సాహితి
సమభావం అంటే...?! (స్పందన)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గత వారం ‘సాహితి’లో ప్రచురితమైన జె.ప్రసాదరావు వ్యాసం ‘సమ భావమే సాహిత్య ధర్మం’లో స్పష్టత లోపించింది. అసలు సమభావం అంటే ఏమిటి? సాహిత్యంలో ఆ సమభావాన్ని సాధించటానికి గల పద్ధతులు ఎలాంటివో కనీసం సూత్రప్రాయంగానైనా రచయిత చెప్పలేకపోయారు. ఎక్కడో మొదలుపెట్టి, ఏవేవో అర్థంకాని - అర్థం లేని విషయాలను స్పృశించి ఇంకెక్కడో ముగించిన ఈ వ్యాసానికి ఒక క్రమ నిర్మాణం గాని, హేతుబద్ధత గాని, విషయ సమన్వయం గానీ లేకపోగా అనవసర ప్రేలాపనలు మాత్రం ఒకటీ రెండూ ఉన్నాయి. వ్యాసం ముగింపులో చెప్పిన విషయాన్ని బట్టి పాపం రచయిత తపనను అర్థం చేసుకోవలసిందే కానీ, అర్థమయ్యేలా రాయకపోవడం ఇతని ప్రత్యేకతలా ఉంది. చెప్పదలుచుకున్న విషయం ఎంత ఉత్తమమైనదైనా, పరమ చెత్తదైనా రాయగల శక్తి లేనప్పుడు ఎలా నవ్వుల పాలవుతుందో ఈ వ్యాసమే బలంగా నిరూపిస్తుంది.
అందరి హితం కోరేదే సాహిత్యమంటారు రచయిత. సంతోషమే. అయితే ఆ అందరిలో కొందరు చెడ్డవారుంటే వాళ్ల హితం కూడా కోరుకోవాలా? వాళ్లను సాహిత్యం ద్వేషించాలా? ఆ చెడుకు గల సామాజిక కారణాలను విశే్లషించడం సాహిత్యం చేయవలసిన పనేనని నాలాంటి వాడు అంటాడు. అంటే తప్పవుతుందా? ‘అందరూ’ అన్న పదం అస్పష్టతకే కాదు గందరగోళానికి కూడా దారితీస్తుంది.
సమాజ శ్రేయస్సు కోసం మన పూర్వీకులు రాసిన రచనలు గానీ, కవులను గానీ రచయిత తన వ్యాసంలో పేర్కొనలేదు. ఇటు వ్యక్తిగత స్వార్థం కోసం సమాజాన్ని దూషించే విధంగా రాస్తున్న వారిని గానీ, వారి రచనలను గానీ పేర్కొనలేదు. ఏ పురాణాలను ఎవరు ఎందుకు వక్రీస్తున్నారో చెప్పలేదు. అంతా అస్పష్టమే. ఇలా నీళ్లమీద దెబ్బకొట్టి నేనే గెలిచాను అన్నట్టుగా - అంటని పొంటని వాక్యాలు రాసి ఎవరిని నిందిస్తున్నట్టు? ఎవరిని టార్గెట్ చేసినట్టు? ఆయన స్పష్టంగా చెప్పకపోయినా అర్థమయ్యే విషయమేమిటంటే - అన్యాయానికి బలైపోతున్నవారు ఆ అన్యాయం గురించి రాయొద్దు; కుల వివక్ష వల్ల నష్టపోయినవారు ఆ కుల వ్యవస్థ గురించి మాట్లాడకూడదు; సకల ఆధిపత్యాల వల్ల నలిగిపోతున్నవాళ్లు వాటిని వ్యతిరేకించకూడదు. ఆయనగారి దృష్టిలో సమభావం అంటే ఇదే. అన్యాయమూ - న్యాయమూ; కులవివక్ష చూపేవాడు - దానివల్ల నష్టపోయినవాడూ; ఆధిపత్యవాది - ఆధిపత్యాన్ని సహిస్తున్నవాడూ; పాలకుడు - పాలితుడూ - అంతా ఒకటే. కిందివాడు కిమ్మనకుండా ఉండటమే రచయిత చెప్పదలుచుకున్న సమభావం, సమవాదం.
‘కాకి కోకిల కాదు... కోకిల కాకి కాదు’ - ఇది చదివిన తర్వాత రచయిత కప్పుకున్న ముసుగు ముక్కలైపోతుంది. ఈ రచయిత లాంటివాళ్లు ఎప్పటికీ ప్రజాస్వామ్యవాదులు కాలేరన్నది కూడా నిజమే. మానవతావాదమంటే ఏమిటో కనీస అవగాహన వుండివున్నా ఈ వ్యాసం ఇలా నడిచేది కాదు. మానవతావాదం గురించి ఓనమాలు కూడా రచయితకు తెలియదన్న సంగతి పాఠకులకు సులభంగానే అర్థమవుతుంది.
ఆశ్చర్యాలలోకెల్లా అమితాశ్చర్యం కలిగించే ‘మాయాజనితులైన మానవులు దీనియందు (మాయ) బతుకుతున్నారు. రచనలు చేస్తున్నారు. సమాజానికి కీడు చేస్తున్నారు’ అని అనటం. అసలు ఏమిటీ మాయ? కీడు చేయడమేమిటి? అని మన తలలు గిర్రున తిరిగిపోవలసిందే. మన బతుకులను ప్రభావితం చేస్తున్న అంశాలేమిటో, వాటిపైన మన స్పందనలేమిటో ఆలోచించాల్సింది పోయి అంతా మాయ అంటాడేమిటి? తిరోగమనవాదుల రచనలు ఇలాగే ఉంటాయనడానికి ప్రసాదరావు వ్యాసమే ఓ ఉదాహరణ.