాల్లో ఎంత కీర్తి సంపాదించినా అగ్రహార నిరాకరణ మచ్చ అలాగే వుంటుంది. కథను ‘మూడు లోకాల మీదా నాల్గు యుగాలు మళ్లీ తిరిగినై. మళ్లీ తిరిగినై. వెలుగుతో నిండిపోయినై. లోకాలు, కాలాలు మచ్చ మచ్చగానే ఉంది’ అంటూ ముగిస్తాడు. అత్యద్భుతమైన ముగింపు. పరమాద్భుతమైన రచనా సంవిధానం. ఇక కథలో సాహిత్య సృజనలోని దివ్యత్వం, దాని పరమార్థం, సాహిత్యం అనుభవించలేని వారి నైచ్యం వంటి విషయాలను ప్రదర్శిస్తూ ఆధునిక సాహిత్య ప్రపంచాన్ని సాహిత్యాన్ని అనుభవించలేనివారు నిర్దేశించడం మనస్సును హత్తుకునే రీతిలో ప్రదర్శిస్తుందీ ‘కాళిదాసుని అపకీర్తి’. కథ అంటే ఇది. కథ చెప్పే పద్ధతి ఇది. అత్యుత్తమ రచనా సంవిధానానికి అత్యుత్తమ దృష్టాంతం ‘కాళిదాసుని అపకీర్తి’. కానీ ఉన్నది ఉన్నట్టు రాయడమే గొప్ప సృజన, చూసింది చూసినట్టు వార్తలా రాయడమే ఉత్తమ కథ అని ప్రచారం చేస్తూ సృజనాత్మక కథారచనను సంకెళ్లలో బంధించి, చుట్టూ ముళ్లకంపల అడ్డుగోడలు నిర్మించిన వారు ఈ కథను ఎక్కడా ప్రస్తావించరు. ఎందుకంటే పాఠకులు ఎలాంటి కథలు చదివితే మందార మకరంద మాధుర్యాన్ని అనుభవించిన మధుపాల్లో ప్రస్తుతం ఉత్తమ కథలుగా చలామణి అవుతున్న కథలు ఉత్త చెత్త కథలని గ్రహిస్తారు. ఎంతో కష్టపడి నిర్మించిన కోటలు, సంకెళ్లు ఆవిరైపోతాయి. ఇలాంటి వారికి ‘కాళిదాసుని అపకీర్తి’లో ‘మచ్చ’ ప్రతీక!

- కస్తూరి మురళీకృష్ణ, 9849617392