సాహితి

సమాజ హితమే సాహిత్య లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీ. శ. 17వ శతాబ్దం వాడైన వేమన సమాజాన్ని వ్యాధిగ్రస్తం చేస్తున్న కుల మతాలను నిరసించాడు. సమాజాన్ని కుల మతాల ముళ్లకంచెలతో చీల్చి, అశాంతిమయం జేసి, మనుషుల మీద పెత్తనం చేయడానికి దోపిడీని కొనసాగించడానికి మనువాదులు చేస్తున్న కుట్రలను కుతంత్రాలను వేమన తన పద్యాల్లో ఎండగట్టాడు. వేమన సాంఘిక అసమానతలు లేని సమాజాన్ని సముద్ధరించుకోవాలంటే కుల మత రహిత సమాజం కోసం కలగన్నాడు గనుకే,
ఉర్విజనులకెల్ల నొక్క కంచము బెట్టి
పొత్తుగుడిపి కులము పొలయజేసి
తలను చేయి బెట్టి తగనమ్మ జెప్పరా
విశ్వదాభిరామ వినురవేమ! అంటూ హితవు పలికాడు.
1910లో ముత్యాలసరాలు రాసిన ‘గురజాడ’ అస్పృశ్యతని నిరసిస్తూ మంచి చెడు అన్నది రెండే కులాలు అంటూ ‘‘యెల్ల లోకము వొక్క యిల్లై వర్ణ భేదములెల్ల కల్లై / వేల నెరుగని ప్రేమ బంధము, వేడుకలు కరియ / అంటూ సర్వమానవ సమానత్వాన్ని, విశ్వమాన ప్రేమను ఆకాంక్షిస్తూ.. ‘‘మతములన్నియు మాసిపోవును /జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’’ అంటూ భవిష్యత్తులో జ్ఞానం మాత్రమే నిలిచి ఉంటుంది అనే దార్శనికతను వ్యక్తీకరించాడు. మానవ సమైక్యతను కాంక్షిస్తూ ‘చెట్టపట్టాల్ పట్టుకొని / దేశస్థులంతా నడవవలెనోయ్ / అన్నదమ్ముల వలెను జాతులు / మతములన్నీ వెలగవలెనోయ్ - అంటారు.
కుల మత పంజరాల్లో కవులు బందీ కాకూడదు. విశ్వనరునిగా కవి హృదయ విశాలత కలిగి వుండాలి. అదేవిధంగా సమాజాన్ని ఉద్ధరించడానికి హితవు పలకాలి. అలాంటి హితవు కవి పాదుషా గుర్రం జాషువా పలికాడు.
‘‘కుల మతాలు గీచుకొన్న గీతల చొచ్చి
పంజరాన కట్టుపడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన, నాకు
తిరుగులేదు విశ్వనరుడ నేను’’ అంటారు. కులమతం పరంగా ఆయనకెదురైన అవమానాలను ప్రతిఘటించాడే కాని ఎవరిమీద పగ, ద్వేషం, ఈర్ష్య, కసి పెంచుకోలేదు. విశ్వనరునిగానే నడిచాడు.
నేడు ‘స్వచ్ఛ్భారత్’ ఎలక్ట్రానిక్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా, ఆచరణలో కాలుష్యం కోరల్లో చిక్కి వైరల్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారినపడి జనం మంచాన పడుతున్నారు. అలాగే ఒకప్పుడు మన రేడియో కార్యక్రమాలు భారతీయ విశిష్టతను, సంస్కృతి సంప్రదాయాలగూర్చి ఎంతో గొప్పగా ప్రసారం చేస్తుండేవి. అవి అన్నార్తుల ఆక్రందనలను, పేదల కడగండ్లను నిర్భాగ్యుల ఆకలిని తీర్చేవి కావు. ఆచరణలో లేని ప్రచారమేలనని జాషువా రేడియో మీద రాసిన పద్యం ‘రేయి బవలు భారతీయ సంస్కృతి పేర / గండ శిలలు చూపి కథలు చెప్పి /కటికి పేదవాని కడుపులో గల చిచ్చు / గడప గలవె నీవు గగనవాణి’ అంటూ నిలదీస్తాడు. అట్లే ఆయన రచన ‘మతపిచ్చిగాని, వర్ణోన్నతిగానీ, స్వార్థచింతనముగానీ నా కృతులందుండదు, శబ్దా/కృతి బ్రహ్మానంద లక్ష్మీనృతమ్మొనర్చున్’’ అంటూ తన కవిత్వపు తీరును చెప్తాడు.
‘మతము’ ఎంత దుర్మార్గంగా మనుష్యుల మధ్య చిచ్చుపెట్టి అనైక్యతకు దారిచూపుతుందో, మతము మానవ హితాన్ని ప్రోత్సహించకుండా మానవ హననానికి దారితీస్తుందనే భావనతో ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి ఇలా చెప్పారు.
‘‘మతము ప్రతి దేశమునందు సౌజన్యము, సౌభ్రాతృత్వము
సమానత్వమును చిందరవందర చేసి, మానవులను అల్లకల్లో
లము జేసి, ప్రపంచశాంతి లేకుండ జేయుటయే కాకుండ
మహాపురుషులనెందరినో తన పొట్టపెట్టుకున్నది’’ అంటారు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ సనాతనవాది. అయినా కుల మతాలను గర్హించాడు. ‘‘కుప్పలు బడ్డా కుల భేదాన్ని / కళ్ళానే్నసి నురిపిడి జేసి / భరత భూమిపై పాటలు పాడుచు /నీ చేతులతో తూర్పెత్తాలోయ్’’ అంటూ అగ్రజాతుల ఆత్మల లోపల / అంటుకుపోయిన అస్పృశ్యతని / అతుక్కుపోయిన అంధత్వాన్ని / పొలి కట్టలతో తుడిచేయమని కరుణశ్రీ సంఘానికి పిలుపునిచ్చారు.
ఇట్లా ఎందరో కవులు జాతి సమైక్యతకు కుల మతాలు అడ్డుగా నిలుస్తూ, సంఘ విద్రోహశక్తుల చేతుల్లో పావులుగా మారుతూ, వారి స్వార్థానికి ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని వెల్లడించారు. సామాజిక హితాన్ని కోరే సాహిత్యం సువిశాలమైన భావనాపటిమతో, లోతైన ఆలోచనలతో ఉండాలి. కనుక సాహిత్యం పాత్ర జీవితమంతా విస్తృతమైంది. సాహిత్యం శాస్త్ర పరిజ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని, హేతుబద్ధమైన ఆలోచనా జ్ఞానాన్ని అందించేదిగా ఉండాలి.
భావ కవిత్వానికి మార్గదర్శకులుగా నిలిచిన రాయప్రోలు సుబ్బారావు అద్భుతమైన దేశభక్తి గేయాన్ని రాశారు. ‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా / ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన / పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ అన్నారు. అట్లే గురజాడ ‘‘దేశమును ప్రేమించుమన్న / మంచి అన్నది పెంచుమన్నా /వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ / గట్టి మేల్ తలపెట్టవోయ్’’ అంటూ దేశభక్తిని ప్రబోధిస్తాడు గురజాడ. త్రిపురనేని రామస్వామి చౌదరి ఒక గేయంలో పౌరుషాగ్ని రగిల్చి వీరత్వాన్ని పురిగొల్పే విధంగా ‘‘వీరగంధము తెచ్చినారము / వీరులెవ్వరో తెల్పుడీ / పూసి పోదుము వీరగంధం / మెడను వైతుము పూలదండలు భక్తితో’’ అంటూ కొనసాగిస్తారు గేయాన్ని. పాశ్చాత్య ప్రభావం వలన పల్లెలు పతనవౌతున్నాయి అంటూ ‘నవ్య పాశ్చాత్య సభ్యత నాగరికత / పల్లెలందు నస్పష్టరూపముల దాల్చి /కాల సమ్మానితములైన, గ్రామ పద్ధతులను విముఖత్వముంగొంత కలుగజేసే’’ అనే మార్పును ఎత్తిచూపాడు దువ్వూరి రామిరెడ్డి.
ఉన్నవాడు, లేనివాడు రెండే రెండు జాతులుగా భావించిన శ్రీశ్రీ దృష్టి సువిశాలమైంది. ఒకే ధ్యేయంతో గమ్యాన్ని వెతికాడు. మరో ప్రపంచాన్ని కలగన్నాడు. అటువైపు జనాన్ని నడవమన్నాడు. ‘‘మరో ప్రపంచం మరో ప్రపంచం / మరో ప్రపంచం పిలిచింది / పదండి ముందుకు / పదండి త్రోసుకు / పోదాం పోదాం పైపైకి /కదం త్రొక్కుతూ / పదం పాడుతూ / హదృయాంతరాళం గర్జిస్తూ / పదండి పోదాం / వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం’’ అంటూ పీడిత వర్గాన్ని పీడకవర్గంమీదకు ఉసిగొల్పాడు.
ఆరుద్ర కూనలమ్మ పదాల్లో సామాజిక స్పృహను మేల్కొలిపి జనాన్ని చైతన్యవంతుల్ని చేసేందుకు యత్నించిన కవి. ఓటు విలువను ఎంత చక్కగా చెప్పాడో చూడండి- ‘‘బ్రూటు’కేసిన ఓటు / బురదలో గిరవాటు / కడకు తెచ్చును చేటు / ఓ కూనలమ్మ’’ అంటూ అధికారం మార్పు ఎట్లాగుంది అంటే ‘‘పాత సీసాలందు / నూతనత్వపు మందు / నింపితే ఏమందు / ఓ కూనలమ్మ’’ అంటారు.
మనిషికి అస్తితత్వం కోసం, వ్యక్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆకలి తీర్చే మెతుకుల కోసం పోరాటం అనివార్యమైంది. ప్రతిఘటన కీలకమైన చర్యగా మారింది. ఈ మార్పును తీర్పుగా చెప్పాడు డా సి.నారాయణరెడ్డి ఒక కవితలో. ‘‘గుండెలు సవాలుజేస్తున్నాయి / తుపాకీ గుండ్లను /తలలు ప్రతిఘటిస్తున్నాయి / లాఠీల మొనలను మడిమలు ప్రవహిస్తున్నాయి /చెరసాలలు మునిగేటట్టు / మెడలు పరాక్రమిస్తున్నాయి / ఉరికొయ్యలు అరిగేటట్టు’’ అంటూ అభివర్ణించాడు. ఈనాడు సాహితీవేత్తలు ఎక్కువ మంది కీర్తి వెంట పడ్డారు. కీర్తి సాహితీవేత్తల వెంట పడడంలేదు. ఏదో విధంగా దొడ్డిదారినైనా పదిమందికి తెలియాలని, వార్తల్లోకెక్కాలనేది కొందరి కవుల మనోవాంఛ. నలుగురి నోళ్లల్లో నానాలనే దురాశతో రాయకూడని రాతలు రాసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. సమాజంలో అల్లకల్లోలాలను సృష్టిస్తున్నారు. ఈ విధానాన్ని ఎత్తిచూపుతూ నిజమైన కీర్తి ఎలా వుంటుందో, వస్తుందో, వ్యక్తీకరిస్తాడు సి.నా.రె. ‘‘నీడలాగ నీ వెంటబడేదే నిక్కమైన కీర్తి /మృత్యు బాహువుల కందలేనిదే నిత్యమైన కీర్తి /డప్పులు డబ్బులు కొని తెచ్చే ఆ మెప్పులకేంగానీ / రొచ్చు ఊబిలో ఉబికొచ్చేదే స్వచ్ఛమైన కీర్తి/ చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తి’’ అంటాడు ప్రపంచ పదుల్లో మహాకవి సినారె.
ఎందరో మన ముందుతరం కవులు కుల మతాలను నిరసించారు. మానవత్వాన్ని ప్రేమించారు. మంచిని ఆరాధించారు. చౌకబారు కీర్తికోసం వాళ్లెవరూ వెంపర్లాడలేదు. పదిమందికి తెలియాలంటే సమాజంలో పాపులర్ కావాలంటే సామాజిక రుగ్మతలను ఎండగట్టే నిజాయితీతో కూడిన కవిత్వం రాయాలి. చీప్ పాపులారిటీకోసం పాకులాడే సాహితీవేత్తలు వివాదాస్పదమైన, కుల మతాల్లో కుమ్ములాటలు పెట్టే రచనలు చేస్తుంటారు. అవి వారి స్వార్థానికి పనికివచ్చినా సమాజానికి చేటు తెస్తాయి. పాత పుండు కోతిపుండవుతుంది.
సాహిత్య రంగంలో సాహితీవేత్తలకు సమాజం యెడల ఒంటి కంటి చూపు పనికిరాదు. కవులు రచయితలు విశాలమైన దృక్పథం కలిగి ఉండాలి. శాస్ర్తియమైన, హేతుబద్ధమైన, సైద్ధాంతిక అవగాహనతో నడుస్తున్న కాలాన్ని అర్థం చేసుకుంటూ మెలకువగా సాహితీవేత్తలు కలం కదపాల్సి వుంది. నిరాధారమైన పరనిందలు, అసత్య ప్రచారాలు, సాహిత్యాన్ని దిగజార్చుతాయే కాని సమాజంలో నిలదొక్కుకొని నిలువజాలవు. కుల మత వర్గ వైషమ్యాలను ఎగదోసే రాతలు పనికిరావు. అవి సాహితీవేత్తల వ్యక్తిత్వాన్ని దిగజార్చుతున్నాయి. దళారీ రాజకీయ వర్గాల జోక్యంతో సాహిత్య రంగంలో రేగిన వివాదం కోతిపుండై కూర్చుంటుంది. సమాజంలో అమాయకుల హననానికి కారణవౌతుంది. సాహిత్య విలువలకే మచ్చ అవుతుంది.
ప్రపంచీకరణ, అగ్రరాజ్యాల వ్యాపార సుస్థిరతను కాపాడేందుకు బడుగు బలహీన దేశాల్లో వస్తు వ్యామోహాన్ని పెంచింది. మనిషి అనుబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మార్చివేయబడ్డాయి. దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా జనమంతా డబ్బు జపం చేస్తున్నారు. నీతి నియమాలకు నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. మనిషి అంటే డబ్బు అనే జబ్బుకు లోనై సమాజం అవినీతితో కుళ్లిపోతుంది. నేటి సాహితీవేత్తలు ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకొని సామాజిక విధ్వంసక మూలాలను ఎత్తిచూపాల్సి వుంది. మనిషికి అక్రమార్జనే ధ్యేయంగా సాహితీవేత్తలమీద వుంది. అన్ని రంగాల్లో అట్టుడికిపోతున్న అవినీతిని ఎండగట్టే చైతన్యాన్ని సాహిత్యం అందించాలి. ఏది ఏమైనా సాహితీవేత్తలు వాళ్ళ ఎథిక్స్‌ను విడనాడకూడదు. సాహిత్యం ఎప్పుడూ సమాజం హితాన్ని కోరుతుందనే సత్యాన్ని సాహితీవేత్తలు మరచిపోరాదు.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243