సాహితి

ఉద్యోగినులు - కుటుంబ బాధ్యతలు (శ్రీవిరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉద్యోగస్థులయిన శ్రీమతులమీద నేను పరిశోధన చేస్తున్నాను. ముఖ్యంగా మన దేశంలో గృహిణులు ఉద్యోగాలు చెయ్యటం అంతగా వ్యాపించలేదు. స్ర్తిలు గృహిణులుగానూ, ఉద్యోగినులుగానూ ద్వంద్వ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారు, ఏయే సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎలా పరిష్కరించుకుంటున్నారన్నదే నా పరిశోధనాంశం’ అంటూ ఒక పరిశోధకురాలు శ్రీమతిగానూ, ఉద్యోగినిగానూ ఉన్న రచయిత్రిని పరిచయం చేసుకుంటుంది.
శ్రీమతి అబ్బూరి ఛాయదేవిగారు 1975లో వ్రాసి ప్రచురించిన కథానిక ‘శ్రీమతి ఉద్యోగిని’లో భాగం ఇది. నలభయి సంవత్సరాలు దాటిపోయిన తరువాత కూడా స్ర్తి జనాభ్యుదయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, తగినంత జరగలేదని అనేవాళ్లు అవసరం కంటే ఎక్కువగా జరిగిందని వాదించేవాళ్లూ అనేకులు వున్నారు. ‘లోకోభిన్నరుచి’ కదా! ఉద్యోగాలలోనే కాదు, పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులలో కూడా స్ర్తిలకు ప్రత్యేక శాతం కేటాయించాలని ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తోంది. అది అనేక రాజకీయ కారణాలవల్ల యింకా సానుకూలం కాలేదు. ‘పీపుల్స్ రిప్రజెంటేషన్ ఆప్ట్’లో స్ర్తిలకంటూ ప్రత్యేక శాతం లేదు. అన్ని సీట్లకు వాళ్లు పోటీ చేసి పాలన విభాగంలో ప్రవేశించినా ఎలాంటి అభ్యంతరం లేదు. (అటువంటప్పుడు ఈ ఆప్ట్ అవసరమా అనేది మరోప్రక్క- అది వేరే విషయం).
స్ర్తిలకు చదువులు అవసరం లేదనే రోజులు కూడా గత శతాబ్దంలో వున్నాయి. స్ర్తిలకు చదువులు వస్తే జీవితాలు అనర్థకంగా తయారవుతాయని వాదించేవాళ్లు ఇప్పటికీ వున్నారు. స్ర్తిలు చక్కగా చదువుకోవడం, ఉద్యోగాలలో ఉన్నత శ్రేణులకు రావడం మానవాభ్యుదయ పథకం- పరిణామంలో అతి ముఖ్యమైన విషయం అనేది మనం గమనించక తప్పదు.
మళ్లీ కథానికలోనికివస్తే, సుజాత సోషియాలజీ శాఖలో పరిశోధన చేస్తున్న అమ్మాయి. ఉద్యోగస్తురాలయిన శ్రీమతిని కలుసుకుని సంసారానికి, సంపాదనకు, దైనందిన జీవన వ్యవహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేసి తనకు కావలసిన సమాచారాన్ని సేకరించగలుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో మధ్య మధ్య ఉద్యోగస్తురాలి భర్తగారు బద్ధకంగా పడుకునివుండి, కొంత చిరాకును ప్రదర్శించడం కూడా జరుగుతుంది. ‘మొదట్లో ఎందుకు ఉద్యోగంలో చేరారు, ఇప్పుడెందుకు చేస్తున్నారు’ అన్న ప్రశ్నకు ఆమె సమాధానం: ‘మొదట్లో ఇంట్లో తోచక చేరాను. ఇప్పుడు అలవాటయిపోయి చేస్తున్నాను’ అంటారు. ఇంట్లో ఇబ్బందుల నుంచీ, అత్తగారి ఆగడాలనుంచీ తప్పించుకోవటానికి కూడా ఆమె ఉద్యోగంలో చేరలేదు.
‘ఏదో కాలక్షేపం కోసం ఉద్యోగంలో చేరాను కాని, ఊళ్ళేలాలని ఉబలాటంతో కాదు. కానీ, కష్టపడి పనిచేయడంవల్ల కాలక్రమేణా పైకి రావడం తటస్థించింది. ఉద్యోగంలో హోదాతోపాటు పరపతి కూడా పెరిగింది అని కూడా చెబుతుంది. తన ఉద్యోగానికి సంబంధించినవే కాక సంసారానికి చెందిన ప్రశ్నలకు జవాబు చెబుతూ ఆమె ‘ఇద్దరు ఆడబిడ్డలు పెళ్లయినాక ఉద్యోగాలు మొదలుపెట్టారు. ఒక ఆడపడుచు పెళ్లికి ముందు మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి తరువాత కుదరక మానేసింది. మా పెద్ద మరిది భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. రెండవ మరిదికి ఇంకా పెళ్లి కాలేదు అని చెబుతూ వున్నప్పుడే ఆమెకు సుజాత చొరవ, పరిశోధనాకాంక్ష చూసి ఆ అమ్మాయిని తన తోటికోడలు చేసుకోవాలనే ఆలోచన మనసులో మెదిలింది. ఈ ఆలోచన మనసులోనే పెంచుకుని, భర్తతో కూడా సూచనగా అని, కథాంతంలో ఈ మాటలు పలికిస్తుంది. ‘ఎన్నో విషయాలు మనసులో అట్టడుగున దాగినవి, ఎన్నడూ అనుకోనివీ బయటకు వచ్చాయి. అసలు నువ్వాడిన ప్రతివాళ్ళూ ఎవళ్ళకి వాళ్లు వేసుకోవాలి. అటువంటి ఆత్మపరిశీలన అవసరం. నీకు నేనే కృతజ్ఞత తెలపాలి. అదీకాక, నీతో మాట్లాడుతున్నంతసేపు మరొక ఆలోచన నా మనసులో మెదిలింది. ఆ ఆలోచన ఏమిటో చెప్పమని సుజాత అడిగితే ‘తరువాత నీకే తెలుస్తుందిలే’ అని నవ్వుతూ చెప్పి కథను ముగిస్తారు. కథనంలో ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు పాఠకుల ఆలోచనకే వదిలేయాలి అన్న అంశానికి ఇదో చక్కని ఉదాహరణ. వివాహ ప్రసక్తి కొనసాగించటానికి ఇంకా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాలి. అబ్బాయికీ అమ్మాయికీ పరిచయం కల్పించాలి. వాళ్ళు ఇష్టపడేట్లు చేయాలి. ముందుకు ముందుగానే మన నిర్ణయాలు, అవే సరయినవి అనుకుని, బయలుపరచడం మంచిదికాదు అనే విజ్ఞత వున్న ఉద్యోగి ఆమె. దంపతులమధ్య వచ్చే చిల్లర, చిన్న చిన్న విభేదాలను గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అయితే ఇవన్నీ అంత ముఖ్యమయినవి కావనీ, అభిప్రాయ భేదాలు సర్దుకుపోవడంలోనే సంసార సుఖం వున్నదనీ చెబుతుంది.
‘ఎవరో పరాయివాళ్లను పిలిచినట్లు పేరు పెట్టి పిలవడమేమిటి? ముద్దుగా పిలవడం ముఖ్యంగాని పేరులో ఏముంది’ అని సమాధానంగా చెబుతుంది. పరిశోధకురాలు ఇచ్చిన జాబితాలో భర్తను వర్ణించే లక్షణాల వివరాలు వుంటాయి. వాటికి చమత్కరంగా సమాధానాలు రాస్తూ ‘ఆయనకన్నా నేను రెండు అంగుళాల పొట్టి. తమతో సమానంగా ఎట్లా చూస్తారు?’ అంటుంది. భర్తకు తన పైన ప్రేమ, అధికారం వున్నాయని నిర్మొగమాటంగా చెబుతుంది. మళ్లీ జీవితం మొదలుపెడితే ఆయనే్న చేసుకుంటాననీ, వాళ్ళ వారు మాత్రం పెళ్ళే చేసుకోననే అభిప్రాయంలో వున్నారనీ తెలియజేస్తుంది. ‘ఆయనకేం? మగరాయుడు’ అనడంలో కొంత వేళాకోళం, హేళన, చమత్కారం వున్నాయి.
అబ్బూరి ఛాయదేవి బాగా చదువుకుని ఉద్యోగం చేసిన వ్యక్తి. జీవిత పరిశీలన సంసారికంగానూ, ఆధ్యాత్మికంగానూ పరిపరి విధాల చేసిన మనీషి. సాహిత్య ఎకాడమీ పురస్కారం పొందిన కథానిక రచయిత్రి. సమరస జీవనానికి అనువయిన సూత్రాలు ఎన్నో ఆమె రచనలలో విస్తారంగా దొరుకుతాయి. కథానిక ప్రయోజనం సాంఘిక సమరసత తీసుకురావడం అనేదేనని ఆమె చెప్పక చెప్పుతారు.

- శ్రీవిరించి, 09444963584