సంపాదకీయం

‘సాగర’ స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేసియాలో జరిపిన రెండు రోజుల పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య సహస్రాబ్దులుగా నెలకొని ఉన్న సాంస్కృతిక సమానత్వం మరోసారి ప్రబలంగా ప్రస్ఫుటించింది. బుధవారం సాయంకాలం ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరిగిన ‘్భరతీయ సంతతి’ మహాసభలో ప్రసంగించిన మోదీ ఈ సాంస్కృతిక సమానత్వాన్ని సమగ్రంగా సమీక్షించడం ఉభయ దేశాల సాన్నిహిత్యానికి అద్దం.. ఈ సాన్నిహిత్యం భౌగోళికమైనది. ‘నీళ్లకవతల’ ఉన్న మన పొరుగు దేశాలలో ‘అత్యంత సమీపంలో ఉన్న దేశం ఇండోనేసియా’ అన్నది ‘్భరత వంశీయుల’ సమావేశంలో మోదీ చెప్పిన మాట! మన ‘అండమాన్ నికోబార్’ ప్రాంత దక్షిణ భాగానికీ, ఇండోనేసియాలోని ‘సుమత్రా’ ద్వీపం ఉత్తర కొసకూ మధ్య అత్యంత ఇరుకైన సముద్ర మార్గం మాత్రమే నెలకొని ఉంది. ఇదీ భౌగోళిక సాన్నిహిత్యం. ఈ సముద్ర మార్గం అంతర్జాతీయ జలమార్గం. తూర్పు ఈశాన్య ఆసియా ప్రాంతాలకూ, ఆఫ్రికా ఐరోపా దేశాలకు మధ్య నడుస్తున్న తొంబయి శాతం వర్తకం, వాణిజ్య నౌకలు ఈ జలమార్గం గుండా నడుస్తున్నాయి. భారత -‘సుమత్రా’ దేశాల చారిత్రక భౌగోళిక సాన్నిహిత్య ప్రాధాన్యం ఇది. తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో విస్తరిస్తున్న చైనా దురాక్రమణ వ్యూహం ఈ ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. మోదీ జకార్తాలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో జరిపిన చర్చల సందర్భంగా ‘ఉభయ దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, వికసించిన వాస్తవం ప్రముఖంగా ప్రస్తావనకు రావడం’ చైనాకు నచ్చని అంశం. మన లక్షద్వీపాల దక్షిణ ప్రాంతానికీ, మాల్‌దీవుల ఉత్తర భాగానికీ మధ్య కూడ ఇరుకైన సముద్ర మార్గం ఉంది. మన ‘అండమాన్’ దీవుల నుంచి ఈ అంతర్జాతీయ జలమార్గం శ్రీలంకను చుట్టి మన లక్షదీవుల వరకూ సాగుతోంది. ఈ భౌగోళిక సాన్నిహిత్యం ఇండోనేసియాతో మన వ్యూహాత్మక సాన్నిహిత్యానికి చారిత్రక ప్రాతిపదిక. కానీ మాల్‌దీవుల విషయంలో ఈ చారిత్రక ప్రాతిపదిక చెఱగిపోతోంది. ‘జిహాదీ’ మతోన్మాదం పెరుగుతున్న మాల్‌దీవులలో చైనా తిష్ఠవేసి ఉంది. కానీ ఇండోనేసియా ప్రభుత్వం మత వైవిధ్యాలను, ఇతర వైవిధ్యాలను రక్షించడానికి కట్టుబడి ఉంది. మన దేశానికీ ఇండోనేసియా మధ్యకల సాంస్కృతిక సమానత్వం ఇందుకు ప్రాతిపదిక! ఈ చారిత్రక హైందవ సాంస్కృతిక బంధం వైవిధ్యాలను రక్షిస్తోంది. అందువల్లనే ఎనబయి శాతం ఇస్లాం మతస్థులున్న ఇండోనేసియా హైందవ సాంస్కృతిక అస్తిత్వాన్ని రక్షించుకొంటోంది. ఇండోనేసియా ప్రభుత్వం మతోన్మాద జిహాదీలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మాల్‌దీవుల ప్రభుత్వం జిహాదీ మతోన్మాదులను ప్రోత్సహిస్తోంది. ఇదీ తేడా.. బీభత్సకాండకు వ్యతిరేకంగా ఇండోనేసియా జరుపుతున్న పోరాటానికి నరేంద్ర మోదీ మద్దతు తెలపడం సాంస్కృతిక సమానత్వ చిహ్నం...
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యత్వానికి తూర్పు ఆసియా ప్రాతినిధ్యం కోసం ప్రస్తుతం మాల్‌దీవులు, ఇండోనేసియా పోటీపడుతున్నాయి. మాల్‌దీవులకు చైనా మద్దతునిస్తోంది. మన దేశం ఇండోనేసియాకు మద్దతునివ్వడం ఖాయం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పదిహేనుమంది సభ్యులున్నారు. అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా చైనా దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. మిగిలిన పది స్థానాలకు వివిధ ఖండాల నుంచి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇండోనేసియాకు మన మద్దతు ఒక ప్రధాన అంశం. మాల్‌దీవులతో పోల్చినప్పుడు ఇండోనేసియా అతి పెద్ద దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతున్న దేశం. మాల్ దీవులలో సైనికులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారు. అందువల్ల అధికాధిక ప్రజలకు ప్రాతినిధ్యం వహించగల ఇండోనేసియాకు భద్రతా మండలిలో సభ్యత్వం లభించడం న్యాయం. నరేంద్ర మోదీ ఇండోనేసియా పర్యటన సందర్భంగా ఈ న్యాయసూత్రం మరోసారి ప్రస్ఫుటించింది. ‘తూర్పు దిశగా కార్యాచరణ’- యాక్ట్ ఈస్ట్- సాగిస్తున్న మన ప్రభుత్వ విధానానికి ఇది అనుగుణం.. ఆర్థిక రంగంలో, వాణిజ్య రంగంలో సహకారం పెంపొందడానికి కూడ ఈ పర్యటన దోహదం చేసింది. 2021 నాటికి ఆకాంక్షించినట్టుగా భారత-ఇండోనేసియాల మధ్య వాణిజ్యం మూడు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయల వార్షిక స్థాయికి చేరగలదా?? అన్నది ప్రశ్న.. ఇలా రక్షణ, ఆర్థిక, దౌత్య, వ్యూహాత్మక సంబంధాలు పెరగడానికి వీలుగా బుధవారం పదహైదు ఒప్పందాలు కుదిరాయట... కానీ భారత- ఇండోనేసియాల మైత్రి ఈ ఒప్పందాలకు పరిమితమైనది. ఈ మైత్రి అనాదిగా సాగుతోంది..
ఈ మైత్రి వేదవిజ్ఞాన రీతులు ఆసియా ఖండమంతటా విస్తరించి ఉండిన నాటిది, కలియుగం పదిహేడవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం పదహైదవ శతాబ్ది-లో బౌద్ధమత ప్రశాంత పవన వీచికలు భారతదేశం నుండి తూర్పుగా పయనించిన నాటిది. రామాయణ మహాభారత కావ్యాలు సంస్కృత భాషా సాహిత్య మధురిమలు యవ, సుమత్రా, బలి తదితర ప్రాంతాలకు విస్తరించిన నాటిది. ఒరిస్సా తీరంలో ఓడలెక్కిన భారతీయులు ‘బలి’యాత్రలు జరిపిన నాటిది. గుజరాత్ సముద్ర తీరం నుంచి భారతీయ వ్యాపారులు యవ, సుమత్రా ద్వీపాలలో స్థిరపడిన నాటిది. ఒరిస్సాలో ఇప్పటికీ ‘బలి యాత్ర’ ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుతున్నారన్నది జకార్తాలోని ప్రవాస భారతీయులు భారతీయ సంతతివారు జరిపిన సమ్మాన సభలో బుధవారం నరేంద్ర మోదీ వెల్లడించిన నిజం. ఇండోనేసియా ఇలా యవ, సుమత్ర, బలి వంటి ద్వీపాల సమూహం. ఈ పేర్లన్నీ భారతీయమైనవి, సంస్కృత భాషకు సంబంధించినవి. భారత్‌ను ‘ఇండియా’గా మార్చిన ఐరోపా దురాక్రమణదారులు యవ, సుమత్ర, బలి వంటి ద్వీపాల సమూహాన్ని ‘ఇండోనేసియా’గా మార్చిపోయారు. డచ్చివారు- నెదర్‌లాండ్స్- క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది నుంచి 1945 వరకు ఇండోనేసియాను దురాక్రమించి పాలించారు. ‘యవ’ జావాగా మారింది. ఇండోనేషియాలో మన దేశంలో వలెనే రెండువందలకు పైగా భాషలు, మాండలికాలు ఉన్నాయి. ప్రధానమైన ‘బహసా’ సంస్కృత భాషకు రూపాంతరం. ‘సహోదర’ ‘వర్ణ’ ‘సమూహ’ ‘ఉపవాస’ ‘ప్రవాస’ వంటి ‘ఇండోనేసియా’ ‘బహసా’ పదాలను నరేంద్ర మోదీ ఉటంకించాడు! తమిళ ‘సంగం’ ‘యోగ దినోత్సవం’ భారతీయతకు మరికొన్ని సజీవ ప్రతీకలు.
నరేంద్రమోదీ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కలిసి గాలి పటాలను ఎగురవేశాడు. ఈ ‘పతంగు’లపై రామాయణ భారత చిత్రాలను ముద్రించారు. ప్రదర్శనశాలలో శ్రీకృష్ణార్జునుల రాతి రథాన్ని నరేంద్రమోదీ తిలకించాడు. జనవరిలో ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న ‘కుంభమేళా’కు ఇండోనేసియా మిత్రులతో కలసి రావలసిందిగా మోదీ ‘్భరత వంశీయులను’ జకార్తాలో ఆహ్వానించాడు. ఇదీ సాగర స్ఫూర్తి.. సముద్రానికి అటూ ఇటూ ఉన్న రెండు దేశాల ఉమ్మడి భద్రత, సమష్టి ప్రగతి మోదీ ఆవిష్కరించిన సాగర స్ఫూర్తి- సాగర్ ఇన్షియేటివ్!