అక్షర

సాయి భక్తమాల
చరణ్ జనమంచి
వెల: 40/-
ప్రతులకు
శ్రీ సాయి దర్శన్
దమ్మైగూడ, నాగారం పోస్ట్
హైదరాబాద్
ఫోన్. 9866748099
భగవంతుడి నేరుగా తలచి,కొలిచి తరించడం, సాధారణంగా భక్తులు చేసే పని. కానీ ఒక లీలా మానుష వేషధారి గురించి తెలుసుకోవడం అంత సులువైన పని కాదు. శ్రీకృష్ణుడి లీలామృతంలో అనేక విశేషాలున్నట్లే, షిర్డీనాధుడు సాయిబాబా జీవితాతం చూపించిన, ప్రవచించిన విశేషాల్లో ఎంతో తత్వం దాగి వుంది. అటువంటి విశేషాల తత్వాన్ని, వాటి అంతరార్ధాన్ని తెలుసుకోవడానికి దగ్గరి దారి ఆయనకు దగ్గరైన వారి జీవితాలను పరిశీలించడం, వారి గురించి తెలుసుకోవడం. వారెలా బాబాకు ప్రీతి పాత్రులు కాగలిగారు, వారి అనుభవాలేమిటి? వారి భక్తిసాధన విధానాలేమిటి అన్నది తెలుసుకోవడం ద్వారా బాబా తత్వసారాన్ని కూడా తెలుసుకోవచ్చు. అందుకు వీలుగా సాయినాథునితో కలిసి షిర్డీ నేలపై తిరుగాడి, ఆయన ప్రేమాభిమానాలను, ఆగ్రహావేశాలను సమానంగా చవిచూచి, ఆయన భక్తులుగా చరిత్రలో మిగిలిపోయిన సుమారు 63మంది భక్తుల జీవిత సంక్షిప్త వివరాలను సేకరించి, ఒక చోట చేర్చిన పుస్తకం ఇది. వివరాలు నింపేసి చరిత్ర పుస్తకంగా తయారుచేయకుండా, ఒక పద్ధతిగా అందించడం బాగుంది. భక్తుల చిత్రపటాలు, సంక్షిప్త పరిచయం,బాబా వద్దకు వారు చేరి, కడదాకా కొనసాగిన వైనం, ఇందుకు సంబంధించిన అపురూప చిత్రాలు..ఇలా సాగింది పుస్తక రచన. సాయి భక్తులను చక్కగా అలరించే రచనగా పేర్కొనవచ్చు. బాబాతో ప్రారంభం నుంచీ నిర్యాణం వరకు అంటిపెట్టుకున్న భక్తుల పేర్లు చాలా వరకు ఆయన గురుచరిత్రను చదివిన వారికి పరిచయమే. కానీ, వారి పూర్తి వివరాలు, చిత్రపటాలు, బాబాతో వారి అనుబంధాల వైనాలూ, సేకరించి ఒక్క చోట చేర్చాలన్న ఆలోచన కొత్తగా వుంది.
-రాజ్
Add new comment