సాహితి

రహస్య ద్వారాలు తెరచిన ‘స్వర్ణహంస’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకప్పటికి పాతికేళ్లు నిండి ఉంటాయి. ఆంధ్రప్రభలో ప్రతి ఆదివారం భట్ట నైషధం గురించి వ్యాసాలు వస్తున్నవి. వాటి రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ. వాటిలో ఆయన ప్రతిపాదించిన అంశాలు అన్నీ కొత్తగా ఉన్నాయి. నైషధానికి సాహిత్యంలో పరమోత్తమ అధ్యయన గ్రంధంగా పేరున్నది. అయితే ఈ వ్యాసాలు కావ్యేతి వృత్తాన్ని దాటి, దానిలోని కొన్ని కొన్ని శ్లోకాలను, ప్రయుక్త శబ్దాలు ఆధారంగా అది శ్రీవిద్యా ఉపాసనకు సంబంధించినదిగా- యోగశాస్త్ర సంబంధిగా శేషేంద్ర శర్మ నిరూపిస్తున్నారు. ఆ వ్యాసాలు పూర్తయినాయో లేదో శేషేంద్ర శర్మ శ్రీమద్రామాయణంలోని సుందరకాండను గురించిన షోడశి మంత్ర గర్భితంగా వ్యాఖ్యానించే వ్యాసాలు ప్రకటించటం ప్రారంభించారు. అపుడు ఆ వ్యాసాలు మాకు, మా సహచరులకు అచ్చెరువును కలిగించాయి. లేఖల ద్వారా నాకు శేషేంద్ర శర్మతో పరిచయం ఏర్పడింది. ఆయనను మొదటిసారి కాచిగూడలో తుల్జ్భావన్ దగ్గర ఆయన ఆఫీసులో కలుసుకున్నాను. నైషధం మీద వచ్చిన వ్యాసాలు స్వర్ణహంస అనే పేరుతో అచ్చయి వచ్చాయి. అప్పట్లోనే ఆయన కవిగా కూడా ప్రవేశించటం ప్రారంభం అయింది. ప్రచురణకు ముందే ఆయన ‘శేషజ్యోత్స్న’, ‘మండే సూర్యుడు’ నా దగ్గరికి పంపించారు.
ఆ రోజుల్లో శర్మను వరంగల్లు పిలిపించి వాసవీ గ్రంథాలయంలో ఉపన్యాసాలు ఏర్పాటుచేశాను. ఆ సభ నిర్వహణలో నాకు శ్రీ్భష్యం విజయసారథి ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సమావేశానికి కవి శాబ్దిక కేసరి, న.చ.రఘునాథాచార్యులు అధ్యక్షత వహించారు. ఆ రోజుల్లో స్వర్ణహంసను గురించి ఒక చిన్న వ్యాసం నేను వ్రాసి పంపించాను. ఇదంతా పూర్వరంగం. ఇపుడు మళ్లీ స్వర్ణహంస కొత్తగా అచ్చయి వచ్చింది. అట్లాగే రామాయణ వ్యాసాలు షోడశి పేరున ప్రకటితమైనాయి. లోక శబ్దం వేరు. కావ్య శబ్దం వేరు. లోక శబ్దం పరిమితమైన అర్థానికి సీమితమవుతుంది. సంకేతితార్థ పరిధి దాటదు. కావ్య శబ్దం కావ్య ఇతివృత్త సందర్భంవల్ల అనంతమైన అర్థాన్ని ప్రాప్తింపజేయగలదు. కావ్య శబ్దం వటవృక్షాన్ని గర్భీకరించుకున్న బీజం వంటిది. కావ్య మర్మ భేదకంగా ఉంటుంది. దేశ కాలాల పరిమితులను దాటి విశ్వజనీనమైన భావనకు పాదుపోస్తుంది- ‘మహాకవేః కావ్య గతాశ్చ శబ్దాః / కేచిత్ కథా మర్మభిదో భవంతి / తాదృక్షధాసృష్టి పథే నిగూఢ/ మాణిక్య గోప్తా ఖలు కాళిదాసః’- అని శాకుంతలము యొక్క అభిజ్ఞానత అన్న గ్రంథ పీఠికలో విశ్వనాథ పేర్కొన్నారు.
కావ్య శబ్దం భావుకుని లోకానుభవము మీద, వ్యుత్పన్నతమీద, స్ఫురణమీద ఆధారపడి నూతనార్థాలకు స్ఫురణకు కారణమవుతున్నది. కావ్య శబ్దంలోని అంశాలతో అవి సమన్వయం చెందగలగాలి. ఈ స్ఫురణ వైయక్తిక పరిమితులలో ఇమిడి ఉండదు. వ్యక్తమైన ఈ విశిష్టార్థం సహృదయునకు అధికంగా కావ్యానుభవాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈ నూతన ప్రకాశంవల్ల ఆ కావ్యం పరిమితులు విస్తృతమవుతూ పోతాయి. ‘వ్యాఖ్యానతో విశేష ప్రవృత్తిః’ అన్నది అనుభవంలోనుంచి పుట్టిన వాక్యం. మల్లినాథాదులది అధ్యయనానికి త్రోవ తీసే, త్రోవ చూపే మార్గం. ఎప్పుడైతే కవి ఒకానొక సంప్రదాయాన్నో, సిద్ధాంతాన్నో ప్రతిపాదించబూనినప్పుడు వ్యాఖ్యాత బుద్ధి చాతుర్యానికి ప్రాధాన్యమేర్పడుతుంది. శ్రీ్ధరుని భాగవత వ్యాఖ్య, గోవిందరాజు శ్రీమద్రామాయణ వ్యాఖ్య ఇలాంటివే. తిరువాయ్ మొళి, తిరుప్పావై మొదలైన ద్రవిడ ప్రబంధాల వ్యాఖ్యలు- రామాయణంలో కొన్ని ముఖ్య శ్లోకాలకు పెరియవాచ్చాంబిళ్లై చేసిన వ్యాఖ్యానాలు విశిష్ట మార్గంలో సాగినవే. తెలుగులో వాసుదాసు రచన ‘మందరము’ ఇలా సాగిపోయిన రచనయే.
సాధారణంగా ఈ వ్యాఖ్యానాలలో శబ్దం రూఢ్యర్థం దాటిపోయి గౌణార్థాన్ని పట్టుకొని అంతటా ప్రాకిపోతుంది. ఈ ప్రాకటంలో అది మన వాఙ్మయం అంతా ఆవరిస్తుంది. వ్యాఖ్య అంతా వివృతికారుని సంప్రదాయంతో చివరకు ముడిపడుతుంది. ఈ అంతర్వీక్షణ దృష్టిని ఈ కాలంలో విమర్శకులు రహస్య కథన సంప్రదాయమని పేర్కొంటున్నారు. స్వర్ణహంస మూలాలు ఉపనిషత్తులలో ఉన్నాయి. ఉపాసనలల్లో ఉన్నాయి, భగవాన్ రమణ మహర్షి రమణ గీతలో ఒక శ్లోకం చెప్పినట్లుగా ఉన్నది.
హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం
హ్యహా మహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి
హృది విశ మనసా స్వంచిన్వతా మజ్జతా వా
పవన చలన రోధాత్ ఆత్మ నిష్ఠ్భోవ త్వం
ఈ హృదయంలోని ఆత్మను ఉపాసించటమే దహరోపాసన. ప్రతీకాత్మకంగా చెప్పితే హంస విద్య. హంసోపాసన. కఠోపనిషత్తులో హంస మంత్రం చెప్పబడింది. ఈ హంసయే శుచి- అగ్ని. అనాహతంలో నెలకొని ఉంటుంది. ఈ శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే సింహము అవుతుంది. ఈ సింహము అనాహతమునకు అధిపతియైన సూర్యదేవుడు. దశావతారాలలో శ్రీనారసింహుడు. శేషేంద్ర శర్మ వివేచనలో సంకేతాత్మకమైన కావ్యానికి ధ్వని కావ్యానికి నడుమ భేదాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రబోధ చంద్రోదయం వంటి అలిగోరికల్ కావ్యాల స్వరూపం వేరు. నైషధం వంటి ధ్వని కావ్యాల స్వరూపం వేరు. దీన్ని ధ్వని కావ్యంగా నిరూపిస్తూ శేషేంద్ర శర్మ ఒక అధ్యాయమే వ్రాసినారు. ఇది సాహిత్య విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనం చేయదగిన భాగం.
మరొక అంశాన్ని కూడా శర్మ దీనిలో గుర్తించారు. ఈ కావ్యంలో మానుష పాత్రలు మూడే. నలుడు- దమయంతి- నిషధ దేశాధిపతి భీముడు. మిగిలిన పాత్రలు హంస ఒక పక్షి- దిక్పాలకులు- సరస్వతి - దేవతలు అందరూ మానుషేతర పాత్రలు. ఉన్న ముగ్గురు పాత్రలలోనూ నిషధాధిపతి భీముడు నిర్గుణ పరబ్రహ్మమునకు, దమయంతి ఆ నిర్గుణ బ్రహ్మ వివర్త రూపమైన సగుణ బ్రహ్మమునకు, శ్రీ లలితా త్రిపుర సుందరికి ప్రతీకలుగా మిగిలిపోతే నలుడు పరబ్రహ్మోపాసకుడైన జీవుడవుతున్నాడు. హంస- స్వర్ణహంస హృదయాకాశంలోని ఆత్మస్వరూపం. షట్చక్ర సంచారం చేసేది ఈ హంసయే. ఊర్థ్వలోకాలకు పోవలసినప్పుడు ఈ హంస ఆజ్ఞాచక్రాన్ని స్పృశించి శ్రవణేంద్రియంనుంచి నిర్గమిస్తుంది. కఠోపనిషత్తులోని నచికేతుడు యమలోకానికి ప్రయాణించింది ఈ సాధన మార్గంలోనే. సావిత్రి త్రిరాత్రోపవాసం తరువాత ఈ సాధన ద్వారానే మృత్యువును అనుసరించింది. హంస ప్రతీకను ఉపయోగించి శ్రీహర్షుడు పరమ రహస్యమైన యోగమార్గాన్ని- గురూపదేశం వలన తెలియదగిన అంశాన్ని కావ్య గ్రంథంగా నిలబెట్టడం జరిగింది.
నలోపాఖ్యానం భారతంలో చెప్పబడింది. దానిలో కొంతభాగం శ్రీహర్షుడు గ్రహించి నైషధకావ్యం నిర్మించాడు. ఒక విశేషమైన అంశం ఏమిటంటే భారతంలో చెప్పబడిన అనేక గాథలు వైదిక కాలంలోనే ప్రచారంలో ఉండినవి. ఉదంకుని కథ, గరుడోపాఖ్యానము, ఉపరిచర వసు వృత్తాంతము, నలోపాఖ్యానం ఇలాంటి ఆఖ్యానాలన్నీ అలాంటివే. నలోపాఖ్యానంలో దిక్పాలకులు పాత్రలుగా ఉంటారు. వీరు ఇంద్రాగ్ని యమ వరుణులు. వీరందరూ వేద ప్రసిద్ధ దేవతలు. ఇంద్రుడు సర్వశ్రేష్ఠుడైన దేవతా విశేషం. అగ్ని మర్త్యలోకానికీ, దైవలోకానికీ అనుసంధానం కలిగించే దేవత. యముడు మృత్యుదేవతా స్వరూపం. మృత్యు రహస్యం తెలిపే గురువు కూడా. వరుణ దేవత జలాధిదేవత. ఈ నలుగురికీ మర్త్యలోకంతో విడదీయరాని అనుబంధం ఉన్నది. వీరందరికీ మర్త్యలోకంలో నలుడు ప్రతీక. వారికి దూత అయినారు. దేవతలకు మర్త్యలోకంతో అనుసంధానం ఈ మర్త్యుడు. సాధకుడు. సుందరకాండలో శ్రీరామచంద్రునికీ, సీతాదేవికీ అనుసంధానమైన ఆంజనేయుని వంటివాడు. కథాంశ సామ్యం వరకే ఈ పోలిక. తాననుకున్న శ్రీవిద్యా సాధనకు ప్రధానోపకరణంగా పనికివచ్చే అంశం మటుకు స్వీకరించి శ్రీహర్షుడు ఈ కావ్య కథాపరిమితిని నిర్ణయించుకున్నాడు. ఈ పంచనళీయ కథ భారతంలో మళ్లీ ద్రౌపది విషయంలోనూ పునరుక్తమయింది. అక్కడ అది పంచేంద్రియోపాఖ్యానం. ఇంద్రపంచక గాథ. ఇంద్రియాలు - ఇంద్రుడు - ఇంద్రాంశ జన్ముడైన అర్జునుడు ఇది మరొక కథా చక్రం. నలగాధ తరువాత పాండవుల గాథలో పునః సృష్టింపబడింది. వ్యాసుని వర్ణన ప్రకారం దమయంతి ‘సాక్షాత్ శ్రీరివరూపిణీ’ అనబడింది. ద్రౌపది అగ్నిసంభవ. దమయంతి పరాదేవతకు ప్రతీకయైతే- ద్రౌపది దశ మహావిద్యలలోని కాళికకు ప్రతీక. మొత్తం కథను నడిపించేది ఈ ఇద్దరు స్ర్తిలే. హంస, పరమహంస శబ్దాలు సాధనలో పరమోచ్చ స్థితిని పొందినవారి విషయంలో వాడుతారు. ఇక్కడ హంస ఒక పరమోచ్చ స్థితిని చేరుకున్న జ్ఞానసిద్ధికి ప్రతీక. అందువల్ల ఇది మామూలు ఒక పక్షి దౌత్యం కోసం వినియోగించబడింది కాదు. దౌత్యకార్యాలలో దౌత్యం చేసే వ్యక్తి- ఒక ప్రతీక మాత్రమే. జీవుని ప్రియావియోగంలోనో, పరమాత్మకు దూరమైన వియోగస్థితిలోనో మన కవులు ఈ దౌత్య కావ్య నిర్మాణం చేసినారు. స్వర్ణహంసలో శేషేంద్ర చింతామణి, తిరస్కరిణి మంత్రాలు కవి శ్లోక బద్ధంగా ఎలా గుప్తపరచినారో విశదంగా వివరించారు.
విశ్వనాథ 1949లో ‘నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి’తోనే విమర్శలో కావ్య గర్భంలోనికి ప్రవేశించే పద్ధతి ప్రారంభం అయింది. యాభైలలో కాళిదాసు శాకుంతలాన్ని గురించి, పెద్దన మనుచరిత్ర గురించి, నాచన సోమన హరివంశం గురించి ఆయన ప్రసరింపజేసిన కొత్త వెలుగులు ఈ రహస్య కథన సంప్రదాయానికి స్పష్టమైన మార్గం వేసినాయి. నల దమయంతులు పూర్వజన్మలో శివారాధన చేసి, వారికి ఉత్తర జన్మలో శివుడే దౌత్యం చేస్తానన్న వరమిచ్చిన శివపురాణంలోని గాథను స్మరించి స్వర్ణహంస మూలాలను నన్నయ ప్రసన్న కథాకలితార్థ యుక్తిలో విశ్వనాథ సూచించారు.
1959-61లలో ఈ వ్యాస రచయిత ‘వసు చరిత్ర’ను గురించి పరిశోధన చేసి సందర్భంలో దానిలోని కథా నిర్వహణలో మూడు పొరలున్నాయని- ప్రకృతిలోని వర్షం కురిసే పరిణామం, ఋగ్వేదంలో వృత్ర గాథ, మూడవ స్థాయిలో ఉపరిచర వృత్తాంతం- మూడు పొరలుగా గాథ నిర్మింపబడిందని తన సిద్ధాంత గ్రంథంలో నిరూపించాడు. ఈ అంశం 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన వసు చరిత్ర పాపులర్ ఎడిషన్ పీఠికలో స్పష్టంగా తెలుపబడింది. ఆ విధంగా ఆ పీఠిక ప్రబంధాధ్యయనానికి ఒక నూతన మార్గం వేసింది. శేషేంద్ర స్వర్ణహంస ఒక నూతన వ్యాఖ్యానం ద్వారా నైషధ కావ్య రహస్యాన్ని వెలికి ప్రసరింపజేసింది. అనంతరం రామాయణ రహస్యాలు రచన ముందుకు సాగి సుందరాకాండ ఆంతర రహస్యాన్ని వెల్లడించింది. ఈనాటికీ స్వర్ణహంస అధ్యయనశీలురైన సహృదయులందరూ జాగ్రత్తగా చదువవలసిన గ్రంథం.

- కోవెల సుప్రసన్నాచార్య