సాహితి
వట్టికోట శత జయంతి వట్టిమాటేనా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ సాహిత్యానికి, సాహిత్య చరిత్రకు, సాహిత్యకారులకు దక్కవలసిన న్యాయమైన స్థానం నేడు దక్కకుండా పోతుంది. గతంలో తెలంగాణ కవులూ, రచయితలూ, కళాకారులు తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపడానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ కవులను, రచయితలను, కళాకారులను పూర్తిగా విస్మరించడం జరుగుతుంది. తెలంగాణ భాషను, సంస్కృతిని నిజాం రాజుల నుండి కాపాడిన తొలితరం వైతాళికుడు వట్టికోట ఆళ్వార్‌స్వామి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణకు సంబంధించినంత వరకు వట్టికోట తొలి నవలా రచయిత. ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని మాధవరం- కలాన్ గ్రామంలో 1915 సంవత్సరం నవంబర్ ఒకటిన జన్మించారు. 2015లో వట్టికోట శత జయంతి ఉత్సవాలు జరుగవలసి వుండె. కానీ జరుగలేదు. నేడు తెలుగు సాహిత్యంలో వట్టికోట స్థానాన్ని అంచనావేయాల్సిన అవసరం ఉంది. నిజాం వ్యతిరేక ఉద్యమాలను నిర్వహించిన ఉద్యమ జీవి. గొప్ప రచయిత. కార్యకర్త. సంఘసంస్కర్త. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీయడానికి ‘రచన’ అనే ఆయుధాన్ని ఎంచుకున్నారు. సాంస్కృతిక పునరుజ్జీవంకోసం నడుంకట్టి చివరికి జాతీయ ప్రగతిశీల ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి విస్తరించారు. గ్రంథాలయోద్యమాల ద్వారా సామాజిక చైతన్యానికి పునాదులు వేసిన కార్యశీలి. ఆంధ్రపత్రిక స్థాపకులు కాశీనాధుని నాగేశ్వరరావు స్మారక చిహ్నంగా 1938లో సికింద్రాబాదులో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 33 గ్రంథాలను ప్రచురించారు. కాళోజీ ‘నా గొడవ’ స్ఫూర్తితో వట్టికోట ‘రామప్ప రభస’ పేరిట రచనలు చేశారు. 1938కి పూర్వంనాటి తెలంగాణ స్థితిగతుల్ని, రాజకీయాల్ని చక్కగా ప్రతిబింబించిన నవల ‘ప్రజలమనిషి’. ఈ నవల నిజాం నిరంకుశ పాలనకు, ఆనాడు దేశ్‌ముఖ్‌లు దొరలు సాగించిన అరాచకాలకు అద్దం పడుతుంది. మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడమనే లక్ష్యాన్ని ‘ప్రజల మనిషి’ నవలలో కంఠీరవం పాత్ర ద్వారా వాచ్యంగానే చెప్పిస్తారు వట్టికోట. మంచి ప్రభుత్వమంటే ఏమిటని బషీర్ చేత ఒక ప్రశ్న కూడా వేయించి ‘కంఠీరవం’ చేత సమాధానం చెప్పిస్తారు. యాభై ఏళ్ళ క్రితమే ప్రజల బంగారు భవిష్యత్తును గురించి కన్న కలను సార్థకంచేసే మంచి ప్రభుత్వం ఏర్పాటును కాంక్షించి పీడిత ప్రజల పక్షాన నిలిచిన ‘ప్రజల మనిషి’ వట్టికోట. 1940-45 ప్రాంతాల్లో తెలంగాణ రాజకీయ ప్రజాఉద్యమాలను చిత్రించే ఇతివృత్తంతో గంగూ నవల రాశారు. ఈ విధంగా ప్రజల మనిషి, గంగూ నవలల్లో ఆనాటి ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబించిన ఒక కంఠీరవం, ఒక కొమరయ్య, ఒక బషీర్, ఒక సుజాత, ఒక కమల, ఒక నవనీతం లాంటి వారసులు ఈనాటి ప్రజాఉద్యమాలలో కొనసాగుతున్నారు. అందుకే వట్టికోట ప్రజల పక్షాన నిలిచి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీయడానికి పూనుకున్నాడు. ముఖ్యంగా ప్రశ్నించే సమాజాన్ని ఆయన కోరుకున్నాడు. ‘జైలులోపల’ కథల సంపుటిలో కూడా ఖైదీలకు ‘ఉరిశిక్ష’ను రద్దుచేయాలని ఆకాంక్షించాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా వట్టికోట సత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించారు. 1947లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా అరెస్టయి మూడేళ్ళు జైళ్ళల్లో డెటిన్యూగా బాధలనుభవించారు. నిజాం పాలనలో తెలుగు భాషా సాంస్కృతికి దాస్య శృంఖలాలను తెంపి ప్రజలకు రాజకీయ హక్కులను గుర్తుచేసిన వట్టికోటకు నేడు న్యాయమైన గుర్తింపు దక్కలేదు. హోటల్ సర్వర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వట్టికోట తాను నమ్మిన సిద్ధాంతంకోసం, సమాజంలో జీవితాన్ని ధారపోసిన త్యాగశీలి.