సంపాదకీయం

‘సంకీర్ణ’ సంరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నగిల్లిపోతున్న సంకీర్ణ రాజకీయం మళ్లీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. విధానసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కర్నాటక ప్రాంతంలో నెలకొని ఉన్న విచిత్ర స్థితి ఇందుకు సరికొత్త నిదర్శనం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వలసినన్ని శాసనసభ స్థానాలను ఏ ఒక్క రాజకీయ పక్షం పొందలేకపోవడంతో ‘సాంకర్య వైపరీత్యం’ మరోసారి తొంగి చూస్తోంది! ఇది రాజకీయ పక్షాల వైఫల్యం, ప్రత్యేకించి జాతీయ స్థాయిలో పరస్పరం ప్రధాన ప్రత్యర్థులైన భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీల వైఫల్యం! 2008లో భాజపా కర్నాటక విధానసభలో ‘సంఖ్యా బాహుళ్యాన్ని’- ‘మెజారిటీ’ని- సాధించ గలిగింది. 2013లో కాంగ్రెస్‌కు ఈ సంఖ్యా బాహుళ్యం లభించింది. ఈ ఉభయ పక్షాలలో ఏ పార్టీకి కూడ ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో ‘సంఖ్యా బాహుళ్యం’ లభించకపోవడానికి కారణం ఈ జాతీయ పక్షాలు ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా చూరగొనలేకపోవడం. ఇలా ప్రధాన రాజకీయ పక్షాలు ‘సంఖ్యా బాహుళ్యం’ సాధించలేక పోవడం- జాతీయ స్ఢాయిలోను, ప్రాంతీయ స్థాయిలోను సంకీర్ణ మంత్రివర్గాలు ఏర్పడడానికి కారణం. ఇలా సంకీర్ణ ప్రభుత్వాలు పెరుగుతున్నకొద్దీ ప్రాంతీయ పక్షాల ప్రాధాన్యం పెరుగుతోంది. ‘సమాఖ్య స్ఫూర్తి’- ఫెడరల్ స్పిరిట్- పేరుతో ప్రతి ప్రాంతీయ నాయకుడు తమ పార్టీ ప్రాధాన్యాన్ని మితిమీరి చాటుకుంటున్నాడు. ప్రాంతీయ రాజకీయ పక్షం తమ ప్రాంతం- రాష్ట్రం-లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు, ప్రగతిని సాధించవచ్చు. కానీ ఇలా ప్రగతి సాధించిన ప్రాంతీయ పక్షం జాతీయ రాజకీయాలలో తాను నిర్ణాయక శక్తిని కాగలగనన్న భ్రాంతికి గురి అవుతుండడానికి కారణం ‘సంకీర్ణ రాజకీయం’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతకాలంగా ఇలాంటి భ్రాంతికి గురి అవుతుండడం ఒక ఉదాహరణ మాత్రమే. 2019వ సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో తమ ప్రాంతంలోని ఇరవై ఐదు స్థానాలనూ తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలన్నది ఆయన ఆకాంక్ష! గెలుచుకోవచ్చు. కానీ అలాగే అనుకున్నట్టయితే జాతీయస్థాయిలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది తామే నిర్ణయించగలమని చంద్రబాబు ప్రకటించడమే విచిత్రమైన సమాఖ్య స్ఫూర్తి.. ఇరవై ఐదుగురు సభ్యులున్న ప్రాంతీయ పార్టీ ఐదువందల నలబయి ఐదుగురు సభ్యుల లోక్‌సభలో నిర్ణాయకశక్తి కాగలదన్నది చంద్రబాబు ప్రవచిస్తున్న విచిత్ర వాస్తవం!
వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ‘సంఖ్యా బాహుళ్యం’ లభించబోదన్న విశ్వాసం, లభించరాదన్న ‘కోరిక’ ఈ విచిత్ర వాస్తవానికి ప్రాతిపదిక. భాజపాకు మళ్లీ లోక్‌సభలో మెజారిటీ స్థానాలు లభించినట్టయితే చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి ప్రచారం చేస్తున్న ‘ఇరవై ఐదు స్థానాల నిర్ణాయక శక్తి’ సిద్ధాంతానికి ప్రాధాన్యం లేదు. అందువల్ల భాజపా సహా ఏ ఇతర జాతీయ పార్టీకి కాని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ‘సంఖ్యాబలం’ ఏ ఎన్నికలో కూడ లభించరాదన్నది దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల ఆకాంక్ష. అప్పుడు మాత్రమే ఇరవై ఐదునుంచి ఒకటి వరకు లోక్‌సభ స్థానాలను గెలిచిన ప్రాంతీయ పక్షాల ప్రాధాన్యం, నిర్ణాయకత్వం పెరిగిపోతాయి. ప్రతి ఒక్క ‘ఏకాంక’- సింగిల్ డిజిట్- రాజకీయ పార్టీ నాయకుడు కూడ స్వీయ సంభావ ప్రాధాన్యంతో ఉబ్బితబ్బిబ్బయి ఊరంతగా మారడానికి అలాంటి అనిశ్చిత స్థితి దోహదం చేస్తుంది... 1990వ దశకంలో జరిగిన ఒక లోక్‌సభ ఎన్నిక సందర్భంగా ఒక ప్రాంతీయ పార్టీవారు భాజపాతో పొత్తుపెట్టుకున్నారు. తమ ‘కూటమి’ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే తమ పార్టీకి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కేటాయించాలని కోరినట్టు ఆ ప్రాంతీయపార్టీ నాయకురాలు ప్రకటించడం చరిత్ర. ఆ ప్రాంతీయ పార్టీకి లోక్‌సభలో స్థానాలు లభించలేదు, అందువల్ల ఆమెకాని ఆమె పార్టీ ప్రతినిధి కాని విదేశ వ్యవహారాల మంత్రి కాగలిగిన వైచిత్రి తృటిలో తప్పిపోయింది! 1989-2014 సంవత్సరాల మధ్య కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడచిన సమయంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో జరిగిపోయాయి.
ఆ విచిత్ర స్థితి కేంద్రంలో మళ్లీ ఏర్పడాలన్నది 2014 నుంచి ప్రాంతీయ నాయకులు కంటున్న పగటికల. 2014 నాటి ఎన్నికలలో భాజపాకు లోక్‌సభలో స్పష్టమైన ‘సంఖ్యా బాహుళ్యం’ లభించినప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ పక్షాల అధినేతలకు తరచు ‘పగటి కల’ వస్తోంది. కర్నాటకలో ఊహించని రీతిలో ‘లౌకిక జనతాదళ్’ పార్టీకి నిన్న మొన్నటి శాసనసభ ఎన్నికల తరువాత ప్రాధాన్యం పెరిగిపోవడంతో ‘ఈ సంకీర్ణ రాజకీయ స్వప్నం’ జాతీయ స్థాయిలో మరోసారి వాస్తవంగా మారవచ్చునన్న ఆశలు మళ్లీ మొలకలెత్తి మోసులెత్తుతున్నాయి! ఏ ఒక్క జాతీయ పక్షానికి లోక్‌సభలో ‘మెజారిటీ’ లేని స్థితి ఏర్పడాలన్నది ఈ ‘సమాఖ్య స్ఫూర్తిమంతుల’ సుందర స్వప్నం! కర్నాటక పరిణామం దృష్ట్యా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కూడిన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడడానికి రంగం సిద్ధమైంది. దీనివల్ల మూడవ కూటమి ముచ్చట మూలపడింది. ఇలా మూలపడడం కూడ జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలకు కొత్త ఊపు. దీని వల్ల ప్రాంతీయ పక్షాల ప్రాధాన్యం జాతీయ స్థాయిలో మరింతగా పెరుగుతోంది! ఎందుకంటే అనేక ప్రాంతాలలో ‘ఆనవాలు’ లేని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ‘అర్థ జాతీయ’ పార్టీగా అలరారుతోంది. కాంగ్రెస్‌తో జట్టుకట్టి భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ప్రాంతీయ పార్టీలకు ఇది మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అందువల్ల కర్నాటకలో కాంగ్రెస్ పరాజయం పాలుకావడం ఈ ప్రాంతీయ పక్షాలకు బహుశా మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. 2004-2009 సంవత్సరాల మధ్య బలహీనమైన కాంగ్రెస్‌తో జట్టుకట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన ప్రాంతీయ పార్టీలు ‘కుక్కను ఆడించిన తోకల’వలె తైతక్కలాడడం చరిత్ర. ఆ తరువాత ‘పుట్ట పగిలిన’ అనేక అవినీతి కుంభకోణాలు ఆ సమయంలోనే రూపొందాయి. అవినీతి ప్రాంతీయ స్థాయి వరకు వికేంద్రీకృతం కావడానికి ఆ సంకీర్ణ ప్రభుత్వం దోహదం చేసింది. బయట నుంచి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ‘ఆడించిన’ వామపక్షాల వారు చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు! 2004లో ‘ద్రవిడ మునే్నత్ర కడగం’వారు కనిపెట్టిన ‘క్లాసికల్ లాంగ్వేజ్’ సిద్ధాంతం సృష్టించిన రాద్ధాంతం ఇప్పటికీ సద్దుమణగలేదు. ‘‘క్లాసికల్ లాంగ్వేజ్’’అన్న ఆంగ్లపదానికి ‘ప్రాచీన భాష’ అన్న విచిత్రమైన అర్థాన్ని కనిపెట్టడం కూడ సంకీర్ణ రాజకీయంలో భాగం. 2009 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ బలం పెరగడంతో ‘సంకీర్ణ రాజకీయ ప్రాధాన్యం’, ప్రాంతీయ పక్షాల ప్రాభవం కొంత తగ్గింది! 1984 తరువాత- ముప్పయి ఏళ్ల తరువాత- ఒకే జాతీయ పక్షానికి లోక్‌సభలో మెజారిటీ రావడంతో ఈ ‘ప్రాధాన్యం’, ‘ప్రాభవం’ దాదాపు అడుగంటిపోయాయి. కానీ మరుగుజ్జు వంటి ‘లౌకిక జనతాదళ్’ కర్నాటకలో ‘మేరు పర్వతమన్న’ ప్రచారం మొదలైంది. అందువల్ల జాతీయ స్థాయి ‘సంకీర్ణ స్వప్నాల’కు ఇది మరో ఆరంభం..