సాహితి

కేంద్ర సాహిత్య అకాడమీలో పారదర్శకత ఎండమావేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో సకల భారతీయ భాషల ఏక సంస్కృతిని, వారసత్వాన్ని, సాహిత్య రీతులను ఆసేతు హిమాచలం ఆత్మీయం చేసే మహత్తరాదర్శంతో ప్రభవించింది కేంద్ర సాహిత్య అకాడమి. ఇప్పటికి ఇంచుమించు 66 సంవత్సరాలుగా ఈ గొప్ప సంస్థ తన ఉనికిని ప్రకటించుకుంటున్నది. కొన్ని వేల ప్రచురణలను, కొన్ని వందల సదస్సులు, గోష్ఠులు, భారతీయ విశిష్ట రచయితల జయంతులు ఈ సంస్థ నిర్వహించి ఉండవచ్చు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, సునీత్‌కుమార్ చటర్జీ వంటి గొప్పవారు ఈ సంస్థ బాల్య కౌమారాలు నిర్వహించారు. తొలి దశలో పర్యవేక్షించారు. తరువాత తరువాత దుర్దశకు గురయింది. అభ్యుదయ, విప్లవపథ నిర్దేశకుల, నినాదాల గాలి సోకినట్లు ఈ సంస్థ నిర్వహించినవారి నిబద్ధత, నిజాయితీలను తెలుసుకోవడానికి ఏమాత్రం మనం పరిశోధన చేయనక్కరలేదు.
నిజానికి సాహిత్య అకాడమీ ఆలన, పాలన బాధ్యతకు ఉత్తరవాదిత్వం అంటే జవాబుదారీతనం నెత్తికెత్తుకోవలసినవాడు ఈ సంస్థ కార్యదర్శి. యు.ఆర్.అనంతమూర్తి, ఇంద్రనాథ్ చౌధురి, సచ్చిదానందన్ ఇటీవల కాలంలో కార్యదర్శులు. వీరి నిర్వహణలో సాహిత్య అకాడమీ తన పేరు ప్రతిష్ఠలను కించపరచుకొంది. ఆశ్రయింపు, పక్షపాతం, ధూర్తత్వం, భజనపరుల (కాకారాయుళ్ళ) ప్రాధాన్యం సంపాదించుకుంది. 66 సంవత్సరాలలో భారతీయ భాషా సంస్కృతులను పునరుత్తేజితం చేయలేకపోయింది. అపనిందలను, అక్రమాలను, దురన్యాయాలను, దురహంకారాలను మూటగట్టుకొంది. గత 20 సంవత్సరాలుగా కార్యదర్శుల నేరస్థ వాటా నిర్ణయించడం, నిర్ధరించడం ఇప్పుడనవసరం. గతం, గతః. రౌతును బట్టి గుర్రం కుంటుతుంది. గెంతుతుంది. చదికిలపడుతుంది. రౌతును పడదోసి పరిగెత్తుతుంది. అసలు విషయానికి రావడానికి ఇంత ఉపోద్ఘాతం అనవసరమే కావచ్చు. కాని 66 ఏళ్ళ అవతారిక కొంతైనా తెలియాలి కదా!
నాకు, అంటే ఈ నేరారోపణకర్తకు, సాహిత్య అకాడమీతో సన్నిహిత సంబంధం ఉంది. మరీ ఇటీవల ఒక ఆవృతికాలం (ఐదేళ్ళు) తెలుగు సాహిత్య సలహా సంఘం సమన్వయకర్తగా పనిచేసిన దురదృష్టకర అనుభవాన్ని బట్టి కొన్ని అప్రియమైన వాస్తవాలు బాగా తెలుసు. నా పదవి ముగిసే కాలానికి అప్పటి కార్యదర్శి అగ్రహారం కృష్ణపై ఎన్నో అభియోగాలు వచ్చాయి. ఆశ్రీత పక్షపాతం, ధన వనరుల దుర్వినియోగం, ప్రపంచ దేశ పర్యటనలు, సొంత రాష్ట్రం వారిపట్ల అనర్హమైన ప్రాధాన్యం మొదలైనవి. అందువల్ల అనివార్యమైన పరిస్థితులలో మొదట ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసి, ఆ తరువాత బర్తరఫ్ చేశారు. దీనినిబట్టి యుపిఏ ప్రభుత్వ కాలంలో ప్రజా సంస్థలను స్వీయ ప్రయోజనపరులు ఎంత భ్రష్టు పట్టించారో తెలుసుకోవచ్చు. ఇంచుమించు ప్రభుత్వరంగ ప్రజాహిత ఉత్తమాదర్శ సంస్థలన్నీ అంతో ఇంతో కళంకం, మకిలి పట్టించుకోవడం పత్రికలు చదువుతున్న వాళ్లందరికీ తెలిసిందే. మార్క్సిజమనీ, నవ్యభావ ప్రగతి విలసనమనీ, సమసమాజ న్యాయమనీ బూకరింపులతో అవినీతి కథా కాలక్షేపం చేశారు. సాహిత్య అకాడమీ వార్షికాదాయ వ్యయ ప్రతిపాదనలు సుమారు పదివేల కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో. సరే ఈ ‘మహాభారతాన్ని’ అట్లా ఉంచుదాం.
తెలుగు భాషా సాహిత్యాలకు సాహిత్య ఆకాడమీ సేవను ఇటీవలి కాలంలో కాస్త పరిశీలిద్దాం. ప్రతి భాషకూ ఒక సలహా సంఘం ఉంటుంది. 2012 తరువాత సలహా సంఘ సభ్యులే ప్రతి సంవత్సరం పురస్కారాలు సముపార్జించుకుంటూ వచ్చారు. 2013కు తెలుగు సాహిత్య పురస్కారం లభింపచేసుకున్న కాత్యాయనీ విద్మహే మార్క్సిస్టు వీరావేశాభిమాని. ఈ పురస్కారాన్ని నిర్ణయించిన జ్యూరీ సభ్యులతో ఆమెకు తెలిసిన వారున్నారని లోకానికి తెలుసు. ఆ తరువాత మూడేళ్ళు వరుసగా తెలుగు సలహా సంఘ సభ్యులకే పురస్కారాలు వచ్చాయి. వీరిని నిర్ణయించిన జ్యూరీ సభ్యులందరూ కూడా వీరివీరి అస్మదాదులే. అసలు సలహా సంఘ సభ్యులకు అత్యున్నత పురస్కారాలు రావడం అనైతికమూ, ఆక్షేపణీయమూ, అక్రమమూ కదా. ఈ అరవై ఆరు సంవత్సరాలలో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ముందుగానే గూడుపుటాణి జరగకుండా ఇది సంభవ సాధ్యమా? సాహిత్య అకాడమీ వంటి అత్యున్నత భారతీయ గౌరవనీయ సంస్థ ఇట్లా చేయకూడదు. ఇది చాలా గర్హనీయమైన పని. ముందుగా జ్యూరీ సభ్యులను నిర్ణయించుకొని లాలూచీ పడి సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలమని జబ్బ చరచుకొంటూ ఊకదంపుడు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ప్రచారార్భాటపరులు కావడం తగునా? సాహిత్య ఆకాడమీ నిర్వహణ పరిధిలో బాలసాహిత్య, యువ సాహిత్య, అనువాద, సంప్రదాయ సాహిత్య విశేష కృషి పరిగణన, ఆజీవ సాహిత్య మూర్తిమత్వ విశిష్ట పురస్కార సమ్మాన్య సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటి విషయంలో ఇటీవలి కాలంలో పారదర్శకత ప్రశ్నార్థకమైందని తెలుగు సాహిత్య వర్గాలు అనుకోవటంలో విడ్డూరమేమీ లేదు. తక్కిన భాషల వర్గ, కుల, మత నిరపేక్ష, యోగ్యతలు మనకు తెలిసే అవకాశం లేదు. ముఖ్యంగా ప్రధానమైన ఆను వార్షిక సాహిత్య పురస్కారం పరిగణనకు మూడు పుస్తకాలు పరిగణించారు. ఈ మూడు సంవత్సరాలు సలహా సంఘ సభ్యులే కూహకంగా కొట్టేస్తే, జ్యూరీ సభ్యులను తమకు అనుకూలంగా ఏర్పరచుకొంటే 50, 60 సంవత్సరాలనుంచి సాహిత్య సేవ చేస్తున్న వారి గతి ఏమిటి? జ్ఞానపీఠం, సరస్వతీ సమ్మాన్ వంటివి పది సంవత్సరాల కాలవ్యవధిని తమ పురస్కారాలకు పరిగణిస్తారు. కాబట్టి సాహిత్య అకాడమీ కూడా 10 సంవత్సరాలను లెక్కలోకి తీసుకుంటే మంచిది. తెలుగుకు ఇరుగు పొరుగు సాహిత్య రాష్ట్రాలైన తమిళ, కన్నడ, మరాఠీ, ఇంకా మలయాళ భాషలలో సాహిత్య రీతులు, ఆధునిక ధోరణులు తెలియాలంటే సాహిత్య అకాడమీ చేసింది స్వల్పాతి స్వల్పం. ఆయా భారతీయ భాషల సంగ్రహ సాహిత్య చరిత్రలు కూడా ఇంతవరకు వచ్చినట్లు కనిపించదు. ఇక ద్విభాషా, బహుభాషా నిఘంటువుల సంగతి అనుకోనే కూడదు.
ఇంత ధన వ్యయంతో - ఇంత సిబ్బందితో సకల భారతీయ భాషల సలహా సంఘ సభ్యులు 240మంది ఉంటారు. వీరిని పర్యవేక్షించే ఒక సాధారణ, సర్వాధికార మండలి ఉంది. వీరి సంఖ్య ఇంచుమించు నూరుపైనే. అయినా భారతీయ రచయితలకు న్యాయం జరగదు. ఉత్తేజకర ఉత్సాహ ప్రోత్సాహ సర్దర్శనం లభించదు. ఇప్పుడు మరీ కరువైంది.
ఉదాహరణకు ఇంతవరకు ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు, తెలుగువారి చరిత్రను సముజ్జ్వలింపజేసిన అడవి బాపిరాజు, కథక చక్రవర్తి చింతా దీక్షితులు, కవిత్రయం మొదలైన మోనోగ్రాఫ్‌లు రాలేదు. బంగోరే, రాచమల్లు రామచంద్రారెడ్డి, రాచకొండ విశ్వనాథశాస్ర్తీ, కొ.కు.లవి వచ్చాయి. ఇవి రాకూడదని కాదు. కాని ఔచిత్యం లేదు. వావిలికొలను వారివంటి కవి ఆధునిక కాలంలో మరి లేడు అని కట్టమంచి రామలింగారెడ్డి ప్రశంసించారు. అన్నట్లు వాసుదాసుగారు నేటి కాలంలో తొలి ‘ఫెమినిస్టు’ (మహిళా గౌరవ పక్షపాతి). కాబట్టి ఇప్పుడు మనకేం తెలుస్తున్నది? సాహిత్య అకాడమీ సుతరామూ చేయకూడనివీ, అవశ్యం చేయవలసినవీ అయిన పనులున్నాయనే కదా?!!

- డా. అక్కిరాజు రమాపతిరావు