సాహితి

‘ఐదో ప్రాంతం’లో తెలుగు రచనా వీచికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, శాన్‌ఫ్రాన్సిస్కోకు దిగువ పసిఫిక్ సముద్ర తీరంలోనికి ఒక పాయగా - అంటే మన బంగాళాఖాతంలా చొచ్చుకు వచ్చిన ప్రాంతాన్ని ‘బే ఏరియా’గా పిలవడం పరిపాటి. ఇక్కడ మన తెలుగువాళ్లు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకరించి ఉన్నారు. వాతావరణంలో కొంత సమస్థితి, యాపిల్, గూగుల్ కంటే పెద్దపెద్ద కంపెనీలుండటంతో, ఎక్కువ ఉద్యోగ వసతి ఉండటం కారణంగా, అక్కడ ఉండటానికి ఎక్కువమంది ఇష్టపడతారు. ఉన్నవాళ్లు సాంకేతిక రంగంతో పాటు, భాషా, సాంస్కృతిక రంగాల్లో కూడా తమ ప్రతిభను విశేషంగా చూపుతున్నారు. మొదట్లో ‘బే ఏరియా తెలుగు అసోసియేషన్’ (బేటా) ఒకటి ఉండేది. పోయిన దశాబ్దం మొదట్లో లేదా కాస్త ముందుగా, ‘సిలికానాంధ్ర’ సంస్థ ఏర్పడి, అక్కడితో పాటు ఇక్కడ కూడా గిన్నిస్ బుక్ స్థాయి కార్యక్రమాలు నిర్వహించింది. ‘సిలికాన్ లోయ’ అనేది ఆ ప్రాంతానికి పేరు. నిజానికది ‘సిరికోనె’ చాలా ఖరీదైన ప్రాంతం కూడా.
తమిళుల నుంచి స్ఫూర్తి తీసుకుని, సిలికానాంధ్రావారు, వీలైనంత తక్కువ ఖర్చుతోనే తెలుగు భాషా బోధనను కూడా తెలుగు విశ్వవిద్యాలయ సహకారంతో, అక్కడ తెలుగు దీపాన్ని సముజ్జ్వలంగా ప్రకాశింపజేస్తున్నారు. ఇటీవల ‘బేటా’ వారు కూడా మరింత తక్కువ ఖర్చుతో బే ఏరియా వరకు తెలుగు తరగతులను నిర్వహిస్తున్నారు. సాహిత్య సృజనకు సంబంధించి, సిలికానాంధ్రా వారి ‘సుజన రంజని’ ఈ-పత్రిక ఉంది. మొదట్లో దాని సంపాదక బాధ్యతలు నిర్వహించిన కిరణ్‌ప్రభగారు, స్వంతంగా ‘కౌముది’ ఈ-పత్రికను ప్రారంభించి, నెలనెలా సుమారు నాలుగు వందల పుటలపైన, కొత్త పాతల మేలు కలయికగా, ఆడియో భాగంతో కలిపి అద్భుతమైన పంథాలో నిర్వహిస్తున్నారు. అప్పుడే అది పదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అది తెలుగు వారికి ఉచితంగా అందుబాటులో ఉన్న పత్రిక. దాంతోపాటు కొన్నివేల పుస్తకాలు ఈ-కాపీలను సేకరించి, ఉచితంగా లైబ్రరీ సేవలందిస్తున్నారు. నిశ్శబ్దంగా, నిరాడంబరంగా చేస్తున్న శ్రీమతి కాంతి, శ్రీ కిరణ్‌ప్రభ దంపతుల భాషా కృషి ప్రత్యేకంగా అభినందనీయమైంది.
కిరణ్‌ప్రభ గారిని అందరూ కవిగారంటుంటారు. ఆయన విడిగా కవితా సంపుటాలు వెలువరించలేదు కానీ, ప్రతి నెలా కౌముది ముఖపత్రం మీద ఒక అందమైన కవితను రాస్తుంటారు. వివిధ అంశాలమీద, ముక్తకాల్లాగా స్ఫూర్తిదాయకమైన కవితలైనా, ఎక్కువగా స్పృశించే అంశం, స్నేహం, అమ్మ, జీవన సౌందర్యం. ‘తెరలు పొరలు లేని స్నేహం / అమ్మ ఊరు లాంటిది / ఉన్నప్పుడే కాదు, దూరమైనప్పుడు కూడా / మనలోనే, మనతోనే ఉంటుంది’ - వంటి పంక్తులు బహుశః అక్కడి తెలుగు వారందరి హృదయాలకు ప్రతిధ్వనులేమో! ‘నవ్వు... అల్లాడీన్ అద్భుత దీపం / అందనంత ఆకాశాన్ని సైతం / పాదాల కింద తివాచీలా పరిచేస్తుంది’... వంటి ప్రతిభాన్విత చిత్రాలు ఆయన కవితల్లో తరచూ అగుపించే సహజ చిత్రాలు.
‘సాహిత్యం’ అనగానే అక్కడ మొదటగా గుర్తుకొచ్చేది ‘వీక్షణం’. బే ఏరియాలోని తెలుగు సాహితీ ప్రియులందరికీ అది కేంద్రం. ప్రతి నెలా రెండవ శనివారం, ఎవరో ఒక మిత్రుని ఇంట్లో సాహితీ ప్రియులందరూ సమావేశమవుతారు. తమ కవితలూ, కథలూ చదువుతారు. చక్కటి సాహిత్య అంశాలమీద ప్రసంగిస్తారు. తెలుగు రాష్ట్రాలనుంచి ఎవరైనా రచయితలు, సాహితీవేత్తలు వచ్చారని తెలిస్తే, ఆహ్వానించి, వారి ప్రసంగాలను ఏర్పాటుచేస్తారు. ఏటా ఒక ప్రత్యేక ఈ-సంచికను వెలువరించి, కినిగీ వారి సహకారంతో తెలుగు అభిమానులకు ఉచితంగా అందిస్తున్నారు. దీనికి శ్రీకారం చుట్టిన ముఖ్య కార్యకర్త, ప్రముఖ కవయిత్రి డా. కె.గీత. తన పదిహేడవ ఏటే ఈమె రాసిన మూడు కవితలు ‘నీలి మేఘాలు’ స్ర్తివాద కవితా సంపుటిలో, చోటుచేసుకున్నాయి. ఆవిధంగా ఈమె అక్కడివారందరిలోనూ సీనియర్ కవయిత్రి. ‘వీక్షణాని’కి అండదండలు ఆచార్య వేమూరి రావుగారు, కిరణ్‌ప్రభ ప్రభృతులు సుమారు 30మంది. ఆచార్య రావుగారు వృత్తిరీత్యా కంప్యూటర్ ప్రొఫెసర్ అయినా, యు.సి.డేవిస్, బర్కత్ విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధనను ప్రారంభించారు. బర్క్‌త్‌లో తెలుగు ఆచార్య స్థానాన్ని స్థాపించడానికి తన వంతుగా ఏభైవేల డాలర్ల నిధిని ఇస్తూ, మిగిలిన మొత్తం సమకూర్చడానికి శ్రమిస్తున్నారు. ఈయన మంచి రచయిత కూడా. సైన్సు వస్తువుగా రచనలు చేయడం ప్రీతి.
గీత గారిది స్ర్తివాద కవిత కాదు. స్ర్తి వేదనా కవిత. తన ప్రమేయం లేకుండానే, స్ర్తి అటు ప్రకృతితో, ఇటు సమాజంతో ఎన్నివిధాల బాధలకు గురవుతుందో అద్భుతంగా, అతి సున్నితంగా వ్యక్తీకరిస్తారు. ‘్భగవంతుడా! అణచివేత, మోసపోవడం, క్షమ, బాధ్యత, జైలు జీవితం / కన్నీళ్లు నిండిన పక్కటెముకని తీసి స్ర్తిని తయారుచేశావెందుకు?’ వంటి వ్యథాభరితమైన పంక్తులు ఆమె కవితల్లో తరచూ సాక్షాత్కరిస్తాయి. జన్మసిద్ధంగా స్ర్తి గురయ్యే బాధను చెబుతూ, ‘ఎన్నాళ్లిలా అవయవాల్ని కడుపులోకి కూడగట్టుకోవడం? / దారం లేని గాలిపటాన్ని ఎన్నాళ్లని కాపాడుకోటం? / ఈ ఒక్క అవయవాన్ని విసిరవతల పారేస్తే చాలు / మరో సృష్టి ఇంకాగిపోతే చాలు’ అనే పంక్తులు నీలి మేఘాలు పాఠకులకు పాతికేళ్లయినా ఇంకా గుర్తున్నవే. ఆమె తొలి సంపుటి ‘ద్రవ భాష’ (2001)కు అజంతా అవార్డు లభించింది. అమెరికా వెళ్లాక ‘శీతసుమాలు’, ‘శతాబ్ది వెనె్నల’ కవితా సంపుటాల్ని వెలువరించారు. బే ఏరియా వెళ్లిన ఏ సాహిత్య విదుడైనా ముందుగా ఆమె ఆతిథ్యం అందుకోవలసిందే. అనుభూతి, ఆలోచనలు (అఆలు) కలిసింది కవిత్వమని తన బ్లాగులో నిర్వచిస్తూ, అభిమానం, ఆత్మీయతలతో ఆతిథ్యమిస్తారు.
‘ఈ కిటికీ తెరుచుకొనేది ఊహల్లోకే’ కవితా సంపుటిని 2014లో వెలువరించిన శ్రీమతి షంషాద్ అక్కడి మరో మంచి కవయిత్రి. ప్రముఖ కవి, రచయిత డా. దిలావర్‌గారి పెద్దమ్మాయి. మొత్తం కుటుంబానికంతా ఉన్న సాహిత్య సంస్కారం ఆమె ఊహల్లో జాలువారుతుంది. ఈమెది కూడా అచ్చమైన స్ర్తి వేదనా కవిత. ఆడవారి కన్నీళ్ళను అతి సున్నితంగా అక్షరాల్లో సాక్షాత్కరింపజేస్తుంది. ‘‘మానని గాయాలు మరెప్పుడూ మరెవ్వరికీ తగలకుండా / మందేదైనా ఇవ్వమ్మా / ఆడజాతంతా మింగేస్తాం / పుట్టే ప్రతి ఆడపిల్లకి పురిట్లోనే వేసేద్దాం’’ లాంటి దుఃఖార్ద్రమైన మాటలు, ‘‘కార్చేదంతా వెనె్నలే / మచ్చ మాత్రం మిగిలే ఉంది’’ వంటి ఆవిష్కారాలు, ‘‘నీ జీవితపు స్టూడియోలోంచి / బయటకు రాలేకపోయినా / నా హృదయపు డార్క్‌రూంలో / నువ్వెప్పుడూ నెగటివ్‌వే’’ వంటి శక్తిమంతమైన ఊహలు ఆమె కవితల్ని మరింత శక్తిమంతం చేశాయి. ఈ సంపుటిలోని ‘పర్సనల్ లా’ - ఏ బృహత్కవితా సంపుటుల్లోనైనా తప్పక చోటుచేసుకోగలిగే ఉత్తమ కవిత. పోయిన ఏడాది ఫేస్‌బుక్‌లో పెట్టిన ‘శుక్కురారం పుట్టిందాన్ని’ కవిత, ‘పుట్టింట లచ్చిందేవి, అత్తింటి శనిగా’ మారి పొందే ఆత్మహింసను చిత్రించే ఓ మినీ పూర్ణమ్మ కథ.
అక్కడి కవులందర్లోనూ ప్రౌఢ కవి నాగరాజు రామస్వామిగారు. తెలుగులో రెండు స్వంత కవితల సంపుటులు, రెండు అనువాద కవితల సంపుటులే కాక, ఆంగ్లంలోనూ ఒక స్వంత కవితల సంపుటి, ఒక అనువాద కవితా సంపుటి వెలువరించారు. అవిగాక ‘ఈ పుడమి కవిత్వం ఆగదు’ పేరిట కీట్సు కవితల సమగ్ర అనువాదాన్ని వెలువరించారు.
సాంప్రదాయిక భాషా సంస్కారంతోపాటు, ఆధునిక ప్రతిభాన సంస్కారం కూడా ఆయన సొత్తు. ఎన్నో దేశాలు తిరిగి, అమెరికా పచ్చకార్డు పుచ్చుకొన్నా, ఆయన హృదయంలో మాత్రం ఇప్పటికీ కరీంనగర్ జిల్లా ఎలగందులవాసే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘నేనున్న వలస దేశం నా స్వగ్రామ విస్తృతినే తలపిస్తున్నది’’ అని భావించే కవి. దేశీయత, గాఢమైన తాత్వికత, అద్భుతమైన ప్రతీకాత్మకత ఆయన కవితల్లో ఒరసి పారుతుంటాయి. ‘మృత్యుసంధ్య’ అనే ఆయన కవిత వేలల్లో ఎన్నదగ్గ ఉత్తమ కవిత. ‘‘పొరలు పొరలుగా కదులుతున్న పరాపర స్పృహ / పొడలు పొడలుగా చీలుతున్న ఇహపర స్పర్శ / భావాభావ అస్పష్ట సంధి గీత మీద / ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు’’గా సాగే ఆ సంధ్యావేళ జీవుడి స్థితిని, ఆయన చిత్రించిన తీరు వ్యాఖ్యానాలకు అతీతంగా పఠితలను తీసుకెళ్తుంది. ‘‘సుతిమెత్తని ఉదయం కనురెప్పల కింద / కవిత్వం కంటిపాపై కదులుతున్న దృశ్యాన్ని చూపిస్తుంది. సుప్త చేతనలోని / సుషుప్తి వాక్యాన్ని ప్రవహించుకునే’’ కవి ఆయన.
విడిగా కవితా సంపుటులు వేయకపోయినా, అంత బిజీ సాంకేతిక జీవితంలోనూ, గుండె స్పందనలను అక్షరాలుగా మార్చుకొనే కవులెందరో ఉన్నారక్కడ. చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న పంక్తుల్లో, ఆర్ద్రమైన భావాలు చెప్పడంలో వేణు ఆసూరి గారిది ఓ ప్రత్యేక శైలి. రాష్ట్రం విడిపోయినప్పుడు ‘‘కవలలిద్దరిని కని / ఆ తల్లి శలవు తీసుకొంది / ...వెళ్లిపోయిన ఆ తల్లి కోసం / ఓ కన్నీటి చుక్క...’గా రాసిన ‘సెలవమ్మా’ అనే కవిత ఆయన భావార్ద్రతకు అద్దం పడుతుంది. ‘సిప్పు సిప్పుకి బలమిచ్చే టానిక్ / కానీ ఖర్చులేని మ్యాజిక్ / గాసిప్, గాసిప్’ వంటి చమత్కారికతా, ‘కాలం ఘనీభవించి / నిశ్చల యోగనిద్రలో నిలిచిన విశ్వం / ఏ అదను కోసం కాచుకొందో’ అంటూ మహా విస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్)ను దర్శించే వైజ్ఞానిక తత్వదర్శనాలూ ఆయన కవితల్లోని భిన్న పార్శ్వాలకు ప్రతీకలు. వేణుగారి లాగే సాంకేతిక రంగానికి చెందినవారైనా, ఇటీవలే సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టినా, అటు సంస్కృతంలోనూ, ఇటు తెలుగులోనూ ప్రౌఢమైన ఛందోబద్ధ కవిత్వం విస్తృతంగా రాస్తున్నారు శ్రీ చరణ్‌గారు. ఈ జనవరిలో వివేకానంద జయంతి సందర్భంగా వారు రాసిన సీస పద్యంలోని ‘్భతి భూతమున్ పరిమార్చ విక్రమించి / ఇనుప కండరాల్ బిగియించి ఏకమయ్యి / ఉక్కు నరముల నిగిడించి దిక్కులెగయ / యువత చైతన్యమై రార! నవ నరేంద్ర!’ ఆయన పద్య ప్రౌఢిమకు చిన్న ప్రతీక. భక్తి ప్రధానంగా సాగే వారి కవితా శక్తి తెలుగులో కంటె సంస్కృతంలో మరింతగా శోభిస్తుంటుంది. అలాగాక తేట తెనుగులో జీవన వాస్తవాలను రావు తల్లాప్రగడ ఛందోబద్ధంగానే చాలా అందంగా చెబుతారు. కాస్త పాటగా మార్చి, లయబద్ధంగా వ్యంగ్య చిత్రాలను రాయడంలో కె.శారదగారిది ఓ ప్రత్యేక బాణీ. కవితలు రాయకపోయినా, కథారంగంలో, ప్రస్తుత సుజన రంజని సంపాదకులు తాటిపాముల మృత్యుంజయుడుగారు సుప్రసిద్ధులు. అనిల్ రాయలు ప్రభృతులు అటు కవితలు, ఇటు కథలూ రాసేవారు ఎక్కువమందే ఉన్నారు. భాషా సాహిత్యాల్లో అనుమానాలు తీర్చేటందుకు, దాదాపు అక్కడే స్థిరపడుతున్న అక్కిరాజు రమాపతిరావు లాంటి పెద్దలూ ఉన్నారు. వీరందరి కృషి వల్ల, అమెరికా ప్రాంత తెలుగు సాహిత్యంలో బే ఏరియా సాహితి ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. మొత్తంపై తెలుగుకి అమెరికా అయిదో ప్రాంతంగా మారుతోంది.

- గంగిశెట్టి లక్ష్మీనారాయణ 9441809566