సంపాదకీయం

‘సేంద్రియ’ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు వేరు పురుగుల వలె, చీడ పురుగుల వలె వ్యవసాయాన్ని భోంచేస్తుండడం ‘గావ్ బంద్’- గ్రామాల మూసివేత- ఆందోళనకు నేపథ్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరను పెంచాలని, రైతులు చెల్లించాల్సిన రుణాలను రద్దు చేయాలని, లీటరు పాలకు యాబయి రూపాయల చొప్పున పశుపోషకులకు చెల్లించాలని, చెరకు రైతులకు చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు బకాయిలను చెల్లించాలని ఈ ఆందోళనకారులు కోరుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సమస్యల పరిష్కారం కూడ ఈ ఆందోళనతో ముడివడి ఉందట. వివిధ ప్రాంతాల్లోని నూట ముప్పయికి పైగా వ్యవసాయదారుల సంఘాలు ‘రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్’ అనే సమాఖ్యగా ఏర్పడి ఆందోళన మొదలుపెట్టాయి. ‘కిసాన్ ఏకతా మంచ్’ అనే మరో రైతుల సంఘం కూడ ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తోందట! యథావిధిగా- ‘రైతుల కడగండ్లకు కారణం మీరు..’అని ప్రతిపక్షాలు, ‘కాదు.. కాదు అన్నదాతల అవస్థలకు మీరే కారణం..’ అని వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పక్షాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు, ప్రతిపక్షాలకు మధ్య కూడ రైతుల కడగండ్లకు దారితీసిన ‘కార్యకారణ’ సంబంధం గురించి మాటల యుద్ధం నడుస్తోంది. కానీ రైతుల కష్టనష్టాలకు అసలు సూత్రధారులు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’న్న వాస్తవాన్ని మాత్రం ఉభయ పక్షాల రాజకీయవాదులు కూడ ప్రస్తావించడం లేదు. బహుళ జాతీయ సంస్థలు మనదేశంలోను, వర్ధమాన దేశాలన్నింటిలోను రైతులకు భయంకరమైన ధరలకు కృత్రిమ రసాయన విషాలను విక్రయిస్తున్నాయి. ఈ విషాల పేర్లు- ఎరువులు, క్రిమి కీటక నాశక ఔషధాలు! ఈ విషాల పేరు విత్తనాలు కూడ.. జీవ జన్యు సాంకర్య- జెనటిక్ మోడిఫికేషన్- జీఎం- ప్రక్రియ ద్వారా రూపొందుతున్న విత్తనాల్లో ‘బాసిలస్ తురింజెనిసిస్’- బీటీ- అనే రసాయన విషం తయారవుతోంది. ఈ విషం భూసారాన్ని, పరిసరాలను దశలవారీగా హరించి వేస్తోంది. మానవులు, జంతువులు, ఇతర జీవజాలం పరిసరాల్లో భాగం. మానవుల ఆరోగ్యం బీటీ విత్తనాల వల్ల క్రమంగా క్షీణిస్తోంది. ఇది జనానికి ధ్యాస లేని ప్రమాదం. కానీ బీటీ విత్తనాలను, బహుళ జాతీయ సంస్థలు రూపొందిస్తున్న ఇతర విత్తనాలను, ఎరువులను, క్రిమి నాశకాలను అధిక ధరలకు కొనలేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బహుళ జాతీయ సంస్థల కబంధ బంధం నుంచి వ్యవసాయ రంగాన్ని సర్వ సమగ్రంగా విముక్తం చేస్తే తప్ప రైతుల కడగండ్లు తీరవు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఈ భయంకర భల్లూక బంధం మరింత బిగిసిపోవడానికి మాత్రమే దోహదం చేస్తున్నాయి.
జీవ జన్యు సాంకర్య-జీఎం- ప్రక్రియ ద్వారా రూపొందిన ‘బీటీ’ పత్తి విత్తనాలను అమెరికా వారి మొన్‌సాంట్ కంపెనీ రెండు దశాబ్దులకు పైగా విక్రయిస్తోంది. ఈ విత్తనాలను మన పొలాలలో మన రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మొన్‌సాంట్ సంస్థ వారు ఈ విత్తనాలకు తమ ‘ముద్ర’వేసి దేశమంతటా విక్రయిస్తున్నారు. ఈ ‘ముద్ర’ వేసినందుకు ఆ సంస్థ వారికి కిలో విత్తనాలకు నూట ముప్పయి నుంచి రెండు వందల రూపాయల వరకూ దశాబ్దుల పాటు ‘రాజస్వం’- రాయల్టీ-లభించింది. ఈ రాయల్టీ నిర్ణీత కాలవ్యవధి వరకే లభించాలని ‘ముద్ర’ల చట్టం- పేటెంట్స్ యాక్ట్- నిర్దేశిస్తోంది. కానీ నిర్ణీత గడువు ముగిసినా మొన్‌సాంట్ కంపెనీ మన దేశంలో వేల కోట్ల రూపాయల రాయల్టీని దండుకొంటోంది. చట్టాన్ని వమ్ము చేయడానికి వీలుగా ‘బీజీ-1’, ‘బీజీ-2’, ‘బీజీ-3’ అనే పేర్లతో విత్తనాలను విడుదల చేస్తోంది. ఈ మూడవ రకం విత్తనాల అమ్మకానికి ప్రభుత్వాల అనుమతి లేదు. అయినా దొంగచాటుగా ఏపీ, తెలంగాణలో ఈ మూడవ రకం విత్తనాలను అమ్మేశారట! తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొన్‌సాంట్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాయట! ఈ రాయల్టీ కారణంగాను, దళారీల వ్యవస్థ కారణంగాను ఉత్పత్తిదారులకు అతితక్కువ ధరలు లభిస్తున్నాయి. కొంటున్న రైతులు మాత్రం భారీగా ధరలను చెల్లించవలసి వస్తోంది. ‘బీటీ’ పత్తిపంటలను దేశవ్యాప్తంగా గులాబీ పురుగులు, తెల్ల ఈగలు, పసుపుదోమలు, కొత్తరకం మిడతలు నమిలి మింగేసి పోతున్నాయి. నిరోధించే మందులు లేవు. రైతుల నష్టాలకు, ఆత్మహత్యలకు ఇది ఒక ప్రధాన కారణం..
దేశంలోని లక్షల గ్రామాల్లోని ప్రజలు ఉప్పు తప్ప మరే ఆహార పదార్థాన్ని కొనని చరిత్ర లక్షల ఏళ్లు నడిచింది. ఉప్పుతో పాటు సర్వే సమస్తం లక్షల గ్రామాల ప్రజలు కొని తింటుండడం నడుస్తున్న చరిత్ర. మన వ్యవసాయ స్వభావంలోను స్వరూపంలోను సంభవించిన, సంభవిస్తున్న విచిత్రమైన వికృతమైన మార్పులు ఇందుకు కారణం. అనాదిగా సాగిన సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం మరుగునపడడం దశాబ్దులుగా ముంచుకొచ్చిన ముప్పు.. విష రసాయన ఎరువులు, క్రిమి సంహారక రసాయనాలు పొలాలను పాడు చేస్తున్నాయి. పచ్చి ఆకులు, పశువుల పేడ, మూత్రం భూమిని సహస్రాబ్దుల తరబడి పరిపుష్టం చేశాయి. పరిపుష్టమైన మట్టి పరిమళాలను వెదజల్లింది. పాలకంకుల పరిమళాలతో కలసి విస్తరించిన మట్టి వాసనలు పల్లెసీమలను పరవశింపచేశాయి. ఈ సహస్రాబ్దుల వ్యవసాయ వికాసం ఐదారు దశాబ్దులలో మోడువారిపోవడం నడుస్తున్న చరిత్ర. అడవులను నరికేశారు. పచ్చి ఆకులు కనిపించని పల్లెలలో ప్లాస్టిక్ వాసనలు ముక్కుపుటాలను బద్దలు కొడుతున్నాయి. ఆవులను హత్య చేశారు. గోసంతతి లేని గ్రామాల ప్రజలు పాలిథిన్ పాకెట్లలోని పాలు తాగుతున్నారు. మన దేశానికి ఈ రసాయన విషాలను తోలుతున్న సంపన్న దేశాలవారు తాము ప్రాకృతిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించుకొంటున్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించుకొంటున్నారు. మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయం గురించి, దాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకత గురించి పదే పదే ప్రకటనలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మరింత ఉత్సాహంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. కానీ మరోవైపు బీటీ పంటలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. జీఎం సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న ఆవాలను సైతం మన ‘పోపుల పెట్టె’ల్లో నింపడానికి బహుళ జాతీయ సంస్థలు ఉవ్విళ్లూరుతుండడం వర్తమాన వైపరీత్యం.
జీఎం పరిజ్ఞానం సంప్రదాయ, సేంద్రియ వ్యవసాయానికి గొడ్డలిపెట్టు. రైతులు తాము పండించే పంట నుంచి తదుపరి పంటకు విత్తనాలను తయారుచేసుకోవడం అనాది ప్రక్రియ. ఎరువులను క్రిమి సంహారక మందులను రైతులు స్వయంగా సమకూర్చుకొనడం కూడ అనాది ప్రక్రియ. ఆవుల నుంచి, పశువుల నుంచి, ఆకుల నుంచి ఎరువులు, క్రమి సంహారాలు లభించాయి. ఇప్పుడు మళ్లీ అలా లభించాలంటే అడవులను, ఆవులను పునరుద్ధరించాలి. గోసంతతి వధను నిరోధించాలి. సిక్కిం ఇప్పటికే సమగ్ర సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మారింది. దేశం మొత్తం సేంద్రియ క్షేత్రమైతే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం వేలాది రూపాయలు వెచ్చించే అవసరం ఉండదు. రైతులు ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉండదు.