సాహితి

అనన్య ప్రతిభామూర్తి వేటూరి ప్రభాకరశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆంధ్ర భాష పుట్టుకయే గానాత్మకం’’ అని నిరూపించిన ఒక గొప్ప సారస్వత మూర్తి, తెలుగు సాహితీ పరిశోధనా పితామహుడు వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు 1888 ఫిబ్రవరి 7న కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారు. నిజాలను వెల్లడించడమే సాహిత్యానికి పరమావధి. పరిశోధనే అందుకు సరైన మార్గంగా భావించారు. నూనూగు మీసాల నాడే సంపాదించుకున్న శతావధాని వేటూరి ప్రభాకరశాస్ర్తీ అనే గొప్ప పేరును త్యాగం చేసి పరిశోధనవైపు నడక సాగించారు.
సాహిత్య పరిశోధనే నిజమైన సాహిత్య సేవ అనేది ఆయన తీర్పు. ‘‘వచన రచనలో ఏ మోసమూ లేని భావ ప్రసారం ఉంటుంది. ప్రశస్త రచన రసోల్బణమైన ప్రతిభా వికాసము గల సహృదయ వర్గమే చేసేదిగా ఉంటుంది’’ అనే ఈ మాటల్లో ఒక పరిశోధకుడి మనోగతం ఆవిష్కృతమవుతుంది. ‘్భష అడవి వంటిది. కవిత ఉద్యానవనం వంటిది. ఉద్యాన పెంపుసొంపులకు అరణ్య పరిశోధన అవసరమైనట్టే సుకవితకి భాషా పరిశోధన అవసరం’ అని గట్టిగా నమ్మారు. ‘జనులలో ఎన్ని అంతరములున్నవో భాషా రీతులకు నన్ని అనంత అంతరములున్నవి. భూములకు వలే భాషలకును సర్వే జరగవలెను’ (బాల భాష- పీఠిక) అంటారాయన!
ఒక కొత్త బాట వేసిన వారిని తన బాటలో అనేక మంది నడుపుకుపోగలిగినవారిని సాహితీ శాస్తవ్రేత్తలుగా సంభావించాలని, వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు అలాంటి సాహిత్య శాస్తవ్రేత్త అని టేకుమళ్ల కామేశ్వరరావు ‘నా వాఙ్మయ మిత్రులు’ గ్రంథంలో ప్రభాకరశాస్ర్తీగారి గురించి వ్రాశారు. చెళ్ళపిళ్ళ వారి దగ్గర శిష్యరికం ప్రభాకరశాస్ర్తీగారి శాస్ర్తియతా దృష్టికి మూలం. ‘తెలుగున నాకేమని ఎఱుక ఏర్పడే నన్నచో నది వేంకటశాస్ర్తీగారి గురుతానుగ్రహ ప్రాప్తమే! వారి దగ్గర పుస్తకం పట్టి, చదివిన దానికంటే వారి ముఖతః వినోదగోష్ఠిలో విని నేర్చుకున్నదే ఎక్కువ’ అని స్వయంగా చెప్పుకున్నారు. (వేటూరి ఆనందమూర్తి ‘మా నాన్నగారు’- డా. ద్వా.నా.శాస్ర్తీ సంకలనం)
వారి పరిశోధనాతృష్ణ తీరేందుకు మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలో కొలువు తోడ్పడింది. అక్కడ తెలుగు క్యాటలాగులు వ్రాసే ఉద్యోగి సెలవు పెడితే, ఆ స్థానంలో వేటూరివారు తాత్కాలిక ఉద్యోగిగా నియమితులయ్యారు. మానవల్లి రామకృష్ణకవి ఆయనలో పరిశోధకుడిని తట్టి లేపారు. ‘మానవల్లివారు పూర్వకాలపు సంకలన గ్రంథమైన ప్రబంధ మణిభూషణాన్ని బయటపెట్టగా ప్రభాకరశాస్ర్తీగారు దాని విలువను తెలిసిన వారై చాటుపద్య మణిమంజరి రెండు భాగాలను ప్రబంధ రత్నావళిని వలవేసి బయటికి లాగేరు. రామకృష్ణకవి క్రీడాభిరామాన్ని తెలుగు వారికి అందచేయగా, శాస్ర్తీగారు ఆ పుస్తకానే్న ముచ్చటలొలికే పండిత కూర్పును, చక్కని పీఠికతో విందు చేసేరు.. మానవల్లివారి దోవ ప్రభాకరశాస్ర్తీగారికి ఘంటాపథమైంది.’ (నా వాఙ్మయ మిత్రులు)
కందుకూరు వీరేశలింగంగారు ఆంధ్ర కవుల చరిత్ర ప్రథమభాగం సంస్కరణ చేసినప్పుడు శాస్ర్తీగారే ఏయే విషయాలు ఎలా ఉండాలో సూచనలు, సంస్కరణ విధానాలు వ్రాసి ఒక పెద్దకట్ట సమాచారాన్ని పంపారట! పాల్కురికి సోమనాథ ’శివతత్త్వ సారం’ గ్రంథాన్ని కొమర్రాజు వారికి పరిష్కరించి ఇవ్వగా ఆయన 1922లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పక్షాన ప్రచురించారు. (వేటూరి ఆనందమూర్తి).
తెలుగు లిపి ప్రాచీనతకు ఆధారంగా దొరుకుతున్న మొట్టమొదటి తెలుగుపదం ‘నాగబు’ గురించి వెల్లడించింది కూడా ప్రభాకరశాస్ర్తీగారే! ఆ తర్వాత కాలంలో అది నాగబుద్ధి అనే పేరులో చివరి అక్షరం విరిగిపోగా నాగబు మాత్రమే ప్రభాకరశాస్ర్తీకి దొరికిందని పండితులు తేల్చారు. పదం ఏదైనా మన లిపి ప్రాచీనతను ఎదగడానికి అది గొప్పగా తోడ్పడింది. కోరాడ మహదేవశాస్ర్తీ తన ‘హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్’ గ్రంథంలో ఈ పదాన్ని విశే్లషిస్తూ, శాతవాహనుల కాలంనాటి తెలుగులో ‘నాగంబు’ అనే పదం మధ్యలో సున్నా లోపించి నాగబుగా మారి ఉండవచ్చునని అనుమానించారు. వివాహంబు అన్నట్టుగా పదం చివర - ‘ంబు’ పెట్టి పలికే ఆచారం తెలుగులో ఉంది. ఇది చదివిన ఐరావతం మహదేవన్ అనే తమిళ చరిత్ర పరిశోధకుడు సింధు నాగరికత లిపిలో కొన్ని పదాలకు చివర బాణం గుర్తు కనిపిస్తోందని, ‘ంబు’ ప్రయోగానికి సంకేతంగా ఈ అంబు (బాణం) గుర్తుని ప్రయోగించి ఉంటారని ఒక నిర్మాణాత్మక ఊహను అందించారు. ఈ ఊహ సింధు నాగరికతలో తెలుగువారి ఉనికి గురించి పరిశోధనలు సాగించేందుకు ఊతం ఇచ్చింది. ప్రభాకరశాస్ర్తీగారి నాగబు తెలుగువారి చరిత్ర గురించిన కొత్త ఆలోచనలకు ఆ విధంగా దోహదపడింది.
తొలి సారిగా అన్నమయ్య ఉనికిని లోకానికి చాటిచెప్పింది కూడా ప్రభాకరులే! కనీసం 500 ఏళ్లపాటు మరుగునపడిన ఆ పద కవితాపితామహుడి గురించి ఏమీ తెలియని పరిస్థితుల్లో అన్నమయ్య జీవితం గురించి, ఆయన రచనల గురించి ఎన్నో విశేషాలను శాస్ర్తీగారు వెలుగులోకి తెచ్చారు. క్రీస్తుశకం 1945వ సంవత్సరంలో ‘వెంకటేశ్వర వచనాలు’కు పీఠిక వ్రాస్తూ అన్నమయ్య జననం క్రీ.శ.1408గానూ, తాళ్లపాక చిన తిరువేంగళనాధుని ‘శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర’ గ్రంథానికి వ్రాసిన పీఠికలో క్రీ.శ.1424నుండి 1503దాకా సంకీర్తనా రచనలు చేసినట్లు పేర్కొన్నారు. (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర, డా.కేసర్లవాణి).
తాళ్లపాక చిన్నన్న వ్రాసిన ‘అన్నమాచార్య చరిత్ర’ను పరిష్కరించి ప్రచురించారు. అన్నమాచార్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టి, ఆయన వ్రాసిన పదాలకు ప్రాచుర్యం కల్పించారు. సి.పి.బ్రౌన్ గురించి, తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్కను గురించి ఈ తరానికి తెలియజేసినది ప్రభాకరశాస్ర్తీగారే! తిరుమల కొండపైన ఒక పురావస్తు పరిశోధనాశాల ఏర్పాటుకోసం అడవులు, వాగులు, వంకలు అన్నీ తిరిగి ఎన్నో అపురూప శిల్పసంపదను సేకరించి, తెచ్చి భద్రపరిచారు.
1914లో తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్రను ప్రకటించారు. బాసుని సంస్కృత నాటకాలు కొత్తగా వెలుగులోకి వచ్చిన కాలం అది! ప్రభాకరశాస్ర్తీగారు ‘ప్రతిమా నాటకం’, ‘కర్ణ్భారం’, ‘మధ్యమ వ్యాయోగం’ మొదలైన వాటిని తెలుగులోకి అనువదించి ప్రకటించారు. 1913లో ‘కనకాభిషేకం’ అనే చిన్న పుస్తకం ద్వారా శ్రీనాథ మహాకవి జీవితాన్ని తెలియచెప్పారు. ఆ తర్వాత 1923లో ‘శృంగార శ్రీనాథం’ అనే మరో ప్రామాణిక రచన చేశారు. వెంకటేశ్వర వచనములు, శృంగారామరుకము, సుభద్రాకళ్యాణం గ్రంథాలను ప్రకటించారు. 1914లో చాటుపద్య మణిమంజరిలో ‘నవరత్నములు’ పేరుతో ‘గుండభూపాలు నరసింహ మండలేంద్ర’ అన్న మకుటంతో ఉన్న 14 పద్యాలను ప్రచురించారు. వీటి కర్త ఎవరో తెలియదు. ‘గ్రంథకర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు కాదగును.’ (పు.39) అని అభిప్రాయపడ్డారు. 1918లో ‘ప్రబంధ రత్నావళి’ ప్రకటించారు.
అయితే సృజనాత్మక రచనలను ఆయన వ్యతిరేకించలేదు. ‘నేటి నవ్యసాహిత్య విశారదుల నవ నవోజృంభణములన్నీ, నాకు పరమానంద ప్రదములే! మన పరిపూర్ణత రేపటి రోజుల్లో ఉన్నదిగానీ, నిన్నటి రోజుల్లో లేదు. సాహిత్యం ఏ ఒక్కరికో కాక అన్ని వర్గాల వారికి అనుభవింపదగినదిగా ఉండాలి’ అని అంటారాయన. లోకోపకారక భావాలు కలగాలంటే, రచయిత మనసు గొప్ప పరిపాకం కలిగి ఉండాలనీ, ఆ పరిపాకపుటంతరవుల్ని అనుసరించి భావప్రజ్వలనం ఉంటుందనీ ఆయన సూత్రీకరిస్తారు.
‘పావులూరి మల్లన్న’ శాస్ర్తీగారి మొదటి వచన రచన. 1910లో శశిరేఖ పత్రికలో వచ్చింది. ‘శతావధాని వేటూరి ప్రభాకరశాస్ర్తీ’ అని అప్పట్లో వ్రాసుకున్నారు. ఆ తరువాత పరిశోధన వైపు మొగ్గు చూపి అవధానాలు మానుకున్నారని శాస్ర్తీగారి కుమారులు శ్రీ ఆనందమూర్తి వ్రాశారు. అయినా, సృజనాత్మక సాహిత్య సేవను వదులుకోలేదు. ‘కడుపుతీపు’, ‘దివ్యదర్శనము’, ‘మూణ్ణాళ్ల ముచ్చట’, ‘కపోతకథ’ సాక్ష్యం లాంటి కావ్యాల ద్వారా ఖండకృతుల ప్రక్రియకు నాందీ పలికారు. ‘కలికి చిలుక’, ‘కరుణకము’ లాంటి కథలు కూడా అనేకం వ్రాశారు.
ప్రభాకరశాస్ర్తీగారు మాష్టర్ సి.వి.వి. అనుగ్రహించిన యోగ విద్యను ఉపయోగించి ఎందరికో స్వస్థత చేకూర్చారు. ఆయుర్వేద వైద్యుడి పుత్రుడు కావటంవల ఈ వ్యాధి నివారకయోగం బహుశా ఆయనకు జన్యుపరంగా సమకూరిన వరం కావచ్చు. మాష్టర్ వి.పి.యస్. అని శిష్యులు ఆయన్ని గౌరవంగా పిలుస్తారు. తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం వెళ్ళి, తూర్పు గోదావరి జిల్లాలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో బస చేసినప్పుడు ఆ బ్రాహ్మణుడి విధవ కుమార్తెకు పట్టిన దయ్యాన్ని మాష్టర్ సివివి యోగ విద్య ద్వారా నయం చేసిన సంఘటనను తిరుమల రామచంద్ర ఉదహరించారు.
ఆయనకు కుల మత వివక్ష ఉండేది కాదు. ఒక హరిజనుడు, ఒక మహమ్మదీయుడు ఆయన ఇంట్లో ఉండి చదువుకున్నారు. (పోచిరాజు శేషగిరిరావు- మణిమంజరి 9వ భాగం). తిరుపతి గుడికి తొలిసారిగా హరిజనుల్ని వెంట తీసుకువెళ్ళారు.
నిడదవోలు వెంకటరావుగారి పెళ్ళి చేయించింది ప్రభాకరశాస్ర్తీగారే! ఆయనకు ఉత్తరం వ్రాస్తే, ‘నీ అంతఃపురిక క్షేమమా?’ అని అడిగేవారట. చెరుకువాడ నరసింహంగారి అమ్మాయి తన కుమారుడికి ప్రభాకరశాస్ర్తీ అని పేరు పెట్టుకోవటం లాంటి సన్నివేశాలు ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.
తిరుమలలో ప్రాచీన కన్నడ సాహిత్య పీఠం కూడా నెలకొల్పటం కోసం ఆయన ఎంతగానో కృషిచేసారు. ననె్నచోడుని కుమార సంభవంలో కన్నడ సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయని వాటిని అర్థం చేసుకొంటేగానీ పరిశోధన పూర్తికాదని ఆయన అనేవారని తిరుమల రామచంద్ర వ్రాశారు.
ఆయన సామాన్య ఎత్తుకంటే కొంచెం తక్కువేనని, కుదురైన మొహం, పచ్చని చాయ. పూర్వకాలపు లక్షణాలన్నీ ప్రకటించే తలకట్టు ఉండేదనీ, ఆఫీసుకు వెళ్ళేప్పుడు పంచ, కోటు ధరించేవారనీ ఆయనకు అత్యంత సన్నిహితులైన టేకుమళ్ల కామేశ్వరరావు వ్రాశారు.
ప్రభాకరశాస్ర్తీగారు వాడుక భాషా వాది. ‘ప్రఖ్యాత సంకీర్తనాచార్యుల పాటలన్నీ వాడుక భాషలోనే యున్నవి. వాడుక భాషలో ఉన్న పాటలను పదాలను ప్రౌఢవ్యాకరణం ప్రకారం తీర్చిదిద్దటం పువ్వును నలిపి వాసన చూడటం లాంటిది’ (్భరతి- 1941 ఫిబ్రవరి) అంటారాయన. విద్యాశాలలో విద్యాబోధన దేశ భాషలలో సాగించడం, ప్రజాపాలన తంత్రమంతా దేశ భాషలలో సాగించటం ఎంత శీఘ్రంగా సాగుతుందో అంత శీఘ్రంగా దేశభాషా వికాసం కలుగుతుంది (మద్రాసు ఆకాశవాణి ప్రసంగం- తెలుగు వ్యాస మండలి కృ.జి.ర.సం.ప్రచురణ) అనేది భావన. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఎంతో ముందుగా ఆయన ఈ మాటలు అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఆరున్నర దశాబ్దలయ్యింది. ఇంకా దేశ భాష అమలుకాలేదు. ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పట్లో అలాంటిది జరుగుతుందని అనిపించట్లేదు.

- డా. జి. వి. పూర్ణచందు, 9440172642