సాహితి

కొత్త శివుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జలపుష్పం’ అని
నాన్న ముద్దుగా పిలుచుకునే చేపల గంప
ఏ వీధిలో వున్నా
రెక్కలుగట్టుకొని వాకిట్లో వాలుతుంది.
నాన్న, కొసరి కొసరి బేరమాడి
ప్రాణం వచ్చినట్టు
చేపలు చేతుల వలకెత్తుకున్న ముఖంల
మురిపెం పూసిన ఆనందమవుతాడు.

సగం బరువు దిగిన చేపలమ్మ
ఎవరెస్టు ఎక్కిన విజేత గర్వంలా
ఊరేగుతుంది.

ఉనుక తెచ్చి చేపలు కడుగుతున్న నాన్న
అమృతం కొరకు జరుగుతున్న
సాగర మథనమవుతాడు.

అమ్మ
గునుగుడు గుణింతం చదువుతూనే
ప్రేమగా నానబెట్టిన చింతపండవుతుంది.
వంటింట్లో పుట్టిన చిట్టిచేపల చెరువులా
చేపముక్కలు పులుసులో ఈదుతూ వుండగా
కుతకుతమంటూ
అమ్మ నేర్చుకున్న పాకశాస్త్ర పరిమళం
పొరుగిళ్ళలోకి గుప్పున పాకుతుంది.

ఏ సందులో ఆటలాడుతున్నా
సిక్సర్‌కొట్టిన బంతిలా ‘అన్నం తిందువురా’ అని
నాన్న పిలుపు ఊరు దాటుతుంది.
ఖాళీ కడుపు ముందేసుకుని కూర్చున్నాక
ఎప్పుడు తెచ్చి దాచుకుంటాడో నాన్న
ముంతడు తాటికల్లు గ్లాసుల్లోకి దింపి
ఇలా తాగాలంటూ
తాటితీర్థం రుచి చూపిస్తాడు.

ఎప్పుడు
నలభీమావతారం ఎత్తుకుంటాడో గానీ
కారం పువ్వుల్లా
ఎర్రగా వేయించిన నాలుగు చేప ముక్కలు
ఇలా తినాలంటూ
దువ్వెనల్లాంటి ఎముకలు తీసి
గొంతులో ఇరుకుతుందన్న భయమవుతాడు.
నేనంటే నాన్నకు ఎంతిష్టమో!

ఎప్పటిలాగే
వాకిట్లోంచి చేపల రథం కదిలిపోతుంటే
‘ఏ రకం చేపలు’ అంటూ
నాన్న పాదం గడప దాటీ దాటకుండానే
‘వొద్దంటూ’ అమ్మ
కసురు బాణమొకటి విసిరింది
నాన్న ప్రాణం గట్టున పడ్డ చేప పిల్లయ్యింది,
పెదవులపై నవ్వు పూలకొమ్మ విరిగిపోయి
అలిగిన చంటి పిల్లాడిలా
నాన్న ముఖం చిన్నబోయింది.
- ఉన్నట్టుండి నానే్న ‘పో పొమ్మని’
పచ్చజెండా ఊపినట్టు
చేయి సైగ చేయగానే
మొదటిసారి చేపల గుంపు
నాన్న చేతుల్లోంచి సర్రున జారిపోయింది.

ఔను
నాన్న నోరుగట్టుకున్నాడు
నాకు జ్వరమని,
ఊరుతున్న జిహ్వచాపల్యం గొంతులోనే దాచుకున్న
కొత్త శివుడు నాన్న.

- జి.రామక్రిష్ణ, 8977412795