సాహితి

అపహాస్యంగా మారిన పురస్కార ప్రదానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ హితం కోరేది సాహిత్యం. సాహిత్యాన్ని సృష్టించేవారు సృజనకారులు. సామాజిక చైతన్యం కోసం కవులు, రచయతలు రచనలు చేస్తారు. సమాజానికి దిశా నిర్దేశనం చేస్తారు. రుగ్మతలను రూపుమాపుతారు. పాలకులను సరియైన మార్గంలో నడిపించేందుకు ప్రజా సమస్యలను తమ రచనల్లో ప్రతిబింబింపచేసి ప్రజల పక్షాన నిలుస్తారు. సామాజిక బాధ్యతే పరమావధిగా రచనలు చేసే కవులు, రచయితలను సత్కరించే సంప్రదాయం అనాదినుంచీ ఉంది. అయితే.. ప్రస్తుతకాలంలో సాహితీ రంగమందు పురస్కార ప్రదానాలు ప్రహసనంగా మారాయి. సాహితీ క్షేత్రాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. అటు ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల్లో, ఇటు సాహితీ సంస్థలు ప్రదానం చేస్తున్న పురస్కార ఎంపికల్లో పారదర్శకత లోపిస్తోంది.
కొన్ని సందర్భాల్లో అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటుచేసే క్రమంలోనూ ప్రభుత్వాలు ప్రమాణాలేవీ పాటించకుండా సభ్యులను కమిటీలో నియమిస్తున్నట్లు వింటున్నాం. కమిటీ నామమాత్రంగాఏర్పాటుచేసి.. వారి సలహాలు, సూచనలు పాటించకుండానే ‘తూతూ’ మంత్రంగా ఎంపిక కమిటీని సమావేశపరిచి ప్రభుత్వం తాము అనుకున్న అస్మదీయులను కమిటీద్వారా ‘మమ’ అనిపించుకున్నట్లు వింటున్నాం! ఎవరైనా సాహితీ పురస్కారానికి యోగ్యుడని భావిస్తే, ఆయన పేరు పరిశీలనకు రాకుండా ఎంపిక కమిటీలో ఆయనను సభ్యునిగా నియమించి నోరు మూయించిన దాఖలాలున్నట్లు ఆనోటా ఈనోటా వింటున్నాం. ఫలితంగా నిజాయితీగా సాహితీ రంగంలో సమర్థంగా కృషి చేస్తున్న కవులు, రచయితలు నిరాదరణకు గురవ్వడాన్ని గమనిస్తున్నాం. ఎంపిక కోసం కనీస ప్రమాణాలు, నియమ నిబంధనలు, సరైన విధానం లేక ప్రభుత్వ పురస్కారాలు విమర్శకు లోనవుతున్నాయి.
ఇక సాహితీ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లోనూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తమ ఆస్తిత్వాన్ని కాపాడుకోవడానికి.. గ్రంథావిష్కరణలు, కవి సమ్మేళనాలు, పురస్కారాల ప్రదానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కవులు, రచయితల రచనా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కార్యశాలలు, సదస్సులు, సాహితీ గోష్ఠులు, శిక్షణా శిబిరాలు, ప్రచురణలు వంటి కార్యకలాపాల ద్వారా సాహితీ సంస్థలు ఓ సాహితీ వాతావరణాన్ని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలా నిబద్ధతతో పనిచేసే సాహితీ సంస్థలు రెండు రాష్ట్రాల్లోనూ వేళ్లమీద లెక్కపెట్టే విధంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. చాలా సంస్థలు మూసధోరణిలో కొన్ని కార్యక్రమాలకే పరిమితమై పనిచేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ సాహితీసంస్థలు సాహితీ రంగాన్ని అపహాస్యం చేసేలా పురస్కార విక్రయ కేంద్రాలుగా మారాయి. మరికొన్ని సంస్థలు సాహితీ పురస్కార ప్రదానాలకే పరిమితమై వ్యాపార దృక్పథంతో కాలం వెళ్ళదీస్తున్నాయి. చిత్తశుద్ధితో పారదర్శకంగా, నిజాయితీగా సాహిత్య పురస్కారాలను అందజేసే సంస్థల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. అంతర్జాల సేవలు విస్తరించడంతో ఆధునికయుగంలో వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా కవులు రచయితలు అనేక సాహితీ సమూహాలను ఏర్పాటుచేసుకుని తెలుగు, భాషా సాహిత్య వికాసం కోసం కొంతవరకు పాటుపడటాన్ని గమనిస్తున్నాం. అదే సమయంలో కొన్ని వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూపులు కవులు, రచయితలను రాశి కోసం పరుగులు తీయించడాన్నీ వీక్షిస్తున్నాం. రాశికోసం పరుగులు తీసే క్రమంలో వాసిని మరుస్తున్నారు. సాహిత్య కృషిని అసలే పరిగణనలోకి తీసుకోకుండా ఎవరికి పడితే వారికి జాతీయ స్థాయిలో పురస్కారాలు అందిస్తూ సాహితీ రంగాన్ని అపహాస్యంపాలుజేస్తున్నారు. సమర్థులు, యోగ్యులు, అర్హులు, సాహితీ రంగంలో విశేష కృషిచేసిన కవి, రచయితను పురస్కారాలతో సత్కరిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఈ రోజు చాలా సంస్థలు పురస్కార ప్రదానాల్లో ఏ మాత్రం ప్రమాణాలు పాటించడం లేదన్నది జగమెరిగిన సత్యం. కవులుగా చలామణి అయ్యేందుకు ‘పురస్కార ఖర్చులన్నీ నేనే భరిస్తాను, నాకు పురస్కారం ప్రకటించండి’ అంటూ నిస్సిగ్గుగా అడిగే ప్రబుద్ధులూ ఉన్నారు. ఆ ప్రతిపాదనను అంగీకరించే సంస్థలూ అక్కడక్కడా ఉన్నాయి.
సాహిత్య కార్యక్రమాల నిర్వహణలోనూ సంస్థలు అనుసరిస్తున్న విధానం సమంజసంగా లేదు. ఓ గ్రంథావిష్కరణో, సదస్సో నిర్వహించాలంటే.. ప్రేక్షక గణం దొరకక.. పురస్కారాల ప్రదాన తంతును జోడించాల్సి వస్తుంది. ఈ రోజు చాలాచోట్ల కొంతమంది కవులు, రచయితలు తమకేదైనా సత్కారం చేస్తేనే సాహితీ సభలకు వస్తాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గ్రంథావిష్కరణల్లో ఈ రోజు చాలా సంస్థలు ఓ పదిమంది కవులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని చెప్పి.. ప్రేక్షకులను రాబట్టుకోవడం జరుగుతోంది! ప్రముఖులుగా భావించబడేవారు కొంతమంది వారిని అతిథులుగా వేదిక ఎక్కిస్తేనే వస్తామన్న స్థాయికి చేరారు. ఇటు కొత్తవారు రాక, పాతవారిని వేదికపై సర్దలేక అయోమయంలో పడ్డ సాహితీ సంస్థలూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ పురస్కారాలే పరిష్కారమని భావించి. సాహితీ రంగాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతోంది.
ఇకనైనా పురస్కార మైకంలోంచి కొత్త కవులు, రచయితలు తేరుకోవాల్సి ఉంది. సాహిత్య సృజనపై దృష్టిపెట్టాలే తప్ప పురస్కారాల కోసం వెంపర్లాడే తత్వాన్ని విడనాడాలి. అలాగే సాహితీ సంస్థలు, ప్రభుత్వాలు పురస్కార ఎంపికల్లో పారదర్శకత పాటించాలి. అర్హులు, యోగ్యులు, ప్రతిభ కలవారికీ పట్టం కట్టాలి, సాహిత్య వికాసానికి శ్రీకారం చుట్టాలి.

- దాస్యం సేనాధిపతి, 9440525544