సాహితి

జాషువా కవితా ఘంటారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెల 28న జాషువా జయంతి
*
బడిలో, గుడిలో, అడుగడుగునా
అస్పృశ్యతా పైత్యం
నాటక ప్రదర్శన నీ కులపోళ్లకు కాదుపొమ్మన్నా
కవిత బాగుంది కానీ... నీదే కులం?
అని ప్రశ్నించి గుండెల్లో కత్తులు దించినా
కళలకు కులం రంగు పులిమి, ఉన్మాదంతో
ఘోర కులపిచ్చి వికటాట్టహాసం చేసినా
అడుగడుగునా అవమానాల పరంపర కొనసాగినా
నాల్గు పడగల హైందవ నాగరాజులు
బుసలు కొట్టినా
గవ్వకు సాటిరాని పలుకాకులు
కారుకూతలు పెట్టినా
ఎన్ని అవమానాలు ఎదురైనా
అసమానతలు చవిచూచినా
కులమతాలు నిర్మించిన కట్టుబాట్ల
ఇనుప పంజరాలను
వెన్నుచూపని వీరకవి దిగ్గజునిగా
తునాతునకలు చేసి
విశ్వనరునిగా ఎదిగిన జాషువా!
నీ కవితా దృక్పథం - నిత్య చైతన్యపథం.

‘అంటరానితనం’ బురదను పూసి
విర్రవీగిన మతఛాందస వాదులకు
నీ ‘గబ్బిలం’ రెక్కల చప్పుడు - కనువిప్పు
దీనుల ఆకలి ఆక్రందనలు విన్పించి
సమసమాజ స్థాపనకు నాంది పలికిన
నీ ‘అనాధ’ కావ్యం సంస్కరణలకు తొలిమెట్టు
కవిత్వమంటే అంగాంగ వర్ణనలు కాదు
సమస్యల చీకటిని తొలగించే కాంతిపుంజమని
నవ్యపంథాను చూపిన
నీ ‘కొత్తలోకం’ నిత్యనూతన పాఠం
మేధస్సు రోదసిని చేరడం గొప్ప కాదు
విశ్వకళ్యాణానికి బాటలు వేయడమే
ప్రస్తుత కర్తవ్యమన్న నీ ‘ముసాఫరులు’
- ఆచరణీయ గ్రంథం
దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం - నీ ‘బాపూజీ’
వీరత్వానికి, త్యాగనిరతికి సాదృశ్యం - నీ ‘నేతాజీ’
కవి ఆత్మాభిమానానికి ప్రతీక - నీ ‘పిరదౌసి’
ఆదర్శ దాంపత్యానికి అందాల హరివిల్లు -
నీ ముంతాజమహలు
జాతీయాభిమానానికి ఢంకాబాజ -
నీ ‘రాష్ట్ర పూజ’
ప్రతీ ‘ఖండకావ్యం’ మానవతా పరిమళాలను
వెదజల్లే కవితా ఉద్యానవనం
నీ కవితాగానం - అణగారిన బ్రతుకుల్లో ఘంటారావం
జాషువా! నీ కవితల్లో తెలుగు వెలుగుతూనే ఉంది
అణగారుతున్న బ్రతుకులకు
దారి చూపుతూనే ఉంది
జాషువా! కవితా సామ్రాజ్యానికి నీవే పాదుషా!

- పెంకి విజయకుమార్, 95533 92949