ఐడియా

సమానత్వం కోసం సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగవివక్ష లేని సమాజంకోసం తపన
విద్యార్థుల్లో చైతన్యానికి శ్రీకారం
కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి
సైకిల్ యాత్ర
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదర్శం

శ్రుతి శివశంకర్ మూర్తి... ఇప్పుడు దేశంలో చాలామందికి ఆమె తెలుసు.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆమె ఒక్కర్తే సైకిల్‌పై సాహసయాత్ర చేసింది. నిజానికి ఆమె ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. మంచి సంస్థలో ఉద్యోగం.. చేతినిండా డబ్బు... నిండా ముప్పై ఏళ్లుకూడా లేవు.. అందమైన మైసూరు సొంత ఊరు... కానీ ఏదో తపన.. ఏదో చేయాలన్న ఉబలాటం.. చదువుకునే రోజుల్లో, చిన్నతనంలో.. చూసిన ఆడామగా తేడాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులే గుర్తుకు వచ్చేవి. ఆడపిల్లలు చీకటిపడితే వీధిలోకి పంపడమే కష్టం. కొంత వయసు పెరిగాక చదువుకూ ఇబ్బందులే. మగవారికీ బోలెడన్ని ఆంక్షలు. కొన్ని బయటకు రావంతే.. అద్భుతమైన భారతదేశంలో ఈ లింగవివక్ష పోవడం ఎలా? జెండర్ న్యూట్రాలిటీ సాధించడం ఎలా? ఇదే ఆమె ఆలోచన. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. రూపర్ట్, అనఘ అనే స్నేహితుల సహకారంతో ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 13 రాష్ట్రాల మీదుగా సైకిల్‌యాత్ర చేపట్టింది. తన బృందంలోని ఇద్దరూ టూర్‌ప్లాన్, బస ఏర్పాట్లు చూశారంతే. సైకిల్ ప్రయాణం మాత్రం శ్రుతి ఒక్కర్తే చేశారు. దాదాపు 500 గ్రామాల మీదుగా ఆమె యాత్ర సాగింది. ప్రతిచోటా చిన్నపిల్లలు, విద్యార్థినీవిద్యార్థులతో కలసి ముచ్చట్లు చెప్పడం. సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం. వాటికి పరిష్కారమేమిటో వివరంగా వారికి చెప్పడం ఆమె చేసిన పని. ఆడమగా సమానత్వంతో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నది ఆమె విశ్వాసం. అదే విషయాన్ని పిల్లలకు ఆమె చెప్పేది. లింగమార్పిడికి గురైన లేదా లింగపరమైన లోపాలున్నవారిపట్ల అనుసరించాల్సిన ధోరణిపట్ల విద్యార్థులకు ఏమీ తెలియకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. వారితో ఎలా మెలగాలో, వారు ఎందుకలా ఉన్నారో చిన్నారులకు వివరించేది. రోజుకు 120 కి.మి.ల సైకిల్‌పై ప్రయాణించేది. ఇలా 45 రోజులపాటు యాత్ర కొనసాగింది. దాదాపు 4200 కి.మి.ల దూరం ఆమె ప్రయాణించింది. ఏదో మొక్కుబడి ప్రయాణంగా కాకుండా ఒక ఉత్తమ ఆశయంతో చేపట్టిన ఈ సైకిల్‌యాత్రను మొదటినుంచి చివరకు వరకు ఎంతో చిత్తశుద్ధితో చేశా, ఆస్వాదించానని చెబుతోంది శ్రుతి. నైపుణ్యం పెంచే చదువుల అవసరాన్ని ఆమె గుర్తించింది. అదే విషయాన్ని వివిధ పాఠశాలల బోధనాసిబ్బందికి, అధికారులకు విన్నవించేది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలను పసిగట్టి అందుకుతగ్గ విద్యావిధానాలను అవలంబిస్తేనే మనం అందరికన్నా ముందుంటామన్నది ఆమె మాట. స్వయంచైతన్యం, సమాచార మార్పిడి, ఆత్మవిశ్వాసంవంటి అంశాలతో కూడిన బోధనాంశాలను ప్రాథమిక విద్యలోనే చేర్చాలని ఇటీవలి కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు.
chitram...
శ్రుతి శివశంకర్ మూర్తి

రూపర్ట్, అనఘతో శ్రుతి