సాహితి

మన కవిత్వానికి చోదక శక్తి ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ వ్యాసం చదివినా, పుస్తక సమీక్ష చదివినా, పుస్తక పరిచయం చదివినా, విన్నా... ప్రతిచోటా కన్పించేది, విన్పించేది వస్తువైవిధ్య ప్రస్తావనలే. కొంచెం అందంగా దీనే్న కవిత్వ విస్తృతి అంటుంటారు. ఇది ఆహ్వానించదగినదే. నిజానికి అట్లా ఎంతవరకు రాస్తున్నాయన్నదే ప్రశ్న. ఆయా కవితా సంపుటాల్లో, సంకలనాల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా తరచు కన్పిస్తుంటాయి. సంపుటాల్లో పూర్తిగా కవిదే బాధ్యత. కానీ సంకలనాల్లో అది సంపాదకులదీ. వీటిలో వారివారి వ్యక్తిత్వాలు, నిజాయితీ స్థాయి, కళా, సాహిత్య విలువల్లో వారి అభినివేశం, ప్రపంచ పరిణామాల పట్ల, ప్రభావాల పట్ల పరిజ్ఞానం, నిస్పాక్షికత, పరిణతి లాంటివనేకం వారి కృషి వెనక దాగి ఉంటాయి. వారి వాటి స్థాయిని బట్టే ఆ తెచ్చేవాటి స్థాయి ఆధారపడి ఉంటుంది. వాటి విలువలూ తదనుగుణంగానే ఉంటాయి. ఆయా కాలాలకు సంబంధించి తెచ్చేవాటిలో ఆ కాలంలో వచ్చినవి వారికి పరిమితులేర్పరుస్తాయి. వారెంతటి వారైనా, వీటిలో తరచూ మనకు కన్పించేవి నోస్టాల్జియా, ట్రావెలోగ్, బాల్యం, ప్రకృతి, ఆయా ఘటనలపై సత్వర స్పందనలు, వైయక్తికాల్లాంటివి. వీటిలో ప్రక్రియా పరంగా రూపాలు వేరైనా సారం ఒకటే. వస్తువుల్లో ఏకీకృతం ఉన్నా అభివ్యక్తిలో ఆకట్టుకునే వాటిని ఆహ్వానించవచ్చు.
రాజకీయ రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అంటరానివిగా పరిగణిస్తారు. బ్రహ్మాండమైన ముద్రలతో వాటిని బహిష్కరిస్తారు. ఆ ప్రక్రియలో వీరు పెట్టు ముద్దుపేర్లే రాజకీయ సంస్కృతి, వ్యాపార సంస్కృతి, ఆర్థిక సంస్కృతి, కార్పొరేట్ సంస్కృతి వగైరా పదజాలాలు. వీటి వెనుక భావజాలం వారికి తెలియకుండా ఉండదు. నిజానికి ఇవి ఏవీ లేకుండా ఇపుడు, ఎపుడూ కవులతోసహా మనిషి మనుగడ ఎక్కడ ఉంది? సమస్త మానవ సంబంధాలూ మారక లేక ఆర్థిక సంబంధాలైనాయి. ఆ ఆర్థికాన్ని శాసించేది రాజకీయ రంగం. ఒకప్పుడు పరోక్షంగా, ఇపుడు ప్రత్యక్షంగానే ఆ పని చేస్తోంది తెగబడి. ఇక సమకాలీన మలిన పరిస్థితులలో అన్ని విలువలూ, నైతికతలూ వ్యాపార విలువల వలల్లోనే బందీ. ఈ వ్యాపార ధృతరాష్ట్ర కౌగిలిలో అన్నింటితోపాటు కవులూ, కళాసాహిత్య విలువలూ ధ్వంసం కావడం హృదయ విదారకరం. దీపధారి దీపాన్ని కోల్పోవడం, నావ చుక్కాని విరిగిపోవడం. ఆ వలలో గిలగిలలాడే మనిషి పట్టని కవిని, అసలు వీటి పట్ల కనీసావగాహన లేని కవిని, అతని కవిత్వాన్నీ ఏ చోదక శక్తులు నడుపుతున్నట్లు? ఎన్నాళ్లు నడిపేటట్లు? ఎందుకు నడిపేటట్లు? వీరంతా తప్పనిసరిగా గుర్తెరగవల్సింది- వీటిని వారెంతగా విస్మరించినా, అవి అందరిలాగే వీరినీ వదలవు. వీడవు. ఆయా రూపాల్లో పట్టిపీడిస్తూనే ఉంటాయి.
ఇంత కీలకమైనవే పట్టనివారికి ఇక మన దేవతావస్త్రాల ప్రజాస్వామ్యం, ప్రజల బాధ్యతల్నుండి పారిపోవు ప్రభుత్వాలూ, ప్రపంచీకరణ నేపథ్యంలోని సరళీకరణ, ప్రైవేటీకరణ లేక కార్పొరేటీకరణ దురాగతాల దుష్ప్రభావాలెలా తెలుస్తాయి. ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇరాన్, పాలస్తీనా, ఇరాక్, ఆప్ఘన్, సిరియా, ఇజ్రాయిల్, అమెరికా సంబంధాలు, కూటమిలు, వ్యూహాలు వాటి పర్యవసానాలూ అసలే ఎరగరు. మన మాన్య గత ప్రధాని మన్మోహన్‌సింగ్ తన పదేళ్ల పాలనలో లేక పదవీ కాలంలో పౌరుషానికీ, పంతానికీ పోయి పదవీ త్యాగానికి సిద్ధపడింది ఒకేఒక్క ‘అణు ఒప్పందం’ సందర్శంలోనే. దాని గురించి ‘అణు’మాత్రం అయినా పట్టిందా? అంతర్జాతీయ ఆర్థిక, రక్షణ, రాజకీయ ఒప్పందాల నేపథ్యాలు, ఆధిపత్యాల పట్ల కనీస అవగాహనుందా? ఇక తిమ్మిని బెమ్మిని చేయగల పాక్షిక ప్రమాణాల మహత్తర లోపలి తెహల్కా ఉదంతాలు, పెయిడ్ న్యూస్, నీరా రాడియా టేపుల బాగోతం, బయట వీకీలీక్స్ అసాంజె, స్నోడెన్ బహిర్గతాల్లో అంతర్జాతీయ పాత్ర వగైరాలేమాత్రం పట్టని, తట్టని, గిట్టని ధీరోదాత్తులు మన కవి పుంగవులు. ఈ పరంపరలో ఎన్నైనా చేర్చవచ్చు. అంతా చెవిటివాని ముందు శంఖం లాంటిదే.
ఎవరేమన్నా, ఎన్నాన్నా కవితా సృజన ఓ మేధోక్రీడ. దీనికి అనుసరించి వుండేవి ఇంద్రియ సంవేదన, భావోద్వేగాలతో కూడిన భావనాపటిమ, అన్నీ రంగరించు రూపానికై భాషాపరిపుష్టి లాంటివి తప్పనిసరి. ఇవి అందరికీ అందుబాటులో ఉండక పోవడమూ సహజమే. వీటిని ఆస్వాదకుడూ అందుకోవడానికి యత్నించాలి. అందుకే అతనూ సహస్రష్టే. సహస్రష్టను పెంచాలంటే ముందసలు స్రష్ట తన మేధోసంపద ఎంతో నిగ్గు తేల్చుకోవాలి. దాన్ని పెంచడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడో లేదో స్వీయశోధన గావించుకోవాలి. వివిధ అంశాలపట్ల విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. ప్రతిదీ ఏదోరూపంలో మరొక దానితో ముడిపడి ఉంటుందని గ్రహించాలి. ద్వందాల్లో పరస్పర సానుకూలాల్ని దర్శించగలగాలి. వీటితోపాటు భాషాపటిమ ముఖ్యం. సృజనలో భాషారహిత పరిజ్ఞానం ఎందుకూ కొరగాదు. వాటిలో అనుభూతిని మేళవించి దాన్ని కవితాత్మకమూ, కళాత్మకమూ చేయాలి. కవి అంటే ఒక అనే్వషి. ఒక జిజ్ఞాసాపరుడు. క్రాంతదర్శి, మార్గదర్శి, ఒక పథ నిర్దేశకుడు లాంటివి అనేకం ఆపాదించుకుంటున్నపుడు ఆ మాటల్ని ఎంతో కొంత సార్థకం చేయాలికదా!? మరి ఆ ప్రయత్నం చేస్తున్నామా? ఇది ఎవరికోసమో కాదు. తనకు తాను గీటురాయిగా పెట్టుకోవడానికి. తాను ఎదిగితేనే తన పాఠకుడూ ఎదిగేది. నే ఉన్నచోటనే ఉంటాను. మరీ మాట్లాడితే వెనక్కి వెళ్తాను అంటే నిజమైన పాఠకుడూ నిన్నొదిలేస్తాడు. ఇక మిగిలేది వంది మాగధుల్లాంటి పరస్పర కీర్తనారాయుళ్లే.
కవిత్వమంటే అక్షరాల్లోంచి ప్రవహించు, వాటిలో ప్రసరించు కవి ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, అంచనాలు, అన్యాయాలు, సమన్వయాలు, స్పందనలు, ప్రతిస్పందనలు. అన్నింటా అతని దృక్పథమే అతని చోదకశక్తి. వీటి పట్ల స్పష్టత లేకుంటే ఒకటిగా తలంచి మరొక దానిలోనికి చొరబడతారు. అది అభివ్యక్తి అంతటా ప్రతిఫలిస్తుంది. ఈ స్పష్టతా రాహిత్యమే ఒకప్పుడు మనకి ఆధ్యాత్మికం, సాహిత్యం, మతం కలగలిపి పయనించినవి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కొందరు ప్రవచనాలకి (రమణమహర్షి, అరవిందుడు, జిడ్డు కృష్ణమూర్తి, ఖలీల్ జిబాన్) కవిత్వానికి తెర తొలగిస్తుంటారు. కలగాపులగం చేసేస్తుంటారు. అవే ఇవిగా చలామణి చేస్తుంటారు. పనిలో పనిగా సోమరితనాన్నీ, స్కాంల్నీ పెంచే, పంచే దొంగ బాబాలు, అమ్మలు, స్వాములు, బైరాగులతో మమైకమై వారి తిమిరాన్ని తత్వభ్రమరంగా పాఠకులపై వదులుతుంటారు నిస్సంకోచంగా. అట్లాగే కొందరు కొన్ని కవితల్ని పూర్తిగా, ఆశ్చర్యార్థకాలతో, సందేహ, ప్రశ్నార్థకాలతో నింపుతుంటారు. అవి అవసరం మేర వాడటం మంచిదే. కాని వాటినే అతిగా కవిత్వంగా సాహిత్య తెరపై ప్రదర్శిస్తారు. సాహిత్య నిజ ప్రపంచం తెలియని వారికి అదే అసలు సిసలు కవిత్వంగా చెలామణి అవుతుంది. కొండొకచో చేస్తుంటారు. వీరిలో ఎక్కువమందికి ఇహం కన్నా పూర్వ, పరలోకాలే ప్రియం. వాటిపైనే వారి దృష్టంతా. తదనుగుణంగానే వారి వారి చోదకశక్తులూ పనిచేస్తుంటాయి. వాటి వత్తాసులకీ లోటు లేదు. ఉండదు. వాలు పయనం ఎల్లప్పుడూ సుళువే. ఎదురీతకే చోదకశక్తుల ఆవశ్యకత ఎక్కువ.
ఈ నేపధ్యంలో మన కవిత్వానికి లేక సాహిత్యానికి సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పోల్చినపుడు ఏ మాత్రం సంతృప్తి కలగదు. ప్రాంతం, జనాభా దృష్ట్యా మన పొరుగువి చిన్న రాష్ట్రాలు. అవి ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, కేరళ. వారికి వచ్చినన్ని ‘జ్ఞానపీఠ్’ లాంటి జాతీయ స్థాయి అవార్డులు మనకు రాలేదు. పోనీ అది కొలబద్ద కాదనుకున్నా ఆ రూపంలో మన స్వీయ వివేచనతో బేరీజు వేసుకోవచ్చు. వేసుకోవాలి. ఎదుగుదల, మెరుగుదలకై యత్నించాలి. అక్కడ సృజన, విమర్శ, పాఠక ప్రోత్సాహ, స్వీయ అధ్యయనాల స్థాయి కూడా ఉన్నతంగా, ఉత్తమంగా ఉండడం గమనింపవచ్చు. మచ్చుకి- ద్వైమాస ఆంగ్ల పత్రిక ‘ఇండియన్ లిటరేచర్’లో మన ప్రాతినిధ్యం, అట్లాగే ‘హిందూ లిటరరీ రివ్యూ’లలో మన ప్రస్తావనలు అత్యల్పంగా వాటిని చదివే వారికి తెలియంది కాదు.
అట్లాగే ఆయా మన పొరుగు భాషా సాహిత్యాల్లో అన్ని స్థాయిల్లో వారూ, అత్యున్నత విద్యతో ఉన్నత ఉద్యోగ వృత్తుల్లో వారూ అన్నింటా గణనీయ పాత్ర కలిగి ఉండడం, ఆ ప్రభావం మొత్తం వారి సాహిత్యం (కవిత్వం)పై పడడం గమనింపవచ్చు. మనకు ఇందుకు విరుద్ధం. ఇదేదో కొందరికే పరిమితం. ఆ కొందరి స్థాయినిబట్టి వారి జిజ్ఞాస, అధ్యయన శీలత, పరిణతి, మనిషి పట్ల, కళాసాహిత్య విలువల పట్ల నిబద్ధత బట్టే వారి సృజన స్థాయి. ఇదే ప్రమాణాలు వాటితో ప్రమేయం ఉన్నవారందరికీ వర్తిస్తాయి భిన్నమోతాదుల్లో. ఇందువల్లనే అనువాదాల్లోనూ పొరుగువారితో పోల్చినపుడు మనలోకి వచ్చేవి, మన నుండి వెళ్లేవీ అంతంత మాత్రమే. తదనుగుణంగానే అన్నింటిలోనూ పరస్పర పరిచయ ప్రభావిత అవకాశాలూ, అసలా ప్రపంచాల గురించి తెల్సుకుంటేనే కదా తెల్సేది. మనమూ మంచి మార్పుకై ప్రయత్నించగలిగేది.
కవిత్వం సాహిత్యంలో అంతర్భాగం. కాబట్టి సాహిత్యానికి సంబంధించి ప్రస్తుత స్థితిగతుల గురించి కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో ముక్తవరం పార్థసారధిగారి మాటలు ఇప్పటికీ అక్షర సత్యాలు. అవి మన కవిత్వానికీ సమంగా లేక ఇంచుమించుగా వర్తిస్తాయి. అవి పత్రికలో రావడం వలన బహిరంగాలు. ఈ సందర్భంగా దర్పణంగా ప్రస్తావనార్హం. ‘‘అనుభవంలో వైవిధ్యం లేదు. అనుభవజ్ఞులేమో రాయడం లేదు. రాసే వాళ్లలో ఎక్కువమంది టీచర్లు లేదా ఏదో చిన్న ఉద్యోగులు. వీరి ఆలోచనా పరిధి చాలా చిన్నది. కూపస్థమండూకాలు. ఇంటి సమస్యలు, అసూరికులు, ఆస్తులు, తగాదాలు, అక్రమ సంబంధాలు ఇవే రాశారు. గోర్కీ చెప్పుల దుకాణంలో పనిచేశాడు. దేశమంతా చూశాడు. ఇంట్లోనే మగ్గిపోతూ రాస్తే అందులో కుళ్లూ, రొచ్చూ తప్ప ఇంకేముంటుంది? లైఫ్ ఫ్లేవర్ ఎలా దొరుకుతుంది? కాగితప్పూలే తప్ప పరిమళాలు గుప్పించే పూలెక్కణించి వస్తాయి?.... మనలో పరిశీలనాశక్తి కూడా తక్కువే. మనకి చాలా తెలుసని మభ్యపెట్టుకుంటాం. నిజానికి సమాజాన్ని అవగాహన చేసుకోవాలంటే సాగర గర్భమంత లోతుకెళ్లాలి. మేధస్సుతో చదరంగమైనా ఆడాలి. లేదంటే దేహ దారుఢ్యంతో బాక్సింగైనా ఆడాలి. మనలో రెండూ లేవు... మనలో బాహ్య ప్రపంచ పరిశీలన లేదా అంతర్ విశే్లషణా లేదు. ఆషామాషీతనం, అసమర్థత, అయోమయం, తమలోని జడత్వానికి కారణం ఏమిటో కూడా తెలుసుకోవడం లేదు. ఇవే కారణాలని చెప్పలేం. ఇవి కూడా కావచ్చేమో!... ప్రపంచ ప్రఖ్యాత రచయితల్లా మనం మాత్రం అద్భుత రచనలు ఎందుకు చేయలేమని ప్రశ్నించుకోవాలి. వాళ్లని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి.’’

- బి. లలితానంద ప్రసాద్ 9247499715